ఆధార్ ఓటీపీ - యస్. రాజేష్ కుమార్

Aadhaar OTP

చామనఛాయ రంగు, గుండ్రని ముఖం కలిగి, నీలం రంగు షర్ట్‌ను నలుపు రంగు ప్యాంట్‌లో టక్ చేసి, మెడలో ఐడి కార్డుతో ఉన్న సుమారు ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు ఒకడు.. హడావిడిగా, ఆందోళనగా చేతిలో స్మార్ట్ ఫోన్‌తో శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లోకి వచ్చాడు. రాగానే అక్కడున్న కానిస్టేబుల్‌తో, “ప్లీజ్ సార్! నేను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారిని కలవాలి” అన్నాడు." అంతలోనే ఇన్స్పెక్టర్ ఉమేష్ తన గది నుండి బయటకు రావడం చూసి “సార్. నా భార్య మరియు నా ఆరు నెలల కొడుకు కనిపించట్లేదు, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా” అన్నాడా వ్యక్తి. సరే, అని ఇన్స్పెక్టర్ అతనిని లోపల కూర్చోబెట్టి, కొన్ని మంచి నీళ్లు తాగు అని గ్లాస్ చేతికిచ్చి, ఏం జరిగింది వివరంగా చెప్పు? అని విషయాలు అడగడం మొదలుపెట్టాడు.

“సర్ నా పేరు నరేష్. ఒక ప్రైవేట్ బ్యాంకు లో మధురానగర్ బ్రాంచ్ లో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాను” అంటూ తన భార్య, కొడుకు తో సహా అదృశ్యం అయిన విషయం విపులంగా చెప్పాడు. అంతా విన్న ఇన్స్పెక్టర్ ఉమేష్. “సరే. వాళ్ళ పేరు,ఫోటోలు మరియు ఇతర డీటెయిల్స్ తో కంప్లైంట్ ను ఎస్సై గారికి ఇచ్చి వెళ్ళు” అన్నాడు. మరుసటి రోజు రజిని తల్లి తండ్రులు స్టేషన్ కు వచ్చి ఇన్స్పెక్టర్ తో “సర్ మా అల్లుడే మా బిడ్డను, మనుమడిని చంపి నాటకాలు ఆడుతున్నాడు. వాడు రాక్షసుడు, అనుమానపు పిశాచి. రోజూ కొడుతున్నాడని మాకు చెప్పేది. మీకు దండం పెడ్తం వాడిని వదలద్దు”. అంటూ కాల్లావేళ పడ్డారు. “వాడిని కూడా ఇంటారాగెట్ చేస్తున్నాం. త్వరలో అన్ని తెలుస్తాయ్.” అని వారిని సముదాయించి పంపాడు ఇన్స్పెక్టర్ ఉమేష్. నరేష్ ని అన్ని విధాలా ప్రశ్నంచిన పోలీస్ లకు ఏమి క్లూ లబించలేదు. రజిని ఫోన్ ఆన్ చేసి లేకపోవడం, ఎటువంటి క్లూ కూడా దొరకపోవడం తో కేసు ఎట్లా చేదించాలో అని ఇన్స్పెక్టర్ తలపట్టుకున్నాడు. అంతలోనే కానిస్టేబుల్ “సార్, ఊరి బయట చెరువు దగ్గర ఒక మహిళ బట్టలు, చెప్పులు, చిన్న బ్యాగ్ దొరికాయి చూడండి అని టేబుల్ పై ఉంచాడు. “సర్, ఆ వస్తువులు నా భార్య వే.” అన్నాడు నరేష్ ఇన్స్పెక్టర్ తో. “సైకో ఎదవవి నువ్వే రజిని ని చంపి శవాన్ని చెరువులోకి తోసేసావు లేదా డెడ్ బాడిని మాయం చేశావు కదూ. నిజం చెప్పు అని కనుగుడ్లు ఉరిమి, తన గంభీరమైన కంఠస్వరంతో గట్టిగా గదమాయించాడు” ఇన్స్పెక్టర్. “సార్. వీడికి పోలీస్ లాఠీ దెబ్బ రుచి చూయించి, నిజం కక్కిస్తా”. అంటూ లాఠీ ఎత్తి నరేష్ ను కొట్టబోయాడు కానిస్టేబుల్.

నువ్వు ఆగవయ్య బాబు! అంటూ కాన్స్టేబుల్ ను తన చేత్తో అడ్డుకున్నాడు ఇన్స్పెక్టర్. ఆ ఏరా! నరేష్. “నీ మొబైల్ నుండి రజిని మొబైల్ కు “నిన్ను చంపేస్తా“ అని మెసేజ్ పెట్టి డిలీట్ చేసావ్, అవి క్లౌడ్ బ్యాకప్‌లో స్టోర్ అయ్యాయి”.నిజమేనా? “అయ్యో! నాకే పాపం తెలియదు.నేను ఏ మెసేజ్ పెట్టలేదు. నన్ను నమ్మండి సార్” అంటూ నరేష్ బోరున ఏడుస్తూ ఇన్స్పెక్టర్ కాళ్ళ పై పడ్డాడు. ****** నరేష్ చేతులు వణుకుతుండగా తన ఫోన్ స్క్రీన్‌ను ఇన్‌స్పెక్టర్ వైపు తిప్పాడు. "సార్.. చూడండి! నా మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. నా భార్య ఆధార్ ఓటీపీ ఇది. తను అదృశ్యమై మూడు సంవత్సరాలు అవుతుంటే. ఇప్పుడు ఈ OTP రావడం ఏంటి సార్?" అయోమయంగా చూస్తున్న ఇన్స్పెక్టర్ సుధాకర్ తో అక్కడే వున్న కానిస్టేబుల్ “సార్.ఇది పాత కేసు” అంటూ ఓ దుమ్ము పట్టిన ఫైల్ ను గుడ్డ తో తూడుస్తూ టేబుల్ పై ఉంచాడు. ఆ ఫైల్ లో పేజీలు గబగబా తిప్పేసిన ఇన్‌స్పెక్టర్, నరేష్ ఫోన్ లో ఆ మెసేజ్‌ను తీక్షణంగా పరిశీలించి, గడ్డం నిమురుకుంటూ ఆలోచనలో పడ్డాడు. "హుమ్.. నీ భార్య బతికే ఉంది”. అన్నాడు ఇన్స్పెక్టర్. నరేష్ కళ్లలో ఒక చిన్న ఆశ మెరిసింది.

"అయితే తను ఎక్కడుందో తెలుస్తుందా సార్?". ఆధార్ అప్‌డేట్ కోసం ఏదైనా మీ-సేవా సెంటర్‌ లో బయోమెట్రిక్ వేలిముద్ర వేసినప్పుడు ఇలా లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఇప్పుడే సైబర్ క్రైమ్ టీమ్‌ తో మాట్లాడుతా. ఆ నరేష్. “ఆ OTP రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేశాం. లొకేషన్ ఏపీ లోని గుంటూరు లో చూపిస్తోంది." నరేష్ షాక్‌తో "గుంటూరా? అసలు తనకి అక్కడ ఎవరూ లేరే! తను అక్కడికి ఎందుకు వెళ్తుంది?" "అదే ఇప్పుడు మిస్టరీ. అక్కడికి కి వెళితే నీ భార్య అదృశ్యం వెనుక ఉన్న అసలు నిజం బయటపడుతుంది. ఆ మిస్టరీని అక్కడే ఛేదిద్దాం! పద” అని ఇన్స్పెక్టర్ బయలుదేరాడు. గుంటూరు కు వెళ్ళిన పోలీస్లు రజినిని అక్కడ పట్టుకోలేకపోయారు. ఆధార్ అప్డేట్ కోసం ప్రయత్నించినప్పుడు తన ఆధార్ కు నరేష్ ఫోన్ నెంబర్ లింకయివుంది అని అర్థం కాగానే, తను చేసిన పొరపాటు గ్రహించి అక్కడ నుండి ఉడాయించింది రజిని. వెంటనే లోకల్ పోలీస్ సహాయం తో సీసీటీవీ ఫుటేజ్ చుస్తే ఆమె మరో వ్యక్తి తో కలిసి విజయవాడ బస్ ఎక్కినట్టు గుర్తించాడు ఇన్స్పెక్టర్ సుధాకర్. ఇన్స్పెక్టర్ ఇన్ఫర్మేషన్ తో విజయవాడ పోలీస్ రజినిని మరియు ఆమెతో వున్న వ్యక్తి ని శంషాబాద్ పోలీస్లకు అప్పచెప్పారు. స్టేషన్ లో ఓ మూలాన బక్కపలుచని రూపం, చూడగానే ఆకట్టుకునే ముఖవర్చస్సు ఉన్న రజిని, ఆమె చేయి పట్టుకుని అమాయకంగా చూస్తున్న మూడేళ్ల పిల్లాడు, వారి పక్కన నలుపు రంగు ముఖం, మంచి ఎత్తు,వత్తు మీసాలు, ట్రిమ్ చేసిన గడ్డంతో గంభీరంగా నిలబడ్డ ముప్పై ఐదు ఏళ్ల వ్యక్తి. భార్య తనను మోసం చేసి, పరాయి వ్యక్తి తో మూడేళ్లు గడిపిందనే విషయాన్ని నరేష్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అంత సేపు మౌనంగా వున్న రజిని ఇన్స్పెక్టర్ వరుస ప్రశ్నలతో నూరు విప్పింది. “సార్, నా భర్త పెట్టె చిత్రహింసలు భరించలేక చెరువులో దూకి చనిపోదామనుకొని ఆరు నెలల కొడుకును తీసుకొని ఇంటి నుండి వెళ్ళాను. సుబ్బరాజు అనే వ్యక్తి నేను నీళ్లలో మునిగిపోతున్న నన్ను, నా కొడుకుని కాపాడి ఒడ్డు కు చేర్చాడు. నా ఆత్మహత్య ప్రయత్నానికి నా భర్త పెట్టిన వేధింపులే కారణమని తెలుసుకున్న సుబ్బరాజు, పోలీస్ కు కంప్లైంట్ చేద్దాం అంటే నేనే వద్దన్నాను. ఆ పోలీసులు నచ్చచెప్పి మళ్ళీ నా భర్త దగ్గరికే పంపుతారు కాబట్టి వద్దన్న. నువ్వు ఇక్కడే ఉంటే రోజు చిత్రహింసలు పడాల్సి వస్తుందని సుబ్బరాజు అదే రాత్రి నన్ను గుంటూరు తీసుకెళ్లాడు.

