సాధికారత - అఖిలాశ

సాధికారత

‘సాధికారత’ అంటే వ్యక్తి తన హక్కులను బాధ్యతను తెలుసుకొని, అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని సమాజానికి, దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడటం. ‘సాధికారత’ విభిన్న అంశాల కలబోత. ప్రతివ్యక్తి తన వ్యక్తిగత లేదా సామూహిక జీవితానికి సంబంధించిన విషయాలలో సొంత నిర్ణయాలను తీసుకునే ధైర్యాన్ని, సామర్ధ్యాన్ని, స్వేచ్ఛనూ కలిగి ఉండటం. ప్రతి వ్యక్తి స్వయం ప్రతిపత్తి కలిగి వుండి తన జీవన కారకాలైన ఆర్థిక, సాంఘిక మరియు రాజకీయ సాధికారతను, ఏది చేయాలో, ఏది కావాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛను మరియు విద్య, ఆరోగ్య, ఉద్యోగ రంగాలో భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం. తమ సమస్యలను తామే పరిష్కరించుకునే సామర్ధ్యాన్ని కలిగి వుండటం. సంపదను, అధికారాన్ని అన్ని వర్గాల మద్య పున:పంపిణీ చేయడం సాధికారతలో భాగం.

ప్రాచీన భారతదేశంలో మహిళలు జీవితపు అన్ని విభాగాలలో పురుషులతో సమాన హోదా అనుభవించారని పరిశోధకుల అభిప్రాయం. అయితే దీనికి భిన్నమైన అభిప్రాయం వెలిబుచ్చిన వారూ ఉన్నారు. పతంజలిగారు కాత్యాయనుడు వంటి ప్రాచీన భారత వ్యాకరణకర్తల రచనల ప్రకారం, వేదకాలపు ఆరంభంలో మహిళలు చదువుకొనేవారని తెలుస్తోంది. ఆ సమయంలో మహిళలు యుక్త వయస్సులో పెళ్ళి చేసుకోనే వారని, వారు భర్తను ఎన్నుకొనే హక్కుని కలిగి ఉండేవారని ఋగ్వేద శ్లోకాలు తెలుపుతున్నాయి. అధ్యయనాల ప్రకారం వేదకాలపు ఆరంభంలో మహిళలు సమాన హోదా, హక్కులను అనుభవించేవారు. ఏమైనా తరువాత (సుమారుగా 500బిసి) స్మృతులతో మహిళల హోదా తగ్గడం మొదలయ్యింది.

ఆధునిక భారతంలో కొన్ని వర్గాలలోని సతీసహగమనం, జౌహర్, దేవదాసి వంటి ఆచారాలు నిషేధించబడ్డాయి, ఎక్కువగా నశించిపోయాయి. అయినప్పటికీ భారతదేశంలోని మారుమూల ప్రాంతాలలో ఈ ఆచారాలు ఇప్పటికీ ఉన్నాయి. కొన్ని వర్గాల భారతీయ మహిళలు పరదా సంప్రదాయాన్ని ఇంకా పాటిస్తున్నారు, ముఖ్యంగా భారతీయ చట్టాల క్రింద చట్టవ్యతిరేక చర్యలయినప్పటికీ బాల్యవివాహాలు ఇంకా కొనసాగుతున్నాయి.

సతీసహగమనం ప్రాచీనమైన ఆచారం. చాలావరకు ఇది అంతరించి పోయింది. మరణించిన భర్త చితిపై సజీవంగా, స్వచ్ఛందంగా తగలబడి పోవడమే సతీసహగమనం. ఇది స్వచ్ఛంద నిర్ణయం వలే కనిపించినప్పటికీ కొన్నిసార్లు ఇది బలవంతంగా చేయించే కార్యక్రమంగా ఉండేది. 1829లో బ్రిటీష్ వారు ఈ ఆచారాన్ని నిషేధించారు. స్వతంత్రం వచ్చినప్పటికీ నుంచి దాదాపు 40 సతీసహగమనం కేసులు నమోదయ్యాయి. 1987లో రాజస్థాన్ కి చెందిన రూప్ కన్వర్ కేసు సతీసహగమనం కమీషన్ (నివారణ) చట్టానికి దారితీసింది. జౌహర్ అంటే ఓడిపోయిన వీరుడి భార్యలు, కూతుళ్లు శత్రువులకు దొరికి వేధింపులకి గురి కాకుండా తమంతట తామే సొంతంగా బలైపోవడం. ఈ ఆచారం అధిక స్థాయి గౌరవాన్ని పొందే రాజపుత్ర రాజులూ ఓడిపోయినపుడు వారి భార్యలు పాటించేవారు.

