కోరుకున్న మొగుడు - కొడాలి సీతారామా రావు

Korukunna mogudu

“సిగరీట్ తాగేవాడిని చేసుకోనంటోంది అనుపమ” చెప్పింది అనసూయ ముందుగదిలో పుస్తకం చదువుతూ సిగరెట్టు తాగుతున్న భర్తతో .అనసూయ తన కూతురు ధైర్యానికి చా లా సంతోషించింది. తన పెళ్లి నాటికి ఆడపిల్లకి ఆ పాటి చెప్పే ధైర్యమే కాదు,పెళ్లి కొడుకుని చూసి నచ్చలేదనే ధైర్యమే లేదు . నచ్చాడా అని మాట వరసకే అడిగారు తనని . తను డిగ్రీ చదివినా మరోలా చెప్పటానికి ఆస్కారం లేకపోయింది . ఎందుకంటే నాన్న ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ . కొద్ది పాటి జీతం . తన వెనక చెల్లెలు ,తమ్ముడు . తన బాధ్యత తీరితే మరో నాలుగేళ్ళకి చెల్లెలు పెళ్లి చెయ్యాలి .

ఇంకో ముఖ్య విషయం అప్పటికే ఆ కుటుంబం గురించీ , వాళ్ళ మంచితనం గురించీ,పె ళ్లి కొడుకు ఉద్యోగం గురించీ చాలా రోజులనుంచీ చర్చ జరుగుతోంది ఇంట్లో .బంధువులు కూడా చాలా మంచి సంబంధం అనేవారు . పెళ్లికొడుకు అందం కన్నా సంపాదన గురించి ఆలోచించారు అందరూ . అనసూయ అదృష్టవంతురాలన్నారు అందరూ .నిజమే అనుకుంది. కొంతవరకు నిజమే కానీ, మొదటి రాత్రే సిగరెట్ తాగి గదిలో వున్న తన భర్తకి అసంకల్పితంగా దూరం జరిగింది. ఏమైందంటే చెప్పింది తనకా వాసన గిట్టదని. వెంటనే మంచినీళ్ళతో పుక్కిలించి, వక్కపొడి వేసుకుని దగ్గిరకి తీసుకున్నాడు.

ఆ తరువాత ఎంత చెప్పిన వినకపోగా తనకి ఇష్టం లేకపోయినా సర్దుకుపోవలిసి వచ్చింది. పాతికేళ్ళ కాపురం తరువాత తన కూతురు పెళ్లి విషయంలో ఇప్పుడు భర్త ఎదురుగా నిలబడి చెప్పవలిసి వచ్చింది.

“సిగరెట్టు తాగని వాడు ఎవడుంటాడు ఈ రోజుల్లో . కాలేజీ పిల్లలే తాగుతున్నారు. అసలు ఆడపిల్లలే తాగుతున్నారు . ఐనా అదేమంత దురలవాటా. సొసైటీలో నలుగురితో తిరిగేటప్పుడు ఇలాంటివి మామూలే. ఐనా అతగాడు ఆర్టీసీలో ఆఫీసరు,మంచి జీతం.హోదా. అందంగానూ వున్నాడు. ఆయనకింద వందల మంది పనిచేస్తారు. కట్నం అక్కర లేదన్నారు. ఇంతకన్నా మంచి సంబంధం దొరకటం కష్టం . అంతగా అయితే అతనికే చెప్పి మానిపించవచ్చు ఆ అలవాటు .” అన్నాడు దమయంత్ . అనసూయ అనుకుంది తను మార్చగలిగిందా తన భర్తని అని .

“పెళ్లి చేసుకోకుండా ఐనా వుంటాను ఉద్యోగం చేసుకుంటూ .నాకు ఇష్టం లేకుండా సిగరెట్టు తాగేవాణ్ణి మాత్రం పెళ్లి చేసుకోను.” ఖండితంగా చెప్పేసింది అనుపమ తండ్రికి ఎదురుగా వచ్చి. ఒక్కసారి ఉలిక్కిపడ్డా దమయంత్ సర్దుకున్నాడు . “సరే .అలాగే చూద్దాం.” అనేశాడు. తరువాత అతను అనుకున్నాడు కూతురి మీద ప్రేమ తనని అలా మాట్లాడించిందని. తన భార్య ఎన్ని సార్లు చెప్పినా ఆ అలవాటుకి దూరం కాలేకపోయాడు.ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు తను సిగరెట్టు తాగకూడదని .

@@@

“మీరు సిగరెట్టు తాగుతారా” అడిగింది అనుపమ పెళ్ళికొడుకు అన్వేష్ ని. తనకా అలవాటు లేదని చేప్పాడు . ”కానీ మీరు పనిచేస్తున్నది గోల్కొండ సిగరెట్ కంపెనీలో అన్నారు కదా .” సందేహ నివృత్తికి అడిగింది . “నేను అకౌంటెంటుగా పనిచేస్తున్నాను.ఫాక్టరీ ఆవరణలోనే వుంటుంది ఆఫీసు . కానీ మాకూ ఆ వాసనకీ సంబంధం వుండదు .”

“మీరు సిగరెట్టు అలవాటు లేదన్నారు కనుక నాకు ఈ సంబంధం ఇష్టమే.”చెప్పి లోపలికి వెళ్లిపోయింది అనుపమ .

@@@

అత్తగారితో కాపురానికొచ్చింది అనుపమ హైదరాబాదు . పొద్దున స్టేషను కొచ్చి తమని ఇంటి దగ్గిర దించి ఫాక్టరీకి వెళ్లిపోయాడు ఆడిట్ వుందని .

అతను వంట చేసుకోవటం వల్ల ఆ పూట వున్న గిన్నెలు ,పదార్ధాలతో వంట చేసు కున్నా రు. తమ కోసం స్టేషనుకి రావటం వల్ల అతను వంట చేసుకోలేదని అర్ధం అయింది .భోం చేశాక అత్త గారు ,తానూ ఇల్లంతా సర్దారు .మూడు వరుస గదుల ఇల్లు. మధ్య గది వాళ్ళ పడక గది . ముందు గదిలో అత్తగారు పడుకుంటానన్నారు. స్నానాల గది వెనక వేపు వరండాలో వుంది.

తాము విడిచిన బట్టలు, అతను విడిచిన బట్టలు ఉతకటానికి బాత్రూములో బకెట్లో వేద్దామని తీసేసరికి అవి సిగరెట్ వాసన వేశాయి. అతని మీద విపరీతమైన కోపం వచ్చింది.ఎంత అబద్దం చెప్పాడు తనతో .సిగరెట్టు తాగనని, అలవాటు లేదని .పెళ్లి కోసం చెప్పించారేమో . తన తండ్రి మీద కోపం వచ్చింది . రాత్రికి అడిగేయాలి . అతను ఆ అలవాటు మానేదాకా దూరంగా వుండాలి . తన తల్లిలాగా మెతకగా వుండకూడదు .

గదులలో ఎక్కడా సిగరెట్ నుసి కానీ , సిగరెట్ పీకలు గానీ కనపడలేదు . బయట కూడా ఎక్కడా కనపడలేదు . అనుపమ వెతుకులాట చూసి ఏమిటి వెతుకుతోందని అడిగింది అత్తగారు . నిజం చెప్పింది .”పిచ్చి పిల్లా వాడు సిగరెట్ తాగని మాట నిజమే . ఆ వాసన ఎందుకు వస్తోందో రాత్రి అడుగుదాములే కాసేపు నడుం వాల్చు ” అందావిడ ముందు గదిలో చాప మీద పడుకుంటూ .

రాత్రి కౌగిలించుకోబోతున్న భర్తకి దూరంగా జరిగి అడిగింది “సిగరెట్టు అలవాటు లేదన్నారు . కానీ బట్టలన్నీ అదే వాసన . ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా . నవ్వుతూ చెప్పాడు అన్వేష్ “నిజంగానే నేను సిగరెట్ తాగను .నాల్గు రోజులనించీ ఆడిట్ జరుగుతోంది ఫేక్టరీలో. అందువల్ల మధ్య మధ్యలో ప్రొడక్షన్ పోయింటు దగ్గిర వున్న సెక్షన్ కి వెళ్ళవలిసి వస్తోంది వాళ్ళకి సమాచారం చెప్పటానికి . అంతే. నన్ను నమ్ము . ఐనా ఈ ఉద్యోగం ఈ నెలాఖరుకు మానేస్తున్నాను . నాకు బేంకులో ప్రొబేషనరీ ఆఫీసరుగా ఉద్యోగం వచ్చినట్టు ఇప్పుడే మెస్సేజ్ వచ్చింది .” అన్నాడు ఆమెని ఘట్టిగా కౌగిలించుకుంటూ . ”అయ్యో ఈ విషయం అత్తయ్య గారికి కూడా చెప్పాల్సింది .”అంది ఘట్టిగా అతని పెదిమలమీద ముద్దు పెట్టుకుంటూ. “నువ్వు లోపలికి వచ్చేముందే వచ్చింది.”

ఆమె గది తలుపు తీస్తూ “ ముందు అత్తయ్యగారికి చెప్పండి ఆ మంచి వార్త” అంది . @

మరిన్ని కథలు

Inquiry
ఇంక్వైరీ
- DR BOKKA SRINIVASA RAO
Telisivachhina tappu
తెలిసివచ్చిన తప్పు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vruddhapyam varama? sapama?
వృద్ధాప్యం వరమా ? శాపమా?
- మద్దూరి నరసింహమూర్తి
Adigite cheptaa
అడిగితే చెప్తా
- కొడవంటి ఉషా కుమారి
Evaru takkuva kaadu
ఎవరూ తక్కువ కాదు!
- రాము కోలా దెందుకూరు
Sahajeevanam
సహజీవనం
- ప్రభావతి పూసపాటి
Amalina prema
అమలిన ప్రేమ
- పోరండ్ల సుధాకర్