ఉత్తరాఖండ్ ( తీర్థ యాత్రలు ) - కర్రా నాగలక్ష్మి

uttarakhand tourism

బదరీనాధ్-2

అలకనంద మీద వున్న వంతెన దాటుకొని వస్తే యెదురుగా మెట్లు , మెట్ల  మీదనుంచి ముందుకు వెళితే బదరీనాధుని మందిరం లోకి ప్రవేశిస్తాము . యెదురుగా కాక మెట్లు దిగి నారద కుండం వైపు వెళితే ముందుగా శివ కోవెల వస్తుంది దానిని ఆది కేదార్ మందిరం అని అంటారు . పక్కగా వున్న మెట్ల నుంచి యింకా కిందకి దిగితే నారద శిల , గరుడశిలలకు పక్కగా వేడి నీళ్లు పడుతున్న కుళాయిల  కింద స్నానం చేసుకునే భక్తులు కనిపిస్తారు . వారిని దాటుకొని వెళితే లోపల ఆడ వారు స్నానం చేసేందుకు వీలుగా వేడినీటి కుండీ కి చుట్టూ యెత్తైన గోడలతో నిర్మించిన గదులు పొడి బట్టలు మార్చుకునే గదులు వుంటాయి . 

ఈ వేడినీటిలో స్నానం చేసుకుని భక్తులు నారదశిల , గరుడ శిలలకు పూజలు నిర్వహించుకొని అలకనందలో వున్న వరాహ శిలను దర్శించుకుంటారు . వరాహ శిల పై భాగాన పడగ ఆకారం వుండి దానికిందన చిన్న గొయ్యలా వుంటుంది , దీనిలో కాస్త నీరు కనిపిస్తుంది . సర్వకాలాలలోనూ ఆ నీరు అలాగే వుంటుందట , యీ విషయం 2015 అక్టోబరు లో వెళ్లి నప్పుడు అక్కడకు విచ్చేసిన ' చిన్న జియ్యరు స్వామి వారు స్వయంగా చెప్పారు . వారిని బదరీనాధుని సన్నిధిలో కలవడం వారి ప్రోధ్బలంతో నాకు కలిగిన చిన్న సందేహాలను అంటే పంచశిలలలో ఒకటిగా చెప్పబడే వరాహ శిల  యెక్కడ వుంది అని అడిగితే వారు ఆ శిలను చూపించి దాని గురించి చెప్పేరు . పంచధారలను గురించి కూడా చెప్పారు .

తర్వాత ఆది కేదార్ క్షేత్రాన్ని దర్శించుకొని అనంతం బదరీ నాధుని దర్శనానికి వెళ్లాలి .

సాధారణంగా మే నుంచి జూలై వరకు చాలా రద్దీగా వుంటుంది బదరీ నాధ్ , ఆసమయంలో దర్శనానికి క్యూ మూడు కిలో మీటర్ల పొడువునా అప్పుడప్పుడు రెండువరుసలలో కూడా వుండి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది . అదే సెప్టెంబరు అక్టోబరులో క్యూ వుండదు .

ముఖ్య ద్వారంలోంచి ముందుకు వెళితే లోపల పంచపాండవులు , కుంతి , ద్రౌపతి , స్వర్గాహరోహణం చేస్తున్నపాండవులు మొదలయిన విగ్రహాలు చక్కబడిన పెద్ద పెద్ద స్థంభాలు మంటపం , ఓ పక్కగా యెర్రటి పరుపులు పరచిన మహంతు గారి ఆసనం వుంటాయి . ప్రొద్దుట , సాయంత్రం మహంతుగారు పూజలు నిర్వహిస్తారు , మిగతా సమయాలలో పూజారులు పూజలు నిర్వహిస్తూ వుంటారు . 

ఇక్కడ నారాయణుడికి తులసిమాలలు , డ్రైఫ్రూట్స్ తో పాటు కలకండ , శనగపప్పు సమర్పిస్తూ వుండడం కనిపిస్తుంది . శివుని శాపం వలన యీ ప్రాంతంలో శనగపప్పు పండదు . నారాయణుడి కృప కొరకు భక్తులు దేవ ప్రయాగనుంచి తెప్పించిన పప్పు తో నివేదిన చేస్తూ వుంటారు 

గర్భగుడిలో బదరీనాధుడు , నారదుడు , నరుడు , కుబేరుడు , సనకసనందులు , నారదుడు మొదలైన విగ్రహాలు వుంటాయి . ఓ పక్కగా అఖండదీపం వుంటుంది . జాగ్రత్తగా వీటిని దర్శనం చేసుకున్నాక మన దగ్గర వున్న యేదైనా నోటుని యిక్కడ పూజారికి యిచ్చి కుబేరుడి ముందు పెట్టి యిమ్మంటే యిస్తారు , దానిని మన దగ్గర వుంచుకుంటే యెప్పుడూ ధనానికి కొరత వుండదని నమ్మకం . మేం వెళ్లి నప్పుడల్లా అలా చేస్తూవుంటాం . 

