చిట్టి చెల్లెలు - సరికొండ శ్రీనివాస్

చిట్టి చెల్లెలు

వాసు చిన్నప్పటి నుంచి అల్లరి పిల్లవాడు. పాఠశాలకు సరిగా వెళ్ళక అల్లరి పనులు చేస్తూ చదువును నిర్లక్ష్యం చేసేవాడు. ఎప్పుడూ ఎవరితోనో గొడవలు పడేవాడు. అల్లరి బృందంతో తిరుగుతూ, ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ, చెడ్డ పనులు చేసేవాడు. తల్లి వాసూని చదువుకోమని, చెడు సావాసాలతో సమయం వృథా చేయవద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా వాసు పట్టించుకోలేదు. కాలం గడుస్తున్నది. వాసూకి ఒక చెల్లెలు ఉన్నది. వాసు కంటె వయసులో చాలా చిన్నది. వాసూకి చెల్లెలు అంటే ప్రాణం. ముద్దుగా "చిట్టి చెల్లెలు", "చిట్టి" అని పిలిచేవాడు. చిట్టి ఇప్పుడు 4వ తరగతి చదువుతున్నది. చాలా తెలివి తేటలు, వినయ విధేయతలు కలది. వాసూతో ఆ చిట్టి చెల్లెలు తరచూ ఇలా అనేది. "ఒరేయ్ అన్నయ్యా! అమ్మా నాన్నల, గురువుల మాట విని బాగా చదువుకోరా! అల్లరి పనులు చేస్తే మన ఇంటికే చెడ్డ పేరు వస్తుంది. పెద్దలు చెప్పినట్లు విను చెడు స్నేహాలు మాను. దయచేసి ఈ చిట్టి చెల్లెలు మాట విను అన్నయ్యా!" అని బ్రతిమిలాడేది. చెల్లెలు మీద ప్రేమతో ఆమె ముద్దు మాటలకు సరే అనేవాడు. ఆ తరువాత మళ్ళీ మామూలే! 

ఓ రోజు వాసు తన మిత్రులతో కలిసి ఓ తోటలోకి వెళ్ళాడు. చిట్టి వారికి తెలియకుండా వారిని అనుసరించింది. కర్రల సహాయంతోను, రాళ్ళతోను మామిడి కాయలను రాలగొడుతున్నారు. అది చూసిన తోటమాలి ఆవేశంతో కర్రను తీసుకొని వీరిని తరుమసాగాడు. ఒక రాయిని తీసుకొని వాసు వైపు విసిరాడు. వాసూకి రాయి తగిలే సమయంలో చిట్టి వాసూకి అడ్డం వచ్చింది. రాయి చిట్టి తలకు బలంగా తగిలి, చిట్టి స్పృహ కోల్పోయింది. వాసు కంగారుతో తన చిట్టి చెల్లెలిని ఎత్తుకొని, ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. డాక్టర్ గారికి జరిగింది చెప్పాడు. డాక్టర్ వాసూని బాగా తిట్టాడు. డాక్టర్ చేసిన వైద్యం వలన చిట్టి గాయం తగ్గిపోయింది. వాసు తనని క్షమించమని చెల్లెలిని వేడుకున్నాడు. చిట్టి వాసూతో మాట్లాడటం మానేసింది. ఎంతో ఆవేదన చెందిన వాసు అల్లరి పనులను మానేశాడు. బుద్ధిగా బడికి  వెళ్ళి, పట్టుదలతో చదువుతూ, అందరితో మంచిగా ఉంటూ, పెద్దలు చెప్పినట్లు వింటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇలా కొద్ది రోజులు అన్నయ్య ప్రవర్తన గమనించిన చిట్టి చెల్లెలు ఆశ్చర్యానందాలకు లోనై అన్నయ్యతో మాటలు కలిపింది. మళ్ళీ ఎప్పుడూ చిట్టి చెల్లెలి మనసును బాధపెట్టకూడదని వాసు నిశ్చయించుకున్నాడు.