వినదగు'నెవ్వరు'చెప్పిన!! - జి.ఆర్.భాస్కర బాబు

Vinadagunevvaru cheppina

అనగనగా ఓ కృష్ణమూర్తి .ఆయనకి అరవై ఐదు ఏళ్ళు ఉంటాయేమో. ఆజానుబాహుడు…అరవిందళాయతాక్షుడు.. ఇలాంటి వర్ణనలు అవసర్లేదుగానీ.. వయసులో ఉన్నపుడు బాగుండేవాడు అని చెప్తారు ఎవరైనా..అతని ఫొటోలు చూస్తే!! తాగిన నీళ్ళ ప్రభావమో,ఉన్న ఊళ్ళ ప్రభావమో కాని అతనికి హాస్యంతో పాటు వెటకారమూ ఎక్కువే. ఓ ఉదయం పూట పూటుగా ఉప్మా పెసరట్టు లాగించి ఆరోజు దినపత్రిక తీసుకుని వరండా లోని మడతకుర్చీలో జారగిలబడి కూర్చున్నాడు. దినపత్రిక మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించబడిన వార్త అతనిని అమితంగా ఆకట్టుకుంది.

“ఏవండోయ్, ఇలారా ఓ సారి”పిలిచాడు శ్రీమతిని “ఏంచేస్తున్నావూ” అంటూ. “ఆ…మీరు చెప్పారు కదా అరిటికాయ ఉప్మాకూర చేయమని…ఆప్రయత్నంలో ఉన్నాను.అయినా మీకు ఈ ఉప్మా పిచ్చి ఏమిటో నాకు అర్ధం కావట్లేదు.అదేదో సినిమాలో మహేశ్ బాబు డైలాగ్ గుర్తుకు వస్తూంది.అయినా ఏమంత కొంపలు మునిగి పోయాయి ఆలా అరుస్తూన్నారు?”అంది కృ.మూ.భా. “అయిందా నీ దాడి చేయటం?నేను చూపించే వార్త చూస్తే నువ్వు ఎగిరి గంతేస్తావు “అన్నాడు కృ.మూ. “అబ్బాబ్బా..అంతమంచి వార్త ఏముంది…నస ఆపి త్వరగా చెప్పండి”అంది కృ.మూ.భా. “ఏముందేమిటోయ్…ఫలానా సిల్క్ వాళ్ళ మెగా ఎగ్జిబిషన్ అంట…ఎట్లాగూ శ్రావణ మాసం కదా ఓ రెండు కొనుక్కుని వస్తే పోలా..”అన్నాడు కృ.మూ. “మీ మతిమరుపుతో నా దుంప తెగుతోంది…మనం ఆ ఎగ్జిబిషన్ కి నిన్ననే వెళ్లి వచ్చాం కదా..”అంది కృ.మూ.భా. “సర్లె… సర్లేమళ్ళీఇంకేమయినాకావాలేమోనని..పిలిచాలే” కవర్ చేసుకుంటూ అన్నాడు కృ.మూ. ఇంకా అక్కడే ఉంటే తనని ఓ ఆట ఆడుకుంటుందనుకుని స్ర్కిబ్ల్ంగ్ పాడ్, పెన్సిల్ తీసుకుని మెల్లగా బైట పడ్డాడు కృ.మూ.

