శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

swami vivekananda biography sixth part

విద్యాసాగరుని పాఠశాలలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఎంత కష్టపడినా కుటుంబం గడిచేది కాదు. ఈ దుస్థితిలో వున్నప్పటికీ అతడు తన మనో నిశ్చయాన్ని. ఆత్మబలాన్నీ ఎప్పుడూ చంపుకోలేదు. తనను వివాహం చేసుకొంటే, లక్షలకు అధిపతిని చేస్తానని ఒక ధనిక యువతి ప్రాధేయపడినా నరేంద్రుడు అందుకు ఇష్టపడలేదు. ఎంతకూ దారిద్రబాద నుంచి విముక్తి కలగకపోవటం వల్ల గత్యంతరం లేక నరేంద్రుడు, తన గురువైన రామకృష్ణుని వద్దకు వెళ్లి, తన కుటుంబాన్ని యీ నీచపుస్థితి నుండి కాపాడవలసినదిగా ప్రార్ధించాడు. రామకృష్ణ పరమహంస నరేంద్రునితో "నాయనా! నేనా పనిచేయలేను. నీవే కాళికాలయానికి వెళ్లి ప్రార్ధించు. ఆమె నీ కోరికలను నేరవేర్చుతుంది" అన్నారు.

పరమహంస చెప్పినట్లే నరేంద్రుడు కాళికాలయానికి వెళ్లాడు. కాని తన సంసార బాధలను తొలగించమని కాళికాదేవిని ప్రార్ధించలేకపోయాడు. అక్కడకు వెళ్ళగానే అతను అన్ని విషయాలను మర్చిపోయి, "తల్లీ! నాకు నిర్మలమైన భక్తి - జ్ఞా - వైరాగ్యాలను ప్రసాదించమని" ప్రార్ధించాడు. అతడు తిరిగి రామకృష్ణుని దగ్గరకు రాగానే, కుటుంబ పరిస్థితులను చక్కబరచమని తల్లిని ప్రార్ధించలేదా? అని అడిగి, కాళికామాత ఆలయానికి మళ్ళీ వెళ్లి ప్రార్ధించమన్నాడు. ఇలా మూడు సార్లు ఆలయానికి వెళ్ళినా కూడా నరేంద్రుడు తన కష్టాలను తొలగించమని ఆమెని ప్రార్ధించనే లేదు. రామకృష్ణుడు అతని నిశ్చలకు అమితానందాన్ని పొంది, "ఇక నుండి మీ కుటుంబానికి అత్యవసరాలైన అన్న వస్త్రాల కొరత కలుగదు" అని అనుగ్రహించారు.

"శ్యామా మా ఉడాచ్చే ఘడీ భభో సంసార్ బజార్ మధ్యే" ఈ పాట దేవీభక్త రాంప్రసాద్ సేన్ ది. శ్రీ రామకృష్ణ పరమహంస ఎప్పుడూ ఈ పాట పాడుతూ ఉండేవారు. దీనర్ధం ఏమంటే, "శ్యామా కాళీమాత, ఆశ అనే గాలిని వీయిస్తూ, జీవులనే గాలిపటాలను ఎగురువేస్తోంది. ఆశయే, జీవనానికి ఆధారం. ఆమె సంసారమనెడి నడిబజార్లో నిర్లజ్జగా, గాలిపటాలను ఎగురవేసే ధీర. నిర్లజ్జ అని ఎందుకంటే సిగ్గున్న వారెవరూ, నడి బజార్లో ఆడలేరు. ఎటువంటి సిగ్గులేకుండా అంటే తన - మన, తర - తమ, భేదాలు లేకుండా, తండ్రి, సోదరుడు, భర్త, మామగారు, తనయుడు అనే భేదాలు లేక అందరినీ సమానంగా, సమ్మోహనపరచే మహారాణి, శ్రీ మహామాయ. జీవుల మద మాత్సర్యాలతో ఆడుతూ ఆడిస్తూ, చప్పట్లు చరుస్తూ, కేరింతలు కొడుతుంది. ఇది ఎందుకన్న ప్రశ్నే లేదు. అనవసరం కూడా. ఆవిడకు ఇష్టమొచ్చినంత కాలం జీవులందరూ ఆడాల్సిందే. అప్పుడప్పుడు కనికరం కలిగి, కొన్ని గాలి పటాలను వదిలి వేస్తుంది. అప్పుడా జీవులకు కలిగే స్థితే సన్యాసస్థితి. ఆ స్థితి యే మన నరేంద్రుని వరించి, వివేకానందస్వామిగా మార్చింది.

నరేంద్రుడు 6 సంవత్సరాల పాటు రామకృష్ణుని వద్ద శిష్యరికం చేసాడు. వివేకానందుడికి సూక్ష్మ సత్యాలను అవగాహన చేసుకునే అద్భుతమైన శక్తి ఉండేది. దక్షిణేశ్వరంలో ఒకరోజు శ్రీ రామకృష్ణ పరమహంస భక్తులకు వైష్ణవ మత సిద్ధాంతాలను వివరిస్తున్నారు. "సర్వజీవుల యెడల దయచూపు" అనే పదాలను ఉచ్ఛరించగానే, ఆయన సమాధి స్థితిలోకి ప్రవేశించారు. కొద్దిసేపటి తర్వాత, ఆయన అర్ధ బాహ్య స్మృతికి వచ్చి ఈ విధంగా అన్నారు. "జీవుల యెడల దయా! జీవుల యెడల దయా! మూర్ఖుడా! భూమిపై ప్రాకే అల్పమైన క్రిమివంటి నీవు, ఇతరుల యెడల దయ చూపటమా! దయ చూపుటకు నీవెవరివి? ఇతరుల యెడల దయచూపడటం కాదు. మానవులను సాక్షాత్తు భగవత్స్వరూపులుగా భావించి సేవించుటయే నీవు చేయవలసింది" అక్కడున్న వారందరూ ఈ మాటలు విన్నారు. కానీ ఆ మాటలోని అంతరార్ధాన్ని నరేంద్రుడొక్కడే గ్రహించాడు. ఈ మహాత్తర సత్యాన్నే విశ్వమంతా "అనుష్టాన వేదాంతం" అనే పేరు మీద ప్రకటించి, నరేంద్రుడు వ్యాప్తి చేసాడు. తన గురువు మాటలలోని నిజమైన భావనను తన సూక్ష్మ బుద్ధి ద్వారానే నరేంద్రుడు గ్రహించగలిగాడు.

"సముద్రంలోనికి అన్ని వైపుల నుండీ నీరు ప్రవేశిస్తుంది. కానీ సముద్రం ఏవిధమైన మార్పూ లేకుండా స్థిరంగా ఉంటుంది".

శ్రీ రామకృష్ణుల భక్తులలో ముఖ్యుడైన గిరీష్ చంద్రఘోష్ కి, తన గురువు పట్ల సంపూర్ణ విశ్వాసం ఉండేది. శ్రీ రామకృష్ణుల యెడల అతనికి కల అచంచల భక్తి వలననే అతి క్లిష్టసమయాలలో కూడా అతను ప్రశాంతంగా ఉండగలిగేవాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, భార్య, యువకుడైన కొడుకు మరణించాడు. ఉబ్బసంతో బాధపడుతూ వుండేవాడు. కష్టాలు, వ్యాధులు, నొప్పులు, దుఖాలు అతనిలోని ఆత్మశక్తిని ఏ కొంచెమో చలింపచేయలేనటువంటి ఉన్నత మానసిక స్థితికి అతను చేరుకున్నాడు. అతను చెప్పిన ఈ వాక్యాలు, మానవుని జీవితంలో కలిగే ఎటువంటి కష్టానైనా స్థిర బుద్ధితో ఎదుర్కొనే శక్తిని, ఉత్తేజాన్నీ, ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అతను ఈవిధంగా అన్నాడు. "ఈ సాధారణ వ్యాధిని నానుండి నేను తొలగించుకోలేననుకుంటున్నారా? లేదు - తప్పకుండా ఈ వ్యాధిని తొలగించుకోగలను. మీకది రుజువు చేయగలను కూడా.

ఒక్కసారి దక్షిణేశ్వరంలోని పంచవటి భూమిపై అటూ, యిటూ పొర్లి, గురుదేవులను శ్రద్ధగా ప్రార్ధిస్తే, ఈ వ్యాధి నివారణమవుతుంది. కానీ గురుదేవులు అపార కరుణామయులని తెలుసు. ఆయన ఇచ్చానుసారమే నేను ఈ వ్యాధి, దుఖము, బాధలకు లోనవుతున్నాను. అంతా నామంచి కోసమే జరుగుతున్నది. గురువు గారి దయవలన ఈ భావం నాలో ఎంత ధృడంగా ఉందంటే, నా వ్యాధిని నయంచేయమని ఆయన్ను ప్రార్ధించాలని కూడా నాకు అనిపించటం లేదు. పరమహంస సకల కోరికలను తీర్చే కల్పతరువు. నేను ఎప్పుడు, ఏది కావాలని ప్రార్ధించినా, ఆయన నుంచి అది పొందాను".

మరిన్ని వ్యాసాలు

ఫతేపూర్ సిక్రి.
ఫతేపూర్ సిక్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Taj Mahal - Wonders of the world
తాజ్ మహల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మొధెరా సూర్య దేవాలయం.
మొధెరా సూర్య దేవాలయం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
హవామెహల్ .
హవామెహల్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Cine geethala rachayitrulu
సినీ గీతాల రచయిత్రులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Social media lo nakilee profile patla apramattata
సోషల్ మీడియాలో అప్రమత్తత
- సి.హెచ్.ప్రతాప్