మంచి స్నేహితులు - డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు

Manchi snehiitulu

రెండేళ్ళ క్రితం గిరీశం భార్య చనిపోయింది. పిల్లలు లేని అతను, ఆమెను కోల్పోయిన తరువాత పూర్తిగా ఒంటరి వాడయ్యాడు. ప్రతిరోజూ ప్రొద్దున్నాసాయంత్రం, నడక వ్యాయామం పూర్తి చేసిన తర్వాత, తాతల నాటి పడక్కుర్చీలో పడుకుని, గత జ్ఞాపకాలు నెమరువేసుకోవడం అతనికో అలవాటుగా మారింది. స్తబ్దుగా మారిన, అతని జీవితంలోకి, చైతన్యాన్ని తెచ్చే ఒక ఇ -మెయిల్, ఈ వుదయం వచ్చింది. ఆ మెయిల్ అతడి ప్రాణస్నేహితుడి కుమార్తె శ్రియ నుంచి వచ్చింది. ఆ పేరు చదవగానే, మరుగున పడిన కొన్ని విషాద జ్ణాపకాలతో, అతని మనసు వికలమైంది.

మనసు వుగ్గబట్టుకుంటూ ఇ-మెయిల్ చదవడం ప్రారంభించాడు. “చిన్నాన్నా” అన్న పిలుపు కంటబడగానే అతని గుండె దడదడలాడింది. మనసు సంతోషంతో పులకించింది. శ్రియ ఏం వ్రాసిందో చదవాలనుకున్న అతని ప్రయత్నానికి స్రవిస్తున్నకన్నీరు ప్రతిబంధకమైంది.

“చినాన్నా, నీ దగ్గర, నీ ఇంట్లో వుండమని, నాన్న చనిపోయే ముందు చెప్పారు. నా పోరు పడలేక నాన్న అమెరికా వచ్చారు గానీ, ఆయన మనసంతా నీ మీదే వుండేది. అది గమనించిన నేనూ, నా భర్తా ఇండియా వచ్చేసే ప్రయత్నాల్లో వుండగా, ఆయన అకస్మాత్తుగా జబ్బు చేసి చనిపోయారు. చనిపోయే ముందు ఆయన నీకిమ్మని ఒక కవరు యిచ్చారు.

ఇంకో పది రోజుల్లో మేము ఇండియా వచ్చేస్తాము. ఇంక మీదట, నీతోనే వుంటాము. నాకిప్పుడు మూడో నెల. నీకు తెలుసుగా నేను అల్లరిపిల్లని. నా పాప మరింత అల్లరిదవుతుంది, నిన్నుకనీసం కూర్చోనివ్వదు. నీవు రెడీనా?”

చదవటం పూర్తి చేసిన గిరీశం, తనకు కలగబోతున్న అదృష్టాన్ని తలచుకుని పొంగిపోయాడు. అదే సమయంలో, తన స్నేహితుడు సుబ్బారావు ఔన్నత్యాన్ని తల్చుకుని కృతజ్ణతాంజలి ఘటించాడు.

@@@

సుబ్భారావు ఖమ్మంలో హైస్కూల్ టీచరు. గిరీశం బాంక్ మేనేజర్. ఒకే వూళ్ళో, ఇరుగుపొరుగు ఇళ్ళల్లో, కాపురముండాలన్న వారి కోరిక, గిరీశం ఖమ్మానికి బదిలీయై రావడంతో నెరవేరింది. వారలా కలిసి వున్న ఆ కాలమొక విచిత్రమైనది. ఊహ కందని విధంగా, రెండు సంఘటనలతో వారి జీవితాలను మలుపులు త్రిప్పింది.

మొదటగా వారి భార్యలని, వారి కొడుకులని, మంచి స్నేహితులుగా చేసి వారికి రెండేళ్ళ పాటు సుఖ సంతోషాల నిచ్చింది. ఆ తర్వాత, ఈ లోకంలో యేదీ శాశ్వతం కాదని. వారి జీవితాలని శోకమయం చేసింది. ఒక రోజు వారి పిల్లలున్న పాఠశాల బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఎందరో పిల్లలతో పాటు, వారి పిల్లలు కూడా మరణించారు.

