పాతదనం నుంచీ, కొత్తదనం నుంచీ విముక్తి... - ..

paathadanam-kotthadanam-nundi-vimukti

మనం కొన్ని పార్శ్వాలను చేరుకున్నప్పుడు మనకు కొన్ని సంగతులు జరుగుతాయి. అందుకే గురువు ఎప్పుడూ, శిష్యులు ఈ కొత్త విషయాల మాయలో పడిపోకుండా ప్రయత్నిస్తుంటాడు. మీరు ఎదో ఒక అనుభూతి కావాలని కోరుకోవద్దని నేను మరీమరీ చెప్తుంటాను. ఎందుకంటే మీరొక అనుభవాన్ని కోరుకున్నప్పుడు, కొన్ని విషయాలు జరగవచ్చు. అవి కొత్తవికావచ్చు, చాలా ఆసక్తికరమైనవి కావచ్చు, వింతగొల్పేవి కావచ్చు, కాని మీరు అందులో శాశ్వతంగా  చిక్కుబడిపోతారు.

మీరు మీతోటలో అటూ ఇటూ పరికిస్తున్నారనుకోండి. ఒక గడ్డిపరక మీద చిన్న పురుగు కనిపించిందనుకోండి. మీరు బాల్యంలో ఉన్నప్పుడు విశ్వంలోనే మీకదొక అద్భుతంగా గోచరిస్తుంది. కాని ఇప్పుడో, మీరు దానివైపు ఒక్కక్షణం కూడా చూడాలనుకోరు. ఇప్పుడు పురుగంటే మీకు పెద్ద విషయమేమీ కాదు. మీ అనుభవంలో అప్పటి వరకు లేనిది, విస్మయం కలిగించేది - అది మీ అనుభవంలోకి  వచ్చినప్పుడు, కాసేపు మీలో ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. కాని తర్వాత అది మిగితావాటిలానే అనిపిస్తుంది. ఈ విధమైనవి, ఈ విశ్వంలో మీకెన్నో కనిపించవచ్చు. మొదట్లో అవి మీలో కుతూహలాన్ని రేకెత్తించవచ్చు, కాసేపవి మిమల్ని విస్మయ పరుస్తాయి, ఆ తర్వాత అన్నీ ఒకటే - మరో పురుగు లాంటివే.

మోక్షమంటే కొత్త ప్రపంచాన్ని కోరుకోవడం కాని, స్వర్గానికి చేరడంకాని కాదు.

మనిషి బుద్ధికి ఉండే కుతూహలం, సహజంగానే కొన్ని వస్తువులపట్ల ఆసక్తి కలిగిస్తుంది. కాని ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే దాన్నుండి ఉపసంహరించుకొని, నడుస్తున్న మార్గం వదలకుండా, ఒక అనుభవాన్ని కోరకుండా, ఉద్వేగాన్ని కోరకుండా, కొత్త ప్రపంచాలను కోరకుండా ఉండే వివేకం కలిగి ఉండడం. కొత్త ప్రపంచాలు ఉచ్చులు. మీరు మరో కొత్త ప్రపంచాన్ని కోరుకోవడానికి ఈ ప్రపంచంలో ఉన్న లోపమేమిటి? మోక్షమంటే కొత్త ప్రపంచాన్ని కోరుకోవడం కాని, స్వర్గానికి చేరడంకాని కాదు. స్వర్గం అంటే కేవలం ప్రతిదీ ఇక్కడికంటే మెరుగ్గా ఉందనుకునే ఒక కొత్త ప్రపంచం మాత్రమే. ఇక్కడికంటే అక్కడ కాస్త మెరుగ్గా ఉన్నా లేదా చాలా మెరుగ్గా ఉన్నా కొంతకాలం తర్వాత దానితో మీకు బోరు కొట్టక మానదు. దూర ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలు అమెరికా అద్భుతంగా ఉంటుందనుకుంటారు.  కాని అమెరికా వాసులకు చాలా బోరుగా ఉంటుంది. లేకపోతే ఇంత పెద్ద వినోద పరిశ్రమ ఎందుకు?

మీ మేధ చాలా క్రియాశీలంగా ఉంటే కొత్తదేదైనా 24 గంటల్లో మీకు పాతదై పోతుంది. మీరు కొంచెం మంద బుధిగా ఉంటే అలా జరగడానికి 24 సంవత్సరాలు పట్టవచ్చు కాని అది పాతబడక తప్పదు. కొత్తదనం అనేదొక ఉచ్చు, పాతదొక భూగర్భపు మురికిగుంట. మురికి గుంట నుండి మీరు కొత్త ఉచ్చులోకి దూకితే దానివల్ల లాభమేమీ లేదు. ఆధ్యాత్మికత అంటే మీరో కొత్త దానికోసం చూడడం కాదు, కొత్తా, పాతా అన్నిటి నుండి మీరు విముక్తి కోరుకోవడం..!

 

(ఇషా ఫౌండేషన్ సౌజన్యంతో...)

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Athi Sukumari
కాశీ ప్రయాణ కథలు - అతి సుకుమారి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaashi Prayana Kathalu - Atha sommu alludu danam
కాశీ ప్రయాణ కథలు - అత్తసొమ్ము అల్లుడు..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Anthuleni rahasyam gaa mighilina minchesot mystery house
అంతులేని రహస్యం - వించెస్టర్...
- డా:సి.హెచ్.ప్రతాప్
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.