మాస్క్ బాంబులు - చంద్ర శేఖర్ కోవూరు

మాస్క్ బాంబులు

కరోనా వైరస్ వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. మొదట్లో డాక్టర్లు సూచించిన విధంగా మాస్కులు వాడటం జరిగింది. కానీ ఇప్పుడు వైరస్ కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో మాస్కులు వాడే విధానంలో చాలా అశ్రద్ధ అనేది కనబడుతుంది. ఇప్పుడు చాలా మంది మాస్కులు వాడే విధానం ఎలా ఉంది అంటే, దాని కంటే మాస్కులు వాడకపోవటమే ఉత్తమమేమో అన్నట్లుగా అనిపిస్తుంది. మాస్కులని పట్టు వస్త్రాలుగా భావించి, ఎలా అంటే అలా వాడేస్తున్నారు.

మాస్కులు థరించినపుడు, ముందు వైపు అదేపనిగా చేతులతో తాకడం, జరపడం, అదే చేతులు సానిటైజ్ చేసుకోకుండా ఇతరులని తాకడం లేదా అదే చేత్తో తినడం లాంటి ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. కొంత మంది అయితే ఆ మాస్కులు తీసి ఎక్కడ అంటే అక్కడ పెట్టడం లేదా జేబులో పెట్టుకోవడం, తీసి మాస్క్ ని చేత్తో తుడుచుకొని ధరించడం, వారాల తరబడి ఒకే మాస్కును ఉతక్కుండా వాడటం లాంటివి చేస్తున్నారు. కొంతమంది అయితే మాస్కులు ధరించి ఇతరులను లేదా చిన్న పిల్లలను ముద్దు పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. అది ఎంత ప్రమాదకరమో ఊహించడం లేదు.

ఇక యూజ్ అండ్ త్రో మాస్కులు అయితే డాక్టర్లు సలహా ప్రకారం ఒక మాస్కు పన్నెండు గంటలుకు మించి వాడరాదు. కానీ వాటిని కూడా రెండు మూడు రోజులు వాడేస్తున్నారు. అది చాలా ప్రమాదకరం. ఇళ్లల్లో మాస్కులు ఎక్కడ పడితే అక్కడ ఉంచడం మంచిది కాదు. డాక్టర్లు ఎన్నో రకాలుగా హెచ్చరించినా, సోషల్ మీడియాలో ఎన్నో మెసేజులు వచ్చినా కూడా, ఇలా అశ్రద్ధగా ఉండటం ముమ్మాటకి నిర్లక్ష్యం అనే చెప్పాలి. జనసమూహంలో మాస్కులు తీస్తున్నారు, ఒంటరిగా ఉన్నప్పుడు ధరిస్తున్నారు. చాలా ప్రదేశాల్లో "నో మాస్క్ నో ఎంట్రీ" అనే బోర్డులు మాత్రమే ఉంటున్నాయి, కానీ, లోపలికి వున్న వాళ్ళకు, వెళ్ళేవాళ్ళకు మాస్కులు ఉండటం లేదు. కొంత మంది అయితే మాస్కులను టిస్యూ పేపర్ లాగానో కర్చీఫ్ లాగానో వాడేస్తున్నారు. ఇవన్నీ తెలియక చేస్తున్నారని అనుకుంటే పొరపాటే, తెలిసి కేవలం నిర్లక్ష్యము వలన చేయడమే.

మాస్కులు ధరించేవారు ఖచ్చితంగా పాటించ వలసిన నియమాలు.
1) ప్రతి రోజూ ఉతికిన లేదా ఫ్రెష్ మాస్కునే వాడాలి.
2) యూజ్ అండ్ త్రో మాస్కులు 12 గంటలకు మించి వాడరాదు.
3) వాడిన యూజ్ అండ్ త్రో మాస్కులు డస్ట్ బిన్ లో మాత్రమే వేయాలి. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వేయరాదు.
4) క్లోత్ మాస్కులు మూడు నెలలకు మించి వాడకపోవడమే మంచిది.
5) ఏ రోజు మాస్కులు ఆ రోజు సాయంత్రం వేడి నీటిలో నానబెట్టి ఉతక వలెను. ఎవరి మాస్కులు వారే ఉతుక్కోవడం మరీ మంచిది. మాస్కులు నానబెట్టిన బకెట్ లు కానీ మగ్గులు కానీ వేరే వాటికి వాడరాదు. ఒకవేళ వాడాల్సి వస్తే సానిటైజ్ చేసి వాడవలెను.
6) మాస్కులు పట్టుకున్నపుడు సానిటైజ్ చేసుకోవాలి లేదా సబ్బు తో కడుక్కోవలెను.
7) వాడిన మాస్కులని ఎక్కడ పడితే అక్కడ వేలాడ తీయకుండా, ప్రత్యేక ప్రదేశాల్లోనే మాస్కులు ఉంచవలెను.
8) ఒకరి మాస్కులు వేరొకరు తాకకపోవడమే మంచిది.
9) మాస్కుకి ఒక వైపే వాడాలి. రెండు వైపులా వాడరాదు.
10) మాస్కు తీశాక చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.

మితి మీరిన ఆహారం మరియు నీటి వల్ల ఎంత ప్రమాదం ఉందో, మాస్కులు సరిగ్గా వాడక పోయినా అంతే ప్రమాదం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మాస్క్ మన చేతుల్లో ఉన్న బాంబు లాంటిది. జాగ్రత్తగా పట్టుకుంటే ఏమీ కాదు, ఏ మాత్రం కదిలినా, వదిలేసినా పేలిపోతుంది. అంటే అంత అలెర్ట్ గా ఉండాలని చిన్న సూచన. మాస్కులు జాగ్రత్తగా వాడకుంటే వాటి వల్లే వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. . .