అంతర్గత శత్రువులు అరిషడ్వర్గాలు - సి.హెచ్.ప్రతాప్

Antargata shatruvulu Arishadvargalu

మనిషి మనుగడకు,ఎదుగుదలకు ,అభివృద్ధికి అడ్డు పడే ఆరు అంతర్గత శత్రువులు, అన్ని దుఃఖాలకు మూల కారణాలు అయిన ఈ అరిషడ్వర్గాలు అందరు శత్రువులకెంటే అత్యంత ప్రమాదకరమైనవీ. మనిషి మనసును , చెట్టుకు పట్టిన చెదలా పీల్చి పిప్పి చేసేవి ఈ అరిషడ్వర్గాలు అన్నది శాస్త్రవాక్యం. ఈ అరిషడ్వర్గాలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. కామ , క్రోధ , లోభ , మోహ , మధ మరియు మాత్సర్యం అనే ఆరు శత్రువులు ఈ అరిషడ్వర్గాలు అన్నది శాస్త్రనిర్వచనం.

మనిషి అభివృద్ధికి అడ్డు పడే , మనిషి దుఃఖాలకు మూల కారణమయ్యే ఈ ఆరుగురు అంతర్గత శత్రువులను అదుపులో పెట్టుకోకపోతే మానవులు అధ:మ పాతాళానికి దిగజారిపోతారని శాస్త్రం హెచ్చరిస్తోంది.

ఈ అరిషడ్వర్గాలు మానవులను శారీరకంగా , మానసికంగా , ఆర్ధికంగా సాంఘీక పరంగా , సామాజిక పరంగా అదః పాతాళ లోకానికి త్రొక్కేస్తాయి . కాబట్టి వీటిని ఎప్పుడూ అదుపులో ఉంచు కోవాలి . ఎప్పుడూ అవి మన అదుపులో ఉండాలి గాని , వాటి అదుపు లోకి మనం వెళ్ళ కూడదు అని ఆద్యాత్మిక వేత్తలు పదే పదే హెచ్చరిస్తున్నారు.

మన మనస్సులో మలినమైన ఆలోచనకు అహంకారం తోడై, నేను చేస్తున్నాను అనే భావం కలిగి బంధానికి కారణమవుతోంది. అందుకే కర్మయోగంలో ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చెయ్యాలని చెప్పబడింది.అంతేకాక కర్తృత్వ భావన లేకుండా కూదా కర్మలు చేయాలని, ఇట్టి కర్మాచరణ వల్ల చిత్తము పరిశుద్ధమై జ్ఞానం కల్గుతుంది. అలా కర్మాచరణ చేస్తుండగా నిర్వికారమైన మనస్సుతో కర్మలు చేసే నైపుణ్యం కల్గుతుంది. అప్పుడు కర్మలు మనల్ని అంటవు.

కామక్రోధాదులనే అరిషడ్వర్గాలను విసర్జించనివారు , నియంత్రించలేనివారు అరణ్యాలలో ఉండికూడా ఏమీ చేయలేరు. అంటే, శాంతిని పొందలేరు.వీటిని జయించినవారు ఎక్కడైనా శాంతిగా ఉండగలరు. భగవత్ కృప కోసం యమ, నియమాది కఠోరమైన నియమాలను అనుసరించాల్సిన పనే లేదు.అందువల్ల, ఇంద్రియ నిగ్రహంతో కామక్రోధాది అరిషడ్వర్గాలను జయించడం వల్లనే పరమమైన శాంతిని పొందగలరు.

ఈ అరిషడ్వర్గాలు అజ్ఞానం వల్ల కల్గుతున్నాయి. కారణశరీరం అజ్ఞానం వల్ల ఏర్పడింది. అజ్ఞానం నశిస్తే ఇవన్నీ నశిస్తాయి. దీనికి ఆత్మసాక్షాత్కారం ఒక్కటే మార్గం. అరిషడ్వర్గాలు నశించాలంటే మనస్సు నశించాలి. మనోనాశనమే మోక్షమని చెప్పబడింది. వీటిని మనం అదుపులో ఉంచితేనే మనం జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోగలం లేకపోతే వీటి బారిన పడి మనం పతనం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వీటిని జయించాలి అంటే ముఖ్యమైన ఆయుధం భగవంతుని సత్యమైన దివ్యమైన జ్ఞానం మాత్రమే. ఆ దేవదేవుని జ్ఞానం ఎపుడు పొందుతామో అప్పుడు అరిషడ్వర్గాలు అన్నియు సమస్తము మన మనసు నుండి సర్వం నశించిపోతాయి.

తాత్‌ తీని అతి ప్రబల్‌ ఖల్‌

కామ క్రోధ్‌ అరు లోభ్‌

ముని విగ్యాన్‌ ధామ్‌ మన్‌

కర్‌హి నిమిస్‌ మహుం ఛోబ్‌

మానవుని బలమైన శత్రువులుగా పిలవబడే కామ క్రోధ లోభాల్లో చిక్కుక్కున్న ఎంతటివారైనా అవి ఆడించే నాటకంలో పాత్రధారులు కావాల్సిందే. అపార జ్ఞాన సంపన్నులైన విద్వాం సులు, పండితులు, రుషులు, మునులు మనస్సుల్లో ప్రవేశించి కామక్రోధ లోభాల ప్రభావంతో చేయకూడని పనులు చేసి అప్రతిష్ట పాలు కావాల్సిందే” అంటాడు తులసీదాసు

కేవలం తన ఉన్నతిని మాత్రమే కాంక్షించకుండా సర్వమానవజాతి కూడా ఉన్నత స్థాయికి చేరుకొని అతి దుర్లభమైన భగవత్ అనుగ్రహాన్ని సాధించాలని కోరుకునే భావనే ఆధ్యాత్మిక భావన. దీనిని నియంత్రిచే దురభాసాలను మిక్కిలి సహనంతో, బుద్ధితో అధిగమించి ముందుకు సాగిపోవాలన్న ప్రాచీన సనాతన భారతీయ సంస్కృతి , సంప్రదాయాలనుగుణంగా సాగిపోతే అన్ని విజయాలు మనకు సాధ్యమేనన్నది ఉపనిషత్ ఉవాచ.