ప్రకృతి ఒడిలో నా అందమైన బాల్యం - Bharathi Makaraju

my childhood in nature

కాలమన్న మాయలో ఆవిరైన జీవితం
చినుకు చినుకుగా కరిగి చేరుకుంది నా గతం
జ్ఞాపకాల విరులు అన్ని నింగి నుంచి జాలువారి
నీటి అద్దమై మెరిసె.. నేలమీద ఈ క్షణం
ఆశగా వంగి చూస్తే, అందమైన ప్రతిబింబం
గొడుగు చాటునుండి తొంగిచూస్తున్న బాల్యం

వర్షంలో చిందులేస్తు పరుగులెత్తి ఇంటికెళ్లి
గొడుగు గూటిలోన.. గువ్వలల్లె ఎదురుచూసి
వడివడివడిగా చూరునుంచి జారుతున్న నీటిబొట్లు
పిల్ల ఏరులై పొంగి అల్లరిగా పిలుస్తుంటె
కాగితాల కొలువుతీరి చిన్ననాటి ఆశలన్నీ
పడవలపై తేలిపోయి సంద్రానికి పయనమయ్యె

చల్లగాలి వీచు.. సాయంత్రపు వేళలోన
ఎంత ఆటలాడినా అలుపురాని వయసులోన
రెక్కలొచ్చి ఊహలన్ని గాలిపటాలై ఎగిరి
నింగి దాటి చుక్కలకై పరుగుతీసె మనసులోన
రెప్పవాలనివ్వదే అంతులేని ఆశ్చర్యం
ఆరుబయట సోలిపోయి చూస్తుంటె ఆకాశం

ఇసుక గూళ్ళు, రేగిపళ్ళు, కోతి కొమ్మచ్చి ఆటలు
సరదాగా గడిచిన వేసవికాలం సెలవులు
ఎండైనా, వానైనా, చెమటైనా, చలిఐనా ఒక్కటే ఉత్సాహం
కనపడనేలేదు ప్రకృతికి నాకు మధ్యన ఏ దూరం
మరి ఎందుకు ఆగిపోయావు బురద అంచున ప్రస్తుతం?
అని అడిగింది అమాయకంగా నా పసితనం

ఇక జాగుచేయక ఏమాత్రం సమయం
ఎగిరి దుకా..వాననీటిలోకి తక్షణం

                              - భారతి మాకరాజు 

మరిన్ని వ్యాసాలు

role model
ఆదర్శం (చిన్నపిల్లల కథ)
- యనమండ్ర సత్య సాధన
వేయిపడగలు
- Manasa Nirakh
our dear brother cartoonist
మా తమ్ముడు కార్టూనిస్టు
- డా. ఎస్. జయదేవ్ బాబు
problems of labours
వలస కూలీల వెతలు
- అంగర రంగాచార్యులు
let us leave silence
మౌనం వీడదాం రండి!
- బి ఎస్ నారాయణ దుర్గా భట్