కరోనా! కరోనా!! - రమణారావు ఎం వి

కరోనా! కరోనా!!
 
పామూ కప్పా నత్తా చెత్తా అవలీలగా దిగమింగే నికృష్ట నిత్యాకృత్య దురలవాట్ల దుష్పరిణామోత్పన్న జనితమైన కరోనా కరాళ దంష్ట్రల వికటాట్టహాస విషపు కోరల మృత్యు ఘంటికల నడుమకు విశ్వజనులను కుక్కి, వారంతా బిక్కు బిక్కు మని చూస్తూ , వెక్కి వెక్కి ఏడుస్తూ , నక్కి నక్కి నడుస్తూ, ముందుకీ వెనక్కీ ఇరుప్రక్కలకీ భయం భయంగా చూసుకు తిరుగుతూ, చేయని నేరానికి అష్ట కష్టాలూ అనుభవిస్తున్న నేటి  విశ్వవ్యాప్త జనావళి ప్రస్తుత అథమస్థితికి కారణాలేంటో మాకేం తెలుసంటూ అడ్డంగా బుకాయిస్తున్న దేశం ఏదో ఎక్కడుందో అందరికీ తెలిసిందే.

ఎక్కడో  కాకులు దూరని కారడవుల నిబిడాంధకారంలోని మారుమూల గుహల్లో స్వేచ్ఛగా ఎగిరే గబ్బిలాల గుంపుల్ని నిర్దాక్షిణ్యంగా మూకుమ్మడిగా పట్టి తెచ్చి, రసాయన పరీక్షలంటూ గుచ్చి గుచ్చి చంపి, భయంకర కరోనా వ్యాధికి బీజం వేసిన దేశం, ‘అయ్యో, వద్దొద్దు, ప్రమాదం రాబోతోందంటూ’ గళం విప్పి చెప్పబోయిన డాక్టర్లను హింసించి, గరళ కంఠుల్లా విషయ విషాగ్నిని తమలోనే దాచుకుని, ఘోర విపత్తును నిర్దాక్షిణ్యంగా ప్రపంచానికి పంపకం చేసిన మహాపాప రహస్యం కాస్తా ఏనాడో బట్టబయలైంది. 
 
చప్పిడి ముక్కులకూ, చీపి కళ్లకూ ప్రసిద్ధి పొందిన ఉత్తర సరిహద్దుల దేశం తమ సైనిక ముష్కర మూకలతో, నమ్మకద్రోహమే ఏకైక బాటగా, మిత్రులమని నటిస్తూనే ఆకస్మిక దాడులకు దిగుతూ, అంతర్జాతీయ నియమాలన్నీ తుంగలో తొక్కుతూ , అడ్డొచ్చిన నిరాయుధ సైనికులపై ఇనుప ముళ్లు చుట్టిన చువ్వలతో బాది బాది లోయల్లోకి తోసి, నిరాయుధ ఒప్పందం గాలికి వదిలి దొరికినన్ని ప్రాణాలు పొట్టన బెట్టుకుంటున్నారు. 

నదులూ, సముద్ర జలాలూ, ద్వీపాలూ, దిబ్బలూ స్వాధీనం చేసుకుంటూ, ఆనకట్టలు కట్టి నీటి ప్రవాహాల దారి మళ్లిస్తూ, ఎక్కడికక్కడ తమ సైనిక మూకల ప్రయోగానికి అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తూ,అవన్నీ మా జాగాలే, హక్కులన్నీ మావేనంటూ, ఎంత దొరికితే అంత ఆక్రమించడమే జీవిత ధ్యేయంగా ఆ దేశం నిస్సిగ్గుగా వాదిస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. చివరికి తాము తీసిన గోతిలో తామే పడి తమతో బాటు తమ దేశ ప్రజలందరినీ నిలువునా ముంచి, దిక్కుతోచక గింజుకుంటున్నారు. ఎప్పుడు చూసినా చీకట్లో గబ్బిలాల్లా లెక్కలేనన్ని కరోనా పాపపు శవాల కుప్పలు పేటికల్లో మోసుకు తిరుగుతూ ఎక్కడ జాగా దొరికితే అక్కడ నిర్విరామంగా పాతిపెట్టుకుంటూనే, మా దేశంలో చావులేమీ ఎక్కువగా లేవంటూ దయ్యాలు వేదాలు వల్లించినట్టు అబద్ధాల చిట్టాలు వల్లె వేస్తున్నారు. 

