ధవళేశ్వరము ఆనకట్ట నిర్మాణములో పాలు పంచుకున్నఇంజనీర్ - ambadipudi syamasundar rao

ధవళేశ్వరము ఆనకట్ట నిర్మాణములో పాలు పంచుకున్నఇంజనీర్

రైస్ బౌల్ ఆఫ్ ఇండియా గా పేరుగాంచిన గోదావరి డెల్టా కు కారణమైన ధవళేశ్వరం ఆనకట్ట నిర్మిణానికి ఇంగ్లిష్ వాడైన సర్ ఆర్థర్ కాటన్ అని ప్రతివాళ్ళు చెపుతారు గోదావరి డెల్టా ఆ రకముగా సశ్య శ్యామలం అవటానికి అఖండ గోదావరి నదిపై తూర్పు గోదావరి జిల్లా  ధవళేశ్వరం నుండి పశ్చిమ గోదావరి జిల్లా విజ్జేశ్వరం వరకు నాలుగు భాగాలుగా గోదావరి  జలాలు సముద్రము  పాలవకుండా బృహత్తరమైన ఆనకట్ట కట్టి భూములను సశ్య శ్యామలం చేసిన ఘనత పూర్తిగా కాటన్ కె దక్కింది 18వ శతాబ్దిలో గోదావరినదిపై ఆనకట్ట నిర్మించిన ఈస్టిండియా కంపెనీ ప్రతినిధి ఆర్ధర్‌ కాటన్‌ తదనంతర కాలంలో సర్‌ బిరుదుతో గౌరవించబడిన విషయం మనకు తెలుసు. కాటన్‌ మహాశయునికి అడుగడుగునా ఆత్మస్థైర్యాన్నిస్తూ అత్యంత సన్నిహితునిగా శ్రమించిన వ్యక్తి,కాటన్ కు వెన్నెముకగా  నిలిచిన వ్యక్తి మన తెలుగువాడు ప్రధమ తెలుగు ఇంజనీర్ వీణెం వీరన్న.వీరన్న గురించి ఎవరికీ తెలియదనే చెప్పుకోవాలి.ఎందుకంటే తాజమహల్ కట్టిన వేలాది మంది కూలీలు ఎవరు వెలుగులోకి రాలేదు. అలాగే వీరన్న కూడ చరిత్ర చీకట్లలో కలిసిపోయినాడు. తనదికాని ప్రాంతములో ఇక్కడి భాష అంతగా రాని  చోట అంత పెద్ద నిర్మాణపు పనిని తలకెత్తుకున్న కాటన్ కు తలలో నాలుకగా నిలిచి ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణము పూర్తి చేయించిన వ్యక్తి వీరన్న ఆయన పాత్ర లేకపోతె ఆనకట్ట నిర్మాణము ఎప్పటికి పూర్తి యేదో ప్రశ్నర్ధకమే.

ఆయన గురించి అతికొద్ది మంది గోదావరి బ్యారేజ్‌పై వ్యాసాలు, పుస్తకాలు రాయగా వీరిలో ఎవరూ వీరన్న గురించి సరైన సమాచారం జీవిత విశేషాలను ఆయన జనన, మరణాల తేదీల సమాచారాన్నిగాని ఇవ్వలేకపోయారు. అయితే కొందరి రచనల్లో క్లుప్తంగా తెలిసిన విషయం గోదావరి ఆనకట్ట నిర్మాణంలో తెలుగువాడు వీణెం వీరన్న ప్రముఖపాత్ర పోషించాడని, ఆనకట్ట ప్రధాన లాకువద్ద రాతిగోడపై ఆయన పేరు చెక్కి ఉండడాన్ని నేటికీ గమనించవచ్చు వీరన్న గారు 1794,మార్చి 3 న వీర రాఘవమ్మ,కొల్లయ్య దంపతులకు జన్మించాడు. తండ్రి కొల్లయ్య మచిలీపట్నములో బ్రటిష్ ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగి. వీరన్న తల్లితో పాటు రాజమండ్రిలో బంధువుల ఇంట్లో ఉండేవాడు.వీరన్నగారి ప్రాథమిక విద్య రాజమండ్రిలో పూర్తి అయింది. ఆ తరువాత ఉన్నత విద్యను మచిలీపట్నం లోని ఆంగ్లో ఇండియన్ కళాశాలలో పూర్తి చేసి తండ్రి సూచన  మేరకు బెంగాల్ వెళ్లి అక్కడ ఇంజనీరింగ్ చదివాడు కానీ ఇంజనీర్ గా శిక్షణ మద్రాసులోనే సాగింది. వీరన్నగారికి ధవళేశ్వరానికి చెందిన వెంకాయమ్మ గారితో వివాహ మయింది వీరికి వెంకట రత్నము, జనార్దన్ స్వామి కొల్లయ్య, సీతారామ స్వామి బాపమ్మలు సంతానము    .
1840 నాటికి వీరన్న గారు  రాజమండ్రి వచ్చి నీటి పారుదల శాఖలో సబ్ ఇంజనీర్ (చిరుద్యోగిగా) గా చేరాడు 1844లో సర్ ఆర్ధర్ కాటన్ గోదావరి పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించటానికి వచ్చినప్పుడు ఆయనతో వీరన్న గారికి పరిచయము ఏర్పడింది. అప్పటి నుంచి వీరన్న గారు కాటన్ కు సహాయకు డిగా కొత్త జీవితాన్ని ప్రారంభించాడు అయన ప్రతి విషయములో జాగ్రత్తలు తీసుకుంటూ కాటన్ ను సోదర సమానముగా చూసేవాడు ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో కాలి నడకన, గుర్రాల మీద వీళ్లిద్దరు వెళుతూ నిర్మాణ పనులను పర్యవేక్షించేవారు.గోదావరి పుట్టిన త్రయంబకం దగ్గర నుండి సముద్రములో కలిసే  వరకు అంటే 1500 కిమీ ల దూరమును ఇద్దరు విస్తృతముగా పర్యటించేవారు ఆ సమయములో పండ్లు తిని  గోదావరి నీళ్లు త్రాగుతూ కాలము గడిపేవారు వారిద్దరి ధ్యేయము ఆనకట్ట నిర్మాణమే దీని కోసము ప్రణాళిక ను సిద్దము చేసుకొని మారు మూల ప్రాంతాలలో పర్యటిస్తూ రైతులను చైతన్య పరిచేవారు అందుచేతనే నేటికీ గోదావరి ప్రాంత రైతులకు కాటన్ దేవుడితో సమానము. ఆనకట్ట నిర్మాణానికి గోదావరి జిల్లాల నుండి కూలీలు ఎవరు ముందుకు రాకపోవటముతో ఒరిస్సా, బెంగాల్ ప్రాంతాల నుండి వందల సంఖ్యలో కూలీలను తెప్పించి నిర్మాణపు పనులలో వారికి వీరన్న గారు తర్ఫీదు ఇస్తూ వారికి ఇవ్వవలసిన పైకమును నిక్కచ్చిగా ఇస్తూ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తు  ఉండేవాడు ఇది చుసిన స్థానికులు కూడా పనిలోకి వచ్చేవారు వీరన్నగారు మన్యము ప్రాంత కోయ వారిని కూడా పనులలో స్థానము కల్పించేవాడు కూలీలకు పని చేయని ఆదివారాలు కూడా కూలి చెల్లించి వారి అభిమానానికి పాత్రుడయ్యాడు. ప్రభుత్వము నుండి సొమ్ము రావటము ఆలస్యమైనా 1851 నాటికి పదివేల మంది పైగా శ్రామికులను సమకూర్చి మహాయజ్ఞాన్ని 1852మార్చి 31 నాటికి పూర్తి చేయించ గలిగాడు
పని జరిగేటప్పుడు స్థానికంగా ఉండే జమీందారులు, కాటన్ కు పేరు వస్తుంది అన్న ఈర్ష్యతో ఇతర బ్రిటిష్ అధికారులు వీరిద్దరిపై ఫిర్యదులు చేసి పనులు ఆపాలని ప్రయత్నాలు చేశారు కానీ ప్రభుత్వము వీరి ఫిర్యాదులు పెడచెవిన బెట్టి నిధులు సమకూర్చి పని పూర్తి అవటానికి దోహద పడింది ముఖ్యంగా కాటన్ ‌దొర అనేక జాతీయ, అంతర్జాతీయ సమావేశాలలో వీరన్నను  కీర్తించాడు   కాటన్‌ కుమార్తె లేడీ హోప్‌ కాటన్‌ జీవితచరిత్రను రాస్తూ అందులో వీర న్న ప్రస్తావన తెచ్చినట్టు తెలుస్తోంది. ఆమె గ్రంథస్తం చేసిన ప్రకారం వీరన్న గౌడ బ్రాహ్మణ శాఖలోని శిష్టు కరణాలు అనే శైవమత కులంలో (నేటి ఒడిశాలోని పట్నాయక్‌, మహంతులు) పరాశర వంశ గోత్రీకులుగా తెలుస్తుంది.

"శ్రీ వీణెం వీరన్న అనే హైందవ పురుషోత్తముడు నాకు లభించ కుండా ఉంటె ఇంత వేగముగా గోదావరి ఆనకట్టను పూర్తి చేయలేక పోయేవాణ్ణి  వీరన్న గారి సహకారము కృషి పట్టుదల నిజాయితీ అంకితభావం కారణముగానే నా కల నెరవేరింది " అని కాటన్ తన స్వదస్తూరితో వ్రాసు కున్నాడు కాటన్ వీరన్న గారికి ఏదైనా మేలు చేయాలనీ ఈస్టిండియా కంపెనీ వారిని విక్టోరియా మహారాణిని అభ్యర్ధించాడు  వీరన్న సేవలను మెచ్చుకున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆయనను ప్రోత్సహించి రాయ్‌బహద్దూర్‌ బిరుదునిచ్చి సత్కరించింది. ఆయన శ్రమకు ఫలితంగా ‘మెర్నిపాడు’ గ్రామశిస్తును ( ఆ రోజుల్లో 500 రూపాయలు) వీణెం వంశానికిస్తూ ఆర్డర్‌ పాస్‌ చేయడం జరిగింది. 1859 అనంతరం విక్టోరియా మహారాణి ఆధిపత్యంలోకి భారత సార్వభౌమాధికారం వచ్చిన తరువాత 1860లో కాటన్‌తోపాటు వీరన్నను కూడా గౌరవించారు.ఆనకట్ట నిర్మాణము పూర్తి అయిన నాటి నుంచి 1867 లో మరణించేవరకు ధవళేశ్వరం లోని హెడ్ లాక్ క్వార్ట్రర్స్ అయన చిరునామాగా ఉండేది. ఆయన కోరిక మేరకు నేటి ధవళేశ్వరం హెడ్ లాక్ ప్రాంతములోనే అయన పార్థివ దేహానికి దహన సంస్కారాలు జరిపి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేశారు. 1940 లో బులుసు సాంబమూర్తి గారు కాటన్ విగ్రహము దగ్గరేవీరన్న గారి వివరాలు తెలిపే శిలాఫలకాన్ని చెక్కించారు కానీ 1986లో వచ్చిన వరదల వల్ల కాటన్ విగ్రహము వీరన్న  గారి వివరాలు తెలియజేసే శిలాఫలకం కొట్టుకుపోయినాయి 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు గారు ధవళేశ్వరం లోని కాటన్ మ్యూజియం లో వీరన్న గారి చిత్ర పఠాన్ని ఆవిష్కరించారు,ప్రస్తుతం ఆ పఠము కూడా మసక బారిపోయింది ఆ విధముగా గోదావరి ఆనకట్ట నిర్మాణములో ఎన్నో విధాలుగా సహాయము అందించిన వీరన్నగారిని కాటన్ దొర మరిచిపోక పోయిన మనము మాత్రము మనవాడిని మరచిపోయాము అంత ప్రముఖ వ్యక్తికీ సముచిత స్థానము కల్పించలేక పోయాము
1975 ప్రాంతాన ధవళేశ్వరం వద్ద పాత ఆనకట్ట స్థానములో కొత్త ఆనకట్టను ప్రారంభించారు అప్పుడు మా నాన్నగారు ఎక్సుక్యూటివ్ ఇంజినీర్ హోదాలో ధవళేశ్వరం లో పని చేశారు అప్పుడు మానాన్నగారు మాతో మాట్లడుతూ ఆ రోజుల్లో అంటే 1844లో కాటన్ అనే ముఖ్య ఇంజనీర్ వీరన్న అనే చిన్న ఇంజనీర్ నిర్మాణ భాద్యతలను భుజాన వేసుకొని సాంకేతిక పరిజ్ఞానము అంతగా లేని రోజుల్లో నిర్మాణాన్ని పూర్తిచేశారు నేడు పెద్ద పెద్ద ఇంజనీర్లు చాలా మంది ,పెద్ద కాంట్రాక్టర్లు అనేక యంత్ర సామాగ్రులు ఉద్యోగస్తులకు నివాస గృహాలు అన్ని హంగు ఆర్భాటాలు కలుగజేసి నిర్మాణము మొదలు పెట్టారు నేడు క్వాంటిటీ తప్ప క్వాలిటీ లేదు అని మానాన్న గారు మాతో అంటూ ఉండేవారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము పెరిగింది అని సంతోషించాలా? లేక ఉద్యోగస్తులలో నిబద్దత నిజాయితీలు లోపించాయని భాధపడాలా?