అమ్మ భాష - స్వర్ణ

Mother Toungue

ప్రాశస్త్య భాష తెలుగు - ప్రాచీన భాష తెలుగు
ప్రాకృతిక భాష తెలుగు- పరిపూర్ణ భాష తెలుగు
చక్కని చిక్కని చక్కెర కలిపిన ఆవు పాల పెరుగు
నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు....

దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు రాయుల వారు.
తెలుగు భాష లోని మాధుర్యం అలాంటిది...

పుట్ట తేనె లాంటి తీయదనాన్ని తెలుగు భాషలో చవిచూసిన ఎందరో కవులు తెలుగు భాష పై ఎన్నో కవితలు రచనలు చేశారు..

మహారథి "తెలుగు తల్లి తీపి తెలుగుతనం తీపి బొట్టు తీపి చీరకట్టు తీపి అని తన శతకం లో వర్ణించారు ఈ కవులు చెప్పిందంతా ఆరోగ్యంగా ఉన్న ఆనాటి తెలుగు తల్లి గురించి తెలుగు భాష గురించి....

కానీ ఇప్పుడు పరిస్థితి వేరు తెలుగు తల్లిని నడిరోడ్డు మీద నగ్నంగా నిలపడానికి బిడ్డ లే పూనుకోవడాని చూసి ఆ తల్లి బోరుమంటున్నది....

రాష్ట్ర విభజనపై చూపించిన శ్రద్ధ భాషను కాపాడుకోవడం పై నాయకులు చూపకపోవడం మన తెలుగువారి దౌర్భాగ్యం.....

ఏ జాతికైనా భాషే జీవం.. మాతృభాష ను విస్మరిస్తే ఆ జాతి విజ్ఞాన వికాసాలు ప్రమాదంలో పడతాయి.. తల్లి భాషను నేర్చని విద్యార్థి మెదడు వికసించదని మన పూర్వీకులు స్పష్టం చేశారు....

తమిళోదయమానికి మూల పురుషుడు అయిన అన్నాదురై ఒక సందర్భంగా ప్రతి వ్యక్తికి మాతృభాష కళ్ళు అయితే పరాయి భాష కళ్ళజోడు అని పేర్కొన్నారు... కానీ మనకి ఇదేమీ పట్టడంలేదు...

భాష ప్రాతిపదికగా ప్రత్యేక రాష్ట్రం ను సంపాదించిన నేడు ఆ భాష ను పూర్తిగా విస్మరిస్తున్నారు....
భాష పేరుతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్న ఆ భాష అభివృద్ధి కి చేసింది శూన్యం.....

అలా అని భాష అభివృద్ధి చెందకుండా ఆగిపోలేదు.. కాలానుగుణంగా భాష తన పరిధి విస్తరించికుంటుంది

తెలుగు విషయం లోనూ అదే జరిగింది ఎవరు వద్దనుకున్నా గిడుగు వారి పుణ్యమా అని వ్యవహారిక భాష వాడకాన్ని ఆపలేకపోయారు... వెయ్యేళ్ళుగా సంకెళ్లు వేస్తూ వచ్చిన పండితులు ఏమీ చేయలేక వాడుక భాషకు పట్టం కట్టి పక్కకు తప్పుకున్నారు...

పరిశుద్ధమైన భాష అంటూ ప్రపంచంలో ఏదీ ఉండదు ఒక భాష వికసించేటప్పుడు ఇతర భాష ల ప్రభావాలు ఉంటాయి అయితే ప్రభావం వేరు మొత్తం గా ఉనికి పోగొట్టుకొవడం వేరు... దాదాపు 120 మిలియన్లు మాట్లాడే తెలుగు భాష మీద ఇతర భాషల ప్రభావాలు కనిపిస్తాయి.

కొత్త శాస్త్ర విజ్ఞానం అందిపుచ్చుకోవడానికి ఇంగ్లీష్ కావాలి అనే ఆలోచన అనుగుణంగా మన విద్యా బోధన తయారయింది. మాతృభాష గట్టిగా వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మరో భాష ను నేర్చుకొవడం కష్టమైన పనేమీ కాదు.

తెలుగు భాషాపరిరక్షణ, తెలుగు ఆధునికీకరణ, భాషాభివృద్ధి ప్రణాళిక లో విషయంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. కానీ సమస్యలు ఉన్నాయని అసలు కే పొగ పెట్టడం మాతృభాష ద్రోహం మాత్రమే కాదు దేశద్రోహం కూడా....

వాస్తవానికి గ్లోబలైజేషన్ క్రమంలో ఇంగ్లీష్ చదువుకొని రాయగలిగే మాట్లాడే వారికి ఉద్యోగ అవకాశాలు అధికం కావడం ధనార్జన అధికం గా పెరగడంతో పరభాష పై నేటి యువత మోజు పెంచుకుంటుంది. తల్లి భాష బ్రతుకు ఇవ్వకుండా పోతుంది అన్న ఆలోచన వారి ని పరభాష వైపు పరుగులు తీయిస్తోంది. అందుకే నేటి తరం తల్లిదండ్రులు కు తెలుగు భాష విషం కన్నా చేదు అయింది.. దానితో తెలుగు భాష అనాధ గా... రూపుదిద్దుకుంది. ఈ సంస్కృతి మారాలి అంటే తెలుగు ప్రజలే భాషను పరిరక్షించుకోవాలి...

