ఎందరో మహానుభావులు –అందరికీ వందనాలు - భమిడిపాటి ఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

జయంతులు 

డిశంబర్ 13
శ్రీ బసవరాజు అప్పారావు :  వీరు డిశంబర్ 13, 1894 న  పటమట లో జన్మించారు.  ప్రముఖ కవి. భావకవితాయుగంలోని ప్రఖ్యాత కవుల్లో ఒకనిగా ఆయన తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని పొందారు.సరళ శైలిలో భావకవిత్వం రాసేవారు.

డిశంబర్ 15 
శ్రీ సత్తిరాజు లక్ష్మీనారాయణ :  “ బాపు “ గా ప్రసిధ్ధులు . వీరు డిశంబర్ 15, 1933 న నర్సాపురం లో జన్మించారు. ప్రఖ్యాత  చిత్రకారుడు, కార్టూనిస్ట్. వారి పేరు వినని తెలుగువాడుండడంటే ఆశ్చర్యం లేదు. ఎవరికైనా మూడ్ బాగోనప్పుడు, ఒక్కసారి బాపు గారి కార్టూన్ చూస్తే మళ్ళీ మూడ్ వచ్చేయడం ఖాయం.అచ్చతెలుగు సినిమాలకి దర్శకర్వం చేసారు..స్నేహితుడు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారితో కలిసి “ బాపు-రమణ “ జంటగా , తెలుగువారి హృదయాల్లో  స్థానం సంపాదించిన మహనీయుడు.

శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవి :  వీరు డిశంబర్ 15, 1933 న చేబ్రోలు లో జన్మించారు. ప్రఖ్యాత తెలుగు నవల, కథా రచయిత్రి. వీరు రచించిన  “ మట్టి మనిషి “ నవల దేశంలోని 14 భాషల్లోకి అనువదించబడింది. వారి రచనలను సినిమాలు గా కూడా నిర్మించారు.

 శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య : వీరు డిశంబర్ 15, 1938 న , వల్లూరు లోజన్మించారు.

సమకాలీన రచయితలలో పేరెన్నికగన్నవాడు. ఆయన రచనలు అత్యధికం విషాదం మేళవించిన సామాన్య జీవన కథలుగా ఉంటాయి. వీరు రాసిన కథాసంకలనం , కేంద్ర సాహిత్య ఎకాడెమీ  పురస్కారానికి ఎన్నికయింది.

డిశంబర్ 16
 శ్రీ కుందుర్తి ఆంజనేయులు : వీరు డిశంబర్ 16, 1922 న , కోటవారిపాలెం లో జన్మించారు.
వచన కవితా పితామహుడు అనే బిరుదాంకితుడైన శ్రీ కుందుర్తి ఆంజనేయులు అభ్యుదయ కవి మరియు ప్రముఖ తెలుగు రచయిత. ఆంధ్ర దేశములో వచన కవితా ఉద్యమానికి ఆద్యుడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. రగిలించే తమ కవిత్వంతో తెలంగాణా సాయుధ పోరాటానికి అజ్యం పోసిన కవులలో ప్రముఖుడు.
వర్ధంతులు
డిశంబర్ 14
1 శ్రీ కొక్కొండ వెంకటరత్నం పంతులు: 
ప్రముఖ కవి, నాటక రచయిత, పత్రికాసంపాదకులు, ఉపాధ్యాయులు, సంగీతజ్ఞులు, గ్రాంధికం తప్ప ఇతర భాష మాట్లాడని వారు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించారు. వీరు "ఆంధ్రభాషా జాన్‌సన్" అనే గౌరవం పొందిన పండితులు. ఆంధ్ర వాజ్మయంలో నవయుగ ప్రవర్తకత్రయం  లో ఒకరుగా గుర్తింపబడ్డారు.
వీరు డిశంబర్ 14,  1915 న స్వర్గస్థులయారు.

2. శ్రీ వీరవెల్లి  రాఘవాచార్య : “ జ్వాలాముఖి “ గా పేరుపొందారు. ప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు . తెలుగు సాహితీ ప్రపంచంలో దిగంబర కవులుగా ప్రసిద్ధికెక్కిన ఆరుగురు కవుల్లో జ్వాలాముఖి ఒకడు. విరసం సభ్యుడు. శరత్ జీవిత చరిత్రను 'దేశ దిమ్మరి ప్రవక్త శరత్‌బాబు' పేరుతో హిందీ నుంచి అనువదించారు. స్వతహాగా తీవ్రంగా స్పందించే గుణదాముడు. కవి పండితుడిగా ఎదిగిన క్రమంలో దిగంబర కవుల్లో' దిట్ట. విరసం వ్యవస్థాపక సభ్యుల్లో విశిష్టునిగా పేరు పొందారు.

వీరు డిశంబర్ 14,  2008 న స్వర్గస్థులయారు..


డిశంబర్ 15

శ్రీ పొట్టి శ్రీరాములు :  ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు . భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు..

 వీరు డిశంబర్ 15,  1952 న  స్వర్గస్థులయారు.

శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి :  ప్రముఖ సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది మరియు ఉభయ భాషా ప్రవీణుడు. . “రామాయణ రహస్యాలు “  లాంటి వీరి  విమర్శక రచనలు జనసామాన్యంలోనే కాక, సాహితీలోకంలో సంచలనం సృష్టించాయి.  హేతువాద తత్వ ప్రభావంతో నిరంతర సత్యాన్వేషి అయ్యారు. ఈఅన్వేషణ, అనంతర కాలంలో వీరు సంతరించిన రచనలలో స్పష్టంగా కానవస్తుంది . కలిపురాణం, రామాయణ రహస్యాలు, కల్పవృక్ష ఖండనం మొదలైన గ్రంథాలు వీరి సత్యాన్వేషణకు, తత్వాన్వేషణకు మారు రూపాలు
               వీరు డిశంబర్ 15, 1974 న స్వర్గస్థులయారు.

డిశంబర్ 18
శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ : 
స్వాతంత్రోద్యమ తెలుగు కవులలో  వీరిది  విశిష్టమైన స్థానం. వీరు రచించిన గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. వీరు  వ్రాసిన ' మా కొద్దీ తెల్ల దొరతనం .... " పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే " దండాలు దండాలు భారత మాత ' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు . నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచారు.. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ..
వీరు డిశంబర్ 18, 1952 న స్వర్గస్థులయారు.