పరదా అంటే కొన్ని వర్గాలలో మహిళలు వారి దేహాన్ని కనపడకుండా కప్పుకొనే అవసరం గల ఆచారం. ఇది స్త్రీ చలనంమీద ఆంక్షలని విధిస్తుంది, వారు స్వేచ్ఛగా అందరితో మసలే హక్కుని హరిస్తుంది, ఇది స్త్రీల అణచివేతకి గుర్తు. ఇది హిందూయిజం లేదా ఇస్లాంల మత బోధలని ప్రతిబింబించదు. ఇది సాధారణ నమ్మకానికి విరుద్ధం అయినప్పటికీ ఇరుపక్షాల మతగురువుల అహంకారం వలన, అజ్ఞానం వలనా దురభిప్రాయం ఏర్పడింది. దేవదాసి అనేది దక్షిణ భారతావనిలో కొన్నిచోట్ల ఉన్న మతాచారం, ఇందులో స్త్రీలు గుళ్లో దేవుడిని "పెళ్ళి" చేసుకుంటారు. ఈ సాంప్రదాయం ఎ.డి. 10వ శతాబ్దానికి బాగా వ్యాప్తిలోకి వచ్చింది. తరువాతి కాలంలో భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో దేవదాసీల మీద చట్టవిరుద్ధమైన లైంగిక వేధింపులు సహజమయ్యాయి.

ఇలా అనేక రూపాల్లో మహిళా తన సాధికారతను కోల్పోయి తనకు నచ్చినట్లు కాకుండా వ్యక్తులకు, వ్యవస్థలకు నచ్చినట్లు బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. మహిళపై వివక్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ఆమె వేసుకునే చెప్పుల దగ్గర నుండి బొట్టు బిళ్ళల వరకు ప్రతీది వివక్షే తనకు నచ్చినట్లు ఉండకూడదు. ఎక్కడ ఏమి జరిగిన అది మహిళే కారణంగా చూపే వ్యక్తులు, వ్యవస్థలు ఇప్పటికీ ఉన్నాయి. ఇందులో విశేషంగా మార్పు రావాలి. మహిళ తన కాళ్లపై తాను నిలబడగలగాలి, తనకు నచ్చిన పని తాను చేసుకునే హక్కు తనకున్నది అనే విషయాన్నీ గ్రహించుకోవాలి, ఇతరుల దానిని అంగీకరించాలి. అడ్డుకట్టలు, ఆంక్షలు పెట్టి మహిళలను అరికట్టడం ఎవరి తరం కాదనే విషయాన్నీ తెలుసుకుంటే అందరికి మంచిది. ఈ విషయాలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టినదని చెప్పవచ్చు. అందులో భాగంగానే పంచవర్ష ప్రణాళికలలో ‘మహిళా సంక్షేమానికి’ ‘మహిళా సాధికారతకు’ ప్రాధాన్యతను ఇస్తూ వస్తుంది. ముఖ్యంగా 8వ పంచవర్ష ప్రణాళిక (1992- 97) లో ఈ ప్రాధాన్యాన్ని చూడవచ్చు. 1982-83 లో ప్రారంభించిన ‘డ్వాక్రా’ 1992 లో మహిళా కమీషన్‌ ఏర్పాటు 2001లో ప్రారంభించిన జాతీయ మహిళా సాధికారత విధానము మొదలైనవి ఇందులో భాగమే. అయితే అటు రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ప్రభుత్వం సమన్వయంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టవలసి ఉన్నది.

మన రాజ్యాంగం కూడా సాధికారత విషయంలో కొన్ని విషయాలను పొందుపరిచింది. అందులో ప్రముఖమైనవి:

* హిందూ వివాహ చట్టం-1955

* వరకట్న నిరోధ చట్టం-1956

* హిందూ వివాహము మరియు విడాకుల చట్టం -1955

* బాల్య వివాహాల నిరోధక చట్టం -1976

* సమాన వేతన చట్టం -1976

* మనుషుల అక్రమ రవాణా నిరోధక చట్టం-1986

* స్త్రీల అసభ్యకర ప్రదర్శన నిరోధక చట్టం – 1986

* సతీ నిరోధక చట్టం – 1987

* గర్భ నిరోధక చట్టం – 1971

* గర్భస్త లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టం- 1992

* 73,74వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీలు, మున్సిపాలిటీలలో రాజకీయ రిజర్వేషన్లు.

* రాజ్యాంగంలో ఏ విధమైన లింగ వివక్షతను నిషేధించటం జరిగింది.

* రాజ్యాంగంలో ప్రకరణ 15(1), 15(2)లు ప్రభుత్వాలు స్త్రీ మరియు బాలిక సంక్షేమము కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయి.

* ప్రకరణ 16 ప్రభుత్వరంగంలో మహిళలకు సమాన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.

మహిళా సాధికారత విషయంలో తెలుసు సాహిత్యంలో విశేషమైన కృషి జరిగింది, ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. అయితే ఎవరి సమస్యలు వారు చెప్పుకుంటే సమస్య మరింత బాగా వివరించగలరు. అందుకే మహిళలు తమకు జరిగిన, జరుగుతున్న వివక్ష, అన్యాయం, అక్రమాల గురించి, హక్కుల గురించి సాహిత్య పరంగా స్పందించారు. ఇంకా స్పందిస్తూనే ఉన్నారు. వారి పోరాటం అలాగే సాగాలని ఒకవైపు కోరుకుంటూనే మరో వైపు వారి పోరాటాల్లో విజయం సాధించడానికి మన వంతు సహాయ సహకారాలు అందివ్వాలని అందరిని ఆహ్వానిద్దాం.

ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త, బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ గా ఉన్న నల్లాని రాజేశ్వరి గారు సాధికారత శీర్షికతో వ్యాస సంపుటిని ముద్రించారు. 135 పుటలు ఉన్న పుస్తకంలో 32 వ్యాసాలు ఉన్నాయి. ఈ వ్యాసాలన్నీ ఈనాడు దినపత్రికలో అచ్చు అయినవి, విశేష ఆదరణ పొందినవి. వీరి సేవలకు గుర్తుగా అనేక పురస్కారాలు వరించారు. భారత ప్రభుత్వ రాజ్య మహిళా సమ్మాన్ అవార్డు-2014, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారం-2018, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం-2017, తెలంగాణ ప్రభుత్వ బతుకమ్మ అవార్డు-2017, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాల సేవక్ అవార్డు-2015,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేవా రత్న పురస్కారం-2015,ఆంధ్రప్రదేశ్ మహిళా రత్న అవార్డు-2012,  ఆంధ్రప్రదేశ్ విద్యా రత్న పురస్కారం-2011 ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పురస్కారాలు వారి ఖాతాలో ఉన్నాయి. 

ప్రస్తుత ఉపరాష్ట్రపతి పుస్తకానికి పరిచయ వాక్యాలు రాయగా ప్రముఖ స్త్రీవాద రచయిత్రి వోల్గా గారు ముందుమాట రాశారు. ఈ వ్యాసాలు సమాజం కోసం సమాజం నుండి పుట్టినవి. ఈ వ్యాసాల్లో తీవ్రమైన ప్రతిఘటన ఉన్నది, న్యాయమైన నిరసన ఉన్నది, ఆలోచనలను రేకెత్తించే ప్రశ్నలు ఉన్నవి. ఈ వ్యాసాలను ఊసుపోక రాసుకున్నవి కాదు సమాజం పట్ల బాధ్యతతో అనేక విషయాలను తెలుసుకొని రాసినవి. కేవలం మహిళా సాధికారతపై మాత్రమే కాకుండా అనేక విషయాలపై రచయిత్రి తనదైన శైలిలో స్పందించిన వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వ్యాసాలలో రచయిత్రి కృషి బలంగా ఉన్నది దానికి సాక్ష్యం వ్యాసాల్లో రాసిన సమాచారం అంకెలతో సహా రాయడం సామాన్యమైన విషయం కాదు ఎంతో వర్క్ జరిగితే కాని అది సాధ్యపడదు. సమస్య నాది అనుకోవాలి అప్పుడే ఆ సమస్య యొక్క మూలాలకి వెళ్లి సమాచారని సేకరించి, తెలుసుకొని రాయగలరు. అంతకంటే ఎక్కువగా ఆ సమస్యలను తెలుసుకోవాలనే తపన ఉండాలి, సున్నిత మనసు ఉండాలి అప్పుడే ఆ సమస్యలు తెలుసుకొని స్పందించగలరు. నలాని రాజేశ్వరి గారికి పైవన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఆ విషయం పుస్తకాన్ని చదివితే తెలుస్తుంది.

లింగ సమానత్వంతోనే సాధికారత సాధ్యపడుతుందని నిర్దారించిన రాజేశ్వరి గారు ప్రభుత్వాలకు అనేక సూచనలు అందించారు. సర్వశిక్ష అభియాన్ జాతీయ కార్యక్రమం ద్వారా విద్యాలయాల్లో ప్రతి నేలా సురక్షిత శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలని, లింగ సమానత్వం కోసం భ్రూణ హత్యలు, పౌష్టికార లోపాలు, అనారోగ్యం, అవిద్య , బాల్య వివాహాలు, బాలికల అక్రమ రవాణా వంటి సమస్యలపై మరింత చిత్తశుద్దితో పని చేయాలనీ కోరారు. శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక, రాజకీయ, క్రీడ రంగాల్లో మహిళలను ప్రోత్సహించాలి. రాజేశ్వరి గారు మహిళా సాధికారత మాత్రమే కాకుండా LGBT హక్కులు, సాధికారత గురించి కూడా తమ మద్దతును తెలపాలి.

వృద్దులంటే అవసరం లేని వారని, పనికి రారని, ఇంట్లో పెట్టుకోవడం దండగ అని, బరువుగా ఉన్నారని కన్నా తల్లిదండ్రులను సైతం నడి బజారులో, శ్మశానంలో వదిలి వెళ్ళిపోతున్న దుస్థితి ప్రస్తుత సమాజంలో ఉన్నది. ఈ సమస్యను పరిష్కరించడానికి అటు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వృధ్యాప్య పింఛన్ లాంటి కార్యక్రమాలతో వ్రుద్దులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్న వారి సమస్యలు అనేకం ఉన్నవి. తెలుగు రచయితలు కొందరు వృద్ధాశ్రమాలను వ్యతిరేకిస్తే మరికొందరు సమర్థిస్తూ సాహిత్యాన్ని సృష్టించారు. రాజేశ్వరి గారు ఈ విషయంలో వృద్ధాశ్రమాలను సమర్థించారు. ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమాలను నెలకొల్పాలని, ఈ విషయంలో స్వచ్చంద సంస్థలకు ప్రభుత్వాలు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందివ్వాలని సూచించారు. అయితే వృద్ధులను ఆదరించడం అందరి బాధ్యతా అని వారి జీవిత చివరి దశలో మంచి జీవితాన్ని అందివ్వాలని కోరుకున్నారు.

చిన్నపిల్లల సమస్యలు, పేదరికం, సమానత్వం, గృహ హింస, దారితప్పుతున్న దత్తతలు, విలువ కోల్పోతున్న దూర విద్య, విద్య వ్యవస్థలో రావాల్సిన మార్పు ఇలా అనేక విషయాలపై రాజేశ్వరి గారి అనేక సూచనలు, సలహాలు అందించారు. అయితే ప్రధానంగా మహిళల, బాలల సమస్యలపై స్పందించారు. రాజేశ్వరి గారు మరిన్ని సమస్యలపై వారి గళాన్ని, కలాన్ని వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.