ఉదార బుద్ధి (బాలల కథ) - సరికొండ శ్రీనివాసరాజు‌

Generous mind (children's story)

 

     రాఘవ 10వ తరగతి పరీక్షలు పూర్తి అయ్యాయి. వాళ్ళ అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళి 3 సంవత్సరాలు అయింది. అందుకే రాఘవ 10వ తరగతి పరీక్షలు, అతని చెల్లెలు స్రవంతి 8వ తరగతి పరీక్షలు పూర్తి కాగానే కుటుంబం అంతా రాఘవ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళారు. సెలవులన్నీ సరదాగా గడిపిన అనంతరం మళ్ళీ రాఘవ వాళ్ళు వాళ్ళింటికి చేరుకున్నారు.

 

      రాఘవ వాళ్ళ ఇల్లు చాలా విశాలమైన స్థలంలో ఉంది. సగం స్థలంలోనే రెండంతస్థుల భవనం కొట్టగా, చాలా ఖాళీ స్థలంలో రకరకాల పూల, పండ్ల, కూరగాయల, అందమైన చెట్లను పెంచారు. వర్షాకాలం వచ్చింది. నాలుగైదు వర్షాలు కూడా పడ్డాయి. ఎండాకాలంలో చాలా చెట్లు ఎండిపోగా, ఈ వర్షాలకు బాగా కలుపు మొక్కలు పెరిగాయి. కలుపు మొక్కలన్నీ తీసెయ్యాలి. కొత్త మొక్కలను, విత్తనాలను నాటాలి. ఒక రోజంతా పని. దానికి ఒక కూలివాని అవసరం పడింది.

 

      రాఘవ తండ్రి మాధవయ్య సోమయ్య అనే కూలివాడిని పిలిపించాడు. సోమయ్య మాధవయ్య ఇంట్లో ఏం పని ఉన్నా వచ్చి చేస్తూ ఉండేవాడు. దశాబ్దానికి పైగా సోమయ్య సేవలను వినియోగించుకుంటున్నారు మాధవయ్య కుటుంబం. సోమయ్య వచ్చాడు. రాఘవ తల్లి మంగమ్మ సోమయ్యతో ఆరోజు చేయాల్సిన పనులను గురించి చెప్పింది. "ఒక్క రోజంతా పని. ఒక్కరోజు కూలిపని చేసినా 600 రూపాయలు వస్తాయి. కనీసం 500 రూపాయలు అయినా ఇవ్వండమ్మా!" అన్నాడు సోమయ్య. "చిన్నపనికి అంత అడుగుతారా? నీకు బాగా పొగరు ఎక్కింది. ఓ 200 ఇస్తాం! చేసిపో!" అన్నది మంగమ్మ. "కష్టం అమ్మగారూ! కనీసం 400 అయినా ఇవ్వండి." అన్నాడు సోమయ్య. "ఆలోచిస్తాలే!" అన్నది మంగమ్మ. 

 

        సోమయ్య రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా చెప్పిన పనిని పూర్తి చేశాడు. మధ్యలో అతనికి విశ్రాంతి లేదు. భోజనమూ లేదు. ఆరోజు ఆదివారం కాబట్టి ఇంటివద్దనే ఉన్న రాఘవ అక్కడే కూర్చుని సోమయ్య చేసే పనిని శ్రద్ధగా గమనిస్తున్నాడు. రాఘవకు సోమయ్య మీద జాలి వేసింది. పనంతా అయిపోయాక మంగమ్మ వచ్చి, సోమయ్యకు 300 రూపాయలు ఇచ్చింది. "నా కష్టాన్ని చూసి ఇవ్వండి అమ్మగారు!" అని సోమయ్య బ్రతిమాలాడు. "ఇష్టం ఉంటే తీసుకో! లేకపోతే తీసుకోకు." అని నిష్టూరంగా మాట్లాడింది మంగమ్మ. చేసేది లేక సోమయ్య 300 తీసుకుని వెళ్ళిపోయాడు. 

 

       ఇంతలో రాఘవ పుట్టినరోజు వచ్చింది. రాఘవ అమ్మ మంగమ్మ కోరిక ప్రకారం ఇంటిల్లిపాదీ పెద్ద స్టార్ హోటలుకు వెళ్ళారు. ఇష్టం ఉన్న వంటకాలను ఆర్డర్ చేసి, తృప్తి తీరా తిన్నారు. బిల్ 2000 అయింది. సర్వర్ బిల్ తీసుకువచ్చాడు. మాధవయ్య 2000 రూపాయలు సర్వరుకు ఇచ్చాడు. అప్పుడు మంగమ్మ "ఆహారం పదార్థాలు అన్నీ ఎంతో రుచిగా ఉన్నాయండీ! వడ్డించిన సర్వరుకు ఎంత ఇచ్చినా తక్కువే! మన అబ్బాయి పుట్టినరోజు సంతోషంతో సర్వరుకు ఓ 300 రూపాయలు టిప్పుగా ఇవ్వండి." అన్నది. అలాగే చేశాడు మాధవయ్య. 

 

      ఇంటికి వచ్చాక రాఘవ చాలా అసంతృప్తిగా కనిపించాడు. "అమ్మా! నీ పద్ధతి ఏమీ బాగాలేదు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని, తిండి, విశ్రాంతి లేకుండా కష్టపడిన సోమయ్యకు 300 రూపాయలు ఇచ్చావు. హోటలులో సర్వరుకు తన పని చేసినందుకు యజమాని జీతం బాగానే ఇస్తాడు. కానీ అతనికి అవసరం లేకున్నా 5 నిమిషాల పనికి అదే 300 రూపాయలు ఇచ్చావు ‌. ఇదేమి న్యాయం? శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇస్తే మనకే పుణ్యం. పేదోడి కడుపు కొట్టడం, ఉన్నోడికి పంచి పెట్టడం ఇదేనా మన న్యాయం? సోమయ్య కష్టాన్ని కళ్ళారా చూశాక అతడు నువ్వు ఇచ్చిన 300 రూపాయలు తీసుకొని వెళ్తుంటే నీకు తెలియకుండా అతని వద్దకు వెళ్ళి, నా పాకెట్ మనీలోని మరో 300 రూపాయలు తీసి ఇచ్చాను." అన్నాడు రాఘవ.

 

        చిన్న వయసులోనే వ్యక్తిత్వంలో తనను మించిన తన తనయుని చూసి, పొంగిపోయింది మంగమ్మ. తాను చేసిన పనిని తలచుకొని సిగ్గుపడింది. పేదల పట్ల ఉదార బుద్ధిని అలవరచుకున్నారు రాఘవ తల్లిదండ్రులు. .