తస్మాత్‌ జాగ్రత్త.. బాల్యం బరువెక్కుతోంది.! - ..

be careful

దీనికి భాషతో సంబంధం లేదు. ప్రాంతంతో సంబంధం లేదు. మగా, ఆడా అస్సలు తేడా లేదు. వయసుని అస్సలు పట్టించుకోదు.. రాష్ట్రం, దేశంతో పని లేదు. ఇంతకీ ఏంటా సమస్య.? ఊబకాయం. 'ఒబెసిటీ'గా పిలవబడే ఈ సమస్య ఇప్పుడు దేశాలన్నింటినీ పట్టి పీడిస్తోంది. అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఈ సమస్య తలెత్తుతోంది. అందుకు కారణం గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారం, చేసే వ్యాయామమే. భర్త, భార్య ఇద్దరూ ఉద్యోగాలు చేసే రోజులివి. గర్భిణిగా ఉన్న స్త్రీ దాదాపు ఎనిమిది నెలల వరకూ ఉద్యోగానికి వెళ్లాల్సి వస్తుంది. ఉరుకుల పరుగుల జీవితం. గర్భిణిగా తీసుకోవాల్సిన కనీస పాటి జాగ్రత్తలు కానీ, ఖచ్చితంగా తీసుకునే ఆహారం కానీ తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దాంతో గర్భస్థ్య శిశువు పాలిట అది శాపంగా పరిణమిస్తోంది.

పుట్టిన బిడ్డ.. అయితే బరువు తక్కువ పుట్టడం, లేదంటే, పుట్టుకతోనే అతి బరువుతో పుట్టడం సంభవిస్తున్నాయి. ఇక అక్కడి నుండీ ఊబకాయంతో పోరాటం చేయాల్సి వస్తోంది. పుట్టుక సహజ బరువుతోనే ఉన్నప్పటికీ, ఆ తర్వాతి పిల్లల ఆహార అలవాట్లు, నడవడిక కారణంగా ఊబకాయం వచ్చేస్తోంది. తల్లి తండ్రులిద్దరూ వర్కింగ్‌ కావడంతో, ఆరోగ్యమైన ఆహారాన్ని పిల్లలకు అందించలేకపోతున్నారు. వృత్తి పరమైన ఒత్తిడి కారణంగా, మహిళలు దేవాలయంలాంటి కిచెన్‌ ప్లేస్‌ని స్విగ్గీస్‌ వంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ సెంటర్స్‌కి లీజుకిచ్చేశారు. ఇదే సర్వ అనర్ధాలకూ కారణమైపోయింది.. అన్నింటికీ మించి శరీరానికి తగినంత వ్యాయామం ఉండడం లేదు. మారిన జీవన శైలితో పాటు, అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ పిల్లల పాలిట శాపంగా మారింది. వారి బాల్యాన్ని అమాంతం మింగేస్తోంది. నాలుగు గోడల మధ్య బంధీలైపోతున్నారు. ఆట పాటల్లేవ్‌. ఇటు స్కూళ్లలోనూ అదే పరిస్థితి. ప్లే గ్రౌండ్స్‌ లేని పాఠశాలలు.. ఒకవేళ ఉన్నా వాటిని ఉపయోగించేందుకు సమయం కేటాయించలేని దుర్భర పరిస్థితి. తద్వారా పిల్లలకు ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌ కరువవుతోంది. అదే ఊబకాయానికి దారి తీస్తోంది.

ఊబకాయంతో కేవలం శరీరాకృతిని కోల్పోవడమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చిన్నతనం నుండే పిల్లలు ఈ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మొదటగా తలెత్తే సమస్య మధుమేహం. జన్యుసంబంధిత కారణాలు కొంత వరకూ ప్రభావితం చూపించినా, వయసుతో సంబంధం లేకుండా మధుమేహం బారిన పడుతున్న పిల్లల్లో ఎక్కువ శాతం ఊబకాయంతో బాధపడేవారే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు, దీర్ఘకాలం ఊబకాయంతో బాధపడేవారిలో కీళ్ల నొప్పులు, ఆయాసం, ఇతరత్రా శ్వాస సంబంధిత వ్యాధులు తదితర సమస్యలు కూడా బాధించే అవకాశముంది. పిల్లల్ని ఈ మహమ్మారి నుండి కాపాడి, వారి బాల్యానికి బంగారు బాట వేసే బాధ్యత ఖచ్చితంగా తల్లితండ్రుల పైనే ఉంది. అయితే, ఈ మహమ్మారిని జయించేదెలా.? ఉన్నంతలో జంక్‌ ఫుడ్స్‌ నుండి పిల్లల్ని దూరంగా ఉంచడం, ఇంటి ఫుడ్‌కే అలవాటు చేయడం. ఎట్‌లీస్ట్‌ వీకెండ్స్‌లోనైనా పేరెంట్స్‌ తమ పిల్లలను ఓపెన్‌ ప్లేసెస్‌కి తీసుకెళ్లడం, ఆహ్లాదరకమైన వాతావరణంలో ఆటలాడించడం.. తప్ప మరో మార్గం లేదు. సో ప్రియమైన తల్లితండ్రులూ.! మీ పిల్లల 'బరువు' బాధ్యతలు జరంత జాగ్రత్త సుమీ.!

మరిన్ని వ్యాసాలు

విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్