తక్కువ వడ్డీకి మీకు అప్పులిస్తాం రండి, రండంటూ చిన్న దేశాలను అప్పులపాల్జేసి వారితో మైత్రి నటిస్తూనే తమ అవసరాలకు రెండు చేతుల్తో  వాడుకుంటున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడనే కుటిలనీతితో, అవకాశవాదులైన గుంటనక్కల్లాంటి పొరుగు దేశాల కొమ్ము కాస్తూ, వారికి అప్పులూ, ఆయుధాలూ, యుద్ధ విమానాలూ, హెలికాప్టర్లూ ,  సైనిక బలాలూ అందిస్తూ ఆ దేశాలకు ఎలాంటి హక్కూ లేని ఆక్రమిత ప్రాంతాల్లో వీరు అక్రమ రహదారులు వేసుకుంటూ, కీలక నౌకాశ్రయాలలో కూడా కాలు మోపి కుటిలనీతితో తమ నౌకా బలాలు అనునిత్యం పెంచుకుపోతున్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర కోట్లు దాటిన కరోనా కేసులూ, ఎనిమిదిన్నర లక్షలు దాటిన మరణాలతో గిలగిల్లాడుతున్న ఎన్నెన్నో దేశాలు రోజు రోజుకూ ఆర్థికంగా దిగజారుతూ విలవిలలాడుతూ ఆర్థిక సంక్షోభంలోకి దిగజారుతూ ఉంటే, కూలిపోతున్న షేర్ల విలువలను పనిలో పనిగా తమకు సదవకాశంగా మార్చుకుని కొనుగోళ్లు చేసుకుంటూ, రోమ్ నగరం తగలబడుతూంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటున్నట్లు  జాతికి తీరని ద్రోహం చేస్తున్న ఈ  దేశాన్ని ప్రపంచ దేశాల అశేష జనావళి కలిసికట్టుగా ప్రశ్నించి అంతర్జాతీయ న్యాయస్థానంలో నిలబెట్టే రోజు ఎంతో దూరంలో లేదు.
 
ఇన్మనాళ్లూ మన దేశం చుట్టూ నిలబడి మనకు అండగా నిలిచిన దేశాల మదిలో అనుమాన విష బీజాలు నాటి, లేనిపోని కయ్యాలు సృష్టించి, మీ వెనుక మేముంటాం, ఎదిరించి పోరాడండి అంటూ స్నేహధర్మానికి తూట్లు పొడుస్తున్న దేశం కరోనా భూతం కంటె ప్రమాదకరమైనదని ప్రపంచ దేశాలన్నీ ఏక కంఠంతో దుమ్మెత్తి పోస్తున్నాయి.

మొక్కవోని మన సైనికుల ధైర్య సాహసాలే పెట్టుబడిగా దేశ సమగ్రతను రక్షించుకుంటూ, మనది కాని భూమిని ఎన్నడూ ఆశించి ఎరుగని దేశంగా అగ్ర రాజ్యాల మన్ననలు పొందుతూ, అహింసయే పరమ ధర్మంగా నడుస్తున్న మన దేశంలోనికి అక్రమంగా ప్రవేశించ జూస్తున్న ప్రబల శత్రువును కలిసికట్టుగా ఎదిరించి నిర్వీర్యం చేసి తరిమి తరిమి కొడదాం. మనం ఎప్పుడూ ఏనాడూ కోరుకోని సరిహద్దు ఘర్షణలు నివారించి ఎల్లెడలా శాంతి వాతావరణాన్ని నెలకొల్పుదాం.  
 
కరోనా భూతాన్ని ధైర్యంగా ఎదిరించి దూరతీరాలకు తరలించి, భయరహిత సామాన్య సాంఘిక జీవనాన్ని కలిసి పొందుదాం! పూర్వపు శాంతియుత వాతావరణాన్ని తిరిగి సాధిద్దాం!!