కళాకారులు - సుస్మితా రమణమూర్తి

Artists

 ఎయిర్ పోర్టులోంచి బయటకు వచ్చేసరికి మా అబ్బాయి, కోడలు, మనవడు చేతులు ఊపుతూ కనిపించారు. మమ్మల్ని చూడ్డంతో వారి ముఖాల్లో ఆనందం చోటు చేసుకుంది. “ ప్రయాణం బాగా సాగిందా డాడీ?...మమ్మీ!.. ఇబ్బందేమీ పడలేదు కదా?” మా అబ్బాయి ఆప్యాయంగా అడిగాడు. “ మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది. బాగున్నారా?” మా కోడలి పలకరింపు. “ తాతయ్యా! నాన్నమ్మా!” అంటూ మనవడు మమ్మల్ని కౌగలించు కున్నాడు. కారు మెత్తగా సాగిపోతోంది. “ ఎంత దూరంరా ఇల్లు?” “ పాతిక కిలోమీటర్లు ఉంటుంది. ముప్పావు గంటలో వెళ్ళి పోతాం.” “ మన విజయవాడలో ఎండలు దంచేస్తున్నాయ్. ఇక్కడేఁవిట్రా ఎండ కాస్తున్నా,ఇంత చల్లగా ఉందేఁవిటి !?” మావాడు నవ్వుతూ చెబుతున్నాడు. “ ఇక్కడ వాతావరణం ఇలానే ఉంటుంది. మాకిప్పుడు ఎండాకాలం ప్రారంభం అయింది. ఇక్కడ ఎండ కాస్తున్నా చలిగానే ఉంటుంది. “ ‘ దేశం మారితే, వాతావరణంలో ఇంత మార్పా!?...’ “ ఇంటికి దగ్గరగా వచ్చేస్తున్నాం…అటువేపు చూడండి. కుడివేపు పెద్ద పార్కు, దానికి దగ్గరలోనే ఓ చర్చ్ కనిపిస్తాయి. ఇక్కడ క్రైస్తవులు ఎక్కువ. రేపు ఆదివారం ఆ చర్చికి, పార్కుకి వెళ్దాం. “ రేపటి కార్యక్రమం గురించి మావాడి ప్రణాళిక. ఇంటికి చేరుకున్నాం. “ ప్రయాణం చేసి వచ్చారు.విశ్రాంతి తీసుకోండి. “ పక్క గది చూపించింది కోడలు. మరుసటి రోజు పది గంటలకు ఆ పార్కుకి వెళ్లాం. బయల్దేరే ముందు మావాడు, అక్కడి అడ్రస్, ఫోన్ నెంబర్లు రాసిన కాగితంతో బాటు, రెండు వందల యూరోలు ఇచ్చి—” మీ దగ్గర ఉంచుకోండి. మన రూపాయలు ఇక్కడ చెల్లవు. ఏదైనా కొనాలంటే ఈ డబ్బు పని చేస్తుంది.” అని చెప్పాడు. విశాలమైన ఆ పార్కులో నేలంతా పచ్చని తివాచీ పరిచినట్లుంది.ఎటు చూసినా రకరకాల పూల మొక్కలు. పార్కు చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. పార్కు మధ్యలో అక్కడక్కడ కూర్చోడానికి బెంచీలు . కాఫీ,టీ,బిస్కెట్లు, ఐస్క్రీం షాపులు ఉన్నాయి. పిల్లల ఆట పాటలతో చాలా సందడిగా ఉంది అక్కడ. మావాడు ఐస్క్రీంలు తెచ్చిచ్చాడు. ప్రక్కనున్న బెంచీల మీద కూర్చున్నాం. “ తాతయ్యా!...అటు చూడండి. గోల్డెన్ మేన్ ” ఆవేపు చూసాం. ఒళ్ళంతా బంగారపు రంగు పూత. బొమ్మలా కదలకుండా కూర్చుని ఉన్నాడు ఓమనిషి. అప్పుడప్పుడు కనురెప్పలు కదులు తున్నాయి. శరీరంలో కదలిక లేదు. అలా ఎప్పటి నుంచి కూర్చుని ఉన్నాడో!?... కాళ్ళ ముందు తెరచి ఉన్న ఎయిర్ బేగుంది. పిల్లలు గోల్డెన్ మేన్!...అంటూ తన చుట్టూ తిరుగుతున్నారు. మాకది వింతలా అనిపించింది. కొందరు ఫోటోలు తీసుకుంటున్నారు. బేగులో డబ్బులు వేస్తున్నారు. ఆ మనిషికి ఫోటో తీసి బెంచీపై కూర్చున్నాను. “ డాడీ!...అలా ఫోటో తీసుకుని వచ్చేయ కూడదు. మనకు తోచినంత బేగులో వేయాలి. “ మావాడి మాటలకు నవ్వుకున్నాను. అక్కడికి మరికొంత దూరంలో స్పైడర్ మేన్ బట్టలు వేసుకుని గెంతులు వేస్తున్న మనిషి అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఇంకో చోట మాసిన బట్టలతో, ముఖానికి మసి పులుముకుని, చేతిలో పెద్ద వెదురు కర్రకి కట్టిన చీపురుతో నేల తుడుస్తున్నట్లు కదలకుండా నిల్చొని ఉన్నాడొక మనిషి. ఇలాంటి దృశ్యాలకు ఇక్కడి వారు అలవాటు పడినట్లున్నారు.చూసి ఆనందిస్తున్నారు. వివిధ భంగిమలలో ఫోటోలు తీసుకుంటున్నారు. వారి ముందున్న బేగుల్లో డబ్బులు వేస్తున్నారు. ‘ వీళ్ళు బెగ్గర్లన్న మాట!?...’ స్వగతంలా అనుకున్నా మావాడు నా మాటలు విన్నాడు. “ అలా అనకూడదు డాడీ!...నటులు, నాట్యకారులు, చిత్రకారులు, సంగీత విద్వాంసులు, గాయకులు, కవులు, రచయితలు….ఇలా ఎంతోమందిని మనకు తెలుసు. కళకు అనంత రూపాలు. వీళ్ళది కూడా ఓ కళా రూపమే!...వేష ధారణలో ఎన్ని గంటలైనా అలా ఉండగలగడం ఈ కళాకారుల ప్రత్యేకత!. కదలరు. మెదలరు. తమ కళను అలా ప్రదర్శిస్తుంటారు. ఈ కళాకారులలో ఎక్కువ మంది విదేశీయులే. ఇక్కడ చదువు కుంటున్న విద్యా ర్ధులు. సెలవు రోజుల్లో వారలా తమ కళను ప్రదర్శిస్తుంటారు….. “ అదుగో అటు చూడండి. అక్కడ జనం మధ్యలో సంగీత కళాశాల విద్యార్థులు, వివిధ వాయిద్య పరికరాలతో తాము నేర్చు కుంటున్న కళను అలా అందరిలో ప్రాక్టీసు చేస్తుంటారు. “ ఆవేపు చూసాం మేము. “ వారలా ప్రాక్టీస్ చేస్తుండటం వలన. వారికి ఎంత మందిలో అయినా తమ కళను ధైర్యంగా ప్రదర్శించ గల నైపుణ్యం వస్తుంది. జనంతో నిండిన ఇలాంటి పార్కులు,ప్రార్ధనా మందిర పరిసరాలు వారికి ప్రాక్టీసు చేసుకోవడానికి మంచి వేదికలు.” మావాడు అలా చెబుతుంటే మవునంగా వింటున్నాం. “సందర్శకులను ఆకట్టుకోవడానికి,అలరించడానికి వారలా తమ కళను ప్రదర్శిస్తుంటారు. మనకు నచ్చితే డబ్బులు వేస్తాం. మన చిరు ఆర్థిక సహాయం వారి చదువుకి ఉపయోగ పడుతుంది. ఎవరినీ అడగరు. ఇస్తే పుచ్చుకుంటారు.” “ అవునవును. వాళ్ళు ఎవరినీ ఏమీ అడగటం లేదు. అవున్రా వీళ్ళదీ ఓ రకం కళే!...వీళ్ళూ కళాకారులే!..” నా మాటలకు మావాడు నవ్వుతూ తలూపాడు. పార్కులో చాలా దూరం నడిచాం. దగ్గరలో ఉన్న చర్చ్ దగ్గరకు వెళ్ళాం. విశాలమైన ఆవరణలో ఉంది ఆ చర్చి. చర్చి లోపలికి వెళ్ళాలంటే చాలా మెట్లు ఎక్కాలి . అలసటగా ఉంది. కాళ్ళు పీకుతున్నాయి. “ ఇక నడవడం కష్టంరా!...” అంటూ ప్రక్కనున్న బెంచీపై కూర్చుండి పోయాను. “ కాస్త ఓపిక చేసుకుని రండి డాడీ!...చర్చి లోపల చాలా బాగుంటుంది.” మావాడి మాటలు వినే పరిస్థితిలో లేను నేను. “ మీరు వెళ్ళండి “ ఆయాస పడుతూ చెప్పాను. “ సరే తాతా!...ఇక్కడే కూర్చో, ఎక్కడికీ వెళ్ళకు. ముఖం మీద ఎండ పడకుండా ఉంటుంది , ఈ టోపీ పెట్టుకో! “ అంటూ మావాడి టోపీ తీసి నా తలపై పెట్టాడు మనవడు. అలసిన శరీరంకి విశ్రాంతి దొరికింది. కళ్ళు మూసుకుని కూర్చునే నిద్ర పోయాను. ఎంత సేపు నిద్ర పోయానో తెలియదు. ప్రక్కన ఏదో పడిన శబ్దం వినిపించింది. కళ్ళు విప్పి చూసాను. నా చుట్టూ పిల్లలు,పెద్దలు గుమికూడి ఉన్నారు. కెమేరాల్లో నన్ను అందరూ బందిస్తున్నారు. కదలక మెదలక అలా బెంచీపై నిద్ర పోతుండటంతో బహుశా నన్ను కూడా అంతా, వేషధారినని ఆనుకున్నారేమో !?... క్రింద పడిన టోపీ తీసాను. నేను లేవడంతో అందరూ చేతులు ఊపుతూ వెళ్ళి పోయారు. టోపీ బరువుగా ఉంది. అందులో చిల్లర నాణాలు, కొన్ని నోట్లు కనిపించాయి. పరిస్థితి అర్ధం అయింది. నాలో నేనే నవ్వుకున్నాను. ‘ ఇక్కడి వారు కళారాధకులు. ‘ స్వగతంలా అనుకుంటూ ఆ డబ్బులు జేబులో వేసుకున్నాను. ఇంతలో మావాళ్లు వచ్చారు. “ ఏం డాడీ!...అలసట తీరిందా?...ఇంకాసేపు రెస్ట్ తీసుకుంటారా?...” “ ఇప్పుడు ఫరవాలేదు. బడలిక తీరింది. పదండి వెళ్దాం. “ చర్చికి ఎదురుగా ఓ యువతి గిటార్ వాయిస్తూ ఏసుక్రీస్తు పాటలు పాడుతోంది. ఆమె ముందున్న బేగులో చిల్లర నాణాలు వేసి, చర్చ్ వేపు తిరిగి నమస్కారం చేసాను. మళ్ళీ పార్కులోకి వెళ్ళాం. ఆ స్పైడర్ మేన్ బేగులో, గోల్డెన్ మేన్ బేగులో, చీపురుతో నేల తుడుస్తున్నట్లు కదలకుండా ఉన్న వాడి బేగులో మిగతా డబ్బులు వేసి తృప్తిగా నవ్వుకున్నాను. “ మీ దగ్గర చిల్లర డబ్బులు ఎక్కడివి డాడీ!?.... యూరోలు మార్చేశారా?...” ఆశ్చర్యంగా అడిగాడు మావాడు. జరగింది వివరంగా చెప్పాను. “ అంటే!?...ఇక్కడి వారు మిమ్మల్ని కూడా…” నవ్వుతూ ఆశ్చర్యపోయాడు మావాడు. “ అవును. నాలోని కళాకారుణ్ణి ఇక్కడి వారు గుర్తించారు. తోచిన సహాయం చేసారు.సాటి కళాకారులకు ఆ డబ్బులతో నా వంతు సహాయం చేసి, వారిని గౌరవించాను. కళాకారులను ప్రోత్సహించాలి. ఆదరించాలి. ఆదుకోవాలి. మర్యాద పూర్వకంగా చూడాలి. “ ” అవునవును. చక్కగా చెప్పారు. మీ కళాకారులందరికీ మా అందరి కళాభివందనాలు. “ అంటూ మావాళ్లు నవ్వుకున్నారు.