రిటైర్మెంట్ తరువాత అతను ఫ్రీ హ్యాండ్ స్కెచ్ లు గీయటం వ్యాపకంగా పెట్టుకున్నాడు. చెట్టు,పుట్ట,పిట్ట….కాదేదీ బొమ్మ కనర్హం అనుకుంటూ ఎక్కడ ఏది చూసినా గీసి పారేస్తుంటాడు. “పోనీలే పాపం కష్టపడి గీశాడు” అని పరిచయం ఉన్నవాళ్ళు తమవంతు ప్రోత్సాహం అందిస్తూ ఉంటారు. బాపు బొమ్మలా గియ్యాలనుకున్నా కుదరక , కుదిరిన వాటితోనే కుస్తీపడుతూంటాడు. అలా దారమ్మట నడుచుకుంటూ పోతూంటే…కాలనీ స్నేహితుడు లక్ష్మణ్ కలిశాడు. “ఏం సార్ ఎందాకా నడక?”అని అడిగాడు. “ఎక్కడికి లేదు ఏదో కాసేపు కాలక్షేపానికి నడుద్దాం అని బయటికి వచ్చాను” అన్నాడు కృ.మూ. “ఎలా ఉంది మీ బొ మ్మల వ్యాసంగం, అన్నట్లు సాయంకాలం ఖాళీయేనా”అడిగాడు లక్ష్మణ్. “ఆ ఖాళీనే ఏం ఏమయినా ప్రోగ్రాం ఉందా”అడిగాడు కృ.మూ. ఆ.. అవును సార్, కొత్తగా ఏదో ఒక గుడి కట్టారుట.అది చూసి వద్దాం అనుకుంటున్నాం. మీరు కూడా వస్తే పదిమందిమి అవుతాం .ఓ మంచి వెహికిల్ మాట్లాడుకుని వెళ్లి రావచ్చు”అన్నాడు లక్ష్మణ్.

“ఓ దానికి ఏం భాగ్యం అలాగే వెళదాం” అన్నాడు కృ.మూ. ,“కానీ ఆ వెళ్లదేదో ఆదివారమో, శనివారమో, వెళితే మనం అందరం కుటుంబ సమేతంగా వెళ్లొచ్చు కదా పుణ్యానికి పుణ్యం, పురుషార్ధానికి పురుషార్ధం” “అవునవును అది కూడా మంచిదే.. మన కాలనీ వాళ్ళతో మాట్లాడుతాను మీరు చెప్పిన సలహా వాళ్ళతో చెప్పి చూస్తాను. ఒప్పుకుంటే ఆదివారం ఆ గుడి చూడటానికి ఫ్యామిలీలతో వెళదాం” అన్నాడు లక్ష్మణ్. కాలనీ వాసులు అందరూ ఒప్పుకోవటం, ఆ వెంటనే ఆదివారం నాడు వాళ్ళందరూ కలిసి ఆ గుడి చూడటానికి బయలుదేరటం చకచకా జరిగిపో యాయి. వాళ్ళు ఉండే చోటికి ఆ గుడి దగ్గర దగ్గరగా ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ గుడిని ఓ బడా పారిశ్రామికవేత్త కట్టించారు.గుడిని దరిదాపుగా నలభై ఎకరాల విస్తీర్ణంలో కట్టారు. గుడి చాలా అందంగా కట్టారు. ఆనోట ఈనోట పడి చాలా మందికి విషయం తెలియటంతో భక్తుల రాక మొదలయింది.ఉపాలయాలు కూడా ఉండటంతో నానాటికి అక్కడికి వెళ్ల భక్తుల సంఖ్య పెరగసాగింది.

ముందుగా అనుకున్నట్లు గానే కృ.మూ. బృందం అక్కడికి వెళ్ళటానికి ఆదివారం ఉదయం బయలుదేరారు. అందరూ ఓ పాతికమంది దాకా అయ్యారు. అందరికీ వసతి సౌకర్యాలను భోజనం ఏర్పాట్లను కూడా చేసుకుని బయలుదేరారు. చెప్పాలంటే అది ఒక పిక్నిక్ లాగా ఏరాటు చేసుకున్నారు. పనిలో పనిగా కృ.మూ. పెన్సిళ్ళు , పుస్తకాలతో తయారయ్యాడు. అక్కడ కూడా బొమ్మలు గీసేసి తన కళా నైపుణ్యానికి పదును పెట్టాలనుకున్నాడు. ఏమాటకామాటే చెప్పుకోవాలి కృష్ణమూర్తి కాస్త కూస్తో చెయ్యి తిరిగిన కళాకారుడే! తను ఏం చేసినా చాలా ఖచ్చితంగా, లోప రహితంగా ఉంటుంది అన్నది అతని గట్టి నమ్మకం. ఎటువచ్చీ అతనితో చిక్కంతా తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అనే రకం! ఇక ఎవరైనా ఏమయినా చెప్పినా,తనని కాస్త విమర్శించినా చాలా అసహనంగా అయిపోతాడు. కృ.మూ.భా.చాలాసార్లు అతనికి చెప్పింది.అతనూ మారాలని ప్రయత్నం చేశాడు కానీ ఏమీ ఫలితం లేకపోయింది. ఈ కారణంతోనే కాలనీ సభ్యులు కూడా అతనితో జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. పూర్వాశ్రమంలో చేసిన ఉద్యోగం వల్ల అతనికి కొన్ని మంచి అలవాట్లు కూడా అబ్బాయి. వాటిల్లో ముఖ్యమైనది ఎంత కష్టమైన పనినైనా సాధించాలనే పట్టుదల. ఆ లక్షణం వల్లే కాలనీలో ఏ కార్యక్రమం జరిగినా,ఏ పండుగ వచ్చినా కృ.మూ.ని ప్రత్యేకంగా ఆహ్వానించి అతనికి తగిన పనిని అప్పగిస్తారు. సరే…ప్రస్తుతానికి వస్తే కాలనీ సభ్యుల బృందం అంతా ఆ ప్రయాణాన్ని చాలా బాగా ఆస్వాదించారు. వాళ్లు అక్కడ దైవదర్శనానికి వెళ్లారు.

అక్కడున్న దైవం, దర్శనం మాట పక్కన పెడితే అర్చక స్వాముల వింత ప్రవర్తన వాళ్లకి కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. కొంతమందితో వాళ్లు చాలా చనువుగా ప్రవర్తిస్తూ వాళ్లకు దర్శనం బాగా జరిగేటట్లు చూస్తున్నారు. వాళ్లు అర్చక స్వాములకు పరిచయం ఉన్నవాళ్లు అయి ఉంటారు అనుకున్నారు కాలనీ బృందం. నిజానికి అక్కడ ప్రత్యేకమైన దర్శనం ఏర్పాట్లు ఏమీ లేవు కానీ అలా కొంతమందికి మాత్రం ప్రత్యేక దర్శనం చేయించటం వాళ్ళకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడ“దేవుడి దగ్గర అందరూ సమానమే” అనే బోర్డు కూడా ఉంది. కానీ ఆ ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళు మేము కాస్త ఎక్కువ సమానం అని అనుకుంటున్నారేమో అనుకున్నారు వాళ్ళు. మొత్తానికి ఎలా అయితేనేం దర్శనం బాగా చేసుకుని గుడి నుంచి బయటికి వచ్చారు కాలనీ బృందం. కృ.మూ. అక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యానికి మైమరచిపోయి చాలా బొమ్మలు గీసేశాడు. వాటిల్లో కొన్ని బాగానే ఉన్నాయి. అవి చూసిన కాలనీ వాసులు ఆ బొమ్మల్ని పత్రికకు పంపించమని సలహా ఇచ్చారు. కృ.మూ. కూడా తను ఎప్పుడు పంపే పత్రికకే అవి పంపాలని నిర్ణయించుకున్నాడు. పక్కనే ఉన్న పన్నగశాయి “గురువుగారు మీరు ఎలా అయినా బొమ్మలు పంపుతున్నారు కదా! అవి గుడి బొమ్మలే కాబట్టి దానికి సంబంధించిన ఒక వ్యాసం కూడా రాసి పంపించండి” అని ఉచిత సలహా ఇచ్చాడు. కృ.మూ.కి ఆ సలహా బాగా నచ్చింది. ప్రయాణాన్ని దిగ్విజయంగా ముగించుకుని కాలనీ బృందం ఇళ్లకు రావడం, ఆనందంగా తమ ఇళ్లకు వెళ్లటం జరిగిపోయింది.

కృ.మూ. తను గీసుకున్న బొమ్మలతో పాటుగా ఓ వ్యాసాన్ని కూడా రాసి పంపించాడు పత్రికకు. బొమ్మలు నచ్చటంతో ఆ వ్యాసాన్ని కూడా కాస్త ఎడిట్ చేసి ప్రచురించారు పత్రికలో. అసలు కథ అక్కడే మొదలైంది. పాఠకులు ఆ కాలనీ బృందం కాదు కదా.. ఎవరి దృక్కోణం వాళ్ళది, అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి వ్యాఖ్యలు వాళ్ళవి. ఆ ఆర్టికల్ ప్రచురించిన తరువాత ఓ రోజు పన్నగశాయి కృ.మూ. ఇంటికి వచ్చాడు. మాటలు మాటల్లో ఆ ఆర్టికల్ గురించిన విషయం ప్రస్తావనకు వచ్చింది అంతే.. కృష్ణమూర్తి మొహం ఎర్రగా కందగడ్డ లాగా అయింది. కోపంతో వేళ్ళు వణుకుతున్నాయి.మెదడు మొద్దుబారి పో తున్నట్టు అనిపించింది. పక్కనే ఉన్న పన్నగశాయి “ఏమయింది గురూ గారూ…ఉన్నట్టుండి అలా అయిపోయారూ…” అన్నాడు. “నేను రాసిన ఆర్టికల్ గురించి కొంతమంది ఎన్ని రకాలుగా రాశారో తెలుసా” అన్నాడు కృ.మూ. “మెచ్చుకునే అంతగానా గురువుగారూ నోచ్చుకునేంతగానా” అని అడిగాడు పన్నగశాయి. “కొంతమంది మెచ్చుకున్నా చాలామంది నేను నోచుకునేటట్లుగానే రాశారు శాయి” అన్నాడు కృ.మూ.

“మీరు నోచ్చుకునేంతగా ఏమి రాశారు గురువుగారు” అడిగాడు పన్నగ శాయి. “నేను గీసిన బొమ్మలు చాలా కృతకంగా ఉన్నాయిట. నేను రాసిన వ్యాసం లో అక్కడి గుడిని నిర్వాహకులను మెచ్చుకుంటూ రాశానే గాని అక్కడ ఉన్న లోపాల గురించి ఏమీ రాయలేదట”అన్నాడు చాలా బాధగా కృ.మూ. “పోనీలెండి గురువుగారు అంతగా ఫీల్ అవ్వకండి మీరు” అన్నాడు పన్నగశాయి. “అలా కాదు అవన్నీ నాకు తెలుసుకొని రాయాల్సిన అవసరం ఏంటి? నేను అనుకున్నదేదో నేను రాశాను దాన్ని కామెంట్ చేయడానికి ఈ జనాలందరూ ఎవరు”అన్నాడు కృ.మూ. “మరి మీరు ఏం చేశారు గురువుగారు?” అడిగాడు పన్నగశాయి. “ఏం చేయటం ఏమిటి…నాకు ఎదురు వచ్చినవాళ్ళందరినీ అడ్డదిడ్డంగా నరికేశాను…” కృ.మూ. గొంతులో భావోద్వేగం. “అదేంటి గురువుగారు” అడిగాడు పన్నగశాయి. అతని గొంతులో సంభ్రమాశ్చర్యాలు. “అదే,నన్ను ఫేస్బుక్లో ప్రశ్నిస్తే చేస్తే వాళ్ళని అన్ఫ్రెండ్ చేసేశాను , నన్ను వాట్సాప్ లో క్వశ్చన్ చేస్తే వాళ్ళని పీకి అవతల పారేశాను..”అన్నాడు కృ.మూ. “దానివల్ల ఉపయోగం ఏం జరిగింది గురువుగారు? అయినా మీరు చెప్పారు కదా నేను కూడా నా వంతు సహాయంగా వాళ్ళని చాలా విమర్శిస్తాను గురువుగారు, అయినా ఆ పని చేయటానికి మీ ఫేస్బుక్ లోను, వాట్సాప్ లోనూ వాళ్లు లేరు కదా ఇప్పుడు” అన్నాడు పన్నగశాయి. “నన్ను విమర్శించే పాటి వాళ్ళావాళ్ళు,నాకు నచ్చింది నేను చేశాను శాయి.. ఎవరు ఎట్లా పోతే నాకెందుకు, నేను అనుకున్నది నేను చేసేశా”అన్నాడు ఉద్వేగంగా కృ.మూ. అంతా వింటున్న కృ.మూ.భా.”మీరు ఏమీ అనుకోనంటే నేనొక మాట చెప్తాను” అంది. “చెప్పు.. నువ్వు ఒక్కదానివే మిగిలావు ఇంకా నాకు ఈ విషయంలో”అన్నాడు కృ.మూ. “అదిగో చూశారా నేను ఇంకా ఏమీ చెప్పక ముందే మీకు కోపం వస్తూంది ,ఇలా అయితే నేను చెప్పడం ఎందుకు” అంది కృ.మూ.భా. “పర్లేదులే చెప్పు అన్నాడు” తమాయించుకుంటూ కృ.మూ. “మన ఇంట్లో మనం ఏమైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు, ఎలాగైనా చేయవచ్చు అదే మీరు బయటకు వెళ్లి మీ ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదు కదండీ అక్కడ కొన్ని పద్ధతులు అవీ ఉంటాయి కదా”అంది కృ.మూ.భా. “అయితే దానికి దీనికి సంబంధం ఏమిటి” అన్నాడు కృ.మూ.

“సంబంధం ఉందండి మీరు గీసిన బొమ్మలు రాసిన రాతలు పత్రికల్లో గాని ప్రసారమాధ్యమాల్లో గాని వెళ్ళిన తర్వాత వాటి మీద మీ నియంత్రణ ఏముంటుంది చెప్పండి. నచ్చిన వాళ్ళు పొగుడుతారు నచ్చని వాళ్ళు విమర్శిస్తారు. అది సద్విమర్శ అయినా కువిమర్శైనా దాన్ని మీరు అంగీకరించాల్సే వస్తుంది. వాళ్లు వాళ్ల అభిప్రాయాన్ని చెప్పటానికి వాళ్లకి అధికారం ఉంటుంది. ఏ విమర్శనైనా స్వాగతించటానికి సిద్ధపడితేనే పత్రికల్లోకి గాని ప్రసారమాధ్యమాల్లోకి గాని మన రచనలు పంపాలి. దానికి మీరు చిన్నపిల్లాడి లాగా ఉడుక్కుంటే ఎలా చెప్పండి? అయినా ఇవన్నీ మీకు తెలియని కాదు. నా అభిప్రాయాన్ని మీకు చెప్పాను అంతే.”అంది కృ.మూ.భా. “అమ్మగారితో నేనూ ఏకీభవిస్తున్నాను గురువుగారు. అయినా మీకు చెప్పేంతటి వాళ్లమా మేము. మీకు ఉన్న లోకజ్ఞానానికి ,అనుభవానికి సాటి రాగలమా మేము చెప్పండి “ అన్నాడు పన్నగశాయి. “అవును శాయి. అయినా ఇంత చిన్న తర్కాన్ని నేనెందుకు గ్రహించలేదు? నా ఫేస్బుక్ మిత్రులు వాట్సాప్ స్నేహితులు ఎంత బాధపడ్డారో పాపం. వాళ్లు నా మంచి గురించే చెప్పబోయారు అయినా నేను అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డాను” అన్నాడు కృ.మూ. “అందుకే అంటారు పెద్దలు వినదగునెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరించదగున్ అని, అంతేకానీ “వినదగు నెవ్వర్” అని కాదు” అంది కృ.మూ.భా. “మీరు రచనావ్యాసంగాన్ని కూడా కొనసాగిస్తారా గురువుగారు” అన్నాడు పన్నగశాయి. “మనకు రచనావ్యాసంగం అంతగా అచ్చి వచ్చినట్లు లేదు మనకు. బొమ్మలు మాత్రమే గీసి పంపిస్తూ ఉంటాను. అవి అయితే మాట్లాడలేని భావాలు చాలా మాట్లాడగలవు. అదైతేనే భేషుగ్గా ఉంటుంది” అంటూ నవ్వేశాడు కృ.మూ. --శుభం--

మరిన్ని కథలు

Aadapillamma
ఆడపిల్లమ్మా!
- రాపాక కామేశ్వర రావు
Voorukunnatha vuttamam..Bodigundantha sukham ledu
ఊరుకున్నంత ఉత్తమం... బోడిగుండంత సుఖం లేదు
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Yodhuraalu
యోధురాలు
- డా:సి.హెచ్.ప్రతాప్
Kotta ticket
కొత్త టిక్కెట్
- జి.ఆర్.భాస్కర బాబు
Retairment
రిటైర్మెంట్
- డా:సి.హెచ్.ప్రతాప్
Maarpu
మార్పు
- మద్దూరి నరసింహమూర్తి
Sahajeevanam
సహజీవనం
- డా:సి.హెచ్.ప్రతాప్
Naa kosam rendu adugulu
నా కోసం రెండు అడుగులు
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు