భారతి - చెన్నూరి సుదర్శన్

bharathi

ఇల్లంతా దద్దరిల్లేలా నోటితో విజిల్ వేస్తున్నాడు ఖాజా.   

            ఖాజాకు అమితమైన సంతోషంకలిగినప్పుడల్లా అలా విజిల్ వేయడం పరిపాటేనని.. వంటింట్లో ఉన్న అతని భార్య భారతి పెద్దగా పట్టించుకోలేదు. వంటపని పూర్తి కాగానే.. ఏమిటా సంతోషానికి కారణం మన్నట్లుగా హాల్లోకి అడుగుపెట్టింది. అక్కడి దృశ్యం చూసి నివ్వెరపోయింది.

            ఎడం చేతి రెండు వేళ్ళను నోట్లో పెట్టుకొని విజిల్ వేస్తూ దానికనుగుణంగా ఒంటి కాలుపై నృత్యం చేయసాగాడు ఖాజా. అలా నృత్యం చేస్తుండగా భారతి ఎన్నడూ చూడలేదు. 

“ఏంటి ఖాజా..!  ఏమయ్యింది..?” అంటూ ఆశ్చర్యంగా అడిగింది భారతి.

            అటు చూడు అన్నట్లుగా టీ.వీ. వైపు చెయ్యి చూపిస్తూ వాలుకుర్చీలో వాలిపోయాడు. భారతిని తన దగ్గరికి వచ్చి కూర్చోమన్నట్లుగా మరోచేత్తో సైగ చేశాడు. అతని ముఖంలో ఉత్సాహం ఉవ్వెత్తున ఉరకలు వేస్తూండడం గమనిస్తూ..  పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంది భారతి. టెలివిజన్ వంక దృష్టి సారించింది.

            అందులో  విదేశపు  ప్రధానమంత్రి, భారతదేశంతో వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకుంటున్నట్లు మెరుపు వార్తలు వస్తున్నాయి. ఆమెరుపుల ప్రతిబింబాలతో చూశావా..! అన్నట్లు భారతి వంక చూసి కళ్ళెగరేశాడు ఖాజా.

“దాని వల్ల మాదేశానికి వచ్చిన నష్టమేమీ లేదు” అంటూ నిర్లిప్తంగా సమాధానమిచ్చింది, భారతి. 

            ఖాజా ముఖం జేవురించింది. కస్సున భారతి పైకి లేచి కళ్ళళ్ళో  నిప్పులు కురిపిస్తూ..“నష్టమెందుకు లేదు.. మా ప్రథాని చాలా తెలివి గల వాడు. క్రికెట్టులో ఎన్నో సార్లు తన చివరి ఓవర్‌లో చివరి బంతి వరకూ పోరాడి జట్టును గెలిపించిన మహానాయకుడు. మీ ప్రధానమంత్రినీ  మట్టికరిపించక మానడు.  

            త్రీసెవెంటీ అధికరణ రద్దుకు ప్రతీకారంగా రేపు మరెన్ని ప్రకటనలు వస్తాయో చూస్తూ ఉండు. కీలెరిగి వాత పెట్టే రకం మాప్రధాని” అంటూ తన లోని ఉక్రోశాన్ని వెళ్ళగక్కాడు ఖాజా.

భారతి నిర్ఘాంతపోయింది. తనను ప్రాణప్రదంగా ప్రేమించిన ఖాజాయేనా..! అన్నట్లు ఆశ్చర్యంగా అతని వంకే చూస్తూ..

            “అదేంటి ఖాజా.. ఈరోజు కొత్త, కొత్త పదాలు వాడుతున్నావు.  మీ దేశం.. మా దేశం అంటూ వింతగా మాట్లాడుతున్నావు. మా దేశాన్ని ఆరాధించే కదా.. నన్ను వివాహం చేసుకున్నావు. ఆరోజు నువ్వు చేసిన బాసలు మర్చి పోయావా..!” అంటూ నింపాదిగా అడిగింది.

            “చూడు భారతీ.. అన్ని రోజులు ఒక్క తీరుగా ఉండవమ్మా..” అంటూ ఎకెసెక్కెంగా చేతులూపుకుంటూ.. “ఇప్పుడు నీతో వాదించలేను”  అని లేచి విసురుగా వెళ్ళి బాత్‌రూంలో దూరాడు. ‘అందులో అయితే తన ఇష్టానుసారంగా నృత్యం చేయవచ్చని కాబోలు’ అని మనసులో అనుకుంది భారతి.

ఖాజా అన్నట్లుగానే ఆతెల్లవారి సంఝౌతా ఎక్స్ ప్రెస్, మరి కొన్ని బస్సులు రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటన వచ్చింది.

            “ఇలా ప్రజలకు అసౌకర్యం కలిగించడమేనా మీప్రధాని పని” అంటూ కోపంగా  ప్రశ్నించే సరికి ఖాజా అగ్గి మీద గుగ్గిలమయ్యాడు.

            తోక తొక్కిన  త్రాచులా బుసలు కొడుతూ.. భారతి చెంప  ఛెళ్ళుమనిపించాడు.

భారతి వెంటనే ఖాజా రెండు చెంపల మీద పిడి గుద్దుల వర్షం  కురిపించింది.  అది ఊహించని ఖాజా దిమ్మ దిరిగి సోఫాలో కూలిపోయాడు. 

            “చూడు ఖాజా.. నేనూ బాక్సింగులో జాతీయ చాంపియన్ అనే విషయం మరిచి పోయావా..! నన్ను కానీ.. నా దేశాన్ని కానీ అవమానిస్తే సహించను. ఇన్నాళ్ళూ నువ్వు చూపించించింది కపట ప్రేమ అని ఇప్పుడే తెలిసింది. నీ నిజస్వరూపమేమిటో చూశాను. మాదేశపు తిండి తింటూ.. నమక్ హర్రాంలా  మీదేశపు పాట పాడుతున్నావు ”  అని ఉరిమి  చూసింది.

            భారతిలో అంత ఆవేశం ఎన్నడూ చూసి ఎరగడు ఖాజా. ఒంట్లో వణకు పుట్టింది. కాని దాన్ని కప్పి పుచ్చుకోవాలనే యత్నంలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. “బాక్సింగ్ చాంపియన్ అయినంత మాత్రాన నీభర్త మీదనే ప్రయోగిస్తావా?.. తిరిగి కొట్టడం ఎంత తప్పు. నీలాంటి భారత స్త్రీ చెయ్యాల్సిన పనేనా ఇది” అంటూ నీళ్ళు నములుతూ గొణిగాడు ఖాజా.

            “నువ్వే అన్నావు.. అన్ని రోజులు ఒక్కతీరుగా ఉండవని. నేను నేటి భారత స్త్రీని. ఒక చెంప కొడితే.. మరో చెంప చూపించమని గాంధీజీ చెప్పిన కాలపు దాణ్ణి కాదు. ఒక చెంప కొడితే రెండు చెంపలు పగలగొట్టాలన్నదే నాసిధ్ధాంతం. నేను బుధ్ధెరిగినప్పటి నుండీ నాకిదే అలవాటు. ఇక ముందు మన ఇంటా, బయటా.. ఇమ్రాన్ పొగడ్తలు గానీ.. పాకిస్తాన్ పొగడ్తలు గానీ.. వినరావద్దు.  ఖబడ్దార్..!” అంటూ చూపుడు వేలుతో తీక్షణ సైగలు చేసింది.

ఊహించని పరిణామానికి ఊపిరి ఆగిపోయినట్టుగా కనుగుడ్లు తేలేశాడు ఖాజా.

            “ఆరోజు నువ్వు నాదేశం మీదా.. నామీదా ప్రమాణం చేశావా.. లేదా..! ఇండియాకు ఇల్లరికం వచ్చానని అనుకోమన్నావు. నాకాళ్ళు మొక్కినంత పని చేసి నన్ను వివాహం  చేసుకున్నావు. నయవంచకుడివి.

మాదేశం మీద నీఅక్కసు బయట పడింది. అది నేను సహించలేను” అంటూ తన కోర్టు లోని బంతిని ఖాజా కోర్టు లోకి విసిరికొట్టినట్లుగా కొర, కొరా చూస్తూ.. పడకగది లోనికి  వెళ్ళిపోయింది.

            భారతి మనసంతా అల్లకల్లోలమవుతోంది.. తాను దేశాంతర వివాహం చేసుకున్నానని  అందరి మన్నలను పొండుతూ పొంగి పోతోంది. కాని నేడు అవహేళనపాలయ్యే రోజు వచ్చింది. విదేశీ  వాళ్ళలో కూడా మనదేశాన్ని ప్రేమించే వారున్నారని నిరూపిస్తా అని అందరి ముందు ప్రమాణం చేసిన ఖాజా, ఇప్పుడు మన ప్రధాని గారి ప్రకటనతో అతని నిజస్వరూపమేమిటో బయటపడింది. 

తన జీవితం ఇంత ఉన్నతంగా నిలబడదానికి   ఎందరో మహాను భావులు కృషి చేశారు. ఆవిషయం ఎలా మరిచి పోగలదు. మనసు ఆలోచనలతో.. ఆర్ద్రమవుతోంది.. ఆనాటి సంఘటనతో తన దెశ.. దిశ తిరిగిన వైనం కళ్ళకు కట్టినట్టుగా కళ్ళముందు దృశ్యాలు కదలాడసాగాయి.

***

            భారతి తొమ్మిదవ తరగతి చదువుతోంది.

            పుస్తకాల బ్యాగును  వీపుకు తగిలించుకుని బడికి వెళ్తున్న ఆమెకు వెనుక నుండి పిచ్చి వాగుడు వినబడ్తోంది..

            “భారతిని ‘భా’ తో భాగిస్తే ఏమవుతుందిరా.. ! భాజన్నా.  అదీ తెలియదారా..! వాజమ్మ”

            “ఒరేయ్ హేమంత్.. అలా మాట్లాడకురా. భారతి నాన్న పరుశురాం పహిల్వాన్. మనల్ని ఉతికి,  ఆరేస్తాడు. భారతిని కూడా అంత తక్కువగా అంచనా వేయకు” అన్నాడు.. అతని పక్కనే నిలబడి వంత పాడుతున్న వసంత్  భయం భయంగా.

            “అదంతా ఒకప్పటి మాట. ఇప్పుడేం పహిల్వాన్‌రా..! తొక్కల్ది. ముసలోడై పోయాడు. అయినా ‘పండిత పుత్రుడు శుంఠః’ అన్నట్టు  పహిల్వాన్ పుత్రిక పిరికిరా..”  అంటూ హేళనగా నవ్వ సాగాడు హేమంత్. 

            భారతి గబుక్కున వెను తిరిగి మెరుపు వేగంతో హెమంత్‌పై పిడి గుద్దుల వర్షం కురిపించింది..

            కుప్పలా కూలిపోయాడు హేమంత్. వసంత్ ఉన్నఫళంగా అదృశ్యమయ్యాడు.

అదంతా చూస్తున్న అభిరాం అచ్చెరువొంది భారతి దగ్గరకు వచ్చాడు. భారతి ఏమాత్రమూ తొణకకుండా అభిరాం వంక చూసింది.. నీకు గూడా వడ్డించనా..! అన్నట్టుగా కళ్ళెగరేసింది. ఆమె ధైర్యానికి అబ్బుర పడ్డాడు అభిరాం.

            “భేష్ భారతీ.. చాలా బాగా బుద్ధి చెప్పావమ్మా” అంటూ అభినందించాడు అభిరాం. అలా  అపరిచితుని అభినందనలు వింటూ ఎగాదిగా చూడసాగింది భారతి. నాపేరెలా తెలిసిందా అని ఆశ్చర్య పోయింది. బహుశః వాళ్ళ మాటలు విని ఉంటాడనుకుంది.

            తనకు మధ్ధతుగా వచ్చాడనుకున్నతను తన నడ్డి విరగ్గొడతాడని పసిగట్టిన హేమంత్,  శక్తినంతా కూడగట్టు కొని కాళ్ళకు బుద్ధి చెప్పాడు.

            “నాపేరు అభిరాం” అంటూ ఆ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. “నేనీ మధ్య మన ఊళ్ళో ‘బాక్సింగ్’ కోచింగ్ సెంటర్ పెట్టానమ్మా. అందులో ముఖ్యంగా ఆత్మరక్షణ కోసం అమ్మాయిలకు  మెళకువలు నేర్పుతున్నాను”

            ఆమాట అనగానే భారతిలో ఉత్సాహం పెల్లుబికింది. అది గమనించి “నేను సాయంత్రం మీఇంటికి వచ్చి వివరాలన్నీ చెబుతానమ్మా” అంటూ భారతి వీపు తట్టి వెళ్ళిపోయాడు అభిరాం.

భారతి చెదిరిన పుస్తకాల బ్యాగును సర్దుకొని బడికి బయలు దేరింది.

            ఆ సాయంత్రం భారతి అదృష్టపు తలుపు తట్టాడు అభిరాం. వచ్చిన పని విన్నవించుకున్నాడు.

            అంతా విన్న పరుశురాం “సార్.. ఇదంతా నావల్ల కాని పని. నా జవసత్వాలుడిగి పోయాయి. బండి మీద కూరగాయలమ్ముకుంటూ భారతిని ఆమాత్రం చదివించడమే గగనమై పోతోంది. ఏదో బిడ్డ నాలుగు అక్షరాలు నేర్చుకుంటే మంచి సంబధం చూసి పెళ్ళి చేయవచ్చనే ఆశ” అంటూ తన అనుభవమంతా చెప్పసాగాడు.

            “ఒకప్పుడు నన్ను రాజకీయ నాయకులంతా వాడుకున్నారు. వారి కుట్రలు,  కుతంత్రాలకు బలయ్యాను. అసలు జీవితమంటే ఏమిటో..! అర్థమయ్యే సరికి ఈడు మీద పడింది. నాకు అమ్మాయినివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. బాగా ఆలోచించాను.

            నాపాపాలకు పరిహారంగా.. ఒకరికి జీవితాన్నివ్వాలనుకున్నాను. భర్త చనిపోయిన ఒక అభాగ్యురాలిని పెళ్ళి చేసుకున్నాను. భారతి పుట్టగానే నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయింది” అంటూ కంట నీరు పెట్టుకోసాగాడు పరుశురాం. భారతి పరుగుత్తుకుంటూ వచ్చి తండ్రి తలను తన హృదయానికి హత్తుకుంది మాతృమూర్తిలా.

            “చూడు అభిరాం.. ఇలాంటి ప్రేమను నూచుకునే నేనింకా బతికి ఉన్నాను. భారతి ఉన్నతి తప్ప నాకింకేమీ అవసరం లేదు. భారతి భవిష్యత్తును నీచేతుల్లో పెడ్తున్నాను” అంటూ వేడుకున్నాడు పరుశురాం.

            “పరుశురాం.. భారతి చదువు ఆగదు. పైచదువులూ చదివిస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు.. ఆమె ధైర్యసాహాసాలు ఈరోజు ఉదయం నా కళ్ళారా  చూశాను. మన దేశం గర్వించేలా తీర్చి దిద్దుతాను. ఒకప్పుడు నువ్వు కుస్తీ పోటీల్లో చాంపియన్ కావాలని కలలుగన్నావు. నీ కలలను భారతి ద్వారా సఫలీకృతం చేసుకోబోతావు. ఖర్చులన్నీ నేను భరిస్తాను” అంటూ అభిరాం భరోసా ఇచ్చాడు.

            అభిరాం శిక్షణలో ఆరు మాసాల్లోనే ఊహించని రీతిలో రాటు దేలింది భారతి.

మొదటి సారిగా అభిరాం ఆశీర్వాదబలంతో.. బాక్సింగ్  మండలస్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది భారతి.  ఆనాటి సభలో ఆమె ఆశయాలను వివరించాడు అభిరాం. గ్రామ సర్పంచులంతా కూడబలుక్కోని ఆర్థిక సాయం అంద జేశారు.

            అలా అంచెలంచెలుగా ఎదిగిన భారతి జాతీయస్థాయి పోటీలలో పాల్గొంది. మొదటి సారిగా ఓడిపోయింది.

అప్పుడు పరిచయమయ్యాడు ఖాజా మక్సూద్ అలీఖాన్. అతను విదేశీయ కుస్తీపోటీల్లో పాల్గొన్న అనుభవముంది. తనకు భారతదేశమంటే ప్రాణమని పలికాడు. మనదేశ కీర్తి పతాకను ఎగరేయాలని ప్రోత్సాహ పర్చాడు. అభిరాం మధ్ధతు లభించింది. భారతికి రెట్టింపు ఉత్సాహం వచ్చింది. మానసిక స్థైర్యం ఇనుమడించింది.

            ఆ అతరువాత జరిగిన జాతీయ స్థాయి పోటీలో బంగారు పథకం సాధించి తండ్రికి కానుకగా సమర్పించింది భారతి.

పరుశురాం ఆనందడోలికల్లో మునిగిపోయాడు. అదే మంచి తరుణమని భారతి, ఖాజాలు తమ మనసులోని మాటను బయట పెట్టారు.

            ఖాజా విదేశీయుడు అనే భావం తప్ప అతనిలో ఏలోటునూ గమనించ లేదు పరుశురాం. అతని భావాన్ని గమనించిన  ఖాజా అత్యంత నేర్పుగా సమాధాన పరిచి భారతిని వివాహం చేసుకున్నాడు.

అల్లుడు కూడా మల్లయోధుడు కావడం పరుశురాం గర్వంగా అందరికీ చెప్పుకోసాగాడు. కాని కొద్ది రోజులకే వాస్తవం బయట పడింది. ఖాజా నిషిధ్ధ ప్రేరకాలు వాడాడని తేలడంతో అతన్ని  క్రీడా సమాఖ్య కుస్తీ పోటీలలో పాల్గొనకుండా నిషేధించింది. దీనితో మానసికంగా కృంగిపోతూ అసువులుబాసాడు పరుశురాం.

ఖాజా అలా దొరికి పోయే సరికి భారతికీ అతని మీద విశ్వాసం క్రమేణా సన్నగిల్ల సాగింది.

మన భారత ప్రధాని ‘తలాక్’ బిల్లును ప్రవేశ పెట్టినప్పటి నుండీ అతని ప్రవర్తనలో రసాయనిక మార్పులు గమనిస్తూ వస్తూంది.

            ఇంతలో భళ్ళున తలుపులు తెరుచుకున్న శబ్దానికి భారతి ఉలిక్కి పడి లేచింది.

            “చూడు భారతీ.. ఇందులో నువ్వు అంతగా బాధ పడాల్సిన పనేమీ లేదు. ఎవరి అభిప్రాయాలు వారివి. ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకో..” అంటూ భారతి ప్రక్కనే మంచంపై పడుకోబోయాడు ఖాజా. దిగ్గున లేచి నిలబడింది భారతి.

            “ఖాజా.. నువ్వు ముందుగా భారత దేశాన్ని, ఆతరువాత భారతిని ప్రేమించావు. మా దేశపు నిర్ణయాలకు బధ్ధుడవు కావాలి కాని మీదేశానికి  మధ్ధతు పలుకుతున్నావు. ఈపధ్ధతి మార్చుకోకుంటే మనం కలిసి జీవించడం అసాధ్యం” అంటూ ఉక్రోషంగా అంది.

ఆమె వివర్ణమైన ముఖాన్ని చూస్తూ..     

            “అయితే వెరీ సింపుల్.. నీ ఇష్టమే కానియ్యి. ‘తలాక్’ అని మూడు సార్లు చెప్పి మాదేశం వెళ్ళిపోతాను. అన్నాడు ఖాజా.

            “అంత సులభమనుకుంటున్నావా..? తలాక్ అనే పదం రద్దైనట్లు తెలియదా..?”

            “అది  మీదేశస్థులకు వర్తిస్తుంది. నాకు కాదు గదా..”

            “అలా అని తప్పించుకోవాలని చూడబోకు. నీ నిజస్వరూపమేమిటో  బయట పెడ్తాను.”

            “బెదిరిస్తున్నావా..? అది నీవల్ల కాదు” అంటూ ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ.. హాయిగా మంచంపై నడుంవాల్చాడు ఖాజా.

            “నాకు నాదేశమంటే ప్రాణం. నా దేశానికి ద్రోహం తలపెట్టే వాళ్ళను వదలను” అంటూ  భారతి విసురుగా మరో గదిలోకి వెళ్తుంటే.. ఒక నిర్లక్ష్యపు  నవ్వు ప్రదర్శించాడు ఖాజా. 

భారతి నిద్రకు స్వస్తి చెప్పి తన పనిలో తాను నిమగ్నమయ్యింది.

             

***

            తెల, తెల వారుతోంది..

            దబ, దబమనే చెవులు పగిలే  శబ్దాలకు.. భారతి మీద విసుక్కుంటూ లేచి తలుపు తెరిచాడు ఖాజా.

ఉన్నఫళంగా ఇద్దరు పోలీసులు ఖాజా మీద పడి ఒడిసి పట్టుకున్నారు. చేతులకు బేడీలు తగిలించారు. ఎదురుగా ఇనస్పెక్టర్ ఇబ్రహీంను చూసి నిర్ఘాంత పోయాడు ఖాజా.

            ఇన్నాళ్ళూ ఇబ్రహీంను బుట్టలో వేసుకున్నాననుకునే ఖాజా సంతోషం అరసెకన్లో ఆవిరై పోయింది.

            “చూడు ఖాజా నాబహెన్ (చెల్లెలు) భారతి మనఃస్తత్వం నీకింకా పూర్తిగా తెలియదు. ఆమెకు  ఒక బాక్సింగ్ తప్ప మరేదీ రాదనే అపోహ పడ్డావు. భారతి చదువులోనూ మేటి. కన్నతల్లి అవస్థ చూసి ఆసుయంత్ర వ్యవస్థను కనుగొన్న మల్లేశం ఆమెకు స్ఫూర్తి.

నేటి కాలానుగుణంగా సాంకేతిక నైపుణ్యాన్ని పుణికిపుచ్చుకోవడంలో ఆమెకామెయే సాటి.           నువ్వు డోపింగ్‌లో దొరికి పోయినప్పటి నుండి నీపై ఒక కన్నేసి ఉంచిందన్న వాస్తవం నీకు తెలియకుండా జాగ్రత్త పడింది.

            మీ వివాహమై ఒక సంవత్సరమైనా నిండకనుందే నీ నిజస్వరూపమేమిటో బయట పడింది” అన్నాడు ఇబ్రహీం.

            “నేను ఏనేరమూ చెయ్య లేదు. కేవలం భారతప్రధాని తీసుకునే నిర్ణయాలు తప్పని వాదించానంతే.. నాకు వాక్‌స్వాతంత్ర్యం లేదా.. ప్రతీ పౌరునికి తన అభిప్రాయాల్ను వ్యక్తపరిచే హక్కు వుంది. ఆ మాత్రానికే నన్ను అరెస్టు చేసే అధికారం నీకు లేదు” అంటూ మేకపోతు గంభీరపు వచనాలు పలికాడు  ఖాజా.

            “అయితే విను” అంటూ భారతి వైపు చూశాడు ఇబ్రహీం.

            భారతి తన చరవాణి తెరచి స్పీకర్ ఆన్ చేసింది.

            గత రాత్రి ఖాజా తన దేశపు సోదరులతో, భారత దేశం చేబడ్తున్న సంస్కరణలకు ఎలా గండి కొట్టాలో, కశ్మీరంలో ఎలా అల్లకల్లోలంరేపాలో.. పన్నిన పథకాలన్నీ వివరించడం.. విని నిర్ఘాంత పోయాడు ఖాజా.

            ఇదెలా సాధ్యమయ్యింది..! అన్నట్టుగా భారతి వంక చూశాడు ఇబ్రహీం.

            “ఖాజా నైపుణ్యంగా తన చరవాణి లోని మాటలు ఎవరూ పసిగట్టకుండా చేసుకున్నాడు. అయితే దాన్ని ఛేదించింది నా అనువర్తనం (APP)” అంది భారతి.

            అర్థం కాలేదన్నట్లుగా చూశాడు ఇబ్రహీం. భారతి తిరిగి చెప్పసాగింది.

            “ఆమధ్య మన ఉపరాష్ట్రపతి మనదేశం గురించి చక్కని వివరణ ఇచ్చారు. దేశంలో ఉన్నది ముస్లింలా, హిందువులా, క్రైస్తవులా కాదు.. ఒకే దేశం, ఒకే శాసనం, ఒకే చట్టం, ఒకేన్యాయం, ఒకే దేశం – ఒకే ప్రజ. ఒకే ఝండా.. అదే మన ఎజెండా.

            దానిని స్ఫూర్తిగా తీసుకున్నాను. కొందరు అస్మదీయులు, తస్మదీయులు  మనదేశానికి ద్రోహం తలబెట్టే వారు లేకపోలేదు. అయితే వారిని ఎలా పట్టుకోవాలా అని ఆలోచించాను మధ్య, మధ్యలో నా బి. టెక్ క్లాస్ మేట్స్  సలహాలు తీసుకుంటూ చివరికి ఒక అనువర్తనం కనుగొన్నాను. దానిని మనం అనుమానితుల చరవాణికి అనుసంధానం చేసుకోవచ్చు. అది చాలా శక్తివంతమైనది. తద్వారా నేను దేశద్రోహుల ఆటకట్టిస్తాను. ఎలా అన్నది అత్యంత రహస్యం” అంటూ ఖాజావైపు తిరిగి “చూడు ఖాజా.. నాకు  కండబలం, గుండెబలమే కాదు బుధ్ధిబలం గూడా ఉంది” అంటూ వెటకరిస్తూ..  కళ్ళెగరేసింది భారతి.  

“భారతీ బహెన్.. యు ఆర్ గ్రేట్ “ అంటూ ఒక కడక్ పోలీసు సలాం చేశాడు ఇబ్రహీం.*