మన భావితరాలకు అందించే భాషగా తెలుగు వెలగాలంటే....

* ప్రజల్లో అధికారుల్లో నాయకుల లో ఆంధ్ర అభిమానం ఉండాలి
* తెలుగు మీడియంలో విద్యను ప్రోత్సహించాలి.
* ఇంగ్లీష్ మీడియం నిరుత్సాహ పరచాలి
* ఇంగ్లీషులో చదివితే వస్తున్న ఉద్యోగాలు తెలుగులో చదివితే వస్తాయి అనే విధంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి
* అధికార భాషా సంఘాన్ని పునరుద్ధరించి అధికారాలు కల్పించాలి
* తెలుగు నేర్చుకొన్న అధికారుల్ని నియమించాలి
* తెలుగులో ఐఏఎస్ ఐపిఎస్ వంటి ఉన్నత పరీక్షలకు రాసే పద్ధతి అమలు చేయాలి
* ప్రభుత్వ ఉత్తర్వులు న్యాయస్థానాల తీర్పులు పూర్తిగా తెలుగులోనే ఉండాలి
* టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ కంప్యూటర్ లో తెలుగు ప్రాధాన్యం కల్పించాలి
* దూరదర్శన్లో హిందీని బలవంతంగా రుద్దకుండా తెలుగు అవకాశం కల్పించాలి.

ఇన్ని పనులు చేయాలంటే మాతృభాషాభిమానం ఉండాలి తెలుగు భాష పట్ల మమకారం అంకితభావం ఉండాలి

అధికార భాషా సంఘం కొందరి అధికార దాహం తీర్చడానికి ఉపయోగపడుతుంది. కానీ అధికారభాషగా తెలుగుని తీర్చిదిద్దడానికి ఉపకరించిడం లేదు. వారి లో నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలుగు భాష బతికించుకుందాం రండి అంటూ సమర శంఖారావం పూరించి అసెంబ్లీని ముట్టడిస్తామని పిలుపునిస్తే కవులు ,సాహితీ వేత్తలు, వివిధ రంగాల్లో తెలుగు భాషాభిమానులు కదంతొక్కి ఉద్యమానికి ఉప్పుఅందించడానికి సిద్ధంగా ఉన్నారు...

లక్ష్యం ఆ దిశగా నడపాలి కానీ భాషా దినోత్సవాలు పేరుతో వేదికలెక్కి ఒక్కరోజు ఉపన్యాసాలతో తెలుగు ను పట్టిపీడిస్తున్న తెగులు జబ్బు నయం కాదు..

భాషాభిమానలు అంతా ఆలోచించాలి.. తెలుగు భాషకు పట్టు వస్త్రాలు కట్టి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సాంస్కృతిక విప్లవం కునడుం కట్టాలి... అలా కానప్పుడు నేటి ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు రేపటి వారి సంతతికి ఆంగ్లమే నేర్పుతూ పోవడం ఆనవాయితీ అయిపోతుంది. తెలుగుతల్లి సమాధిలో కలిసిపోతుంది.

తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే సంస్కృతి మనకొద్దు ఏరు దాటాక తెప్ప తగలేసే అది మన ఉనికిని ఉరేస్తూంది...

ఏ జాతికైనా తల్లి భాషను సంరక్షించుకోవడం ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం...
భాష నశిస్తే జాతి నిర్జీవం అవుతుంది...చిత్తశుద్ధి ఉంటే లక్ష్య సిద్ధి దానంతట అదే సిద్ధిస్తుంది.

మన భావితరాలకు తెలుగు అమలు కష్టమేమీ కాదు శాస్త్ర సాంకేతిక యుగంలో పరిజ్ఞానం ను భాషాభివృద్ధి కి ఉపయోగించాలి యువతరంలో భాషాభిమానం మొగ్గ తొడిగేలా చేయగలిగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ....

తెలుగు అంటే....
నన్నయ పద్యం - చిన్నయ్య వ్యాకరణం
శ్రీనాధుని సీసం - పోతన భాగవతం
అన్నమయ్య పాట -కూచిపూడి ఆట
గురజాడ స్వరం - గిడుగు స్వరం
ఘంటసాల గానం -సాలూరు రాగం
గోదావరి గలగల- కృష్ణానది కళ కళ
రాజమహేంద్రవరం - ఏకశిలానగరం
ఆత్రేయపురం పూతరేకు- ఆత్రేయ పాటల పూలరేకు

మొత్తంగా చెప్పాలంటే అమ్మ పేగు బంధం నాన్న ప్రేమ గంధం..

అలాంటి నా మాతృభాష తెలుగును భావితరాలకు అందించేందుకు నా వంతు కృషి లో భాగం....ఈ నా ప్రయత్నం....

మరిన్ని వ్యాసాలు

కళారూపం తోలుబొమ్మలాట .
కళారూపం తోలుబొమ్మలాట .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కురుక్షేత్ర సంగ్రామం.
కురుక్షేత్ర సంగ్రామం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
మనజానపద కళలు
మనజానపద కళలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
మన శిల్ప శోభ .
మన శిల్ప శోభ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
హనుమంతుడు.
హనుమంతుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
యజ్ఞం .
యజ్ఞం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
శారదా పీఠం .
శారదా పీఠం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.