పూరి 20ఏళ్ల సినీ ప్రయాణం - రఘు కుంచె

PURI JAGAN 20 years Journey of Cinema

ఫిలింనగర్లో  తన ఆఫీస్ లో బయట గడ్డిలో కూర్చుని ఉన్నాం... అక్కడ ఒక  తెలియని నిశ్శబ్దం... దాన్ని ఛేదిస్తూ  మాట్లాడాలని ఉంది... కానీ ఎదురుగా ఉన్న తన ముఖంలో  ఓడిపోయాను అన్న బాధ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది , దాన్ని కట్టడి చేయ గలిగే శక్తి ఆ సమయంలో నాకు లేదు...

అతని కళ్ళలో నీళ్లు కూడా బయటకి రావడానికి కూడా భయపడుతూ ఆగి ఉన్నాయ్  ... ఎందుకంటె వాటికి అతని విల్ పవర్  గురించి తెలుసు కాబట్టి ....

కొంచెం వెనక్కి వెళ్తే -

ఒకటి కాదు రెండు కాదు, 4 ఏళ్ళ కష్టం ... ఆ కథ పట్టుకుని ఎలా తిరిగాడో నాకు తెలుసు... అంతకు ముందు 2 సినిమాలు ఓపెనింగ్ జరిగి ఆగిపోయాయి...  'కృష్ణ ' గారితో 'థిల్లానా' అనే సినిమా ... 'సుమన్ 'గారితో  'పాండు' అనే సినిమా .  కానీ ఆ మనిషి కృంగిపోలేదు... తిరిగాడు... తిరిగాడు... చెప్పులు అరిగేలా తిరిగాడు ..

మొత్తానికి నిర్మాత "త్రివిక్రమరావు"గారి కి  ఆ కథ వినిపించి, ఆయన ఆ కధని "పవన్ కళ్యాణ్ " గారికి వినిపించగలిగే  అవకాశాన్ని సంపాయించాడు - ఆయనకీ వినిపించాడు - ప్రొసీడ్ అని అనిపించుకున్నాడు... ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా చెప్పిన కథని , చెప్పిన సమయానికి చెప్పినట్టుగానే  పూర్తి చేయగలిగాడు.

ఏప్రిల్-20-2000 సినిమా విడుదల అయింది... RTC క్రాస్ రోడ్స్  లో సంధ్య థియేటర్ లో ఆ సినిమా చూడ్డానికి వెళ్ళాం... పవన్ కళ్యాణ్   గారి అభిమానులు సందడి చాలా గొప్పగా అనిపించింది...  కానీ సినిమా పూర్తి అయ్యేసరికి... చిన్న తేడా కొడుతుంది అక్కడి వాతావరణం ... సరే మాట్నీ వరకు వెయిట్ చేద్దామంటే వొద్దు అని ఫిలింనగర్లో  తన ఆఫీస్ కి silent గా వెళ్ళిపోయాడు .

మేం అంతా ఇళ్ళకి వెళ్లిపోయాం... సాయంత్రం ఒకసారి కలుద్దామని ఆఫీస్ కెళ్ళా... అక్కడి పరిస్థితే  నేను ముందు చెప్పింది  ....

మొత్తనికి నా నోటి ఒక మాట బయటికి రాగలిగింది .... " ఏంట్రా పరిస్థితి "....అని

తను అన్నాడు... ఐపోయిందిరా --! రిపోర్ట్ చాలా బ్యాడ్... సినిమా వర్కవుట్ కాదని డిస్ట్రిబ్యూటర్స్ తేల్చేసారు... ప్రొడ్యూసర్ ఫోన్ తియ్యడం లేదు... మళ్ళీ  0 నుండి మొదలు పెట్టడమే... చేసేదేం లేదు... అని గడ్డిలో ఆలా వాలిపోయాడు... ఎలా ఓదార్చాలో తెలియక సైలెంట్ గా ఉండిపోయాను...

ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్లిపోయాం ....

మరునాడు సాయంత్రానికి ...

ఆ సినిమా విషయంలో ఒక అద్భుతం జరిగింది ... సడన్ గా  అన్ని చోట్లనుండి అద్భుతమైన బజ్  ... "బద్రి " సూపర్ హిట్ అని రిపోర్ట్స్  .... ఆల్ ఓవర్ హౌస్ ఫుల్ అని ఫోన్స్ అదే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి .....నిర్మాత త్రివిక్రమరావు గారు రిపోర్ట్స్ పట్టుకుని పూరి ఆఫీస్ కొచ్చారు ... ఆయన ఆనందానికి పట్టపగ్గాలు లేవు .. ఆల్మోస్ట్  జగన్ ని ఎత్తుకున్నంత పని చేశారు ... కళ్యాణ్ గారి దగ్గరనుంచి ఫోన్ ... మెగాస్టార్ నుంచి అభినందన సందేశం ... ఆరోజు  జగన్ చిన్నపిల్లాడిలా గంతులెయ్యడం నేను చూసాను ..

ఆ తర్వాత ఆ సినిమా 200 రోజులు ఆడింది ... "నువు నందా ఐతే నేను బద్రీ .. బద్రీనాథ్ " మారుమోగిపోయింది .... నాటి "బద్రి నుంచి  నేటి ఇస్మార్ట్ శంకర్" వరకు ... తనది ఒక గొప్ప ప్రయాణం .. ఎంతో ఎత్తుకి  ఎదిగాడు ... మధ్యలో చాలాసార్లు దెబ్బతిన్నాడు ... పడిన ప్రతీసారి అంతకన్నా వేగంగా  లేచేవాడు ... తను లేస్తూ ఇంకో పదిమందిని లేపేవాడు...

వాడికి తెలిసింది ఒకటే ..
మనిషిని మనిషిగా చూడటం... తను ప్రేమించినంత గొప్పగా జంతువుల్ని ,పక్షుల్ని ఇంకెవరు ప్రేమించరేమో ఈ ప్రపంచంలో ...

ఎంతోమందికి తను చేసిన  'అపాత్ర దానాలు' ఐతే వాటికి లెక్కే లేదు... ఒక నిర్ణయాన్ని  తీసుకోడంలో అతని వేగాన్ని అందుకోడం అసాధ్యం ... కానీ ఒకే ఒక్క విషయంలో చాలా బలహీనుడు ..!

" మనిషిని అంచనా వేయడంలో ".
చాలా సార్లు మోసపోయాడు
ఈ "మనుషుల "వల్ల ....
నన్ను  ఒక మాట అంటూ ఉంటాడు  !
"ఎప్పుడూ అంత  హ్యాపీ గా ఎలా ఉంటావ్ రానువ్వు ?"  అని ....😃

ప్రియమైన జగన్ .... ఈ 20 ఏళ్ల నీ ప్రయాణంలో  నువ్వు -నేను మాత్రం అలానే ఉన్నాం ... మనం ఎప్పటికి ఇలానే ఉండాలని  ఆ దేవుడిని కోరుకుంటున్నాను ..విజయాన్ని అపజయాన్ని ఒకేలా చూడగలిగే దమ్మున్న హృదయం నీది 🤗
ఇంకోక్క 20 ఏళ్ళు సినిమాని ప్రేమించరా ...ప్లీజ్  🙂
శుభాకాంక్షలు స్నేహితుడా ❤️

మరిన్ని వ్యాసాలు

కళారూపం తోలుబొమ్మలాట .
కళారూపం తోలుబొమ్మలాట .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కురుక్షేత్ర సంగ్రామం.
కురుక్షేత్ర సంగ్రామం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
మనజానపద కళలు
మనజానపద కళలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
మన శిల్ప శోభ .
మన శిల్ప శోభ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
హనుమంతుడు.
హనుమంతుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
యజ్ఞం .
యజ్ఞం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
శారదా పీఠం .
శారదా పీఠం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.