కాశీ ప్రయాణ కథలు - దానము చేసిన తరగనిది.
పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమ పెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను కావిళ్ళలో పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి కాలినడకన బయలుదేరారు.
రాత్రికి ఓగ్రామం చేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయం వెలుపల మండపంలో విశ్రమించారు.
ఈరోజు మీకు దానము చేసిన తరగనిది అనేకథ చెప్పబోతున్నాను...
సిరిపురంలో రంగయ్య,చంద్రయ్య అనే ఇరువురు వ్యవసాయ కూలీలు ఉండేవారు. పొలం పనులు లేని నాడు ,చేరువలోని అడవికి వెళ్ళి ఎండుకట్టెలు తెచ్చి పొరుగు ఊరిలో అమ్ముకునేవాళ్ళు.
ఒకరోజు అడవిలో ఎండుకట్టెలు సేకరించడానికి వెళ్ళారు,చంద్రయ్య ఒక ఎండిన చెట్టును తన గొడ్డలితో కట్టెలుగా చేయసాగాడు, అక్కడకు కొంతదూరంలో రంగయ్య మరో ఎండు చెట్టును కట్టెలుగా చేయసాగాడు.
కొంత సేపటికి చంద్రయ్య కొడుతున్న చెట్టుతొర్రలో ఒకమూట కనిపించింది
దాన్ని విప్పిచూడగా బంగారు నగలు, చాలా ధనం కనిపించాయి వాటిని ఎప్పటిలామూటకట్టి ,తనుకొట్టిన ఎండుకట్టెల మధ్యలో భద్రపరచి దాన్ని తలపైకి ఎత్తుకుని " రంగన్నా నాకు కడుపు నొప్పిగా ఉంది నేను ఇంటికి వెళుతున్న "అని నడక సాగించాడు.
మరుదినం నుండి చంద్రయ్య కట్టెలు కొట్టడానికి, వ్యవసాయపనులకు వెళ్ళడం మానివేసిసాడు. ఉన్నఫలంగా చంద్రయ్య ధనవంతుడు ఎలా అయ్యాడో ఆఊరి ప్రజలకు అర్ధంకాలేదు,రంగయ్య ఎప్పటిలా తన కూలి జీవనాన్ని కొనసాగించాడు.
చంద్రయ్య తనకుమారుడిని పట్టణంలో విలాసవంతమైన నివాసగృహంలో ఉంచి చదివించసాగాడు. రంగయ్య కుమారుడు అదేపట్టణంలో ప్రభుత్వ నివాస గృహంలో ఉంటూ చదువుకోసాగాడు,చేతినిండ ధనం ఉండటంతో విలాసాలకు అలవాటుపడిన చంద్రయ్య కుమారుడు రెండేళ్ళు వరుసగా పరిక్షలు తప్పాడు,రంగయ్య కుమారుడు మంచి ఫలితాలతో ఉత్తిర్ణత సాధించాడు, వెనువెంటనే రంగయ్య కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది.రంగయ్యను కూలి పనులకు వెళ్ళకుండా ఇంటివద్దనే విశ్రాంత జీవితం గడపమన్నాడు అతని కుమారుడు.
తాము అడవిలోని చెట్టుతొర్రలో దాచినధనం చంద్రయ్యకు దొరికిందని భావించిన దొంగలు ,ఒకరోజు రాత్రి చంద్రయ్య ఇంటిలో ప్రవేసించి చంద్రయ్య దంపతులను కాళ్ళు ,చేతులు కట్టివేసి అరకుండా నోళ్ళు బంధించి ఇంట్లో ఉన్న బంగారునగలు,ధనం,చంద్రయ్య భార్య ధరించిన నగలు సమస్తం తీసుకుని వెళ్ళి పోయారు. తెల్లవారి పాలుపోసే మనిషి చంద్రయ్య దంపతులను బంధవిముక్తులను చేసాడు.
విషయం తెలుసుకున్న రంగయ్య చంద్రయ్య ఇంటికి వచ్చి " చంద్రన్నా దొంగలు వచ్చారట " అన్నాడు. " రంగన్నా ధనం ఎలా వచ్చిందో అలానే పోయింది ధనం పోయినందుకు బాధలేదు ,ఈసారికుడా మావాడు పరిక్షలలో ఉత్తిర్ణుడు కాలేకపోయాడు ధనం వలన ఎంత మేలు జరుగుతుందో అంత అపకారంకూడా జరుగుతుంది ఈధనం ఉండటంవలన మావాడు విద్యను నిర్లక్ష్యం చేసాడు ఫలితం అనుభవించాడు ధనం ఎప్పుడైనా ఎలాగైనా సంపాదించవచ్చువిద్య, వినయం,విధేయత, జీవితంపైన అవగాహన లేని వారి జీవితాలు నాకుమారుడి లాగా తయారవుతాయి,దొంగల చేతికి దొరకనిది దానం చేసిన తరగని పెన్నిధి విద్య దాన్ని నీకుమారుడు సాధించి విద్య విలువను నిరూపించాడు, నాకుమారుడికి విద్య విలువ తెలియకపోవడంతో ఈవయసులోనూ నాకు కష్టం తప్పలేదు నాతోపాటు నాకుమారుడినికూడా అడవికి తీసుకువెళతాను వాడు చేసిన స్వయంకృతాపరాధానికి మెత్తం మాకుటుంబం శిక్ష అభవించవలసివచ్చింది మేమేకాదు విద్య విలువ తెలియనివారి జీవితాలు ఇలాగే ఉంటాయి "అన్నాడు చంద్రయ్య.