ఆ దురదృష్టకరమైన సంఘటనకు వారు భిన్నమైన రీతుల్లో స్పందించారు. బాధ మనస్సుని తొలిచేస్తూంటే, మిత్రులిద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ, మరింత దగ్గరయ్యారు. గిరీశం భార్య వినీత ఒక వేదాంతిలా స్పందించగా, సుబ్బారావు భార్య రమ దాదాపు పిచ్చిదైపోయింది. ఆ స్పందనలలో తేడా వారిద్దరి మధ్య దూరాన్నిపెంచింది.

రెండో ఘటన, రమ మరోసారి గర్భవతి కావడం. ఆ శుభవార్త వారి యిళ్ళల్లోకి వసంతాన్ని తిరిగి తెచ్చింది. ఆమెను అందరూ అపురూపంగా చూసుకోసాగారు. నెలలు నిండుతున్న కొద్దీ , రమలో ఒక వింత భయం మొదలైంది.

ఆమె ఒక నాడు భర్త తో " ఏమండీ! మనం యిల్లు మారిపోదాం. మీ స్నేహితుడు పొరుగున వుండడం, మనకి దురదృష్టాన్ని తెచ్చింది. మనం బాబుని పోగొట్టుకున్నాము. ఇప్పుడు పుట్టే బిడ్డ కేమైనా జరిగితే నేను తట్టుకోలేను." అని కన్నీటితో చెప్పింది.

సుబ్బారావు ఆమె మాటలకు బాధపడ్డాడు. " వాళ్ళ బిడ్డ కూడా చనిపోయాడుగదా! మరి మన వల్లనే, వాడికి నష్టం జరిగిందంటావా? "

"లేనిపోని తర్కం వద్దు. మన వల్ల వాళ్ళకి, వాళ్ళ వల్ల మనకి నష్టం కలిగింది. పోనీ వాళ్ళ మంచికోసమే అనుకోండి. మనం యిల్లు మారిపోదాం" అని రమ ఈసారి కాస్త కటువుగానే అంది.

" ఇప్పుడంటే ఇప్పుడు , ఆ పని చేయలేను కానీ, నిన్ను నీ పుట్టింటికి పంపిస్తా, బిడ్డని ప్రసవించి క్షేమంగా రా. ఏదో వంకతో, నువ్వు వచ్చేటప్పటికి ఇల్లు మార్చేస్తాలే." అని సుబ్బారావు భార్యకి నచ్చచెప్పాడు.

రమ ఆలోచన స్నేహితునికి తెలియకుండా వుంచాలన్న, సుబ్బారావు ఆశ ఫలించలేదు. రమ పనిమనిషితో తన బాధ చెప్పుకుంటూ, యిల్లు మారే ఆలోచన చేస్తున్నట్లు చెప్పింది. లౌక్యం తెలిసిన పనిమనిషి, ఆమెకు నచ్చేలా, " మీ అదృష్టానికి వినీతమ్మ కళ్ళల్లో నిప్పులు పోసుకోకుండా వుంటుందా? ఆమె దృష్టి మీకు మంచిది కాదు. వీలైనంత దూరగా వుండండి." అని సలహానిచ్చింది

అంతటితో వూరుకోకుండా ఆ పనిమనిషి, వినీతకి రమ ఆలోచనలను తెలియచేసి, “ఇది కలికాలం, స్నేహానికి మంచి రోజులు కావు.” అని వాపోయింది.

రమలో వస్తున్న మార్పుని వినీత అంతకు ముందే పసి గట్టింది. ఇప్పుడు పనిమనిషి మాటలతో ఆమె అనుమానం నిజమని తేలింది. విషయం తెలిసి గిరీశం బాధపడ్డాడు. అతని అదృష్టం బాగుంది. బాంకు వారు గిరీశాన్ని వేరే వూరికి బదిలీ చేసారు.

@@@

శ్రియ వస్తోందని గిరీశం, ఇల్లంతా శుభ్రం చేయించాడు. తన ఆప్తులకి, పరిచయస్తులకీ, “నా స్నేహితుడి కూతురు, అంటే నాకూ కూతురే, ఆమె గర్భవతిగా వస్తోందని చెప్పాడు. ఎంతో హడావుడిగా, ఆనందంగా ఇంటా బయటా తిరిగాడు. ఆ రోజు సాయంత్రం, కుర్చీలో వెనక్కి వాలి పడుకున్న అతడిని జ్ణాపకాలు ఈగల్లా ముసురుకున్నాయి.

