మీ టూ: మౌనాన్ని వీడండి శ్రీరెడ్డిలా.! - ..

mee too

పని చేసే రంగం ఏదైనా కావచ్చు. స్త్రీలకు రక్షణ లేకుండా పోతోంది. లైంగిక వేధింపులతో మహిళలు పడుతున్న ఇబ్బందులు వారిని మానసికంగా ఎన్నో రకాలుగా దెబ్బ తీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు మహిళలు. ఈ సమస్య చాలా తీవ్రమైనది. సమాజంలో చాలా బలంగా పాతుకుపోయింది. ఎంత బలమైన సమస్య అయినా ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడితేనే ఆ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.

ఈ లైంగిక వేధింపులు అనే సమస్య ఏ ఒక్క రంగానికో పరిమితమైంది కాదు. విద్యాబుద్ధులు నేర్పించి, నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చి దిద్దే విద్యాలయాల్లోనూ ఈ లైంగిక వేధింపులు తప్పడం లేదు. నెలల వయసు పసిగుడ్డు నుండి, అరవై, డెబ్బై ఏళ్ల ముసలి అవ్వల దాకా ఈ వేధింపుల బారిన పడుతున్నారంటే, ఈ సమస్య ఎంతగా సమాజంలో పాతుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు. సమస్యకు పరిష్కారం దొరకాలంటే, ముందుగా ఆ సమస్య వెలుగులోకి రావాలి. ఎట్టకేలకు సినీ రంగం నుండి నటి శ్రీరెడ్డి ఇష్యూతో ఈ సమస్య ఇటీవల వెలుగులోకి వచ్చింది.

నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటూ తనకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్పింది. అంతేకాదు, తనలాంటి ఎంతో మంది ఆడపిల్లలు ఈ సమస్య బాధితులుగా ఉన్నారంటూ, తనతో పాటు వారందరికీ కూడా న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో నాన్సెన్స్‌ అనుకున్న ఈ ఇష్యూ క్రమక్రమంగా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా నేషనల్‌ ఇష్యూదాకా చేరిందంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సమస్య ఎంత తీవ్రతరమైందో. శ్రీరెడ్డి పోరాటం ఎంత బలమైందో.

మొదట్లో వన్‌ విమెన్‌ ఆర్మీలా మొదలైన ఈ పోరాటానికి శ్రీరెడ్డి వెనక ఇప్పుడు కొన్ని వందలమంది తోడయ్యారు. పలువురు నటీమణులు మేమూ ఈ సమస్య బాధితులమే అంటూ ముందుకొస్తున్నారు. దాంతో ఆమె పోరాటం మరింత బలపడింది. ఏదో టాలీవుడ్‌ సమస్యగా మొదలైన ఈ సమస్య సామాజిక సమస్యగా, తర్వాత యూనివర్సల్‌ సమస్యగా వెలుగు చూసింది. రంగం ఈ సమస్యను రూపుమాపేందుకు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రబుద్ధులెవరైనా సరే వారిని ప్రక్షాళన చేసేందుకు శ్రీరెడ్డి చేపట్టిన ఈ పోరాటానికి ఆమె ఎంచుకున్న మార్గం సరైనది కాదని కొందరు భావిస్తున్నా, ఎత్తుకున్న ఇష్యూ మాత్రం అంత తేలిగ్గా తీసుకొనేది కాదని అందరి అభిప్రాయం.

మొన్న మలయాళ నటి భావన అయినా ఇప్పుడు ఈ శ్రీరెడ్డి, ఆమె వెనక ఉన్న మరో సెలబ్రిటీ మాధవీలత తదితర సెలబ్రిటీలే కాదు, సమాజంలో ఈ రకమైన వేధింపులను ఎదుర్కొంటున్న ప్రతీ ఆడపిల్లా, మహిళా ధైర్యంగా ముందుకు వచ్చి ప్రశ్నిస్తే, ఎంత ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభించే అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే అందుకు అమ్మాయిలు సిగ్గుపడకుండా, ధైర్యంగా మౌనం వీడి తమకు ఎదురైన ఇబ్బందుల్ని బయట ప్రపంచానికి తెలియపరిచే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఎంతో కొంత 'మహిళ'ను మహమ్మారిలా పట్టి పీడిస్తున్న ఈ లైంగిక దాడుల పర్వానికి శుభం కార్డు వేసే అవకాశం కలుగుతుంది. మహిళ తల్చుకుంటే ఏదైనా సాధించగలదు అనే విషయం మరోసారి శ్రీరెడ్డి ఇష్యూ ద్వారా ప్రూవ్‌ అయ్యిందని చెప్పొచ్చు.

మరిన్ని వ్యాసాలు

విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్