చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

” ఏకాగ్రత” ని  concentration  అంటారనుకుంటాను. అలాగని మరీ కోకాకోలా concentrate, లేక మనవైపు తిన్న తిండరక్క, తోచినప్పుడు విసిరే యాసిడ్ల concentration గురించీ మాత్రం కాదు. మనమేమీ అష్టావధానాలూ, శతావధానాలూ చేయగలిగే ఉద్దండ పండితులం కాదు. అలాటి మహామహులు, ఒకే సమయంలో, ఎవరెన్ని చెప్పినా, వాటిని గుర్తుంచుకుని, సమాధానాలు చెప్పగలిగే వారు. అందుకే అంత పెద్దవారయ్యారు. మనలాటి ఆంఆద్మీలకిఅలాటివేవీ అవసరమూ లేదు. చేతిలో ఉన్న పనేదో సరీగ్గా చేయగలిగితే చాలు. అదికూడా చేయలేము మనము. ఓ పని మొదలెట్టామనుకోండి, ఆ టైములోనే ప్రపంచంలోని అన్ని విషయాలూ గుర్తొచ్చేస్తూంటాయి. దానితో చేతిలో ఉన్న పని కూడా తగలడుతూంటుంది. ఇక్కడే ” ఏకాగ్రత” అన్నది చాలా అవసరం వస్తూంటుంది.

రోడ్డుమీద వెళ్తూన్నప్పుడు చూస్తాం, కారో, బైక్కో, స్కూటరో మామూలుగా డ్రైవు చేసికోవచ్చుగా, అబ్బే అప్పుడే ఏదో గుర్తొస్తుంది. జేబులోని సెల్ ఫోను లో మాట్టాడడం. మెడ ఓ వైపుకి పెట్టేసికుని ( మెణ్ణరం పట్టినవాడిలా!), రోడ్డుమీదవాళ్ళు ఏమైపోయినా ఫరవాలేదు. వీడి మాటలు వీడికి కావాలి. అలాగే ఏ కారులోనో వెళ్తున్నప్పుడు, సెల్ ఫోను లో మాటాడ్డం, మ్యూజిక్ సీడీ లు మార్చడం, అదీకాకపోతే పెళ్ళాంతోనో, ముందుసీటులో కూర్చున్నవాడితోనో సొళ్ళు కబుర్లు చెప్పడం, వీటివలన రోడ్లమీద ఎన్నెన్ని accidents జరుగుతున్నాయో చూస్తూంటాము. అయినా వీళ్ళు బాగుపడరూ, ఇంకోళ్ళని బ్రతకనివ్వరూ.

మనం వెళ్ళేదారిలో రోడ్డు పక్కన ఓ గుడి ఉందనుకుందాం,, అదేమిటో సరీగ్గా అక్కడకొచ్చేటప్పటికి, ఆ స్కూటరు/బైక్కు మీదెళ్ళేవాడికి, ఎక్కడలేని భక్తీ పుట్టుకొచ్చేస్తూంటుంది. రోడ్డు మీదెంత ట్రాఫిక్కున్నాసరే, అటువైపే చూడ్డం, రెండు చేతులూ వదిలేసి, ఓ దండం పెట్టడం. వీడు దండం పెట్టకపోతే, పోనీ ఆ వినాయకుడేమైనా అనుకుంటాడా, అంటే అదీ లేదు. అంత దైవదర్శనమే చేసికోవాలనిపిస్తే, హాయిగా అక్కడ కొంతసేపు ఆగి, దండం పెట్టుకోవచ్చుగా, అబ్బే అలా కాదు, అన్నీ పన్లో పనే అయిపోవాలి. మిగిలినవాళ్ళు ఏ గంగలో దూకినా సరే!

ఇంకొంతమందిని చూస్తాము, చెవిలో అవేవో పెట్టేసికుని, అలౌకికానందం పొందేస్తూ, రోడ్డు క్రాస్ చేసేస్తాడు. వీడదృష్టం బావుంటే సరే, లేకపోతే తెలుసుగా! రోడ్డు వరకూ పరవాలేదనుకుందాము, రైల్వే స్టేషన్ల దగ్గర  ఓ level crossing ఉంటుంది,  ప్రతీనెలలోనూ కనీసం ఓ ఇద్దరుముగ్గురయినా  రైళ్ళపట్టాలు క్రాస్ చేస్తూ, చచ్చారని వింటూంటాం.. భాష కొద్దిగా సున్నితంగా వ్రాయవలసిందేమో అనుకున్నా, రాయలేకపోయాను. ఎందుకంటే, వాళ్ళు చేసిన పనికి, they deserved it. గేటు బందుగా ఉంది, రైలొస్తోందని, పక్కనుంచరుస్తున్నారు అందరూ, అయినా సరే, వాడికి వినిపిస్తేగా! level crossing దగ్గరకొచ్చేటప్పుడు, ప్రతీ ట్రైనూ పెద్దగా కూత పెడుతుంది. అదికూడా వినిపించనంత ఆనందంలో ఉన్నాడు వాడు. బాధపడ్డవాళ్లు ఎవరూ, అతని తల్లితండ్రులు, అయ్యో చేతికందొచ్చిన కొడుకు ఇలా పోయాడే అని.

బస్సుల్లో వెళ్ళేటప్పుడు చూస్తూంటాను. అసలు కాలేజీలకెళ్ళేటప్పుడు, సెల్లుఫోన్లూ, ఐపాడ్లూ, చెవుల్లో పువ్వులూ”( ear phones) అంత అవసరమంటారా? వీళ్ళు కాలేజీలకెళ్తున్నారా, పిక్నిక్కులకెళ్తున్నారా అనిపిస్తుంది. అయినా వీళ్ళనని లాభం ఏమిట్లెండి? ఆ తల్లితండ్రులకి బుధ్ధుండాలి, ఏ టైములో చేయవలసినది ఆ టైములో చేయాలని చెప్పకపోవడం వల్లే కదా ఇవన్నీ. చిన్న పిల్లల్ని చూస్తూంటాం, అమ్మ పెట్టిన చపాతీ, కూరా ఓ ప్లేటులో పెట్టుకుని, హాల్లో, టివి ముందర సెటిలవుతారు.ఇంక తిండేం తింటారు? ఏ ఇంట్లో చూసినా ఇలాగే. కంసే కం భోజనాలు చేసేటప్పుడైనా, ఆ దిక్కుమాలిన టీవీ కట్టేస్తే, పిల్లలకి ఇలాటి అలవాట్లవవు. అసలు మనకే, ఆ కంట్రోల్ లేకపోతే, పిల్లల్నని ఏం లాభం?

 

ఇలాటివన్నీ తెలియకనా, అబ్బే ప్రతీవాడికీ తెలుసు, అయినా సరే ధ్యాసుండదు.పోన్లెద్దూ, పిల్లాడు ఈ వంకనైనా ఏదో ఒకటి తింటున్నాడు కదా , లేకపోతే ప్రతీదానికీ పేచీయే అని ఓ compromise. అంతేకానీ, ఇలాటివి కంట్రోల్ చేయకపోవడం వల్ల, ఆ పిల్లో పిల్లాడో ఎంత నష్టపడుతున్నాడో అన్న ఆలోచన మాత్రం రాదు. ఏదో ఒకటీ పనైపోతోందిగా!

అసలు మన టీవీల్ననాలి. ఇదివరకే బావుండేది, హాయిగా ఒకటే చానెలూ. ఇప్పుడో వందలాది చానెళ్ళు. పోనీ ఏదో ఒకటి చూస్తూనైనా ఆనందిస్తారా అంటే అదీ లేదు, ఇంకో చానెల్లో ఏమైపోతోందో , అందులో హీరోయిన్ ఏమయ్యిందో, అత్తగారు ఏమయ్యిందో అన్నీ వర్రీలే. టుప్కూ టుప్కూమంటూ రిమోట్ నొక్కేయడం. ఒక్క ప్రోగ్రామూ సరీగ్గా చూడనీయరు. వాళ్ళు సుఖపడరూ, ఇంకోళ్లని సుఖపడనీయరూ. అడక్కూడదూ, ఏమీ అనకూడదూ, భరించాలి!

అంతదాకా ఎందుకూ, ఏ వంట చేసేటప్పుడో, ఎవరిదైనా ఫోనొచ్చిందనుకోండి, స్టవ్ మీద పెట్టిన పాలూ గుర్తుండదు, పప్పులోనో, పులుసులోనో ఉప్పేశారో. లేదో గుర్తుండి చావదు.మొత్తంమీద ఈ టెక్నాలజీ అంతా, మన బతుకులు అస్థవ్యస్థం చేయడానికే వచ్చిందా, అంటే అదీ కాదు. వాటిని సరీగ్గా ఉపయోగించుకోడమనేది మన చేతిలోనే ఉంది. అయినా జీవితాలు వెళ్ళిపోతున్నాయి…..

 

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్