తునికాకు - భవ్య చారు

తునికాకు

అది 1980 వ సంవత్సరం , ఎండ బాగా కాస్తోంది, వెంకన్న వడివడిగా నడుస్తున్నాడు . ఎండకాలం లో తునికాకు బాగా దొరుకుతుంది , అందుకే మబ్బున్నే ఇంత సద్ది కట్టుకొని వచ్చాడు. ఆకు కోసం , అది కరీంనగర్ జిల్లా లోని ఒక మారుమూల పల్లె, ఆ పల్లె కు పొద్దున , సాయంత్రం ఒకే ఒక బస్ వచ్చి పోతుంది. 

ఆ పల్లె లో ఒక rmp డాక్టర్ తప్ప ఎవరూ లేరు , జ్వరం వచ్చినా, గర్భవతి అయినా , ఇంకేమైనా వచ్చిన ఆ డాక్టర్ ఒక్కడే గతి వాళ్లకు ,  వాళ్లకు ఏ వస్తువు కావాల్సి వచ్చిన  మూడు కిలోమీటర్లు దూరం లో  ఉన్న  కొంచం పెద్ద ఊరు అని అనిపించే ,అక్కడికి వెళ్లాల్సిందే.
 
ఆ ఊర్లో ఏమి దొరకదు , వల్ల ఊర్లో  ఒక్క సారాయి మాత్రం విరివిగా దొరుకుతుంది.అది కూడా అయిదు రూపాయలకు ఒక పాకెట్, వెంకన్న వాళ్ళు అంటే కుటుంబం లోని అందరూ దాదాపు గా రాత్రి అయితే ఇదే తాగుతారు, వాళ్లు కష్ట పడి సంపాదించేది అంతా దానికోసమే....

వాళ్ళ ఆడవాళ్లు కూడా బాగానే కష్ట పడతారు, కాబట్టి వాళ్ళు తాగుతారు,  ఎందుకంటే వాళ్ళకి అదొక అలవాటు గా మారిపోయింది కాబట్టీ.. 
 
అదే ఊర్లో ఉన్న ఇంకో విషయం ఏమిటంటే అన్నల గొడవ , అన్నల్లో కలిసిన వాళ్ళు , ఈ మధ్య ప్రభుత్వం వల్ల కొంత మంది జన స్రవంతి లో కలిసిపోయారు , వాళ్ళే ఈ సారాయి తయారు చేసి , అమ్ముతూ, జీవనం కొనసాగిస్తున్నారు ...
 
అందువల్ల కొంత మంది భయం తో ,వాళ్ల దగ్గర కి వెళ్లి తాగుతున్నారు , కొందరు డబ్బు ఉన్నప్పుడు వెళ్తే , డబ్బు లేనప్పుడు వెళ్లకపోతే , వాళ్ళు పిలిచి మరి , అరువుగా ఇస్తున్నారు. వీళ్ల వల్లే వాళ్లకి జీవనం నడుస్తోంది కాబట్టీ, ఎవర్నీ వదులుకోలేరు....
 

అలా ఆ ఊరు  ఏలాంటి ప్రభుత్వ సదుపాయాలు లేక , కనీసం కంట్రోల్ ( రేషన్ షాప్ )  లేకపోవడంతో, ఆ ఉరి మగవాళ్ళు కొందరు వ్యవసాయం చేస్తే , కొందరు దొరల వ్యవసాయoలో పాలేరు గా పని చేస్తూ , ఇంకా కొందరు , వేరే పొలం లో జీతగాళ్ళు గా పనిచేస్తూ , జీవనం కొనసాగిస్తున్నారు..
 

అలాంటి కొంత మంది లో ఒక్కడే మన వెంకన్న , వెంకన్న కొండ ఎక్కే సరికి  ఎండ బాగానే వస్తుంది , చేతికి అందిన చెట్లు ఎక్కుతూ , దిగుతూ , ఆకు అంతా గబగబా తెంపి , తాను తెచ్చిన సంచుల్లో నింపుతున్నాడు, అతనికి దగ్గర్లో ఇంకా ఎవరో ఉన్నట్టు గా అనిపించింది , ఎవరో చూద్దాం అని చెట్టు దిగాడు అతను , ఆ కొంచం సమయంలో నే రెండు సంచులు నింపి పెట్టాడు.....

చెట్టు దిగి , చప్పుడు వచ్చిన వైపుగా వెళ్ళాడు వెంకన్న, అక్కడ ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు , మిలట్రీ వాళ్ళు వేసుకునే లాంటి డ్రెస్ వేసుకున్నారు ,అందరి భుజాలకు చేతి సంచులు ఉన్నాయి, నిలబడ్డ వారు , నిలబడట్టు గానే సంచులోనుంచి కొన్ని పుస్తకాలు తీసి పక్కన పెడుతున్నారు... ఇంకా ఏవేవో తీసి లెక్కలు చూస్తూన్నారు, వెంకన్న ఎవరో తెలిసిన వల్లే అనుకోని , ఎరా మల్ల అని అంటూ ఒకతనిపై చేయి వేసాడు , కానీ అతను ఇటూ తిరిగే సరికి ,మల్ల కాదు , వేరే ఎవరో , ఎవరయ్యా మీరు అని అడిగాడు వెంకన్న , నువ్వు ఎవరు అని తిరిగి ప్రశ్నించారు వాళ్ళు, నేను ఈ కింద ఉన్న పల్లెల్లో ఉంటాను.నా పెరు వెంకన్న అని చెప్పాడు , 

అవునా సరే వెంకన్న మేము నీకు తెలియదు గాని , నువ్వు ఒక్కడివి ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడిగాడు అందులోని ఇంకో వ్యక్తి , నేను తునికాకు కోసం వచ్చిన , అది తీసుకపోవలె అన్నాడు , గట్లన అయితే సప్పుడు జెక , ఎల్లిపో అన్నాడు , గదేంది ఇంకా నాలుగు సంచులు గూడ కాలే , గిప్పుడే నేను పోను గాని ముందుగల్లా మీరెవరు జెప్పిండి అనగానే ,  ఎయి చెప్తుంటే మలుతమైతలేద పో ,పో గిడనుంచి జల్దీ పో ఇగ ఇటు అంకల రకు మేము అన్నలం , సప్పుడుజెక పొర బై , అన్నాడొకడు, అవునా గట్లన అన్న ,మీరు అన్నల మరి తుపాకులు ఎయి , అరే నాకే అవ్వొద్దం సెప్తారా , మీరు అన్నల్లో ,గిన్నెలో సుస్థ నేను , మికడా తుపాకులు సుపియ్యుడ్రి ముందుగల్ల గప్పుడు నమ్ముతా అని వెంకన్న అనగానే....

 సంచిలోనుండి వారిలోని మూడో వ్యక్తి తుపాకీ తీసి , వెంకన్న కి చూపించి, సుడు ఇగో ఇదే తుపాకీ అని చూపించాడు, అర్ తుపాకీ మస్తుగుంది గాని , నిజం తుపాకీ అయితే  ఓ పాలీ నేనట్టుకుంటా అన్నాడు వెంకన్న , దాన్ని చూసిన ఆనందంలో , అరె  పిల్లగా పొర ఇది నిమేనదేరా, ఇగో సుడు జల్దీ గిడనుంచి పో ,  నడిమెట్ల ఎవలన్న అడిగిన మా సంగతి సెప్పకూ, జల్ది పోరా బై , పొలిసొళ్ళు మా గురించి ఎంకులాడుతండ్రు , ఇడ నుంచి నువ్వు పోలేదనుకో , ఇగో సుడు గి తుపాకీ పెట్టి నిన్ను కాలుస్తా, సచి పోతవ్, మళ్ళ , పో అని అన్నాడు  మూడో వ్యక్తీ , అలా అతను అనగానే , వెంకన్న కి దృఢంగా అనిపించింది వాళ్ళు అన్నలు అని ,
  

 సరే పోతాగని ఇంకో రెండు సంచులు తునికాకు టెంపుకొని పోత అని అన్నాడు , అరె తునికాకు లేదు ఎం లేదు , నింపిన కాడికి తీసుకపో రా, లేకుంటే మాతో పాటు నువ్వు సస్తావ్ అని అన్నాడు నాలుగో వ్యక్తి, ఏ లేద్దోరా,  నాలుగు సంచుల తునికాకు తెస్తేనే నా అప్పు తీర్థది అని మా దొరసాని సెప్పింది , గి యల్లా నేను నాలుగు సంచులు  టెంపక పోతే ఇంకో పడిరుకాలు ఎక్కువ అయితాయి అని సెప్పింది , అందుకే గింత తెంపుతున్న అన్నాడు వెంకన్న....
 
అరె మళ్ళ రేపు వచ్చి తెంపుకో కానీ ఇయ్యల మాత్రం ఎల్లిపోరా అన్నాడు , ఆ వ్యక్తి , అప్పటికే మధ్యాహ్నం కావస్తున్నది , వెంకన్న కి ఆకలి అవుతుంది, కానీ విల్లు వెళ్లమంతున్నారు, ఇగో అన్న పోతాతి గాని ఈ కొండ డిగాలి అంటే కొంత శక్తి కావాలె గదా , దండి గింత తిని పోదాం అందరం అని అన్నాడు , ఇగో గా తిండి , బిండి మకేం అడ్డు గాని , నువు ఇడనుంది జల్దీ పోయి , ఇంకేదానన్న తిను పో అన్నాడు , అన్న గిడానే జర నీడ  బాగా ఉంది, గిడానే గింత తింటాన్న ,మీరు తినకుంటే మానే నాకెంది, అని తెచ్చుకున్న సద్ది మూట విప్పాడు..


 ఆ సద్ది మూటలోనుండి  సద్ది గిన్నె తీసాడు , ఆ గిన్నెలో ఇంత అన్నం , ఎర్రగారం , ఉల్లిపాయ, ఉన్నాయి, అది సుడగానే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా నోరు ఊరింది , వాళ్ళకి కూడా ఆకలిగా అనిపించింది, తమ సంచుల్లో ఉన్న మూటలు తీశారు వాళ్ళు , అరె బై మేము కూడా ని సోపాతి తో కూసోని తింటాం రా , అన్నారు వాళ్ళు , అరె అన్న గట్లాంటావ్ ఏందీ , రాండ్రి తిందురు అన్నాడు వెంకన్న...అందరూ చుట్టూ కూసోని  తినడానికి  తయారు అయ్యారు...

వీళ్ళు ఇలా మాట్లాడుతుండగానే , వేరే దారిలో నుండి ఆ కొండ ఎక్కుతున్నారు పోలీసులు, వాళ్ళకి ఎలా తెలిసిందో కానీ ,పోలీసులు ఇంకో పక్క నుండి వస్తున్నారు, కానీ ఇవేవీ తెలియని  వారు అన్నం తినడానికి సిద్ధం అయ్యి , తింటూ కూర్చున్నారు.. ఎస్.ఐ ,ఏడుకొండలు గారు ఆ పోలీసుల గ్రూప్ లీడర్ గా వ్యవహరిస్తూ,ముందుకు నడిపిస్తున్నాడు, పది మంది  బెటాలియన్ పోలీసులు ,తుపాకులు ఎక్కు పెట్టి , ముందుకు సాగుతున్నారు....

చెట్లని చాటు చేసుకుంటూ ,వీరు ఉన్న ప్రదేశానికి దగ్గరగా వచ్చేసారు, అక్కడ ఉన్న వారిని గమనించిన ఏడుకొండలు , మిగతా వారికి సైగ చేసాడు, అందరూ తుపాకిలు ఎక్కు పెట్టారు , ఏడుకొండలు గారు కౌంటింగ్ మొదలు పెట్టారు..వన్ ,అని అంటూ ..

ఇక ఇక్కడ తినడం చివరికి వచ్చేసింది, అందరూ తమ తమ సంచులు సర్దుకున్నారు.చుట్టూ పొదలు ఉండడం వల్ల వారికి వీరు కనిపించడం లేదు , అందులోని ఒక వ్యక్తి చేయి కడుక్కుని, ప్రకృతి అవసరానికి కొంచెం ముందుకి వచ్చాడు.ఆ సమయం లో అడవి అంతా నిశ్శబ్దంగా ఉంది, ఆ నిశ్శబ్దంలో లీలగా ఆ వ్యక్తి కి మాటలు గాలిలో వినిపించాయి.అతను అనుమానం తో నిశితంగా పరిశీలించి చూసాడు,...


 అతని అనుమానం దృఢ పడింది,దాంతో తన మిత్రులకు గలిలోనే సమాచారం అందించి, గబగబా వచ్చి ,తన సంచి తీసుకుని , బయటకి వచ్చాడు, అతని సందేశాన్ని అందుకున్న మిగతా వారు కూడా , తమ తమ సరంజామా సిద్ధంగా పెట్టుకుని ,ఒక పెద్ద పొద చాటుగా చేసుకుని ,పోలీసులని గమనిస్తూ,తమ ప్రాణాలని కాపాడుకుంటూ ఉన్నారు, వారికి ఇచ్చే శిక్షణలో గాలి సందేశం, తమని తాము కాపాడుకునే చిట్కాలు,చాలా నేర్పిస్తారు.. దానితో వాళ్ళు తమ ప్రాణాలని కాపాడుకుంటూన్నారు.. 

ఇవేవీ గమనించనిది ఒక్కడే అతనే వెంకన్న, వాళ్ళు తమ సంచులు సర్దు కోవడం చూసి , అదేంది అన్న ,గట్ల పోతునవా ఇగ , అని అన్నాడు , ఉష్ ఉరుకో , అని వెంకన్నని గదిమి ,పొద చాటుకి వెళ్ళిపోయారు వాళ్ళు , ఏందో గి అన్నల ముచ్చట అని అనుకుంటూ, తన సద్దిమూట  సర్దుకుంటూ , ఒక్కడే పాట పాడుకుంటూ ఉన్నాడు, ఏవో తత్వాలు పాడుతున్నాడు.. 

 ఏడుకొండలు  వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని గమనించి, ఫైరింగ్ కి సైగ  చేసాడు, దన్ ,ధన్,ధన్ ధన్ మంటూ, తుపాకుల మోత తో అడవి దద్దరిల్లింది, ఒక గంట పాటు ఆ అడవిలోని ప్రాణులన్నీ, ప్రాణాలని  గుప్పిట్లో పెట్టుకుని, ఉన్నాయి...
 
గంట తర్వాత , అడవి సద్దుమునిగింది,అంతటా నిశ్శబ్దం ఆవరించింది.ఎక్కడ చప్పుడు లేదు , పోలీసులు అంతా చూసి వచ్చి , ఎక్కడ ఎవరు లేరు, తప్పించుకున్నారు అని అనుకుని , ఎవ్వరూ లేకపోవడంతో, నిరాశాగ వెనుదిరిగి వెళ్ళిపోయారు, అన్నలేమో తమ ప్రాణాలు తమకు దక్కించుకుంటూ, వెనుదిరిగి చూస్తూ, పొదల మాటున తప్పించుకుని , తమ స్థానాల్లోకి వెళ్ళిపోయారు..అందరూ అన్ని విధాలా సురక్షితంగా ఉన్నారు....

ఇక్కడ సురక్షితంగా లేనిది ఒక్కడే, ఆ నిశ్శబ్దంలో ,నిశ్శబ్దంగా కలిసిపోయి ,అలసిపోయి, ఎరక్క వచ్చిన పాపానికి , ఆ తునికాకు గుట్టలో , ఆ ఆకు కింద , ఆ తుపాకుల కి బలైపోయిన వెంకన్న , రక్తపు ముద్దలా మారిపోయి ఉన్నాడు,వెంకన్న అన్నల కడుపు నింపాలనుకున్న  వెంకన్న, దోర బాకీ తీర్చాలని కోరుకున్న వెంకన్న , ఆ బాకీ కిందనే  పడి ఉన్నాడు, ...

అన్నల,పోలీసుల పోరాటంలో  ఓడిపోయిన ఒక అల్పప్రాణి , ఆ అడవిలో  , ఆ గుట్ట మీద , ఆ నిశ్శబ్దంలో , ఆ అల్పప్రాణి తూటాలకు బలైపోయి , చెల్లాచెదురుగా పడిన తునికాకు మీద అతని రక్తపు చుక్కలు మెరుస్తున్నాయి..ఎండకి..

 

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు