తెలుగు నేలపై కార్టూన్ పండుగ - Srinivas Iduri

Cartoon Festival

తెలుగు నేలపై కార్టూన్ పండుగ....ఒకేసారి ఆరుగురు తెలుగు కార్టూనిస్టులకు జీవన సాఫల్య పురస్కారాలు
గత 24 సంవత్సరాలుగా కార్టూన్ రంగంలో ఏకైక ద్విభాషా పత్రికగా వెలుగొందుతున్న కార్టూన్‌ వాచ్‌ ప్రతి ఏడూ కార్టూన్ కళకు చెందిన విశిష్ట వ్యక్తులకి జీవన సాఫల్య పురస్కారం అందజేయటం ఆనవాయితీగా వస్తూవుంది. 2003లో శ్రీ ఆర్కే లక్ష్మణ్ గారితో మొదలై ఈ పురస్కారం సుధీర్ తైలాంగ్, అజిత్ నీనన్, బాలా సాహెబ్ ఠాక్రే వంటి ఎందరో ప్రముఖ కార్టూనిస్టులను వరించింది. మన తెలుగు కార్టూనిస్ట్ అయిన శ్రీ సుభాని గారు కూడా (2016లో) ఈ అవార్డ్ అందుకున్న ప్రముఖులలో వున్నారు. యిదిలా వుండగా 2019 మరియు 2020 సంవత్సరాలకు గాను కార్టూన్‌ వాచ్‌ పత్రిక తెలుగు భాషకు చెందిన ఏకంగా ఆరుగురు కార్టూనిస్టులకు ఈ పురస్కారం ప్రకటించి ఒకే వేదికపై అందించడం కన్నులపండువగా కార్టూన్ ప్రేమికులను అలరించింది. ఎడిటర్ శ్రీ త్రయంబక్ శర్మ గారు తన కుటుంబసభ్యులతో కలిసి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం హైదరాబాదు సోమాజిగూడలోని ది పార్క్ హొటల్లో నిర్వహించడం ముచ్చట కలిగించింది. యిదే వేదికపై కార్టూన్‌ వాచ్‌ స్పెషల్‌ ఎడిషన్‌ను కూడా ఆవిష్క రించారు.

2019 సంవత్సరానికి గానూ సీనియర్‌ కార్టూనిస్టు స్వర్గీయ మోహన్ గారు (వారి తరఫున వారి సోదరుడు జర్నలిస్ట్ ప్రకాష్‌ అవార్డును అందుకున్నారు), సీనియర్‌ కార్టూనిస్టులు శ్రీ జయదేవ్‌ బాబు, శ్రీ ఎం.ఎస్‌.రామకృష్ణలు పురస్కారాలు అందుకున్నారు.

2020కి గానూ నవ తెలంగాణ కార్టూనిస్టు శ్రీ నర్సిం, సాక్షి కార్టూనిస్టు శ్రీ శంకర్, నమస్తే తెలంగాణ కార్టూనిస్టు శ్రీ మృత్యుంజయ్‌ పురస్కారాలు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఎండీసీ సిఎండి ఎన్‌ బైజేంద్రకుమార్‌, మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ,  నమస్తే తెలంగాణ ఎడిటర్‌ కట్టా శేఖర్‌రెడ్డి, నవతెలంగాణ ఎడిటర్ శ్రీ వీరయ్య, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. వక్తలు ప్రముఖంగా కార్టూన్ కళపై వారికున్న మక్కువను వివరిస్తూనే కార్టూన్ రంగం ఎదుర్కుంటున్న యిబ్బందులనూ విశ్లేషించారు. ఈ రంగానికి కార్టూన్ వాచ్ పత్రిక అందిస్తున్న సేవలను కొనియాడారు. శ్రీ బైజేంద్రకుమార్ త్రయంబక్ శర్మ గారితో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. కార్టూన్ రంగంపై శ్రీమామిడి హరికృష్ణగారికున్న అవగాహన శ్రొతలను అబ్బురపరచింది.

అనంతరం బహుమతి గ్రహీతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు జర్నలిస్ట్ ప్రకాష్ ప్రసంగం ఛలోక్తులతో సాగింది. శ్రీ జయదేవ్ బాబు కార్టూన్ కళపై పరిశోధన చేస్తున్న విధ్యార్ధిని వేదికపైకి పిలిచి అందరికి పరిచయం చేయడం ఆకట్టుకుంది. కార్టూన్లపై యింకా విస్త్రుతంగా పరిశోధనలు జరగాల్సిన అవసరాన్ని తమ ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. శ్రీ రామకృష్ణ గారు తమ ప్రసంగంలో జాతీయ స్థాయి పత్రికలలో తనకు లభించిన ఆదరణ గుర్తుచేసుకుంటూ శ్రీ శంకర్ పిళ్ళైలాంటివారి నుండి తనకు లభించిన ప్రోత్సాహం, ప్రశంసలను సభకు తెలియజేశారు. అనంతరం శ్రీ నర్సిం, శ్రీ శంకర్ మరియు శ్రీ మృత్యుంజయ్ గార్లు ఒక పొలిటికల్ కార్టూనిస్ట్ వృత్తిపరంగా ఎదుర్కునే యిబ్బందులను ప్రస్తావిస్తూ తమ తమ పత్రికల సంపాదకులనుండీ సీనియర్లనుండీ తమకు అందిన ప్రోత్సాహం వుదహరిస్తూ ఎన్నో విషయాలు ప్రస్తావించి కార్టూన్ వాచ్ తమకు అందించిన పూరస్కారానికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ మృత్యుంజయ్ చిన్న వయసులోనే తనకు ఈ అవార్డ్ రావడం సంభ్రమాస్చర్యాలకు గురిచేసిందంటూ తనను ఎన్నుకున్నందుకు త్రయంబక్ గారు యిచ్చిన వివరణతో సంతృప్తి చెంది అవార్డుని స్వీకరిస్తున్నట్టుగా చెప్పారు. అవార్డు గ్రహీతలే కాకుండా ప్రసంగించిన వారందరూ కూడా స్వర్గీయ మోహన్ గారి ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా ప్రముఖంగా గుర్తు చేసుకున్నారు. ఆ సభా ప్రాంగణంలో శ్రీ మోహన్ గారు వున్నట్టుగానే ప్రతి ఒక్కరూ భావించడం విశేషం.

సభా ప్రారంభానికి ముందు కార్టూనిస్టులందరూ తమతమ సంతకాలతోబాటుగా చిన్న కార్టూన్ బొమ్మ గీసి ఒక జ్ఞాపికగా తయారు చేయడం ఆకట్టుకుంది. అతిధులతో కూడా యిలా గీయించగా శ్రీ బైజేంద్ర కుమార్ మరియు శ్రీ మామిడి హరికృష్ణ తమ చిత్రలేఖనా కళతో కార్టూనిస్టులనే అబ్బురపరిచారు. సభ పూర్తవగానే చక్కని విందు అందరినీ అలరించింది. వేరే రాష్ట్రం నుండి వచ్చి యింత చక్కగా సభ నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది.  సభను నిర్వహించడంలో శ్రీ త్రయంబక్ శర్మగారికి వారి సతీమణి, వారి రెండో అమ్మాయి సహకరించగా వారి పెద్దమ్మాయి ఫొటోలు తీస్తూ తన సహకారం అందజేయటం అందరిని ఆకట్టుకుంది. అన్నివిధాలా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా శ్రీ త్రయంబక్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు