దిక్కు కాదు... దిక్కయినవాడు ముఖ్యం - విఎస్ఎన్. మూర్తి

dikku kaadu dikkayinavaadu mukhyam

మానవ జీవనం అనువణువూ నమ్మకం మీదే ఆధారపడి వుంది. ఇక మత విశ్వాసాల సంగతి కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. ఇలా ఎందుకు చేయాలి అంటే ఎవరైనా చెప్పేది ఒకటే, ఫలానా  శాస్త్రంలోనో, ఫలానా పురాణంలోనో, లేదా ఫలానా గ్రంధంలోనో ఇలా రాసి వుంది. అందువల్ల ఇది శాస్త్ర సమ్మతం అనే. ఆయా పుస్తకాలు, శాస్త్రాలు, కచ్చితమైన ప్రామాణికాలు అన్న నమ్మకమే ఈ ఆచరణకు కారణం. అయితే రాను రాను మారుతున్న మానవ జీవన విధానాలకు అనుగుణంగా కూడా కొన్ని నమ్మకాలను అవసరమైతే సడలించుకోవాల్సి వుంది. అన్నింటికీ ఈ సడలింపు సాధ్యం కాకపోయినా, కొన్నింటికి సాధ్యమవుతుంది. అవసరం కూడా.

వాస్తు శాస్త్రం ఇటీవల భయంకరంగా పాపులర్ అయింది. వాస్తుకు అనుగుణంగానే జన జీవితం చాలా వరకు నడుస్తోంది. తూర్పు వాకిలి లేదా తూర్పు ఫేసింగ్ ఇళ్లు మంచివి అని ఓ సిద్ధాంతం. ఫలానా నక్షత్రం వారికి ఫలానా ఫేసింగ్ ఇళ్లు నప్పుతాయని మరో సూత్రీకరణ. ఇటీవల ఓ లే అవుట్ ప్లాన్ చూసాను. ఈశాన్యం పెరిగినవి, ఈశాన్యంలో రెండు రోడ్ల కార్నర్ ఏర్పడిన బిట్లను అన్నింటిని ‘డైమండ్’ ప్లాట్లు అని పేర్కొంటూ, అదనపు ధర నిర్ణయంచారు. దీన్ని బట్టి తెలుస్తుంది జనంలో ఎంతగా నమ్మకాలు పెరిగాయో. మంచిదే. శాస్త్రాలు చెప్పే విషయాలను నమ్మడం. కానీ ఇక్కడో సమస్య వుంది. కొన్ని నమ్మకాలను పాటించడం కష్టమైనపుడు, చాలా మంది కనీసపు సర్దుబాట్లను కూడా చేయానికి జంకడం.

ఇప్పుడు తూర్పు, ఈశాన్య, ఉత్తర ద్వారం వున్న అపార్ట్ మెంట్లనే చూడండి. సహజంగా అక్కడ డ్రాయింగ్ రూమ్ వస్తుంది. మరి ప్రేయర్ రూమ్ లేదా పూజా గది పరిస్థితి ఏమిటి? ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అయితే కాస్త పక్కగా ఓ చిన్న గది అమరుస్తారు. డబుల్ బెడ్ ల సంగతేమిటి? కచ్చితంగా ఈశాన్యంలో పూజ గది వుండాలన్నది వాస్తు మాట. తూర్పు లేదా ఈశాన్య దిశగా కూర్చుని ప్రార్థించాలని అనడంతో ఇక సమస్యలు మొదలవుతాయి. తలుపు పక్కగా అడ్జెస్ట్ మెంట్ లేదా గోడ మీదుగా చిన్న అటక, లేదా ఆ పక్కన చిన్న మందిరం. అంతే కానీ అనువైన చోట దేవుడి మందిరం ఎందుకు వుంచుకోకూడదు.

ఇందుగలడందులేడని సందేహము వలదు... అని మన పురాణాలే చెబుతున్నాయి కదా. పైగా దేవుడ్ని తలుచుకోవాలనుకున్నపుడు, అర్జెంటుగా తూర్పుకు తిరిగి మరీ తలుచుకుంటున్నామా? లేదు కదా. ఇంట్లో కాస్త పవిత్రమైన చోట, అనువైన చోట, మందిరం పెట్టకుని ప్రార్థించడం తప్పేమీ కాదు. ఆ మాటకు వస్తే  ఆలయాలను చూడండి. ఆలయం మొత్తానికి వాస్తు లెక్క వేస్తే, కేవలం ఈశాన్యంలో, తూర్పు ముఖంగానే ఒక్క మందిరం వుంటోందా? సముదాయం మొత్తం మీద వివిధ దేవతల ఆలయాలు వుండడం లేదా? అందులో ఈశాన్యం లో కూడా మందిరం వున్న ఆలయాలు వున్నాయి. మరి వాస్తు లెక్కల ప్రకారం ఈశాన్యంలో బరువు కూడదు కదా? ఇలాంటి వ్యవహారాల్లోనే లాజికల్ థింకింగ్ కావాలి. ఈశాన్యంలో బరువు పెరగకూడదు అంటే నైరుతిలో కాస్త ఎక్కువ బరువు వుంటే సరిపోతుందిగా? ఈశాన్యం గోడ ఎత్తుగా వుండకూడదు. కానీ జనం ఈశాన్యం, తూర్పు, ఉత్తరాల్లో కావాల్సినంత ఎత్తున గోడలు కట్టి, దక్షిణం, నైరుతి, పశ్చిమాల్లో కాస్త ఎక్కువగా వుండేలా చూస్తున్నారు. ఇదే లాజికల్ థింకింగ్ అంటే., అంతేకానీ ఎత్తు వద్దన్నారని, తూర్పు, ఉత్తరాల్లో అడుగుకో, రెండు అడుగులకో గోడలు పరిమతం చేయడం లేదు కదా?

అందువల్లే వాస్తను వాస్తవ జీవితానికి అమలు చేయడంలో కాస్త లాజికల్ గా థింక్ చేయాలి. లేదంటే జీవితం ఇరుకైపోతుంది. నిజానికి వాస్తు శాస్త్రం చాలా మారింది. ప్రాచీనవాస్తు ప్రకారం స్థలాన్ని నిర్ణయించడమే పెద్ద ప్రహసనం. నిర్ణీత కొలతల్లో గొయ్యి తవ్వి, దాన్ని కొంత కాలం అలా వుంచి, ఆపైన వచ్చిన మట్టిని సవివర పరిశీలన చేయాలి. అందులో వువ్న వస్తువుల ఆధారంగా స్థలం మంచి చెడ్డలు నిర్ణయించాలి. తరువాత  ఆ మట్టిని గోతిలో నింపి, ఎక్కువైందా... తక్కువైందా... సరిపోయిందా అన్నది చూసి, స్థలం మంచిదా చెడ్డదా అన్నది చూడాలి. ఇన్ని విషయాలు ఇప్పుడు పట్టించుకోవడం సాధ్యమా? పైగా వందల ఏళ్లుగా భూమిపై మట్టి పెరుగుతూ వస్తోంది. అందువల్ల ఎంత లోతు తవ్వితే స్థలం మంచి చెడ్డలు తెలుస్తాయి. అందుకే దీన్ని వదిలేసారు. అదేవిధంగా అపార్ట్ మెంట్ నిర్మాణాలు పెరిగినందున, మిగిలిన విషయాలను కూడా లాజికల్ గా ఆలోచించి పాటించాలి. అంతే కానీ ఈశాన్యంలో ప్రార్ధన వుండాలని అక్కడే వుంచేందుకు పాట్లు పడాల్సిన పని లేదు. అవసరమైతే ఉత్తర ముఖంగా మార్చుకుంటే దేవుడేమీ అనడు.

నా మిత్రుడు ఒకరు ఓ చిత్రమైన వాదన తీసాడు. ‘నాకు దెయ్యాలంటే భయం లేదు. ఎందుకంటే దెయ్యాలు లేవనుకుందాం. సమస్యే లేదు. లేదూ... దెయ్యం వుంది అనుకుందాం... అప్పుడు దేవుడూ వున్నట్లే. దాని సంగతి ఆయనే చూసుకుంటాడు’ అని. ఇదో లాజికల్ నమ్మకం. ఒకరకమైన టేకిటీజీ పాలసీ. ఆధునిక జీవితానికి చాలా వరకు సరిపోతుంది ఇది. దేవుడ్ని ప్రార్థించేటపుడు, ఈ దిక్కుగా ఎందుకు ప్రార్థిస్తున్నావు అని అడగడుగా? నిజానికి చాలా ఆలయాల్లో భగవంతుని మూర్తి తూర్పు ముఖంగా వుంటుంది. అంటే అప్పుడు మనం భగవంతుడ్ని పశ్చిమ ముఖంగా తిరిగి ప్రార్థించినట్లేగా. మరి ఆలయంలో తప్పు కానిది, ఇంట్లో మాత్రం తప్పు ఎందుకు అవుతుంది. ఇది వితండ వాదన, నాస్తికత్వం అనుకుంటే, నేనేమీ చెప్పలేను. తూర్పు, ఈశాన్యం, ఉత్తరం లో ప్రార్థన అవకాశం లేక ఇబ్బంది పడే ఎన్నో అపార్ట్ మెంట్ నివాసులు, అలా బాధ పడకుండా, తమకు అనువైన చోట, అనువైన విధంగా భగవత్ ప్రార్థన చేయండి... తప్పేమీ లేదన్నదే నా వాదన. అంతగా కావాలనుకుంటే, ఈశాన్యం వైపు గోడకు ఓ భగవంతుడ్ని ఫొటో, దానికో చిన్న దీపం వుంచండి. మీ ప్రార్థన మీకు వీలైన చోట్ల చేసుకోండి. నమ్మకం కీలకం... భగవంతుడిపై... అంతే కానీ ఫలానా దిక్కుకు తిరిగితేనే కనిపించే భగవంతుడిపై కాదు. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి. ఏ పిలుపుతో పిలిచినా పలికేవాడు... ఏ దిక్కున కూర్చుని పిలిచినా పలుకుతాడు. గజేంద్రమోక్షంలో, గజేంద్రుడు ఏ దిక్కుకు తిరిగి పిలిస్తే హరి పరిగెత్తుకు వచ్చాడన్నది స్పష్టంగా చెప్పలేదుగా? మీరే ఆలోచించండి.

విఎస్ఎన్ మూర్తి

మరిన్ని వ్యాసాలు

కళల ఆవిర్భావం .
కళల ఆవిర్భావం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
లంబాడి సంస్కృతి .
లంబాడి సంస్కృతి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
గిరిజన నృత్యాలు .
గిరిజన నృత్యాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కళారూపం ఒగ్గు కథ.
కళారూపం ఒగ్గు కథ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
యోగాలు .
యోగాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కళారూపం తోలుబొమ్మలాట .
కళారూపం తోలుబొమ్మలాట .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కురుక్షేత్ర సంగ్రామం.
కురుక్షేత్ర సంగ్రామం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.