బంధం - నాగమణి తాళ్ళూరి

relation

"నా కళ్ళ జోడు విరగ్గొట్టింది ఎవరే?"  బామ్మ గారి  గావు కేక చెవిన పడగానే నా  గొంతులోని ఇడ్లీ ముక్క దడుచుకుని , దారి మరిచి పోయి అడ్డం తిరిగేసరికి దారుణంగా పొలమారింది నాకు.

గ్లాసుడు నీళ్ళతో గొంతునూ , నా ఉలికిపాటుకు బెదిరి వేగం పెంచుకున్న గుండెనూ సముదాయించి హాల్లోకి పరుగెత్తాను.

రెండు చేతుల్లోనూ రెండు ముక్కలైన కళ్ళ జోడును పట్టుకుని కళ్ళతో నిప్పుల వర్షం కురిపిస్తోంది.
ఆవిడ    తన  చనిపోయిన తమ్ముడు కొనిపెట్టిన ఆఖరు కానుకగా అపురూపంగా చూసుకుంటున్న వస్తువు అది .పనికి రాకుండా విరిగిపోయింది.

ఇది భూకంపం కాదు , ఖచ్చితంగా సునామీయే , కొంప మునిగిపోవడం ఖాయం అనుకున్నాను.

"నాకు తెలీదు బామ్మా నే చూడలేదు " భయం భయంగా సమాధానమిచ్చాను.

"  టీవీలో ప్రవచనాలు విన్నాక      అక్కడ పెట్టి స్నానానికి వెళ్ళొచ్చి చూస్తే ముక్కలై ఉంది. ఎవరి మొఖాన పెట్టుకు చచ్చారో !"కోపంతో రగిలిపోతోంది బామ్మ.

"బన్నీ ఇందాకే స్కూల్ కి వెళ్ళాడు , ఈయన షాప్ కి వెళ్ళిపోయారు. నేను వంటింట్లోనే ఉన్నానండీ ముందు గదిలోకి రానే లేదు , నేను చూడలేదు." సంజాయిషీగా  .

"ఎవరూ చూడకుండా , ఏమీ చేయకుండా దాని పాటికి అది విరిగిపోయింది కాబోలు , కలికాలంలో వింతలు జరుగుతాయని కాలజ్ఞానంలో చెప్పారుగా" నిష్టూరంగా చేతులు తిప్పుతోంది ఆవిడ.

"సరే మధ్యానం ఈయన భోజనానికి వచ్చినప్పుడు మార్చి కొత్త జోడు తెస్తారు లెండీ" సమాధాన పరచాలని అన్నాను.

ఆవిడ గొణుగుడు మానలేదు.

ఇంట్లో ఎవరూ లేరు? ఎలా విరిగిందో అర్ధం కాకుండా ఉంది నాకు.

గుడి నుండి అప్పుడే ఇంటి కొచ్చిన అత్తగారి చెవిన పడిందా సణుగుడు.
"లంకంత కొంప ఉండగా అక్కడా ఇక్కడా తగలెట్టడమెందుకో ,   అలమారలో పెట్టొచ్చు కదా! తన చేతిలోనే విరిగిందేమో ఎవడు చూసాడు? ఈ ముసలి దానికి అబధ్ధాలు ఆడే బుధ్ధి ఉంది." అత్తగారి కౌంటర్.

బామ్మ వినేసింది. వినాలనే కదా అత్తగారు అన్నది కూడా!


"ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమనవే మీ అత్తగారిని , నోరు జారితే మర్యాద దక్కదు" ఉగ్రరూపం దాల్చేసింది బామ్మ.

"నా ఇల్లు నా ఇష్టం . ఎలాగైనా మాట్లాడతాను. మర్యాద కావాలంటే గడప దాటి అడగమను" అత్తగారి ఆవేశం.

నివ్వెర పోయి నిలబడిపోయాను.

ఏంటిది? రోజూ కీచులాటలు మామూలే గానీ ఇవాళ మూడో ప్రపంచ యుధ్ధానికి ఇరు వర్గాలు సై అంటున్నాయి.
 "నేనేం ఊరికనే ఇక్కడికి రాలేదు.  నా అరెకరం పొలం అమ్ముకుని వ్యాపారం పెట్టుకున్నాడు ఆవిడ గారి మొగుడు అది గుర్తు పెట్టుకోమను"  బామ్మ ఆవేశంలో బ్రహ్మాస్త్రం వాడేసింది.