అతనితో కొత్త జీవితం మొదలుపెట్టి మూడు సంవత్సరాలైంది. “మరి ఆధార్ సెంటర్ కు ఎందుకు వెళ్ళావ్?” అడిగాడు ఇన్స్పెక్టర్. నా కొడుకు ను అంగన్వాడీ లో వేద్దామంటే నా ఆధార్ అడ్రస్, ఫోటో అప్డేట్ చేసుకోవాలన్నారు. అప్డేట్ తో ఓటీపీ నరేష్ కు వస్తుందని నాకు తట్టలేదు. మరి ఫోన్ లో “నిన్ను చంపేస్తా” అని నరేష్ నీకు మెసేజ్ చేసాడుగా? అడిగాడు ఇన్స్పెక్టర్. “సార్. అది నేనే ఆయన మత్తు లో వున్నప్పుడు నరేష్ మొబైల్ నుంచి నా మొబైల్ కు బెదిరింపు మెసేజ్ చేసి డిలీట్ చేశా”. మరి బట్టలు, బ్యాగ్, చెప్పులు అక్కడే చెరువు దగ్గర ఎందుకు వదిలేశావ్? గట్టిగా అడిగాడు ఇన్స్పెక్టర్. నన్ను నరేష్ చంపాడని అనుమానించడానికి సీన్ క్రియేట్ చేశా సార్. “సార్. నా భార్య తప్పులను క్షమిస్తున్నా. మళ్ళీ నా జీవితంలో కి ఆహ్వానిస్తున్న. దయచేసి నా భార్య ను, కొడుకును నాతో పంపండి” అని దీనంగా బతిమిలాడాడు నరేష్. “ఒరేయ్! నరేష్ అమాయకుడిగా నటించకు, నువ్వు పెట్టిన టార్చర్ని రజిని రహస్యంగా మొబైల్ లో రికార్డ్ చేసింది చూడు” అని ఇన్స్పెక్టర్ ఫోన్ ను నరేష్ ముఖం ముందుంచాడు. నరేష్ తన హింసాప్రవృత్తి ( violent tendency ) బయటపడటంతోతన భార్య కళ్ళలోకి సూటిగా చూసే ధైర్యం లేక తలదించుకొని, చేతులు కట్టుకొని మరోపక్క నిలబడ్డాడు. “నన్ను మళ్ళీ ఆ నరకకూపంలోకి నెట్టకండి సార్. నా మనసు గెలుచుకున్న సుబ్బరాజు తోనే వుంటా” అని రజిని చాలా నిక్కచిగా ఇన్స్పెక్టర్ తో చెప్పింది. “నరేష్ పై గృహహింస కేసు పెట్టండి. రజినినీ కోర్ట్ లో హాజరుపర్చండి”.అని ఇన్స్పెక్టర్ అక్కడినుండి వెళ్ళిపోయాడు. *** ఆర్డర్, ఆర్డర్.... “పోలీస్ లను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినందుకు రజినికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, 498A ఐపీసీ కింద నరేష్ కు మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఐదువేల జరిమానా విదిస్తున్నాం” అంటూ జడ్జి తీర్పు చదివాడు. తీర్పు వింటున్న రజిని మొహంలో చిన్న గెలుపు నవ్వు.

మరిన్ని కథలు

Tappu
తప్పు
- మద్దూరి నరసింహమూర్తి
Andari bandhuvayya
అందరి బంధువయ్యా
- డా:సి.హెచ్.ప్రతాప్
Ruthuchakram- O chinnari katha
ఋతు చక్రం - ఓ చిన్నారి కథ
- మిక్కిలి రాజ్యలక్ష్మి
Dharma samstapanardhaya
ధర్మ సంస్థాపనార్ధాయ
- డా:సి.హెచ్.ప్రతాప్
Atyaasha
అత్యాశ
- చెన్నూరి సుదర్శన్
Bhayanakam
భయానకం
- డా:సి.హెచ్.ప్రతాప్
Vinadagunevvaru cheppina
వినదగు'నెవ్వరు'చెప్పిన!!
- జి.ఆర్.భాస్కర బాబు