సెప్టెంబరు ఆఖరు వారం నుంచి విజయదశమి వరకు బదరీనారాయణుని ' బ్రహ్మకమలాలతో పూజిస్తారు . ఈ పూలు బదరీ కొండకు పై భాగాన వున్న కొండలలో సున్న కంటె వాతావరణం చల్లబడే ప్రదేశాలలో పూస్తాయి . ఆ సమయం లో ఆ పూలతో చేసిన పూజ చాలా గొప్పదని స్థానికుల అభిప్రాయం . సాయంత్రపు పూజ సమయానికి ప్రొద్దుట నిర్మాల్యం భక్తులకు యిస్తారు , ఆ పూలు సుమారు ఒక సంవత్సరం నిలువ వుంటాయి , ఆ పూలు వున్న ప్రదేశంలో  రుగ్మతలను కలుగజేసే సూక్ష్మ జీవులు నశింప చేసి ఆరోగ్యాన్ని కలుగ చేస్తాయని  చెప్తారు .

ఈ మందిరం లో ప్రొద్దుట అభిషేకం , మహాభిషేకం , గీతాపాఠ్ ,  భగవత పూజ జరుగుతాయి సాయంత్రం అష్టోత్తర పూజ విష్ణుసహస్రనామ పూజ గీత గోవిందం  , శయన ఆరతి మొదలయిన ఆర్జిత సేవలు వున్నాయి . రద్దీ యెక్కువగా నిండే సమయాలలో ఆన్ లైన్లు బుకింగ్ చేయించుకుంటే మేలు , భక్తుల రద్దీ లేని రోజులలో గర్భగుడిలో కూర్చొని యీ సేవలను చేయించుకొని నారాయణుని దీవెనలు పొందవచ్చు వీలున్న వాళ్లు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేసే నైవేద్యం చూడండి చాలా బాగుంటుంది . 51 రూపాయలు చెల్లిస్తే మీ గోత్రనామాలతో నైవేద్యం చేయించి ప్రసాదం యిస్తారు . 

నైవేద్య సమయంలో మందిరం లో వున్న దేవీదేవతలందరికీ పేరు పేరునా మహంతు గారు నివేదించి ఆఖరుగా సూర్యునకు నైవేద్యం సమర్పిస్తారు , ఆ సమయంలో యెంత వాన పడుతున్నాగాని ఒక్కసారి మబ్బులను తొలగించుకొని సూర్యుడు వస్తాడు తరవాత మళ్లా వాన పడడం చూసేం . ఆ వింత చూడాలనే వాన పడుతుంటే మందిరానికి వెళ్లేం , స్థానికులు చెపితే యెలా నమ్మగలం అందుకే వెళ్లి నిర్ధారణ చేసుకుని , మా గోత్ర నామాలతో దేవునికి నైవేద్యం సమర్పించుకొని ప్రసాదం తిన్నాం , అదో మర్చి పోలేని అనుభూతి .

సాయంత్రం సహస్రనామ  పూజ , శయన ఆరతి చూసుకొన్నాం .

బదరీనాధ్ యెందరో తాపసులకు యిష్టమైన ప్రదేశం , వీరిలో క్షుద్రోపాసకులు కూడా వుంటారు , కాబట్టి యిలాంటి ప్రదేశాలలో యిలాంటి వారి( జడలు కట్టిన తలలతో వుండే బైరాగులు ) తో గొడవలు పెట్టుకోకుండా వుండడమే మేలు . అఘోరీ బాబాలు యెక్కువగా వుండే ప్రదేశం ప్రాంతం యిది వీరు నరమాంస భక్షకులు , వీరితో గొడవలు పడే వారిని సజీవంగా భక్షిస్తారని స్థానికులు యెన్నో కథలు చెప్పేరు . యాత్రీకులు వీరితో కాస్త జాగ్రత్తగా వుంటే మంచిది . స్థానికులు చాలా నెమ్మదైన వారు , దొంగతనాలు అలాంటివి చాలా తక్కువ .

ప్రతీ సంవత్సరం ' మాతా మూర్తి క మేలా ' జరుగుతుంది . స్థానికుల ప్రకారం గంగ భూమి పైకి వచ్చే టప్పుడు పన్నెండు ప్రదేశాలలో ప్రకటితమై భూ లోక వాసుల అవుసరాలను తీరుస్తూ  ప్రవహిస్తోందట , అలకనంద కూడా అందులో ఒకటని ,  ఇక్కడ బదరీ నారాయణుడు గంగా పుతృనిగా కొలవబడుతున్నాడు . ఈ మాతా మూర్తి క మేలా అలకనంద నది కి జరుపుతారు . ప్రతీ సంవత్సరం జూన్ మాసంలో బదరీ కేదార్ ఫెస్టివల్ రెండు మందిరాలలోనూ యెనిది రోజులు జరుపుతారు , దీనికి దేశ విదేశాల నుండి కళాకారులు వచ్చి తమ కళలను ప్రదర్శిస్తారు .

బదరీ నాధ్ లో చూడ వలసిన ప్రదేశాలు చాలా వున్నాయి 

అందులో నవదుర్గ మందిరం , నారాయణుడు బాలునిగా పార్వతికి లభించిన ప్రదేశం , ఊర్వశీ మందిరం , చరణ పాదుక , ' మానా ' గ్రామం , ఘంటాకర్ణని మందిరం , పంచధారలు , సరస్వతీ నది పుట్టిన ప్రదేశం , భీమ పూలు , గణేశ గుహ , వ్యాస గుహ , కుంతీ మందిరం , లక్ష్మీ మందిరం , ద్రౌపతి మందిరం ముఖ్యమైనవి .

మళ్లా వారం వాటిగురించి తెలుసుకుందాం , అంతవరకు శలవు .