ఉపయోగపడని ప్రతిభ - పద్మావతి దివాకర్ల

ఉపయోగపడని ప్రతిభ

రామాపురం అనే పట్టణంలో సుబ్బిశెట్టి అనే ధనవంతుడైన వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతను ఇతర ప్రాంతాలనుండి రకరకాల సరుకులు సేకరించి రామాపురంలో వ్యాపారం చేసేవాడు.  తన తండ్రినుండి వారసత్వంగా సంక్రమించిన వ్యాపారాన్ని అభివృద్ధి చేసి అనతి కాలంలోనే ఆ పట్టణంలోకెల్లా గొప్ప ధనవంతుడైనాడు. అతని వద్ద వివిధ పనులు చూసుకోవడానికి చాలా మంది నౌకర్లు ఉండేవారు.  సుబ్బిశెట్టి తనకి వ్యాపారాల్లో, వ్యవహారాల్లో తగు సలహాసహకారాలు అందించడానికి గోవిందుడు అనే వాడిని నియమించుకున్నాడు.  సుబ్బిశెట్టి వ్యాపార అభివృద్ధికి ముఖ్యకారకుడు గోవిందుడే.  గోవిందుడి వల్ల సుబ్బిశెట్టి వ్యాపారం మూడు పూవులు, ఆరుకాయలుగా వర్ఢిల్లింది.  దాంతో అతను చుట్టుపక్కల పట్టణాలకి కూడా తన వ్యాపారాన్ని విస్తరించాడు.   అందుకే సుబ్బిశెట్టికి గోవిందుడంటే చాలా గౌరవం, అతని మాటంటే గురి.  గోవిందుడంటే అభిమానం కూడా.  అతని సలహా లేనిదే ఏ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టడు.  అతని సహకారం లేనిదే ఏ పని చేపట్టడు.

ఇలా చాలా ఏళ్ళు గడిచిన తర్వాత ఓ రోజు గోవిందుడికి ఓ ఆలోచన వచ్చింది. అదేమిటంటే తన సలహా సహకారాలవల్ల సుబ్బిశెట్టి వ్యాపారం చేసి కొట్లు గడించాడు, అదంతా తన ప్రతిభవల్లే సాధ్యపడింది కదా  మరి, అలాంటప్పుడు తను కూడా స్వంతంగా వ్యాపారం చేస్తే తనూ కోట్లకి పడగెత్తవచ్చు కదా అని.   అలా ఆలోచించిన కొద్దీ గోవిందుడికి కూడా స్వంతంగా వ్యాపారం చేసి కోట్లు గడించాలన్న కోరిక పుట్టింది.

ఆ తర్వాత రోజు ఆ విషయమే సుబ్బిశెట్టికి విన్నవించుకున్నాడు గోవిందుడు.

"అయ్యా!...నేను కూడా వ్యాపారం చెయ్యాలనుకుంటున్నాను.  నా వద్ద కొంత మొత్తం ఉంది.  మీరు నాకు కొంత పైకం అప్పిస్తే, అది కలిపి పెట్టుబడి పెట్టి వ్యాపారం ఆరంభించాలనుకుంటున్నాను. త్వరలోనే మీ అప్పు తీర్చివేస్తాను" అన్నాడు గోవిందుడు.

గోవిందుడి కోరిక విని ముందు సుబ్బిశెట్టి నివ్వెరపోయాడు. ఆ తర్వాత చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, "గోవిందూ!  నువ్వు లేకపోతే నా వ్యాపారం ఎలా నడుస్తుంది?  కావాలంటే నీకు జీతం రెట్టింపు చేస్తాను, అంతేగానీ నువ్వు ఇలా వదిలివెళ్తే ఎలాగా?"

"జీతం కోసం కాదుగానీ నాకూ తమరిలాగే వ్యాపారం చేసి కోట్లు గడించాలని ఉంది." అని తన మనసులోని  మాట బయటపెట్టాడు గోవిందుడు.  అది విన్న సుబ్బిశెట్టి నివ్వెరపోయాడు.

"నీ సలహా, సహకారాలవల్లే నా వ్యాపారాలు అభివృద్ధి చెందాయన్నది నిజం, అయితే వ్యాపారం అంటే ఎంతో నేర్పు ఉండాలి. సమయస్పూర్తి కావాలి. అవతల వాళ్ళల్లో ఎవరు మంచివాళ్ళో, ఎవరు మోసకార్లో గ్రహించే శక్తికావాలి.  నీలా సరైన సమయంలో సరైన సలహాలిచ్చే నమ్మకస్తుడు కావాలి.  అన్నిటికీ మించి అదృష్టం కలసి రావాలి.  అందుకోసం మరోసారి ఆలోచించు." అన్నాడు.

అయితే గోవిందుడు వ్యాపారం చేసి బాగా ధనం సంపాదించాలని అప్పటికే ఓ స్థిర నిర్ణయం ఏర్పరుచుకున్నాడు. "అయ్యా!...మరి నా సలహా వల్లే కదా మీరు మీ వ్యాపారంలో అభివృద్ధి సాధించారు.  నాకు నా శక్తి మీద పూర్తి నమ్మకం ఉంది. నాకో పదివేల వరహాలు అప్పు ఇస్తే, నా వద్ద ఉన్న ధనంతో కలిపి వ్యాపారం చెయ్యాలని ఉంది." అన్నాడు గోవిందుడు తన పట్టు విడవకుండా.

చివరికి మరేం అనలేక, సుబ్బిశెట్టి అతను కోరిన డబ్బులు గోవిందుడికిచ్చి, "చూడు, గోవిందూ! నువ్వు కూడా నాలానే వ్యాపారంలో రాణించాలనే నా ఆకాంక్ష. అయితే సలహాలివ్వడంలోగల నీ  అనుభవం వ్యాపారంలో కూడా చూపించాలి.  ఒకవేళ నీ వ్యాపారం మాత్రం సజావుగా సాగకపోతే నువ్వు మళ్ళీ నా వద్ద పనిలో చేరడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు సుమా!" అన్నాడు.

గోవిందుడు సంతోషంగా సుబ్బిశెట్టి వద్ద నుండి ధనం తీసుకొని కొద్ది రోజుల్లోనే స్వంతంగా వ్యాపారం మొదలుపెట్టాడు.  తన సలహా, సహకారం వల్లే సుబ్బిశెట్టి కోట్లు పడగలెత్తగాలేనిది, తను స్వంతంగా వ్యాపారం చేస్తే ఆ మాత్రం సాధించలేనా అనుకున్నాడు గోవిందుడు.  అయితే త్వరలోనే వ్యాపారంలో సాధక బాధకాలు తెలిసివచ్చాయతనికి.  సరుకులు అరువు తీసుకున్నవాళ్ళ వద్ద నుండి  డబ్బులు వసూలు  చేసుకోవడంలో నేర్పు చూపలేక కొంత నష్టపోతే, కొంత మంది మోసకార్లైన తోటి వ్యాపారుల వల్ల మరికొంత నష్టపోయాడు గోవిందుడు.  తోటి వ్యాపారస్థుల నుండి ఎదురైన పోటీ తట్టుకోలేకపోయాడు.  చివరికి సుబ్బిశెట్టి మాటలు స్ఫురణకు వచ్చాయి. తను సరైన సలహాలిచ్చినా వాటిని సరైన విధంగా ఆచరణలో పెట్టగలిగే నైపుణ్యం కలిగిఉండటంవలనే సుబ్బిశెట్టి వ్యాపారంలో రాణించాడని అనుభవపూర్వకంగా తెలుసుకొనే సరికి గోవిందుడు పూర్తిగా దివాలా తీసాడు.   ఆ విధంగా సలహాలిచ్చే తన అనుభవం, ప్రతిభ సుబ్బిశెట్టికి బాగా ఉపయోగపడినా తన స్వంతానికి మాత్రం ఏవిధంగా కూడా ఉపయోగ పడలేదన్న సత్యం త్వరలోనే గ్రహించాడు.  తనకున్న ప్రతిభ సలహాలివ్వడం, సహాయపడడం వరకేనన్న విషయం కూడా అప్పుడు గ్రహించాడు గోవిందుడు.

చేసేది లేక మళ్ళీ సుబ్బిశెట్టి దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పి తిరిగి అతని వద్ద పనిలో చేరాడు గోవిందుడు.  సహృదయుడైన సుబ్బిశెట్టి ఎప్పటివలే గోవిందుడిని ఆదరించాడు.