నవ్వుల జల్లు - జయదేవ్

మంత్రి: మహారాజా, మన రాజ్యంలో ఏనుగులు ప్రవేశించాయని వార్త వచ్చింది!
రాజు: వెంటనే వాటిని పట్టి మచ్చిక చెయ్యండి!!
సైనికుడు: ఈ మంత్రి గారికి వార్త సరిగ్గా అర్ధం కాలేదు. ప్రభో! ఆ ఏనుగులు శత్రురాజు గజ దళానికి సంబంధించినవి! మన మీద దండెత్తి వస్తున్నాయి!!
రాజు: ఔనా! వెంటనే ఈ మంత్రిగార్ని పట్టుకు వెళ్ళి ఆ ఏనుగుల చేత తొక్కించండి!!

కవి పుంగవుడి స్నేహితుడు: వయస్యా! అంత గొప్ప ప్రబంధాన్ని రచించి, నీ పేరు పెట్టుకోక, రాజుగారి పేరు పెట్టావేం?
కవి పుంగవుడు: మన సరస సల్లాపాలకీ, మన వన, నౌకా విహారాలకీ, మన దాసీ జనాలకీ అయ్యే ఖర్చు ఎవరు భరిస్తున్నారనుకున్నావ్?

రాజు: మహా మంత్రీ, పొరుగుదేశం రాజు పిచ్చివాడనుకుంటాను. పావురంతో గాక, చిలుకతో వార్త పంపించాడు?
మహా మంత్రి: రాజా, ఇది మాటలు నేర్చిన చిలుక, జాగ్రత్తగా మాట్లాడాలి, మనం ఏది మాట్లాడితే, దాన్ని, తు.చ తప్పకుండా, మోసుకెళ్ళుతుంది!

కోటద్వారం రాజభటులు: పొరుగు దేశం నుంచి మా రాజ్యంలోకి వచ్చేవాళ్ళు పన్ను చెల్లించాలి! ఇదిగోండి చీపుళ్ళు! పురవీధులు శుభ్రం చెయ్యండి!
పొరుగుదేశ పౌరులు: పన్ను చెల్లిస్తాం... ఈ చీపుళ్ళొద్దు!
కోటద్వారం రాజభటులు: పన్నులో ఒక భాగం అది! తప్పదు!!

బొక్కలో ఒకడు: "జయము, జయము మహారాజా" అని సంభోదించినందున, రాజుగారు నిన్ను బొక్కలో తోశారా?
ఇంకొకడు: రాజుగారు గుఱ్ఱప్పందాలాటలో చిత్తుగా ఓడిపోయి చిర్రెత్తిపోయున్నారు! ఆ సంగతి నాకు తెలియలేదు!!

జైలు ఖైదీ - 121: ఏరా! తిండి సరిగ్గా తినక చిక్కి శల్యమై పోతున్నావ్?
జైలు ఖైదీ - 142: అదే నా ప్రయత్నం! జైలు కమ్మీల్లోంచి దూరి పారిపోవడానికి!!


క్రిష్ణారావ్: ఈ రోజుల్లో "గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి" అంటామే? ఆ రోజుల్లో ఏమనే వాళ్ళు?
క్రిష్ణారావ్ తాత: "గుండెల్లో రధాలు పరుగెత్తాయి" అని వుంటారు!!
క్రిష్ణారావ్: అవి టైముకి పరుగెత్తేవా??


రాజు కొలువులో ఒకడు: చిన్నా, పెద్దా ఎలాంటి నేరానికైనా శిరచ్చేధ శిక్షేనా?
ఇంకొకడు: కోట చుట్టూవున్న కందకంలో వందల సంఖ్యలో మొసళ్ళున్నాయి. వాటికాహారం కావాలిగా??


వర్మ: జాగీరులో సగభాగం, నెలకి తూము ధాన్యం, మణుగు బెల్లం భరణంగా యిచ్చారు!
శర్మ: అదృష్టమంటే నీదే! ఏం చేశావ్?
వర్మ: వాయువేగంతో పరుగెత్తే నా గుర్రాన్ని రాజుగారికి బహుకరించాను! రాజుగారు ఆ గుర్రమెక్కి యుద్ధంలో తప్పించుకు పారిపోయి ఒక చోట దాక్కున్నారు!
శర్మ: అందుకు రాజుగారు సంతోషించి నీకు బహుమాన మిచ్చారా?
వర్మ: రాజుగారు కాదు! రాజుగార్ని పట్టిచ్చినందుకు శత్రురాజు గారిచ్చారు!!


తోట కవి: రాజుగార్ని పొగుడ్తూ పద్యం పాడావే? కాసుల మూట యిచ్చారా?
పేట కవి: బాగుందని చప్పట్లు కొట్టి పంపించేశారు! అంతా రాణి గారి పెత్తనం అట! ఆవిడ, రాజుగారి చేత చిల్లి గవ్వ కూడా ఖర్చుపెట్టనివ్వదట!!