"ఆయనకు ఇస్తే పైకి వెళ్ళి ఆయన్నే అడుక్కోమను "   మా అత్తగారు లాజిక్ వదల్లేదు.

"దేవుడా! ఈ రోజు నా శక్తి యుక్తులన్నీ నిర్వీర్యం చేసేసావా"

నా ప్రార్ధనలు వినేలా లేడు భగవంతుడు.

చూస్తుండగానే మాటల యుధ్ధం ఆరంభమై పోయింది. అత్తగారి గళం నుండి కటువైన పదాలు , బామ్మ ఏడుస్తూ ఇచ్చే ఎదుర్కోళ్ళతో కొంప కురుక్షేత్రమై పోయింది.

సంధి ప్రయత్నాలు చేయబోయాను గానీ ఇరు వర్గాల వారూ నన్నో శత్రువు కు సంబంధించిన గూఢచారిలా భావించి బుసలు కొట్టడంతో మిన్నకుండిపోయాను.

 అలసిపోయారో లేక ఆకలేసిందో మరి మధ్యాన్నానికి కొంచెం  ఆ  తుఫాను తెరిపినిచ్చింది.

కంచంలో అన్నం పెట్టి పెద్దావిడ కు  శోష  వస్తుందేమో అని భయమేసి "బామ్మా, భోజనం చెయ్" అన్నాను.

ఆవిడ బోరుమంటూ "చూసావంటే పిల్లా, మీ అత్త దాష్టీకం , పెద్దదాన్ని  అని కూడా  లేకుండా! ఎన్నేసి మాటలు అంటోందో చూడు" అంది .
జాలేసింది కానీ   ఇద్దర్లో ఎవరూ తగ్గరైతిరి మరి.

"పోనీలే బామ్మా ఆవిడ సంగతి మనకు తెలియనిది కాదుగా!" అన్నాను  సముదాయింపు గా.

"ఆవిడ మీద నువ్వెందుకు మాట పడనిస్తావులే , ఎంతైనా అత్తా కోడళ్ళు ఒకటే , నేనే పరాయిదాన్ని "మొఖాన కొట్టినట్లుగా అనేసరికి
చివుక్కుమంది నాకు.

"ఎంత బతుకు బతికాను? ఎంత సంసారం నడిపాను? నా మాటకు ఎంత విలువ ఉండేది? నన్ను పట్టుకు నానా మాటలు అంటుందా?" బామ్మ నోరు ఇక మూతపడదు .

షుగర్ పేషెంట్ అని అత్తగారికీ భోజనం పట్టుకెళ్ళాను.

"ఆవిడ గారు మింగిందా వాయనం,ముందు ఆవిడ గారి సేవ చేసుకో , నాదేముందీ ఇక్కడే పడి ఉంటానుగా" ఈసడింపుగా అంటోంది.

మనసు మెలి పెడుతూ ఉంటాయి ఇద్దరి నిష్టూరాలూ , నిట్టూర్పూలూ.

"పోనీ లెండీ చాదస్తపు మనిషి , ఆవిడతో మనకెందుకు మీరు తినండి"  ఏదో చెప్పాలి అన్నట్లు చెప్పాను మా అత్త గారితో.

"ఈ తద్దినాన్ని తెచ్చి తలకు చుట్టిన మీ మామ గారిని అనాలి" తీక్షణంగాఫొటో వైపు చూస్తూ "ఆ నోటికి మూత అనేది ఉందేమో చూసావా! కృష్ణా రామా అంటూ ఓ మూలన కూచుందామని లేదు , అన్నింట్లోకి దూరిపోవడమే. కళ్ళజోడు విరిగితే ఏంటంటా! షాపు వాడు అతికించడా? లేక కొత్త ఫ్రేము వేయడా?" ఈవిడా ఏం తక్కువ తినలేదు.

అసలు ప్రపంచంలో ఇలా తగాదా పెట్టుకునే మాటలతో కొట్టుకునే తల్లీ కూతుళ్ళను నేను ఎక్కడా చూడలేదు.

మీరు సరిగానే చదివారు , నేనేమీ పొరపాటుగా రాయ లేదు. వాళ్ళిద్దరూ  నిజంగా తల్లీ కూతుళ్ళే!
బామ్మగారి ఒక్కగానొక్క కూతురు మా అత్తగారు.

బామ్మ కు కూతురు పుట్టిన మూడేళ్ళకు భర్త తాచుపాము కాటుతో లోకాన్ని వదిలి వెళ్ళగా   పసికందుతో పుట్టింటికి చేరిందంట.

కూతురికి ఈడు రాగానే తమ్ముడికిచ్చి చేసిందంట.

"చదువుకుంటాను , ఇప్పుడే పెళ్ళి వద్దు" అని ఎంత  మొత్తుకున్నా వినకుండా తన మెడలు వంచి పెళ్ళి చేసిందని తల్లి మీద మా అత్తగారికి గుర్రు ఉన్న మాట నిజమే అయినా మా మామ గారితో ఆవిడ పాలూ నీళ్ళలా కలిసిపోయిన మాటా నిజమే!

చేసుకునే ఓపిక లేక , చూసేవారు లేక అవసాన దశలో కూతురు పంచన చేరింది బామ్మ. తన  అల్లుడికి వ్యాపారంలో గడ్డు  దశ నడుస్తోంటే చూడలేక తనకు మిగిలిన అరెకరం మాగాణి అమ్మి ఇచ్చిందంట.

ఓ ఒరలో రెండు కత్తులు ఇమడొచ్చేమో గాని ఓ కప్పు కింద రెండు కొప్పులుఇమడవు అనేది నిజమే.

మా అత్తగారి మాట కటువు , చూపు చురుక్కు , కానీ మనసు  మరీ అంత ఎడారి కాదు.
అసలు  తన తల్లి  రాకతోనే తమకు ఆర్ధిక సమస్యలు మొదలయ్యాయనీ , ఆవిడ పాదం మోపగానే ఆరోగ్యంగా ఉండే తన భర్త హఠాత్తుగా పోయాడని మా అత్తగారి బలమైన విశ్వాసం.

తల చెడిన ఆడపిల్ల పుట్టింటిపంచన జేరితే ఆ ఇంట్లో కలిసిరాదని ఇరుగూ పొరుగూ అమ్మలక్కలు చెప్పిన మాటలు బుర్రలోనాటుకుపోవడం కూడా ఓ కారణం.

అందుకే బామ్మను చూస్తే ఆవిడకు చిరాకు.

అక్క అనే ప్రేమతోనూ , సమయానికి సాయం అందించిందనే కృతజ్ఞతతో మావయ్య గారు , వయసులో పెద్దావిడ , కాస్త నోరు గల్ల మనిషి అనే భయంతో నేనూ బామ్మ గారికి కొంత గౌరవం ఎక్కువిచ్చేసాం.

దానితో మా అత్త గారికి తన ఆధిపత్యానికి ఆటంకం కలిగినట్లు , ఇంట్లో తన ప్రాధాన్యత తగ్గినట్లూ ఊహలుమొదలై తన పట్టు ను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోంది.

తన అస్ధిత్వాన్ని కాపాడు కోవాలనే ఆరాటం , ఆస్థి మొత్తం తమ్ముడికే ఇచ్చాను కదా అనే ధీమా తో పోరాటం చేస్తోంది బామ్మ.

మావయ్య గారి నిష్క్రమణతో బలి పశువును నేను అయ్యాను.

ఇద్దరి రామ రావణ యుధ్ధాన్ని వివరించి నేను చెప్పగా విని పకపకా నవ్వుతూ"ఉదయం బన్నీ టవల్ కుర్చీలో వేసాడోయ్ , దానిపై మా అమ్మ కూర్చుంది. తను లేచి వెళ్ళాక ఆ టవల్ తీసుకుని నేను స్నానానికి వెళ్ళాను. తప్పు ఎవరిదో , ఎవరి వల్ల జోడు రెండు ముక్కలైందో కొంచెం ఇన్వేస్టిగేట్ చేసి చెప్పు. పండక్కి పట్టు చీర కాకపోయినా కాటన్ చీర అయినా కొనిపెడతాను"మా ఆయన హాస్యం.

ఇంత విషమ పరిస్థితుల్లో కూడా నవ్వెలా వస్తుందో ఈయనకు అర్ధమై చావదు నాకు.

"వాళ్ళు భాధ్యతలు తీరిన వాళ్ళు , వయసు అయిపోయిన వాళ్ళూను. ఖాళీగా ఉండటం మూలానో , కాలక్షేపం కోసమో పాత సంగతులు తవ్వుకుని గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు నువ్ పట్టించుకోకు" ఎప్పుడూ ఇచ్చే సలహానే ఉదారంగా మరోసారి ఇచ్చేసారు.

అస్తమానూ కొంపలో పడి ఉండేది నేను , పట్టనట్లు ఉండటమెలాగ? వదిలేస్తే జుట్లు పట్టుకుని వీధిలో పడతారేమో అని భయం ఒకటి ఏడ్చింది కదా నాకు.

బామ్మ నోటికి దూకుడెక్కువ ,ఆవిడ నిర్మొహమాటంగా ఎంత మాటైనా అనేస్తుంది. 

మా అత్తగారి మాటకు పెళసరం పెచ్చు. కర్ర విరిచి పొయ్యిలో పెట్టినంత చక్కగా సమాధానమిస్తుంది.

"చీర మడతలు పోయేలాగా ఆరేయలేదనో , కూరలో ఉప్పు ఎక్కువైందనో , అరటి పళ్ళు మాగితేనే కానీ ఇవ్వడానికి మనసొప్పడం లేదా మీకు" అనో  బామ్మ అస్తమానూ చురకలు వేస్తుంది.

"వాగడానికి ఓపిక ఉంది కదా , కాస్త పని సాయం చేయొచ్చు కదా " అని మా అత్త అట్లకాడ వాతలు పెడుతూనే ఉంటుంది.

పెద్దరికానికి గౌరవమిస్తున్నానో , మాటకు రెండు మాటలతో సమాధానం ఇచ్చుకునే వారి నేర్పరి తనానికి నివ్వెర పోతున్నానో , సాయం అందుకున్న కృతజ్ఞతా భావమో తెలీదు కానీ ఒకింత పంటి బిగువున ఈ భాగవతాన్ని భరిస్తున్నాను.

"ఒరేయ్ , నీ పేరేంటో చటుక్కున తట్టి చావదు , బనీనో , డాయరో ఇలా రారా" బామ్మ కేక .
పాపం వాడికి పెద్దోళ్ళంటే ప్రేమేనూ .

హోమ్ వర్క్ చేసే వాడల్లా చివాలున పరుగెత్తుకుని ఎదురుగా నిలబడి మరీ
"ఏంటి బామ్మా " అడుగుతున్నాడు.

"వీధి చివర కొట్లో కాస్త దగ్గు బిళ్ళలు తెచ్చి పెట్టరా" కొంగున మూటలోని చిల్లర తీస్తోంది. 


"చక్కని పేరుండగా డ్రాయర్లూ , చెడ్డీలు అని పిలుస్తావా ,పొద్దున్నే ఆ దిక్కుమాలిన బిళ్ళలు చప్పరించకపోతే రోజు గడవదు కాబోలు, ఇంకోసారి ఆ ముసిల్ది పిలవగానే వెళితే నీ కాళ్ళు విరిచేస్తాను" మనవడికి మా అత్త  వార్నింగ్.

"నీకు మనవడు అయితే నాకు ముని మనవడు , మరచిపోకు. తల్లిని కదా "అమ్మా ఏమైనా తింటావా , చేసి పెట్టనా "  అని అడగాల్సింది పోయి నోరేసుకుని పడిపోతున్నావ్ , నీ ధాటికి తట్టుకోలేకనే నా తమ్ముడు అర్ధాంతరంగా పోయాడు" బామ్మ ఆరోపణలు.

భయపడిపోయాడేమో ఓ మూలగా నిలబడి ఒణికిపోతున్నాడు బన్నీ. 

ఉదయాన్నే మొదలైన కిష్కింధ కాండను తిలకించి , పులకించే మహధ్బాగ్యం ఈవేళ మావారికి లభించింది.

శాంతమూర్తి కాస్తా ఉగ్ర నారాసింహావతారం ఎత్తారు మా ఆయన.

"ఇలాగే రోజూ కొట్టుకు చావండీ , మాకు మనశ్శాంతి లేకుండా చంపండి. మీరు హాయిగానే ఉంటారు , మీ గోలకి పిచ్చెక్కి మీకన్నా ముందే మేం పోయేట్లు ఉన్నాం" .

అంత కోపం నేను ఊహించలేదు.

ఆయన వ్యాపారంలోని ఒత్తిడి , దాని మూలంగా కలిగే విసుగు ఆ రకంగా బయటపడింది.


కొడుకు అన్న మాటకు తల్లి హృదయం తల్లడిల్లిపోయినట్లుగా ఉంది. కళ్ళ నిండా నీరు నింపుకుని అక్కడనుండి వెళ్ళిపోయింది.

బామ్మ ఏడుస్తూ పడుకుంది. ఆ పూట అన్నాలు ఎవరూ తినలేదు.

నోరు జారినందుకు ఆయనా బాధ పడుతూనే ఉన్నారు.

"మూడు గంటల వేళ కు గుండెల్లో ఏదో కలకేస్తోందే" అన్నారు అత్త గారు ఓర్చుకోలేనంత ఇబ్బంది పడుతున్నారని అర్ధమైంది నాకు.
కడుపు ఖాళీగా ఉండటం చేత పేగులు లుంగ చుట్టుకుని నొప్పి వచ్చిందేమో అని గబగబా మజ్జిగ అన్నం పట్టుకెళ్ళాను.

ఓ ముద్ద తినగానే భళ్ళున వాంతి అయింది.

ఆవిడ నొప్పితో మెలితిరిగి పోతోంది.

అసలే చిన్నబోయి ఉన్న మావారి మొహం   తల్లి బాధ చూడలేక  దిగులును పులుముకుంది.

బామ్మకు ఓ మాట చెప్పి , ఇల్లు కనిపెట్టుకుని ఉండమని హెచ్చరించి హడావిడిగా హాస్పిటల్ కు తీసుకెళ్ళాం.

కాళ్ళూ , చేతులు ఆడనట్లు గా ఉంది నాకు.

అరగంట తరువాత మమ్మల్ని లోపలికి పిలిచిన డాక్టరు పరలోకానికి పయనమై వెళ్ళిన మా అత్తగారి శరీరాన్ని అప్పగించారు.

ఒంట్లోని శక్తి మొత్తం ఎవరో లాగేసుకున్నట్లు కూలబడి పోయారు ఆయన.

స్నేహితుల సాయంతో అత్తగారి భౌతిక కాయం ఇల్లు చేరింది.

తల వైపున దీపంతో వాకిట్లో పడుకున్నారు మా అత్తగారు.

  తల్లడిల్లిపోతున్నాడు కొడుకు.

బామ్మ ఎంగిలిపడిందో లేదో కనుక్కుందామని వెళ్ళాను.

కాళ్ళు పెట్టుకునే వైపు తల పెట్టుకుని పడుకుని ఉందామె.

తట్టి లేపుదామని చెయ్యి వేసాను.
ఒళ్ళు చల్లగా , బిగుసుకున్నట్లు ఏదో అసహజంగా అనిపించింది.

కదిపి చూసాను. చలనం లేదు.
కాళ్ళ కింద భూమి కదిలి పోయినంత ప్రకంపనలు నాలో.


తల్లి వెంట కూతురు వెళ్ళిందో , కూతురు వెంట తల్లి తోడుగా వెళ్ళిందో గానీ ఇద్దరూ ఒకేసారి వెళ్ళిపోయారు.


కొద్ది సేపటి ముందు హోరాహోరీగా పోట్లాడుకున్న తల్లీకూతుళ్ళు సయోధ్య కుదిరినట్లు పక్క పక్కనే పడుకున్నారు, తల దగ్గర దీపాలు వెలిగించుకుని మరీ!

మరణం లో కూడా పట్టు , పంతం వీడలేదు ఇద్దరూ.

వారిద్దరి మౌనం ఇంత భయంకరంగా ఉంటుందని ఊహించని నేను నిలబడిపోయాను నిశ్చేష్టంగా!