నాగార్జున సాగర్ ప్రాజక్ట్ నిర్మాణ సారధి - ambadipudi syamasundar rao

నాగార్జున సాగర్ ప్రాజక్ట్ నిర్మాణ సారధి

ఇంతకు మునుపు వ్యాసములో గోదావరి డెల్టాను సశ్య శ్యామలము చేసిన ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణములో ప్రముఖపాత్ర వహించిన ఇంజనీర్ వీణం వీరన్నగారి గురించి తెలుసుకున్నాము ఇప్పుడు స్వాతంత్త్రము తరువాత కట్టిన బహుళార్ధక సార్ధక ప్రాజెక్టులలో ముఖ్యమైనది కృష్ణా నది మీద నిర్మించిన నాగార్జున సాగర్ నిర్మాణానికి కృషిచేసిన ముక్త్యాల రాజా గారి గురించి తెలుసుకుందాము .అయన వంశ పారంపర్యముగా వచ్చిన రాచరికం తో తృప్తి చెందకుండా ఒక శాశ్వతమైన గుర్తింపు ఉండేలా ఒక మంచి పని చేయాలని తాపత్ర పడ్డాడు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గుంటూరు కృష్ణ నల్గొండ ఖమ్మంకు జిల్లాలకు ముఖ్యమైన నీటి వనరు నాగార్జున సాగర్ కు ఉన్న రెండు (కుడి ఎడమ)  కాలువలు , కుడి కాలువ ఆంధ్ర ప్రాంతములోని గుంటూరు కృష్ణ జిల్లాలను ఎడమ కాలువ తెలంగాణా ప్రాంతములోని ఖమ్మంకు నల్గొండ జిల్లాలను సస్య శ్యామలము చేసినాయి
వరి పండని మెట్టప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్ వలన నీటి వసతి కలగటం వలన వరి లాంటి పంటలు పండటం, అలాగే విద్యుత్ ఉత్పాదనము పెరగటం వంటి సదుపాయాలు కలిగినాయి ఇంత  ఉపయోగకరమైన బహుళార్ధక ప్రాజెక్ట్ కు సంబంధించిన అనుమతులు నిధుల సమీకరణము మొదలైన ముఖ్యాంశాలు విషయములో విశేషమైన కృషి సల్పిన వ్యక్తి ఇంజనీర్ కాదు రాజకీయ వేత్తకాదు ఒక జమీందారు
ముక్త్యాల రాజా గారి పూర్తి పేరు  వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ వీరు జగ్గయ్య పేట వద్ద గల ముక్త్యాల సంస్థానానికి జమీందారు ఆంధ్రదేశంలో పేరు ప్రతిష్ఠలు గల వాసిరెడ్డి వంశానికి చెందిన వాడు వీరి వంశములో పూర్వికులు తెలుగునాట ప్రముఖ దేవాలయాల నిర్మాణములో ముఖ్య పాత్ర వహించేవారు వీరి వంశములోని పూర్వీకుడు అమరావతి జమీందారు అయినా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అమరావతి మంగళగిరి దేవాలయాల నిర్మాణములో ప్రధాన పాత్ర నిర్వహించారు ,ముక్త్యాల రాజాగారిని  ప్రాజెక్టుల ప్రసాద్ అని కూడా పిలిచేవారు ప్రజలకు పదికాలాలపాటు ఉపయోగే పడేది చేయాలన్న తలంపు తో  ఆంధ్రప్రదేశ్ కు తలమానికమగు నాగార్జున సాగర్ డాం నిర్మాణానికి ప్రసాద్ అహర్నిశలూ శ్రమించారు.నాగార్జున సాగర్ వద్ద కృష్ణా నదిపై ఆనకట్ట కట్టి  ప్రాజెక్ట్ బహుళార్ధ సాధకముగా ఉపయోగపడి కరువు దూరము అయి ప్రజలు ఆర్ధికముగా అభివృద్ధి చెందుతారన్న ఉద్దేశ్యముతో ఈ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు.   మొదట ఈయన  కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్తు నిర్మాణానికి కృషిచేసాడు. ఈ ప్రాజెక్టు పూర్తికాబడి ఉపయోగంలో ఉంది. మనము ఉమ్మడి మద్రాసు రాష్ట్రం లో ఉండగా కృష్ణానది నీటిని తమిళ దేశానికి తీసుకుపోవుటకు తమిళులు సన్నాహాలు చేయుట మొదలుపెట్టారు. అందులో భాగముగా తొలుత కృష్ణా పెన్నా నదులను సంధనము చేయుటకు ప్రయత్నాలు మొదలుపెట్టారు  ఇది తెలుసుకున్న  మహేశ్వర ప్రసాద్ ఆంధ్ర ప్రాంతంలోని తొమ్మిది జిల్లాలలో ప్రతి వూరు తిరిగి నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి విన్నపాలను కేంద్ర  ప్రభుత్వానికి పంపారు.
మాచర్ల నుండి దట్టమయిన అడవుల గుండా నందికొండ వరకు వెళ్ళి డాం నకు అనువైన స్థలం చూశాడు. సొంత డబ్బుతో రిటైరయిన ఇంజినీర్లను ఒక టీంగా తయారు చేసి వారిచే ప్రాజెక్టుకు కావల్సిన ప్లానులు, డిజైనులు చేయించాడు కానీ మద్రాసు ప్రభుత్వం వారి ప్రయత్నాలకు అన్నివిధములా అడ్డు పడింది. రాజా గారు కృష్ణా రైతుల వికాస సంఘం స్థాపించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాడు.అప్పుడు  ప్రభుత్వం ఖోస్లా కమిటీ ఏర్పాటు చేసింది. కానీ కమిటీ సభ్యులు నందికొండకు అడవుల గుండా  కార్లు జీపులలో వెళ్ళటానికి అనువైన దారి లేదనే సాకుతో విషయంను దాటవేయుటకు ప్రయత్నించారు. ఇది గుర్తించిన రాజా గారు, దీని వెనుక ఎవరున్నారో అర్ధము చేసుకొని,వారు వేలరూపాయల సొంత ధనాన్ని ఖర్చు పెట్టి  ఇరవైఇదు గ్రామాలనుండి ప్రజలను, స్వయంసేవకులను సమీకరించి వారం రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి కార్లు వెళ్ళుటకు వీలగు దారి ఏర్పాటు చేయించాడు.ఖోస్లా కమిటీ నందికొండ డాం ప్రదేశం చూసి ప్రాజెక్టు కట్టుటకు ఇంతకన్న మంచి చోటు వుండదని తేల్చారు ఢిల్లీ వెళ్లి ఆనాటి ప్రధాని నెహ్రు పటేల్ వంటి పెద్దలను కలిసి ప్రాజెక్ట్ ఆవశ్యకతను వివరించి,.ఆనకట్టలు ఆధునిక దేవాలయాలుగా భావించి  ప్రభుత్వానికి నివేదించి నాగార్జున సాగర్ నిర్మాణము పై పాలకుల దృష్టి పడేటట్లు కృషి చేశారు.
ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టుటకు ఢిల్లీలో ప్రయత్నాలు మొదలైనవి.మహేశ్వర ప్రసాద్ ఢిల్లే వెళ్ళి ప్రొఫెసర్ ఎన్.జి.రంగా, మోటూరు హనుమంతరావు, కొత్త రఘురామయ్య మొదలగు పార్లమెంటు సభ్యులను కలిసి, రిపోర్టును వెలికితీయించి దాని ప్రతులను అందరికి పంచిపెట్టి, ప్లానింగ్ కమిషను సభ్యులందరిని ఒప్పించి సుముఖులు చేశాడు.అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నరు చందూలాల్ త్రివేది ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను ఖోస్లా కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశాడు. చివరకు 1954 లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 1955 డిసెంబరు 10వ తేదీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. నిర్మాణ సమయంలో మహేశ్వర ప్రసాద్ యాభైరెండు లక్షల రూపాయిలు మాచింగ్ గ్రాంటుగా ఇచ్చాడు. 1966 ఆగస్టు 3న డాం నిర్మాణము పూర్తి అయి ప్రధాని జవహర్ లాల్ చే ప్రారంభోత్సవం జరిగి నీరు వదిలారు.నెహ్రు డ్యామ్ ను ఆధునిక దేవాలయముగా అభివర్ణించాడు.
నాగార్జునసాగర్ డాం ముక్త్యాల రాజా కార్యదక్షతకు, దేశ సేవా తత్పరతకు, నిస్వార్ధ సేవా నిరతికి గొప్ప ఉదాహరణ. ముఖ్యంగా సాగర్ ఆయకట్టు రైతులకు మహేశ్వర ప్రసాద్ ఎల్లవేళలా  స్మరణీయులు.కాని రాజావారి సేవలను తర్వాతి తరం వారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గుర్తించలేదు, సరిగదా పూర్తిగా మరచారు.ఆ ఒక్క వ్యక్తి అవిశ్రాంత అవిరళ కృషే గనుక లేకపోతె నాగార్జున సాగర్ డ్యామ్ మొదలు అయేదికాదు పూర్తి అయ్యేది  కాదు ఆ విధముగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణకి మూలము ముక్త్యాల రాజా గారు వీరు 1972 లో స్వర్గసులు అయినారు ప్రస్తుతము మనము తినే ప్రతి మెతుకులో ,త్రాగే నీటి బొట్టులో ఆయనను స్మరించుకోవాలి  రాజా మహేశ్వర ప్రసాదుకు ఇందిరా దేవి అను కుమార్తె ఉంది. ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త, పూర్వ ఐ.సి.యస్ ఉద్యోగి వెలగపూడి రామకృష్ణ కుమారుడు దత్తును పెండ్లాడారు.
అంబడిపూడి శ్యామసుందర రావు

మరిన్ని వ్యాసాలు

కొమర్రాజు లక్ష్మణ రావు.
కొమర్రాజు లక్ష్మణ రావు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
అమృతానికి మారుపేరు అమ్మ.
అమృతానికి మారుపేరు అమ్మ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
అశ్రద్ద కు..ఆనవాళ్ళు..!!(దంతవైద్య విజ్ఞాన వ్యాసం)
అశ్రద్ద కు..ఆనవాళ్ళు..!!
- డాక్టర్. కె.ఎల్. వి.ప్రసాద్
టంగుటూరి ప్రకాశం పంతులు .
టంగుటూరి ప్రకాశం పంతులు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
అభ్యుదయవాది దామోదరం సంజీవయ్య.
అభ్యుదయవాది దామోదరం సంజీవయ్య.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
అట్టమీది బొమ్మ కథ
అట్టమీది బొమ్మ కథ
- డాక్టర్ కె.ఎల్ వి ప్రసాద్