లాజిక్ కు అందినదల్లా మంచిదే - విఎస్ఎన్. మూర్తి

laajik ku andinadalla manchide

శాస్త్ర వ్యతిరేకమైన విషయాలు చెబితే జనాలకు అంతగా రుచించవు. ఎందుకంటే తరతరాలుగా పేరుకున్న భావాలు అటువంటివి. కానీ నా ఉద్దేశం కేవలం శాస్త్రాలను వ్యతిరేకించడం కాదు, వీలయినన్ని విషయాలను లాజికల్ గా ఆలోచించాలన్నదే. ఇదంతా ఎందుకంటే, ఇంట్లో వున్న అవకాశం మేరకు దేవుడి మందిరం వుండొచ్చని రాస్తే జనం స్పందన చాలా తక్కువగానే వుంది. కారణం ఈశాన్యంలోనే దేవుడి మందిరం వుండాలన్న అభిప్రాయం పాతుకుపోయి వుండడమే. కొంతమంది మాత్రం ఫోన్ లో కాస్త వాదించడానికి ప్రయత్నించారు. అయితే నేనన్న ‘దిక్కు కన్నా దిక్కయినవాడు ముఖ్యం’ అన్న పాయింట్ తో మాత్రం చాలా మంది ఏకీభవించారు.  అసలు బేసిక్ గా వాస్తును జీవన విధానానికి అనువుగా కూడా ఆలోచించాలి. తూర్పు దిక్కు అంత ప్రాముఖ్యత సంతరించకోవడానికి ఇది ప్రధాన కారణం. తూర్పు దిక్కు ఇళ్లలో లొపలికి వస్తూనే ఎక్కు వ దూరం వెళ్లకుండానే వంటగది, పూజగది, భోజనాలు వంటి వ్యవహారాలు కంటపడతాయి. అంటే ఇంట్లో వుండే ఇల్లాలు సదా వుండే ప్రదేశాలు అవి. ఇంటి తలుపు ఎవరయినా కొట్టినా వెంటనే వినిపించేంత దూరంలో వుండేవి. రోజూ కేవలం రాత్రి పూట వాడే బెడ్ రూమ్ మాత్రం కాస్త దూరంగా, వెనగ్గా నైరుతి మూల వుంటుంది. అంటే నిత్యం ఇంట్లో వుండే ఆడవారి సౌకర్యాలకు అనుగుణంగా వుంటుంది తూర్పు దిశ ఇల్లు.  పైగా కావాల్సినంత సూర్యరశ్మి, దాదాపు ఏడాదిలో తొమ్మిది నెలలు గాలి వాటం వుండదు కాబట్టి వంటకు ఇబ్బంది వుండదు. నైరుతిలో నీళ్ల టాంక్ కూడా లాజిక్ కు అందేదే. నైరుతి గదిలో వుండే పడక గది పైకప్పు సదా హాయిగా చల్లగా  వుంటుంది.

ఇలాంటి లాజికల్ వాటిని పాటిస్తూ ముందుకు సాగడం వల్ల ఇబ్బందులేమీ లేదు. కానీ ఇబ్బంది అయినా కూడా లాజికల్ కాని వాటిని పట్టుకు వేలాడ్డమే సరికాదని చెప్పేది. మొన్న ఎవరో అన్నారు... బ్రాహ్మణులు కచ్చితంగా పరిషం పట్టాలి (కంచం చుట్టూ చేయి తిప్పి, నీళ్లు చిలకరించే వ్యవహారం). సదాచారాలు పాటించాల్సిందే. కానీ అలవి కాని చోట, వీలు కాని వేళ తప్పదు, అత్యవసరం అంటే ఎలా సాధ్యం? అసలు పరిషం పట్టే వ్యవహారం ఎందుకు వచ్చింది. అలికిన నేలపై కూర్చుని తినేటపుడు సూక్ష్మ జీవులు విస్తరిలోకి పాకకుండా వుండేదుకు. అలాగే వీలయితే పక్కనో మద్ద,.. వాటికి కాస్త ఆహారంగా. ఇప్పుడు అలికిన నేలలు లేవు, విస్తర్ల భోజనాలూ అరుదు. పాటించగలిగిన వేళ, కుదిరే చోట ఫరవాలేదు. కుదరని చోట సర్దుకోవాలి. వాస్తు అయినా, ఆచారం అయినా. కుంకుమ, తిలకంగా, తిలకం స్టిక్కరుగా మారలా? మనకు ఇష్టమైనవి మార్చుకుని, ఇష్టం కానివి సంప్రదాయాలు అంటూ వుంటే ఏలా?

ఇప్పటికీ శ్రీమన్ మహారాజ రాజశ్రీ అని ఉత్తరాలు రాస్తున్నామా? ఎస్ఎమ్ఎస్ లు, ఫేస్ బుక్ మెసేజ్ లు, చాటింగ్ లకు అలవాటు పడలా? కాలం తెస్తున్న మంచిని స్వీకరించాలి. కాలం చెల్లిన లాజిక్ లేని వ్యవహారాలు విసర్జించాలి. చిత్రమేమిటంటే వయసు అయిపోయిన పెద్దవాళ్లు, కాళ్ల నొప్పులతో వెస్ట్రన్ టాయిలెట్లు  కోరుకుంటారు. కానీ వెస్ట్రన్ కల్చర్ మంచి చెడ్డలు గమనించకుండానే కాదు పోమ్మంటారు. తాగితందానాలు ఆడడం, పెద్దలు అంటే గౌరవం లేని వెస్ట్రన్ కల్చర్ ని ద్వేషించవచ్చు. కానీ నలుగురితో కలివిడిగా వుండడం, లోపల ఒకటి పైన ఒకటి దాచుకోకుండా వుండగలగడం వాళ్లని చూసి నేర్చుకోవచ్చు. మొన్నటికి మొన్న నేను ఓ స్టార్ హోటల్ లో రెండు మూడు రోజులున్నాను. అక్కడ దిగేవారిలో విదేశీయులు ఎక్కువ. వాళ్లు నన్ను చూసి, పలకరింపుగా నవ్వడం చూసి ఆనందం వేసింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చెప్పింది ఇదే కదా అని గుర్తుకు వచ్చింది. ఎదుటి మనిషిని చూసి పలకరింపుగా నవ్వినంత మాత్రాన పోయేదేమీ లేదుగా.. ఇప్పుడు పద్దతి చాలా వరకు మారింది, కారణం వీలయినంత ఎక్కవ మంది ఎసి తరగతుల్లో ప్రయాణం చేయడం వల్ల. కానీ గతంలో ఎసి లో ప్రయాణం అంటే పరమ బోర్ గా వుండేది. కారణం, ఎవరూ ఎవరితోనూ పలకరింపులు సైతం లేకుండా మూతులు బిగించుకు కూర్చోవడం వల్ల. ఇప్పుడు ఫ్లయిట్ ప్రయాణాలు ఇలాగే వుంటున్నాయి. అందువల్లే రైలులో నాలుగు గంటలు జర్నీ చేయగలం కానీ ఫ్లయిట్ లో గంటయినా కష్టంగా వుంటుంది. సరే, ఈ సంగతులు వెనక్కు నెట్టి మళ్లీ వాస్తు దగ్గరకు వస్తే, చాలా విషయాలు లాజిక్ కు అందుతాయి. అందువల్ల వాటిని పాటించడంలో ఇబ్బంది లేనే లేదు. ఇంటి ఆవరణను దాటి మేడ మెట్లు వుండకూడదన్నది కూడా మంచి విషయమే. అందులో రక్షణ విషయం దాగి వున్నట్లు అనిపిస్తుంది. అసలు ఈశాన్యంలో బరువు అన్నది కూడా ఇలా రక్షణకు సంబందించే అని నా అనుమానం. ఎందుకంటే ఇంట్లో ఆ కాలంలో బరువైనవి ఏమిటి? ఇనుప పెట్టి తప్ప, కింద తింటూ కింద పడుకోవడమే కదా. మరి ఇనుప పెట్టిని నైరుతిలో వుంచమనిని చెప్పింది ఎందుకు? తూర్పు వాకిలి ఇంటికి నైరుతి బాగా లోపలికి వుంటుంది కాబట్టి. అంటే రక్షణ కాస్త ఎక్కువ వుంటుంది కనుక.

ఏటికి ఎదురీదమన్నానని, అందరూ ఎడదెడ్డం, అంటే నేను పెడదెడ్డం అనమంటున్నానని అనుకోకండి. కాస్త లాజికల్ గా ఆలోచించి, ఆచార వ్యవహారాలు పాటించి జీవితం సుఖమయం చేసుకోండి... అదే నా మాట.

విఎస్ఎన్ మూర్తి

మరిన్ని వ్యాసాలు

Cine srungaram
సినీ శృంగారం
- మద్దూరి నరసింహమూర్తి
Heaven On Earth - Kashmir
భూలోక స్వర్గం కాశ్మీర్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
రెండవ ప్రపంచ యుద్ధం-రహస్యాలు/విశేషాలు 6
రెండవ ప్రపంచ యుద్ధం - 6
- శ్యామకుమార్ చాగల్
పెళ్ళి పదికాలాలూ నిలవాలంటే పాత ప్రేమికులను వదులుకోవాల
పెళ్ళి పదికాలాలూ నిలవాలంటే...
- సదాశివుని లక్ష్మణరావు
ప్రభల సంస్కృతి .
ప్రభల సంస్కృతి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బుడబుక్కలవారు.
బుడబుక్కలవారు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
పూరి జగన్నాధ రథ యాత్ర .
పూరి జగన్నాధ రథ యాత్ర .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
వీధి నాటకం .
వీధి నాటకం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.