అదేమిటో.. ఎవడూ పట్టించుకోవడమే లేదు... - భమిడిపాటి ఫణిబాబు

no one recognising

మనలో అందరికీ ఈ వ్యాసానికి పెట్టిన శీర్షిక లాగ, ఎప్పుడో ఒకప్పుడు అలాటి భావనే వస్తూంటుంది. ఇదేదో వయసు పెరిగిన తరువాతే వస్తుందనుకుంటే పెద్ద పొరపాటు. ఈ జాడ్యం అందరికీ చిన్నప్పటినుంచే ప్రారంభం అవుతుంది. వయసొచ్చేకొద్దీ ప్రభావంకూడా ఎక్కువౌవుతూంటుంది. ఇదివరకటి రోజుల్లో ఇంటినిండా పిల్లలే. పైగా ఎంతమందిపిల్లలుంటే ఇంటికి అంత ఐశ్వర్యం అని, పెద్దలు చెప్పగా వినేసి, అదే మార్గం అవలింబించేసేవారు. ఆ రోజుల్లో జీవితాలు కూడా మరీ ఈరోజుల్లోలాగ ఉరకలూ పరుగులూ ఎక్కడుండేవి? హాయిగా ఏడాదికో, ఏణ్ణర్ధానికో ఓ పిల్లనో, పిల్లాడినో కనేయడం, వాళ్ళని పెంచిపెద్దచేయడంలోనే ఆనందం అనుభవించేవారు. దీనితో ఎవడో ఒకడికి "ఎడ పిల్లాడు" అనే ఉపాధి వచ్చేది. అసలు గొడవంతా వీడితోనే. ఇంట్లోకి క్రొత్తగా ఇంకో "ప్రాణి" వచ్చేసరికి, ఎంతచెప్పినా అందరి దృష్టీ ఆ కొత్తగా వచ్చిన బిడ్డమీదే కదా ఉండేది? దీనితో, ఈ "ఎడపిల్లాడో/ పిల్లదో" కి, ఇంట్లో తన ప్రాముఖ్యత తగ్గుముఖం పడుతోందేమో అనే అభిప్రాయం వచ్చేది. అంతకు ముందేడాది వీడు పుట్టినప్పుడు, అందరూ వీడినే ఆడించేవారు, వీడాడిందే ఆటా, వీడుపాడిందే పాటాగా ఉండే రోజులే. కానీ ఈ కొత్తగా అందరి జీవితాల్లోకీ ప్రవేశించాడే వాడొచ్చినప్పటినుండీ, తన మీద అంతగా శ్రధ్ధ చూపించడంలేదేమో అనే ఓ శంక ప్రారంభం అవుతుంది. దానితో ఏ కారణం లేకుండా పేచీపెట్టడం మొదలూ. ఓ ఏడుపేడిస్తే వీడిమీదే శ్రధ్ధ పెడతారు. అదే కదా వీడికీ కావాల్సింది. ఏదో ఒకటిరెండుసార్లు, వీడి గోల భరించలేక వీడిక్కావాల్సినట్టుగా చేసి ఊరుకోపెట్టేవారు. కానీ ప్రతీసారీ అలాచేస్తే, ఇంట్లోవాళ్ళకీ విసుగెత్తి, ఓ రెండు దెబ్బలేసి కూర్చోబెట్టేవారు. ఏడుపనేది బ్రహ్మాస్త్రం లాటిది కదా, ఓసారి చూద్దామనుకుంటాడు, కానీ ఎవరూ వీడెంత అరిచిగీపెట్టినా పట్టించుకోవడమే లేదాయె. ఏడ్చి ఏడ్చి చివరకు విసుగేసి వాడంతట వాడే మానేసేవాడు. ఊరికే ఏడిస్తే పట్టించుకుంటారా ఎవరైనా? అయినా ఆరోజుల్లో అదే ఫ్యాషనూ మరి.

కాలక్రమేణా రోజులూ మారేయి. ఈరోజుల్లో పిల్లల విషయానికొస్తే, ఒకరూ, మహ అయితే ఇద్దరూ. పైగా ఆ ఇద్దరూకూడా ఈకాలపు తల్లితండ్రులకి అవేవో "ఆంఖోంకా తారాలూ", valuable possessions అన్నట్టుగానే ప్రవర్తిస్తారు. వీళ్ళు కొండమీద కోతైనా తెప్పించుకుని సాధించుకునే సమర్ధులు., ఇంటికి ఒక్కడే పిల్లాడిగా ఉన్నంతవరకూ వీడికంతా మహరాజభోగం. మొదట్లో ఒక్కపిల్లో పిల్లాడితోనో సరిపెట్టేసికుందామనుకుంటారు, కానీ పరిస్థితుల ప్రాబల్యం ధర్మమా అని, ఇంకొక్క ఛాన్సు తీసికుందామేమిటీ అనుకుని, ఇంకో మోడల్ కి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఇదివరకటి రోజుల్లోలాగ, ఈరోజుల్లో పిల్లలేమైనా, "నోట్లో వేలెడితే కొరకలేనివారా" ఏమిటీ? ఇంట్లో తల్లితండ్రులు డాక్టరుగారి దగ్గరకు సంప్రదించడానికి వెళ్ళినప్పటినుండీ, ఈ మొదటి పిల్లో, పిల్లాడో కూడా part of the team లోకే వస్తాడు. పాపం ఆ ఇంట్లో వీళ్ళు ముగ్గురే కదా మరి. తల్లి దినదినాభివృధ్ధిని వీడూ గమనిస్తూంటాడు. ఏదో మొత్తానికి ఇంట్లోకి వీడికి పోటీగా ఇంకో "జీవి" రంగప్రవేశం చేస్తాడు/చేస్తుంది. ఏదో మొదట్లో బాగానే ఉంటుంది. ఆ పసిబిడ్డ ఆలనా పాలనా తల్లీ, ఈ మొదటివాడి పెంపకం తండ్రీ చూసుకుంటూంటారు. అంటే ఆ పెద్దపిల్లాడికి స్నానం చేయంచడాలూ, స్కూలుకి పంపడాలూ అవీనూ. పిల్లల్ని కనేయడంతో సరిపోదుగా, ఇద్దరినీ పెంచిపెద్దచేయడానికి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పని సరైపోయింది ఈరోజుల్లో.

ఇద్దరూ ఉద్యోగాలకి వెళ్ళడం, ఆ పసిబిడ్డని ఏ డే కేర్ లోనో పెట్టడం. పోనీ ఇళ్ళల్లో ఉండే ఏ పెద్దవారినో పిలిపించుకుని ఉంచుకుందామా అంటే, వాళ్ళ "పాత చింతకాయ" పధ్ధతుల్లో వాళ్ళ పిల్లల్ని పెంచడమే.. వామ్మోయ్... అకస్మాత్తుగా ఆ పెద్దపిల్లాడికో, పిల్లకో అనిపిస్తుంది- మమ్మీ డాడీలకి ఎప్పుడు చూసినా ఆ చిన్నపిల్లాడితోనే సరిపోతోందీ, నన్ను పట్టించుకోవడమే లేదూ అని. అంతే ఓ "బాంబు" వేస్తాడు. మమ్మీ my head is reeling అని ! ఈరోజుల్లో అన్నీ ఇంగ్లీషులోనే కదా చెప్పేదీ మరి? ఆఫీసు మాట దేవుడెరుగు, వెంటనే ల్యాప్ టాప్ తెరిచేసి "గూగులమ్మ" ని అడగడం. అసలు head ఎందుకు తిరుగుతుందీ, తిరిగితే వచ్చే గొడవలేమిటీ, వాడి head తో పాటు మన head కూడా తిరుగుతుందా వగైరా.. వగైరా. వెంటనే ఫ్యామిలీ డాక్టరుకి ఫోను చేసి ఓ టైము తీసికోవడం, పాపం ఆయనకూడా, ఈ పిల్లాడికి బట్టలూడతీసి, పొడుగూ, వెడల్పూ, నెత్తి వైశాల్యమూ కొలతలు తీసికుని, సావకాశంగా సింకులో చేతులు కడుక్కుని, తిరిగి ఆఫీసులోకి వచ్చి, ఎంతో ఆత్రంగా వేచిఉన్న తల్లితండ్రులతో "Nothing serious.." అని ఓమాట చెప్పేసి, ఓ అయిదారు రకాల most harmless మందులు రాసిచ్చేసి, తనకి రావాల్సిన ఫీజు తీసేసికుంటాడు. అంతే ఆ రోజంతా టైముకి మందులువేస్తూ, వీడితోనే గడుపుతారు. ఇదో పధ్ధతీ attention సాధించాలంటే.

వీళ్ళ పధ్ధతి ఇలాగుంటే, ఇళ్ళల్లో ఉండే వయోవృధ్ధులు ఏ తల్లో, తండ్రో, అత్తగారో, మామగారో వీళ్ళ ప్రణాలిక ఇంకోలా ఉంటుంది. తమగురించి కొడుకూ, కోడలూ పట్టించుకోవడంలేదని అనిపించిందనుకోండి, ఎప్పుడు చూసినా వీళ్ళ షికార్లూ, వీళ్ల పని ఇలా ఉందా అనుకుని ఓ ముహూర్తం చూసుకుని, అమ్మాయీ ఏవిటోనే వేడి చేసినట్టుందేమోనే, తిన్నదరగడంలేదేమో నలత చేసినట్టుగా అనిపిస్తోందే.. అనడం తరవాయి, తిట్టుకుంటూనో, విసుక్కుంటూనో ఆ పిక్నిక్కో, సినిమాయో మానేసి, ఏ డాక్టరుదగ్గరకో తీసికెళ్ళడం. కాదూకూడదనుకుంటే ఖళ్ళుఖళ్ళుమంటూ దగ్గడం. ఇలా రకరకాల ప్రక్రియలు.

ఒకానొకప్పుడు ఎంతో ప్రాముఖ్యం, ప్రాబల్యం ఉన్న ఏ రాజకీయనాయకుడో అయితే, ఆయన పధ్ధతి ఇంకో రకం. నగరాల్లో అయితే, ఏ టీవీ చానెల్లోనో ప్రతీ రోజూ ఏదో ఒక మాయదారి విషయం మీదో "చర్చా" కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. స్వంత ఖర్చులమీద ఏ స్టూడియోకి వెళ్ళినా అవాకులూ చవాకులూ పేలేయొచ్చు, అడిగేవాడే లేడు. కానీ, చిన్న చిన్న పట్టణాల్లో ఇలాటి సదుపాయాలుండవుగా, ఏ పత్రికా విలేఖరినో పిలిచి, కాఫీ టిఫినూ ఇప్పించి, ఓ ప్రకటన ఇచ్చేయడం, "మన మాతృభాషని మరచిపోతున్న యువతా" అనో " దేశంలో లంచగొండితనం పెరిగిపోతోందో" అనో. కాఫీ టిఫినూ తీసికున్న విశ్వాసం మూలానా, ఆ పత్రికా విలేఖరి కూడా ఓ రిపోర్టు పంపుతాడు. ఆ ఊరినుండి ఎప్పుడూ విశేషాలే రావడంలేదూ, పోనీ ఆ రిపోర్టరుని తీసేద్దామా అనుకుంటున్న ఆ పత్రికా యాజమాన్యానికి కూడా, ఈ విలేఖరి పంపిన "వార్త" అమృతప్రాయంలా అనిపించి, మర్నాడు న్యూసుపేపరులో "పతాక" శీర్షికలో ప్రచురించేస్తారు. చూశారా పత్రికా విలేఖరి ఉద్యోగమూ నిలిచింది, మన రాజకీయనాయకుడు గారి అస్థిత్వమూ ప్రపంచానికి తెలిసింది.

మామూలుగా ఉద్యోగాల్లోంచి రిటైరయిన తరువాత, ఒక్కళ్ళూ పట్టించుకోరు. ఎవడూ చూసికూడా పలకరించడు. ఇలాటివాటికి ఒక్కటే పరిష్కారం. అందరికీ కనిపించేటట్టు ఏ కాలికో, చేతికో ఓ బ్యాండేజీ చుట్టపెట్టడడం. వంట్లో ఏదో రోగం ఉందంటే ఎవడికీ అఖ్ఖర్లేదు. కానీ, అందరి దృష్టీ పడేటట్టు ఓ గాజుగుడ్డతో బ్యాండేజీయో, కనీసం ఇంటూ ప్లస్సు మార్కులతో మొహంమీద ఓ బ్యాండెయిడ్డో వేసేసికుని, బయటకు రండి, తెలియనివాడు కూడా పరామర్శించేస్తాడు. ప్రాణహాని లేనంతవరకూ ఎన్ని బ్యాండేజీలు వేసికుంటేనేమిటీ ఇలాటి attention seekers కీ ?
భమిడిపాటి ఫణిబాబు

మరిన్ని వ్యాసాలు

atithi
అతిధి
- Madhunapantula chitti venkata subba Rao
Manavulalo daivatwam
మానవులలో దైవత్వం
- సి.హెచ్.ప్రతాప్
హెలెన్ కెల్లర్
హెలెన్ కెల్లర్
- బి.రాజ్యలక్ష్మి
ఋచీక మహర్షి .
ఋచీక మహర్షి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఋష్యశృంగ మహర్షీ .
ఋష్యశృంగ మహర్షీ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఆంగీరస మహర్షి.
ఆంగీరస మహర్షి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అగస్త్యుడు .
అగస్త్యుడు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు