శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

swami vivekananda

1893 ఫిబ్రవరి 10-15 తేదీలలో వివేకానంద స్వామి హైదరాబాద్‌లో పర్యటించి ప్రప్రథమంగా మెహబూబ్ కళాశాలలో ఉపన్యసించడం మనకెంతో ఆనందదాయకం. ఆ పరివ్రాజక జీవితంలో దక్షిణ దేశ సందర్శనం మరపురాని మలుపు. కన్యాకుమారి అగ్రం వద్ద మూడు సాగరాలు సంగమించే చోట ఆ దేవికి ప్రణమిల్లి ఈదుకుంటూ ఒక శిలను చేరి, దాని మీద ఆసీనుడై ధ్యాముద్రలో మునిగి, తన జీవితాన్ని మాతృదేశ సేవకు అంకితం చేయవలెనని, తన జాతిని ఉద్ధరించవలెనని ప్రతిజ్ఞ చేసారు.

‘‘ఒక వ్యక్తి తనను తాను ఎలా భావిస్తాడో అదే అవుతాడు.
తాను బలహీనుడినని భావిస్తే బలహీనుడే అవుతాడు,
బలవంతుడిని అని భావిస్తే బలవంతుడే అవుతాడు,
కార్యసాధన యత్నంలో ఎదురయ్యే ఆటంకాలను, పొరపాట్లను లక్ష్యపెట్టకూడదు. ఓటమిని లెక్క చేయకూడదు. తిరోగమనాలనూ సహించాలి.
లక్ష్యసాధన కోసం వెయ్యి ప్రయత్నాలైనా చేయాల్సిందే.
అప్పటికీ ఫలించకపోతే మరో ప్రయత్నానికి సిద్ధం కావాలి’’

"నీ శక్తే నీ జీవితం... నీ బలహీనతే నీ మరణం..."

ఇటువంటి ఎన్నో అమూల్యమైన జీవిత సత్యాలను ప్రపంచానికి చాటిచెప్పిన మహామనిషి స్వామి వివేకానంద.

స్వామిఅఖండానంద, వివేకానంద స్వామిని గురించి ఇలా వ్యాక్యానించారు . "వివేకానందుడికి భారత దేశం పట్ల గల ప్రేమ అసమాన్యమైనది. అది దేశ భక్తి కాదు. అది 'దేశాత్మబోధం'. అంటే దేశాన్ని తానుగా భావించుకోవడం". దేశ ప్రజల సుఖం-దుఖం, వారి గతం, భవిష్యత్తు, ప్రస్తుత కాలం గురించి మాత్రమే అతడు ఆలోచించాడు. 'మాతృదేశమంటే వివేకానందుడు ఉప్పొంగి పోతాడు. అతడి మమతకు అవధులుండవు. మద్రాసులోని శిష్యుల అభినందన సందేశానికి అతడు అమెరికా నుంచి వ్రాసిన సమాధానంలో భక్త్యావేశం తారస్థాయినందుకుంది. 'భారత దేశం అంతరిస్తుందా? ప్రపంచం నుంచి ఆధ్యాత్మికత నశిస్తుంది. ఆదర్శశీలత్వం నశిస్తుంది. స్త్రీ పురుష కామోద్రేకంతో - భోగలాలస పరిణయమాడుతుంది. ధన శక్తి పౌరోహిత్యం వహిస్తుంది. పశుబలం, మోసం, వైవాహిక కర్మకాండలవుతాయి. మానవతయే హోమద్రవ్యమవుతుంది. అది ఎన్నటికీ జరుగదు-జరుగదు-జరుగదు'

అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ మొదలైన దేశాలలో నాలుగు సంవత్సరాలు పర్యటించి, మన వైదిక వాజ్ఞ్మయం పట్ల అపార శక్తి శ్రద్ధలను పాశ్చాత్యులలో కలుగ చేశాడు. అతడు హైందవ ఝంఝామారుతంగ, వేదాంత శిరోభూషణంగ, ఈశ్వర ప్రేరిత మహా వక్తగ, నభూతో నభవిష్యతి అన్నట్లు ప్రపంచ ప్రశంసలందుకున్నాడు. అతడి ఖండాంతర పర్యటన ఒక మహా జైత్రయాత్ర. ప్రపంచంలోని మూడు ఖండాలలో విస్తృతంగా పర్యటించిన ప్రప్రథమ భారతీయ విశ్వ పౌరుడు వివేకానంద స్వామి.

స్వామి వివేకానంద ఎంత గొప్ప వక్త అయినా అప్పుడప్పుడూ ఆయన ఉపన్యాసం మధ్యలో ఆయన్ను చులకన చేసేవాళ్ళూ ఉండే వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఆయన సరైన రీతిలో జవాబిచ్చేవారు స్వామి. అలాంటి సంఘటనలు కొన్ని…

ఓ సారి ఇంగ్లండ్ లో ఉపన్యసిస్తూ ఇలా చెబుతున్నాడు “కొన్ని వేల సంవత్సరాల పూర్వం నుంచే అద్భుతమైన నాగరికతతో విలసిల్లిన భారతదేశంలాగ  కాకుండా, ఈ ప్రాంతం ఒకప్పుడు మొత్తం అడవులతో నిండి ఉండేది”. అసలే ఆంగ్లేయులకు తమకే అన్నీ తెలుసన్న అహంకారం ఎక్కువ. ఇక ఇలా చెబుతుండగా శ్రోతల్లో ఉన్న "ఇంగర్ సోల్ " అనే రచయితకు చిర్రెత్తుకొచ్చింది. అతను వెంటనే ఒక కాగితం పై “I will kill you” అని రాసి స్వామి మీదకు విసిరేశాడు. స్వామి దాన్ని తీసి బిగ్గరగా చదివి అందరికీ వినిపించి “చూశారా! ఇప్పుడే మీ అనాగకరికత్వానికి ఇంకో ఋజువు దొరికింది” అన్నారు.

మరో సమావేశంలో ఎవరో భగవద్గీత పుస్తకంపై మరేవో మత గ్రంథాలు పేర్చి స్వామి దగ్గరకు వచ్చి "చూశారా ఇదీ భగవద్గీత స్థాయి” అన్నారు. స్వామి భగవద్గీత పుస్తకాన్ని ఒక్కసారిగా పక్కకు లాగడంతో మిగతా పుస్తకాలన్నీ కిందపడిపోయాయి. అప్పుడు స్వామి “చూశారా అన్నింటికీ ఇదే ఆధారం” అన్నారు.

ఇంకో సమావేశంలో వివేకానంద మాట్లాడుతుండగా ఎవరో ఒక కాగితం పై “FOOL” అని రాసి ఆయన చేతికిచ్చారు. స్వామీజీ దాన్ని చూసి నెమ్మదిగా నవ్వుకుని అందరితో “మామూలుగా మనం ఏదైనా లేఖ రాసి చివర్న సంతకం పెట్టడం మరిచిపోతుంటాం. కానీ ఇక్కడ చూడండి. సంతకం పెట్టి లేఖ రాయడం మరిచిపోయాడు పాపం” అన్నారు.

వివేకానంద స్వామి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు