నారాయణమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుడు. ప్రతీ ఆరు నెలలకొకసారి తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని వస్తూ ఉండేవాడు. గ్రామంలోని అందరూ నారాయణమూర్తిని చూసి “నీ అంతటి అదృష్టవంతుడు మరొకడు లేడు” అని పొగిడేవారు. తిరుమలలోని మాడ వీధులు, విమాన వేంకటేశ్వరుడు, వరాహస్వామి దేవాలయం, కపిల తీర్థం, శ్రీవారి పాదాలు, శిలాతోరణం మొదలైన విశేషాలన్నీ వారికి పూసగుచ్చినట్లు చెప్పేవాడు. అంతేకాకుండా “అన్నదానానికి వంద రూపాయలు విరాళంగా ఇచ్చానని” పదే పదే గొప్పగా అందరికీ చెప్పుకునేవాడు. వంద రూపాయల విరాళం విషయం విని విని అందరికీ విసుగు పుట్టింది. ఈ విషయం ఆనోటా ఈనోటా అదే గ్రామానికి చెందిన, చదువుకున్నవాడు, తెలివైనవాడు అయిన లక్ష్మణరావు చెవిన పడింది. ఒకసారి లక్ష్మణరావుని కలిసినప్పుడు తిరుమల విశేషాలతో పాటు విరాళంగా ఇచ్చిన వంద రూపాయల గురించి కూడా చెప్పాడు నారాయణ మూర్తి. అది విన్న లక్ష్మణరావు నవ్వుతూ, “నీ విరాళం ‘సముద్రంలో కాకిరెట్ట’ లాంటిది,” అన్నాడు. “అంటే ఏమిటి?” అంటూ నారాయణమూర్తి ఆశ్చర్యంగా లక్ష్మణరావు వైపు చూశాడు. “సముద్రంలో కాకిరెట్ట’ అనేది ఒక సామెత. సముద్రం అంటే అంతులేని, అపారమైన నీరు. అందులో చిన్నమొత్తంలో ఉన్న కాకిరెట్ట పడటం వల్ల సముద్ర జలాల్లో ఎటువంటి మార్పు జరగదు. నీటి పరిమాణం తగ్గదు, పెరగదు. పెద్ద ఎత్తున జరుగుతున్న పనిలో అతి స్వల్పమైన సహాయం చేసి, దాన్ని గొప్పగా చెప్పుకున్న సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఇదిగో చూడండి, ఈ పుస్తకంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆస్తులు, శ్రీవారి సేవలు, అన్నదాన పథకాల వివరాలు ఉన్నాయి. వాటిని చదివి వినిపిస్తాను, వినండి” అని చెప్పి చదివి వివరించాడు లక్ష్మణరావు. “ఎంతో మంది భక్తులు అన్నదానం నిమిత్తం కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. కుడిచేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదని పెద్దలు చెప్పారు. మీరు ఇచ్చిన విరాళం గురించి అడిగినవారికి, అడగనివారికి కూడా చెప్పారు. అన్నదానానికి వచ్చిన విరాళాల్లో మీరు ఇచ్చింది అతి స్వల్పం. అందుకే ‘సముద్రంలో కాకిరెట్ట’ అన్నాను” అని వివరించాడు. లక్ష్మణరావు మాటలతో కనువిప్పు కలిగిన నారాయణమూర్తి ఇకపై ఎక్కువ మొత్తంలో గుప్త దానాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.