“శ్రియ బారసాల కి నువ్వు రాకుంటే నా మీద ఒట్టు” అని సుబ్బారావు ఫోన్ చేసి చెబితే తప్పనిసరై వెళ్ళాడు. వినీత రానని మొండికేయడంతో, అతను ఒక్కడే హాజరయ్యాడు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత కలిసిన స్నేహితులలో ఆనందం పెల్లుబికింది. ఒకరి నొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. రమ ముక్తసరిగా పలకరించి, ఆ తర్వాత ముఖం చాటేసింది. ముందే ఆమె ప్రతికూల వైఖరిని వూహించిన గిరీశం ఎంతమాత్రం నొచ్చుకోలేదు. ఆ దంపతుల జీవితంలో నూతనంగా తొణికిసలాడుతున్న ఆనందాన్ని చూసి సంతోషించాడు. ఇప్పుడు శ్రియయే వారి ప్రపంచం. ఆ పాప నవ్వులు, ఆటలు, ఆకలి యేడ్పులు. ఒకటేమిటి, పాప ప్రతి కదలిక వారికి అబ్బురమే. పాపకోసం వారు చేసే ప్రతీ పనీ ఒక ముచ్చటే.

@@@

గిరీశానికి పిల్లలు కలగలేదు. ఆ లోటుని వినీత దైవధ్యానంతో, గిరీశం ఆఫీసు పనులతో భర్తీ చేసుకున్నారు. అయితే సుబ్బారావు గిరీశాన్ని వదిలిపెట్టలేదు. తరచూ తన చిన్నారిని వీడియో కాల్స్‌లో గిరీశానికి చూపిస్తూ, ఆ పిల్ల చేసిన అల్లరి కబుర్లను ఆనందంగా చెప్పేవాడు. కొన్నేళ్లకు, ఆ పాపతో నేరుగా గిరీశం మాట్లాడేలా చేశాడు.

పిల్లలు లేని గిరీశానికి ఆ అనుభూతి అపారమైన ఆనందాన్ని ఇచ్చింది. ఆ పాపను ఎత్తుకుని ముద్దాడాలనిపించినా, సుబ్బారావు ఇంటికి వెళ్లేందుకు అతను సాహసించలేదు. రమ మాటల్లో నిజముందో లేదో తెలియకపోయినా, ఒక తల్లి అనుమానాన్ని గౌరవించడం తన కర్తవ్యమని గిరీశం భావించాడు. అలా రెండు దశాబ్దాల కాలం గడిచిపోయింది. శ్రియకు పెళ్లి కుదిరింది. సుబ్బారావు ఇచ్చిన ఆహ్వానాన్ని కాదనలేక, గిరీశం శ్రియ పెండ్లికి హాజరయ్యాడు

“చిన్నాన్నా, నా పెళ్లికి వచ్చినందుకు థాంక్యూ,” అని శ్రియ ఆప్యాయంగా అతన్ని వాటేసుకుంది. సుబ్బారావు మగ పెళ్లివారికి గిరీశాన్ని తన సోదరుడిగా పరిచయం చేశాడు. దగ్గరుండి మరీ వధూవరులతో పాదాభివందనం చేయించాడు. రమ మాత్రం ముభావంగా నిలిచిపోయింది. కొడుకు మరణానికి సంబంధించిన బాధ ఆమె మనసులో ఇంకా మిగిలి ఉంది.

పెళ్లయిన తర్వాత శ్రియ భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయింది. ఆ తరువాతి సంవత్సరమే రమ అనుకోకుండా మరణించింది. సుబ్బారావు ఒంటరివాడైపోయాడు. అతని ఒంటరితనానికి రిటైర్మెంట్ తోడైంది. ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన అతనికి ఘనమైన వీడ్కోలు లభించింది. స్నేహితుడికి దక్కిన ఆ గౌరవాన్ని చూసి గిరీశం ఎంతో సంతోషపడ్డాడు.

" మంచితనానికి నిలువెత్తు రూపం సుబ్బారావు మాస్టారు. ఒక ఉపాధ్యాయుడికి జ్ఞానం ఎంత అవసరమో, సహనం, క్షమ కూడా అంతే అవసరం అని తన ఆచరణ ద్వారా నిరూపించిన వ్యక్తి మన సుబ్బారావు మాస్టారు,” అని సభలో వక్తలు చెప్పుకుంటుంటే, అవి వింటున్న గిరీశం స్నేహితుణ్ని చూసి పొంగిపోయాడు.

“ఇక శేషజీవితం కలిసి జీవిద్దాం. నా దగ్గరకు వచ్చెయ్యి,” అని ఆహ్వానించాడు. కానీ శ్రియ అంగీకరించలేదు. తండ్రిని తనతో పాటు అమెరికాకు తీసుకెళ్లింది. గిరీశం విమానాశ్రయానికి వెళ్లి సుబ్బారావుకి వీడ్కోలు పలికాడు. ఆ క్షణమే అవే ఆఖరి చూపులవుతాయని, ఆ స్నేహితులు ఊహించలేదు.

@@@

ఎదురు చూసిన రోజు ఎట్టకేలకు రానే వచ్చింది. గిరీశం కూతురినీ, అల్లుడినీ అప్యాయంగా స్వాగతించాడు. శ్రియ గిరీశాన్ని ప్రేమతో కౌగలించుకుని, “చిన్నాన్నా! ఇక నా బాధ్యత నీదే,” అంది.

శ్రియ రాకతో ఇల్లంతా సందడిగా మారింది. తెలిసినవారు, ఇరుగుపొరుగు వారు వచ్చి శ్రియను ఆశీర్వదించి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత శ్రియ ఒక కవరును గిరీశానికి అందించింది. ఏకాంతంలో గిరీశం ఆ కవరును తెరిచి చూశాడు. అందులోని లేఖను బయటికి తీసి చదవసాగాడు. ఆ లేఖలో ఇలా ఉంది.

"గిరీ! ఎందుకురా మనం దూరమైపోయాం! మనలో ఎవరికి బిడ్డ పుట్టినా మన బిడ్డగా చూసుకుందామని ప్రమాణాలు చేసి, సంతానం కోసం ప్రార్ధనలు చేసాం. ఆ దేవుడు నాకు బిడ్డనిచ్చి నిన్ను దూరం చేసాడు. మన ప్రమాణాలకి అవరోధం కల్పించాడు. కానీ ఈ రోజు నన్ను తన దగ్గరికి తీసుకుని వెడుతూ, ఆ వాగ్దానాన్ని నిలుపుకునే అవకాశమిచ్చాడు నా బిడ్డకి ఇంక నువ్వే నాన్నవై, మన వాగ్దానాన్ని నిలబెట్టు. నువ్వు, మన కూతురు, మనవరాలితో నిండు నూరేళ్ళు జీవించాలని ఆశీర్వదిస్తున్నాను- నీ సుబ్బు,

గిరీశం ఆ వుత్తరాన్ని గుండె కానించి కన్నీరు పెట్టాడు.

ఆ కన్నీరు రెండు వుద్వేగాలకి సంకేతం. ఒకటి ప్రాణ మిత్రుడు మరణించాడన్న దుఖానికి. మరొక్కటి, స్నేహితుడి సహృదయతతో తండ్రినవుతున్నానన్న ఆనందానికి. అప్పుడే లోనికి వచ్చిన శ్రియ, అతని మనసుని అర్ధం చేసుకుని, అతని ప్రక్కన కూర్చుంది. మెల్లగా అతని చేతిని తన చేతిలోకి తీసుకుని, అతని భుజం మీద తలవాల్చి, " మీరిద్దరూ మంచి స్నేహితులు. ఇంత స్వచ్చమైన ప్రేమలు బహు అరుదు. మీ బిడ్డని కావడం, నా అదృష్టం. ఐలవ్ యూ డాడ్"అని ప్రేమగా చెప్పింది.

@@@@@

మరిన్ని కథలు

Kaanuka
కానుక
- డా:సి.హెచ్.ప్రతాప్
Manavatwama nuvuu ekkada
మానవత్వమా నువ్వు ఎక్కడ?
- హేమావతి బొబ్బు
Antarmathanam
అంతర్మథనం
- డా:సి.హెచ్.ప్రతాప్
Sirimalli seetaalu
సిరిమల్లి సీతాలు (కథ)
- బూర్గుల రవి, టీచర్
Needalo nilichina garwam
నీడలో నిలిచిన గర్వం
- రాము కోలా.దెందుకూరు
Aruna nirnayam
అరుణ నిర్ణయం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Puttinti matti
పుట్టింటి మట్టి
- హేమావతి బొబ్బు
Jeevitham viluva
జీవితం విలువ
- సి.హెచ్.ప్రతాప్