మారాల్సిందీ.. మార్చాల్సిందీ యువతే.! - ..

You need to change.

ఏడేళ్ల కిందట దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచార కేసు సభ్య సమాజం సిగ్గుతో ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనపై యావత్‌ దేశం స్పందించిన తీరు తెలిసిందే. అలాంటి స్పందనే ఇప్పుడు దిశ ఘటనలోనూ చోటు చేసుకుంది. దిశ అత్యాచార కేసులో నిందితులైన నలుగురు యువకులు పోలీసులు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోవడంతో, దిశకు న్యాయం జరిగిందంటూ ప్రజానీకం నుండి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇలాంటి సంఘటనలు ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతున్నాయా.? అంటే పొరపాటే. ప్రతీ రోజూ, ఏదో ఒక చోట రకరకాల కారణాలతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాటిలో వెలుగులోకి వచ్చేవెన్ని.? కాల గర్భంలో కలిసిపోయేవెన్ని.? అసలీ అరాచకాలకు కారణాలేంటీ.? ఖచ్చితంగా పెరిగిన సాంకేతిక పరిజ్ఞానమే అంటున్నారు

స్వయంగా యువత. దురదృష్టవశాత్తూ ఇలాంటి ఘటనల్లో బాధితులు యువతే, నిందితులూ యువతే. ఇప్పుడు వీటిని ఖండించాలని డిమాండ్‌ చేస్తోంది కూడా యువతే.అవును నిజమే, యువత సచ్చందంగా తనంతంట తాను మారితే తప్ప సొసైటీ మారేలా లేదు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని ఉరి తీయాలని యువత నినదిస్తోంది. అప్పుడు నిర్భయ ఘటన జరిగినప్పుడు అలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని 'నిర్భయ చట్టం' అమలులోకి తీసుకొచ్చారు. కానీ, ఆ తర్వాత ఎన్ని సంఘటనలు అదే స్థాయిలో చోటు చేసుకున్నాయో లిస్టు తీయలేం. అలాగే ఇప్పుడు దిశ ఘటన తర్వాత కూడా అలాంటి చట్టాన్నే తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏకంగా కొన్ని అడుగులు ముందుకేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని 21 రోజుల్లో ఉరిశిక్ష విధించాలని చట్టం తీసుకొచ్చింది. అయితే ఈ చట్టం ఎంత మేర అమలులోకి వస్తుంది.? మిలియన్‌ డాలర్ల ప్రశ్నే ఇది.

ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడం, దానికి యువత బానిస కావడం ఇలాంటి దుశ్చర్యలకు పెను భూతంగా పరిణమిస్తోంది. ఆయా సంఘటనలతో విస్తుపోయిన యువతే ఇప్పుడు ఆ ఇంటర్నెట్‌ని కట్టడి చేయాలని కోరుతుండడం ఆశ్చర్యకరమైన అంశం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, ఇదిగో ఇలా ప్రజల ఆగ్రహావేశాలకు తగ్గట్లుగా, వ్యవస్థలు ముందుకొచ్చి సత్వర నిర్ణయాలు తీసుకోవడం (ఎన్‌కౌంటర్లు చేయడం) వల్ల భయం పుట్టించగలమా.? ఈ సమస్యలకు ఇదే పరిష్కారమా.? మూలాల్ని వెతికే ప్రక్రియను ప్రభుత్వాలు పక్కదోవ పట్టించేస్తున్నాయా.? దిశ అత్యాచార ఘటనలో నిందితుల్ని ఎన్‌కౌంటర్‌ చేసినంత మాత్రాన భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఎవరు చెప్పగలం.? నేర న్యాయ వ్యవస్థలో సవరణలకు కేంద్ర ప్రభుత్వం సరైన చట్టాలు తీసుకురావాలి. శిక్ష అమలు, న్యాయ విచారణల్లో కాల హరణాన్ని కుదించాలి. తక్కువకాలంలోనే శిక్షల అమలు, విచారణ ప్రక్రియలు పూర్తి చేసేలా చట్ట సవరణలకు ప్రభుత్వాలు తోడ్పడాలి. న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగేలా సత్వరం దృష్టి సారించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే. ప్రభుత్వంతో పాటు, సభ్య సమాజంలోని ప్రతీ పౌరుడూ ఈ తరహా ఘటనల పట్ల తన వంతు కనీస బాధ్యతను గుర్తించాలని గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకే ఓ యువతా.! మారాల్సిందీ, మార్చాల్సిందీ నువ్వే.