పంజరం (బాలల కథ) - డి వి డి ప్రసాద్

cage

టివిలో కార్టూన్ ఛానల్ చూస్తున్న చిన్నూ తాతని అడిగాడు. "తాతా!  ఎప్పుడు ఈ లాక్‌డౌన్ పూర్తవుతుంది?" అని.

"ఏం ఎందుకురా!  ఇప్పుడప్పుడే లాక్ డౌన్ సడలించేట్లులేదు.  అసలు ఇప్పుడెలాగూ స్కూలు లేదుగా!  హాయిగా ఇంట్లోనే కూర్చుని టివిలో కార్టూన్ షోలు చూస్తూ, సెల్‌లో గేములు ఆడుతూ ఉన్నావుకదా!  అదీ కాక అప్పుడప్పుడు నేను చెప్పే కథలు వింటున్నావు కదా."  అన్నారు తాత రామారావుగారు.

"లేదు తాతయ్యా, ఈ లాక్ డౌన్ సడలించి స్కూళ్ళు తెరిస్తే బాగుణ్ణు." అన్నాడు చిన్నూ.

చిన్నూవైపు విస్మయంగా చూసారు రామారావుగారు.

"అదేంటి, బడి తెరిచి ఉన్నప్పుడు ఎగగొట్టడానికి రకరకాల సాకులు వెదుక్కొనేవాడివి, అలాంటిది ఇప్పుడు బడి తెరవాలని కోరుకుంటున్నావా?" అన్నారు ఆశ్చర్యంగా.

"అవును తాతయ్యా!  ఇంట్లోనే ఇన్నిరోజులు ఉండిపోయి బందీఖానాలో ఉన్నట్లు ఉంది.  కనీసం బడి తెరిస్తేనయినా మా స్నేహితుల్ని కలవచ్చు, వారితో ఆడుకోవచ్చు.    ఇప్పుడు కనీసం వీధిలోకి కూడా వెళ్ళడానికి లేదు, స్నేహితులతో ఆడుకోవడానికి లేదు. నేనొక్కణ్ణీ ఇంట్లో కూర్చొని ఎంతసేపని ఆడుకోను?  వీధిలోకి వెళ్తే నాన్నగాని, అమ్మగానీ ఒప్పుకోరు." అన్నాడు చిన్నూ దిగులుగా.

చిన్నూని జాలిగా చూసారు తాతగారు.

"చిన్నూ!  ఇప్పుడు కరోనా వైరస్ వలన వీధిలో తిరగకూడదురా!  పరిస్థితులన్నీ చక్కబడ్డాక బడికి వెళ్ళవచ్చు.  వీధిలోకి కూడా వెళ్ళవచ్చు.  అందాక ఇంట్లోనే ఉండి ఎంచక్కా ఆడుకో.  టివి విసుగనిపిస్తే, నువ్వు పెంచుకున్న రామచిలక చిక్కూతో ఆడుకో." అన్నారు తాతగారు.

చిన్నూ హుషారుగా లేచి నిలబడి పంజరంలో ఉన్న చిలకతో ఆడుకోసాగాడు.  దానికి జామపళ్ళ ముక్కలు పెడుతూ, అది వినిపించే చిలకపలుకులు వింటూ కొద్దిసేపు గడిపాడు.  ఏడాది క్రితం చిన్నూ ముచ్చటపడితే నాన్నగారు వాడికి చిలక కొనిచ్చారు.  దానికి చిక్కూ అని పేరుపెట్టి, దాని కోసం అందమైన పంజరం కొనిపించి అందులో దాన్ని ఉంచి ప్రాణపదంగా చూసుకుంటున్నాడు. రోజూ దానికి పళ్ళు తినిపించి, చిన్న గిన్నెతో నీళ్ళు తాగడానికి ఇచ్చేవాడు.  రోజులో చాలాసేపు దానితోనే ఆడుకొనేవాడు.  టివీ చూడటం, గేములు ఆడటం తగ్గించాడు.  చిలక వచ్చినతర్వాత చిన్నూ అల్లరితగ్గడంతో వాడి అమ్మానాన్నా కూడా చాలా సంతోషించారు.  అయితే ఈ లాక్ డౌన్ తర్వాత రోజంతా ఖాళీగా ఉండటంతో మళ్ళీ టివి చూడటం, సెల్‌తో ఆడుకోవటం మొదలెట్టాడు.

అయితే, ఆ రోజు చిక్కూతో ఆడుకున్నప్పుడు వాడికి అది చాలా దిగులుగా ఉన్నట్లు తోచింది.  "చిక్కూ!...ఏం ఇవాళ దిగులుగా ఉన్నావు?  ఎందుకు ఉత్సాహంగా లేవు?  నేనున్నానుగా నీతో ఆడడానికి" అడిగాడు చిలకని లాలనగా.

అయినా చిలక అలాగే దిగులుగా కదలక మెదలక పంజరంలో ఓ మూల కూర్చుంది.  చిన్నూఎంత బతిమాలినా ఇచ్చిన పళ్ళు కూడా తినలేదు.  దానివంక తదేకంగా చూస్తున్న చిన్నూకి అప్పుడు తోచింది, చిక్కూ ఒంటరిగా పంజరంలో ఉండటంవల్ల దిగులుగా ఉందని.  అప్పుడు ఈ లాక్‌డౌన్‌లో తను ఇంట్లోనే ఉండిపోయి స్నేహితుల్ని కలవలేకుండా ఎలా ఒంటరిగా ఆడుకుంటున్నాడో గుర్తొచ్చింది.  తను నలభైరోజులు ఇంట్లో ఉంటేనే ఇంత చిరాకు పడితే, తన చిలక చిక్కూ పాపం ఏడాదిగా పంజరంలోనే బందీగా ఉంది మరి. 

'పాపం స్వాతంత్రం లేక, పంజరంలో బందీ అయి చిక్కూ ఎంత బాధపడుతుందో?  దానికి కూడా స్వేచ్ఛగా ఎగరడానికి, తన తోటి చిలకలతో ఆడుకోవడానికి మనసులో ఎంత కోరిక ఉంటుందో పాపం.  తనకి ఎప్పటికైనా ఈ లాక్ డౌన్ నుండి విముక్తి దొరుకుతుంది, కాని దానికి జీవితాంతం లాక్ డౌనే.' ఇలా మనసులో అనుకున్న చిన్ను ఇంక ఉండబట్టలేక, పంజరం తలుపు తీసి చిలకని గాలిలోకి వదిలేసాడు.  చిక్కూ ఎగిరిపోతూ తనకి కృతఙతలు తెలుపుతున్నట్లు తోచింది చిన్నూకి.  ఎగిరిపోతున్న చిక్కూ వైపు చూసి ఆనందంగా చేతులు ఊపాడు.

అదిచూసి తాత అడిగారు, "అదేమిటి చిన్నూ, చిక్కూతో ఆడుకోకుండా వదిలేసావు?" అన్నారు విస్మయంగా.

"తాతయ్యా!  పాపం చిక్కూ పంజరంలో ఏడాదై లాక్‌డౌన్‌లో ఉంది తాతయ్య!  నాలాగే అదికూడా తన తోటివారిని కలుసుకోక పంజరంలో ఒంటరిగా ఉండి ఎంతో దిగులుతో ఉంది తాతా.  అందుకే దాని లాక్‌డౌన్ సడలించి వదిలేసాను.  ఇప్పుడు అది ఎంత ఆనందంగా ఎగురుతుందో చూసావా తాతయ్యా?" అన్నాడు చిన్నూ.

చిన్నూ మంచి మనసు అర్థం చేసుకొని తాతయ్య వాడి తలనిమిరారు ఆప్యాయంగా.

                                                                               

                                                                                                                                    - డి వి డి ప్రసాద్

 

D V D PRASAD

House no. EW-2,

Neelachal Nagar, 5th line,

BERHAMPUR-760010 (ODISHA)