ఎడారిపూలు పుస్తక సమీక్ష - మంజు యనమదల

edaripoolu book review
సామాజిక సమస్యలపై బాధ్యతాయుత రచన " ఎడారిపూలు "..!!

సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తిగా, కుటుంబ విలువలకు పెద్దపీట వేస్తూ ముందు తరాల మానవత్వాన్ని దాటిపోనీయక చక్కని పరిణితి గల కథలను అల్లాడి శ్రీనివాస్ తన " ఎడారిపూలు " కథా సంపుటిలో అందించారు. చక్కని సహజ ఇతివృత్తాలను ఎన్నుకుని మన కథేనేమో ఇది అన్నంతగా మనం చదువుతున్న కథలో మమేకమైపోయేటట్లుగా రాసిన తీరు అభినందనీయం.

మొదటి కథను పాత జ్ఞాపకాలతో పుట్టిన ఊరుపై మమకారాన్ని చాటుకుంటూ తమ వాడుక భాషలో, యాసలో రాయడంలోనే పురిటిగడ్డపై ఉన్న ఇష్టం తెలుస్తోంది. ఇరవై ఏళ్ళ తరువాత మళ్ళీ పుట్టిన ఊరికి వచ్చినప్పుడు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వాస్తవ పరిస్థితులను అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ పలకరింపులతో జరిగిన పరామర్శల కబుర్లు చదువుతుంటే మనమూ గతంలోనికి వెళ్ళకుండా ఉండలేనని పరిస్థితిని కల్పించిన కథలాంటి వాస్తవమే అస్పె జారిన కస్పి. వానలు లేక, కల్తీ విత్తనాల మెాసానికి గురైన మధ్యతరగతి రైతు ఆర్థిక అవసరాలకు సతమతమౌతూ తనువు చాలించాలన్న నిర్ణయాన్ని పురిటిబిడ్డతో మార్చడం బాట ఎరిగిన పాట కథలో మనం చదవవచ్చు .ఆధునిక మార్పులకు అనుగుణంగా మనమూ మారుతూ, పరిస్థితులను మనకనుకూలంగా మలుచుకోవాలని మార్పు కథలో సూచించారు. మనిషిలోని మానవత్వానికి, కృతజ్ఞతకు చక్కని తార్కాణం అమావాస్యకు వెన్నెలొచ్చింది కథ. ఇది చదివినప్పుడు నాకు యండమూరి గారు చెప్పిన ఆయన జీవితకథ గుర్తుకు వచ్చింది.రైతుకూలి కాయకష్టాన్ని, వ్యాపారుల దళారితనాన్ని చెప్తూ, జీవిత వైరుధ్యాలను వివరిస్తూ చదువు ఆవశ్యకతను చెప్పిన కథ మబ్బులు తొలిగిన వేళ. ఎన్నో ఆర్థిక అవసరాల కోసం అనుబంధాలకు దూరమైన వలసల జీవితాల మనసుల వ్యథలను కళ్ళకు కట్టినట్టుగా చూపిన కథ ఎడారిపూలు. ఈనాటి ఎన్నో జీవితాలకు ప్రతిబింబమీ కత. చదువుతుంటే మనసు ఆర్ద్రమవక మానదు.

కుటుంబ అవసరాల కోసం డబ్బు సంపాదించడానికి  దూరపు కొండలు నునుపని గల్ఫ్ దేశాలు పోవడానికి పడే కష్టాలను, అక్కడికి వెళ్ళిన తరువాత పరిస్థితులను, మానసిక వేదనలను ఎడారి మంటలు కథ చెబుతుంది.

అన్నీ తానైన అమ్మను మరిచిన బిడ్డల అమానుషత్వాన్ని చెప్పిన కత అవ్వ. మానవత్వాన్ని గుర్తు చేసిన మనిషితనం నిండిన కథనం. సంపాదనలో పడి మనం ఏం కోల్పోతున్నామెా, పిల్లల మనసుల్లోని దిగులును హృద్యంగా చెప్పిన కత అలుక్కుపోని హరివిల్లు. బిడ్డకు తల్లిపాల ఆవశ్యకతను తెలుపుతూ, కాంట్రాక్ట్ ఉద్యోగ నిర్వహణలో తన బిడ్డకు అందించలేని తల్లిపాలను అందించడానికి ఓ తల్లి తీసుకున్న నిర్ణయాన్ని చెప్పిన కథ అమృతధార. ప్రభుత్వ ఉపాధ్యాయుల అంకిత భావాన్ని, గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ బడులు బతికించుకోవడం ఎలా అన్న విషయాన్ని చక్కగా వివరించారు బడి కథలో. పొరుగింటి పుల్లకూర రుచి సామెతను గుర్తు చేసుకోకుండా ఉండలేము అంద(మైన)ని ఆకాశం కథ చదువుతుంటే. ఈర్ష్యాసూయలతో మనఃశాంతి కరువౌతుందన్న విషయాన్ని గుర్తు చేస్తుందీ కథ. కుటుంబంలో ఒకరు అనాలోచితంగా చేసిన పని ఆ కుటుంబాన్ని ఎంత క్షోభకు గురి చేసిందో తెలిపే కథ డేంజరస్ విండో. మలి వయసులో దూరమైన అనుబంధాలను తల్చుకుంటూ, ఒంటరితనం నుండి బయటపడటానికి చేసిన కొందరి ప్రయత్నాలే ఆత్మీయ సదనం కథ. బ్రూణ హత్యల ఉదంతమే చిట్టితల్లి కథ.

విధి ఆడే వింత నాటకంలో మనసు లేని 'మూడు'ముళ్ళు ఎలాంటివో, మనసున్న ప్రేమ గొప్పదనాన్ని చాటిన కథ 'మూడు'ముళ్ళు.
అల్లాడి శ్రీనివాస్ రాసిన " ఎడారిపూలు " కథా సంపుటిలో ప్రతి కథా వస్తువు ఊహాజనితం కాదు. మనచుట్టూ జరుగుతున్న సంఘటనలే కథల్లో పాత్రలుగా మనకు కనిపిస్తాయి. తరిగిపోతున్న అనుబంధాలు, మానవతా విలువలు, సమాజంలో మన పాత్ర, కుటుంబ అవసరాల కోసం దూర దేశాలు పోవడం ఇలా ఎక్కువగా తాను చూసిన సంఘటనలకు కథారూపాన్నిచ్చి సుళువైన శైలిలో చక్కగా రాసారు. కాకపొతే చాలా కథలు తెలంగాణా భాష, యాసలో రాసి ప్రాంతీయత మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. సున్నితమైన కథా వస్తువులను అవ్వ, తల్లిపాల ఆవశ్యకత, చదువు విలువ ఇలా ప్రతి చిన్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పారు. సమాజానికి అవసరమైన కథలను " ఎడారి పూలు " పుస్తకం ద్వారా అందించిన అల్లాడి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక అభినందనలు.

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు