పెళ్ళిపిలుపు - డాక్టర్ చివుకుల పద్మజ

wedding invitation

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ, చిన్న బ్రేక్ తీసుకుని రూమ్ బయట కొచ్చిన నాకు మా ఆవిడ తలుపు దగ్గరే వేలాడుతూ కనిపించింది. నేను పని చేస్తుంటే డిస్టర్బ్ చేయనివ్వనని, ఎప్పుడు బయటకి వస్తానా అని చూస్తోందన్నమాట. మొహం ఒక వంద ఎల్.ఈ.డి బల్బులు ఒకేసారి వెలిగినట్లు వెలిగిపోతోంది.

ఏంటి చెప్మా..ఎప్పుడు ఏదో ఒక సమస్యతో నా చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది గాని, ఇవ్వాళ ఏంటో తేడా ఉందే అనుకుంటూ "ఏంటీ.. సంగతి" అన్నాను.

"మా బాబాయ్ కూతురి పెళ్ళిటండీ"

"అవునా.. ఎప్పుడుట" అడిగాను ఆశ్చర్యంగా. ఆ అమ్మాయికి పోయిన డిసెంబర్ లోనే ఎంగేజ్మెంట్ జరిగింది. ఫిబ్రవరిలో పెళ్ళనుకుంటే అప్పుడేదో అడ్డం వచ్చిందని ఆగారు. ఆ తర్వాత లాక్ డౌన్ మొదలైంది, ఇంకేముందీ.. పెళ్ళీ లేదు, గిళ్లీ లేదు.

"వచ్చే పదో తారీకుట. బాబాయ్ ఫోన్ చేశారు"

"అయినా ఇప్పుడు పెట్టుకున్నారేం. లాక్ డౌన్ పూర్తి కాలేదు కదా. ఆగవల్సింది" అన్నాను.

మిర్రి మిర్రి చూసింది నాకేసి.."ఇప్పటికే నిశ్చితార్ధం అయ్యి ఆరు నెలలైంది. ఇంకెన్నాళ్లు ఆగాలి" అంది.

అసలు విషయం చటుక్కున అర్ధం అయింది నాకు. ఫిబ్రవరిలో ఈ పెళ్లి ఉందని నా దుంప తెంచి కాసుల పేరు కొనుక్కుంది మా ఆవిడ. దానికి తగ్గ పట్టుచీరలు గట్రా సిద్ధం చేసుకుంది. తీరా లాక్ డౌన్ మొదలయ్యి పెళ్లి జరగకపోయే సరికి నీరు కారిపోయింది.

ప్రపంచం అంతా వణుకు పుట్టి ....కరోనా రావద్దమ్మా... అని తలుపులేసుకు కూర్చుని, లాక్ డౌన్ల మీద లాక్ డౌన్లు ప్రకటిస్తుంటే, మా ఆవిడ మాత్రం లాక్ డౌన్ అయిపోవాలి అని రోజూ పూజలూ, పునస్కారాలు చేస్తోంది తన కాసుల పేరు ఎప్పుడు ప్రదర్శిద్దామా అని.

"రూల్స్ ఏవో పెట్టారట కదా. అన్నీ పాటిస్తూ చేస్తారుట లెండి" అంది తిప్పుకుంటూ.

"మరింకేం రెడీ అవ్వు. ప్రైవేట్ వెహికల్స్ తిరుగుతున్నాయి కాబట్టి నీకు దిగుల్లేదు” అన్నాను నా కారుని తల్చుకుంటూ. అదింక పెళ్ళిలో ఎలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గా మారుతుందో నాకు బాగా అనుభవం. వాళ్ళ మేనమామ కొడుకు ఉపనయనం అని వెళ్తే, వాళ్ళు నా కారుని వాడిన వాడకానికి సర్వీస్ సెంటర్ వాడు వాడి ప్రతిభ అంతా ప్రదర్శించి మరీ బాగు చెయ్యాల్సి వచ్చింది ఒక వారం రోజుల పాటు... పైకి అనకూడదు ఆమ్మో..

ఆ ఉత్సాహంలో నాకు వేడి వేడి ఉల్లిపాయ పకోడీ అడక్కుండానే చేసిపెట్టింది. రోజూ అయితే "పాడు లాక్ డౌన్..వంటలు చెయ్యలేక చస్తున్నా" అని సహస్రం తిట్టేది. ఇవ్వాళ అడక్కుండానే నాకు విందుభోజనం దొరుకుతోంది.

కాస్సేపటికల్లా వెడ్డింగ్ కార్డు వాట్సాప్ లో వచ్చింది. నా చేతుల్లోంచి ఫోన్ లాక్కుని ఒక పది సార్లు తనివి తీరా చూసుకుంది. ఆవిడ మురిపం అయ్యాకే దొరికింది నా ఫోన్ నాకు. అంతా చదివాక, కింద కామెంట్ లో WL/1  అండ్ WL/2 అని వుంది. అర్ధం కాక మళ్ళీ మొత్తం పరిశీలనగా చూశాను. ఉహూ.. బుర్ర వెలగలా.

సరే.. ఎందుకైనా మంచిది.. వాళ్లనే అడుగుదాం అని మా చిన్నమావయ్య గారికి కాల్ చేశాను.

"మొత్తం 50 మంది మాత్రమే వుండాలిట అల్లుడు గారు. మీ అత్తగారి తరపు వాళ్లే సరిపోయారు. మీ నంబర్స్ వెయిటింగ్ లిస్ట్ ఒకటి, వెయిటింగ్ లిస్ట్ రెండు.. అంటే .. ఈ యాభై లో ఎవరన్నా రాకపోతే అప్పుడు మీ వంతు. ముందు రోజు తెలియచేస్తాం"... స్వంత అన్నగారి అల్లుడుగారికి దక్కిన మర్యాద ఇదీ.

విషయం విన్న మా ఆవిడ ముందు గుడ్లు తేలేసింది, తర్వాత ముక్కు చీదింది.

"గట్టిగా చీదకే, ఎవరన్నా కంప్లెయింట్ ఇస్తే క్వారంటైన్ చేసేయఁగల్రు"

"అసలు మిమ్మల్ననాలి. రిలేషన్స్ మెయింటైన్ చెయ్యకపోతే ఇలాగే ఉంటాయి. ఏనాడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళారా? వాళ్ళను మనింటికి పిలిచారా?" గాలి నా మీదకి తిరిగింది.

"హవ్వ.. సదరు పెళ్లికూతురు రెండేళ్లు మా ఇంట్లోనేగా వుంది ఆ కోర్సులు, ఈ కోర్సులు చదువుకుంటూ" మనసులోనే అనుకుని రూమ్ తలుపేసుకుని మళ్ళీ నా పని మొదలుపెట్టేశాను.