ప్రతాప భావాలు! - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

పుస్తకం అచ్చేయించుకోవాలా..అమ్మో!

తను రాసిన వాటన్నింటిని ఒక పుస్తకంగా వేయించుకోవాలని ప్రతి రచయితకూ ఉంటుంది. ఇల్లుకట్టి చూడు, పెళ్లి చేసి చూడులాగా పుస్తకం అచ్చేయించుకుని చూడు అన్న నానుడి కూడా ఇంతకు ముందు వాటి సరసకు చేర్చవచ్చు. అదో అసిధారావ్రతం. మహా యజ్ఞం. ఇప్పుడు సాహిత్యమనేది సేవ కాదు ఫక్తు బిజినెస్! మార్కెట్లో వీటికి వేలల్లో, లక్షల్లో ప్యాకేజీలు కూడా ఉన్నాయి.

సరే బోలెడంత డబ్బు కర్చు పెట్టి, నిద్రాహారాలు మానుకుని ప్రింటింగ్ ప్రెస్ చుట్టూ తిరిగి దానికో రూపాన్నిచ్చి, పుస్తకాల బండిల్స్ ఆటోలోనో, రిక్షాలోనో ఇంటికి తెచ్చుకున్నాక సెకెండ్ ఫేజ్ ఆఫ్ బాధ మొదలవుతుంది. తన పుస్తకం ఒక మంచి వేదిక మీద పదిమంది చేతుల మీదుగా ఆవీష్కరించబడాలనుకుంటే..ఇహ చెప్పనక్కరలేదు...చుక్కలు కనిపిస్తాయి.

పుస్తకం విడుదలయ్యాక, పేపర్లో వేయించుకోడాలు, పుస్తకాల్లో సమీక్షల కోసం పంపడాలు ఓహ్! ఓ తల్లి నెల తప్పిన నాటి నుంచి బిడ్డడిని కనేదాకా పడే శ్రమంతా పడాల్సిందే!

ఆవీష్కరణ సభలో కొన్ని మార్పులు జరిగితే రచయితకు కాస్త ఊరటగా ఉంటుందని నా నమ్మకం!

1, పుస్తకం ఆవీష్కరించిన అనంతరం వేదిక మీద ఉన్నపెద్దలు ఆ పుస్తకాన్ని ‘కొని’, తర్వాత నాలుగు మంచి మాటలు మాట్లాడి తమవంతు మార్గదర్శకత్వం వహించాలి.

2, సభలో ఆసీనులైనవాళ్లు కూడా ‘పుస్తకం ఉచితంగా ఇస్తే తీసుకుపోదాం’ అని కాకుండా తమ వంతుగా కొంత ధర పెట్టి కొనుక్కోవాలి.

3, అందరూ అన్ని పుస్తకాలు చదవలేకపోవచ్చు, సమీక్షలూ చూడలేకపోవచ్చు అంచేత తమకు నచ్చిన పుస్తకం తమ స్నేహితులకు, బంధువులకు, సాహితీ ప్రియులకు పరిచయం చేసి కొనిపించాలి.

4. కార్యక్రమానంతరం సభలోని రచయిత మనస్ఫూర్తిగా నవ్వగలిగితే సరస్వతీదేవి మురిసిపోతుంది.

పైవన్నీ జరగాలని ఓ రచయితగా ఆశ. ఇవి పక్కనపెడితే, ఇంట్లో ఉన్న పుస్తకాలు అమ్ముడు పోవు. లాభాలమాట దేవుడెరుగు, కనీసం తను పెట్టిన కర్చు అన్నా వెనక్కొస్తే మరో పుస్తకం వేసుకోడానికి సాహసిస్తాడు. కాని అదీ జరగదు. సాహితీ మిత్రులకు, సన్నిహితులకు, మిత్రులకు, బంధువులకు, కనిపించిన వారికి, కనిపించనివారికి (ఇన్ డైరెక్ట్) ‘ఉచితంగా’ పుస్తకాలు పంచేస్తాడు. షాపులో ఏదైనా వస్తువు కొనాలంటే ఎన్నోసార్లు ఆలోచిస్తాడు. ధరలు పోల్చుకుంటాడు. బేరాలాడతాడు. అలాంటిది తను డబ్బుపెట్టి, కష్టపడి అచ్చేయించుకున్న పుస్తకం అలా ఉచిత పందేరాలు చేస్తున్నాడంటే అతడి మానసిక క్షోభను అర్థం చేసుకోగలగాలి. పోనీ అలా ఉచితంగా తీసుకున్న పుస్తకాన్ని ఎప్పుడైనా సమయం చిక్కినప్పుడు చదివి తమ అభిప్రాయం తెలియజేస్తే ఆ రచయిత సంబరంతో ఏనుగెక్కుతాడు. అదీ ఉండదు.

రచయితలు రచనల బదులు, అదే సమయాన్ని కేటాయించి మరే పని చేసుకున్నా నాలుగు డబ్బులు కళ్లజూస్తాడు. కాని సాహితీ పిపాస అందరికీ అర్థం కాదు. నా భాషలో చెప్పాలంటే అదో పిచ్చి. వ్యసనం. రెమ్యూనరేషన్ రాకపోయినా, అచ్చేయించుకున్న పుస్తకాలు అమ్ముడుపోకపోయినా రచనా వ్యాసంగాన్ని కొనసాగించే సరస్వతీ మూర్తులైన రచయితలకు హృదయపూర్వక అభినందనలు.

పుస్తక ప్రచురణకు మహర్దశ రావాలని కోరుకుంటూ-

(నోట్: నేనూ గతంలో ఓ పుస్తకం వేయించుకుని, చేదు అనుభవం పొంది, ట్రంక్ పెట్టెలో అచ్చయిన కథలు, కవితలు మూలుగుతున్నా, పై కారణాల వల్ల అచ్చేయించుకునే సాహసం మాత్రం చేయడం లేదు)

***

మరిన్ని వ్యాసాలు

విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్