మానవ నాగరికత లో నిప్పు పాత్ర - Pillaa kumaraswaamy

మానవ నాగరికత లో నిప్పు పాత్ర భూమి ఏర్పడిన తర్వాత భూమిపై అనేక జీవరాసులు పరిణామక్రమంలో ఏర్పడ్డాయి .ఒక దశలో అత్యధిక హిమపాతం కలిగిన భూమిని అంతరిక్షం నుంచి వచ్చిన ఆస్టరాయిడ్ శకలాలు తగలడం వల్ల అనేక వృక్షాలు జంతువులు మరణించాయి. ఆ సందర్భంలో భూమి పైన అనేక గడ్డి మైదానాలు ఏర్పడ్డాయి. ఉత్తరకెన్యా, ఈశాన్య ఇథియోపియాలో లేక్ రుడాల్ఫ్ గడ్డి మైదానాలలో మానవ పరిణామ క్రమం ప్రారంభమైందనిఅందరూ అంగీకరిస్తున్నారు. అప్పుడు కొన్ని వేల సంవత్సరాలుగా నడిచే వానరాలు చెట్ల మీద నుంచి భూమి మీదికి ఆహార సేకరణ కోసం చాలా దూరం గడ్డి మైదానాల పై నడుస్తూ వెళ్లాల్సి వచ్చేది. ఆ క్రమంలో లో వానరాలు నిలబడటం అలవాటు చేసుకున్నాయి. వెనుక కాళ్ళు మొత్తం శరీరాన్ని మోయగల శక్తిని సంపాదించుకున్నాయి. కాలి వేళ్ళు భూమిని పట్టుకునేందుకు అనువుగా పాదం వెడల్పుగా తయారైంది. అప్పుడు ముందు కాళ్ళు స్వేచ్ఛను పొందాయి. కాలక్రమంలో అవి మనిషి చేతులు గా రూపాంతరం చెందాయి. చెట్లు ఎగబాకే టప్పుడు, పళ్ళు ,కాయలు దుంపలు ఏరుకొనేటప్పుడు, రాళ్లను ఉపయోగించేటప్పుడు జరిగిన శ్రమవల్ల చెయ్యి నిర్మాణం అభివృద్ధి చెందింది. రకరకాల వస్తువులు పట్టుకునేందుకు బొటనవేలు మిగతా వేళ్ల కన్నా ఎడం అయింది. స్వేచ్ఛ పొందిన చేతులతో ఆహార సంపాదన ఆత్మరక్షణ చేసుకోగలిగాడు. ఇదంతా 20 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది.మూడు కోట్ల సంవత్సరాల కిందట మొదలైన వానర ప్రస్థానం 20 లక్షల సంవత్సరాలు వచ్చేటప్పటికి మనిషి గా మారి నిటారుగా నిలిచి నడవటం నేర్చాడు. 10 లక్షల సంవత్సరాలు గడిచే టప్పటికి మానవుడిగా రూపాంతరం అయ్యాడు. ఇతనిని పెకింగ్ మాన్ అని కూడా అన్నారు. 2 లక్ష సంవత్సరాల కిందటరెండవ సారి వచ్చిన హిమయుగాన్ని ఆనాటి మనిషి తట్టుకొని నిలబడ్డాడు. గుహల్లో అగ్ని రగిల్చాడు .బల్లెం, బరిశ ,గది లాంటి ఆయుధాలను, రెండు వైపులా మొనదేలిన ఆయుధం మొదలైన వాటిని తయారు చేసుకున్నాడు .జంతువులను మచ్చిక చేసుకున్నాడు నిప్పును తయారు చేయడం నేర్చుకున్న మనిషి జీవితం పూర్తిగా మారిపోయింది. దీంతో మనిషి జంతువులతో వాన రాలతో విడిపడినట్లైంది. ఆనాటి మనిషి అంగ నిర్మాణానికి మన అంగ నిర్మాణానికి చాలా తేడా ఉంది. చిన్న నుదురు చిన్న ముక్కు, చిన్న చెవులు ,వంగిన నడుము, ఎక్కువ రోమాలు ఎత్తుగా పొడుచుకువచ్చినట్లు కనుబొమ్మలు, నాలుగడుగులు ఎత్తు. ఇది ఆదిమానవుని రూపం .అతని మెదడు బరువు నరవానరాలు మెదడు కన్నా పెద్దది. నేటి మనిషి మెదడు కన్నా చిన్నది. ఆధునిక మానవుని అంగ నిర్మాణం 30000సంవత్సరాల క్రితం ఏర్పడింది. క్రీ.పూ.10000 సంవత్సరాల ప్రాంతంలో ఒక పెద్ద ప్రేలుడు లాంటిదేదో సంభవించి మంచు యుగానికి ముగింపు పలికిందని పలువురు శాస్త్రవేత్తలు భావించారు. అంటే మానవుని నాగరికత ప్రారంభమై కేవలం 12000 సంవత్సరాలు మాత్రమే అయింది. మనిషి తన ప్రస్థానాన్ని ఆఫ్రికా నుండి ప్రారంభించాడు నాగరికతను తూర్పు దేశాలలో వికసింపజేసినాడు.ఆనాటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటూ తన నాగరికతా ప్రస్థానం సాగించాడు. ప్రతిరోజూ క్రూరమృగాల తో పోరాడుతూ అడవుల్లో గుహల్లో జీవితాన్ని కొనసాగించే వాడు. ఈ సంఘర్షణలో మనిషి చాలా దృఢకాయుడుగా ఉండేవాడు. ఆరోగ్యంగా ఉండేవాడు. అనారోగ్యం బారిన పడేవాడు కాదు. మనిషి ఎప్పుడూ ప్రమాదానికి చేరువగా జీవించేవాడు. అంతే. తనను తాను కాపాడుకోవడమే ముఖ్యంగా ఉండేది. అతని ఆలోచనలన్నీ ఆహార సేకరణ,తన్ను తాను సంరక్షించుకోవడం,ఈ రెండింటి మీద ఉండేది.ఆ క్రమంలో అవి అతని పంచేంద్రియాల పై ప్రభావాన్ని కలిగించాయి. జంతువులు మాత్రం ప్రకృతికి లోబడి ఉండేవి. మనిషి మాత్రమే ప్రకృతి కి ఎదురుతిరుగుతూ ఉండేవాడు. ఆ క్రమంలో మానవుల్లో అవగాహన శక్తి మెల్లగా పెరిగి మెదడు వికసించింది. అతని అనుభూతులు ఆవేశాలు దీనికి అవకాశం కలిగించాయి. ఆది మానవుడికి భౌతిక అవసరాలు మాత్రమే అవసరమయ్యేవి. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం కావాలి. ఆకలి తీరాక లైంగిక సుఖం కావాలి. ఈ రెండే. అతను మృత్యువు గురించి ఆలోచించలేదు. ప్రకృతి గురించి అవగాహన పెరిగేకొద్దీ మృత్యువును గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. నైతిక పరమైన మంచిచెడ్డలు అతనికి తెలీవు. సుగుణాలు,వ్యసనాలు అతనికి అసలు తెలియవు దొరికిన జంతువును చంపడంకన్నా దాని నుండి పుట్టే వాటి ద్వారా ఆహారాన్ని సంపాదించడం సులభమని అర్థం చేసుకున్నాడు.అప్పటి నుండి జంతువులు చంపడం మానేసి వాటిని పెంచడం ప్రారంభించాడు.జంతువులను అదుపులో పెట్టుకోవడం కూడా నేర్చుకున్నాడు . ఇది అనుభవం మీద సాధ్యమైంది. మంచి అనుభవం ఉన్న వాడు తక్కినవారికన్న సమర్థవంతంగా ఉండేవాడు.క్రీ.పూ. 10 వేల ఏళ్ళనాడే కుక్కల్ని మేకల్ని గొర్రెల్ని మచ్చిక చేసుకోవడం నేర్చు కున్నాడు. క్రీ.పూ. 5000 నాటికే గుర్రాలను మచ్ఛిక చేసుకున్నాడు.క్రీ. పూ. 2000 ప్రాంతంలో మనిషి గుర్రాల స్వారీ చేయడం నేర్చుకున్నాడు. మనిషి పనిముట్ల వాడకం నేర్చుకున్నాడు. ఆనాటి పనిముట్లు పదునైన రాళ్లు ,ఎముకలను వాడిగా చెక్కిన కర్రలు. పనిముట్లతో మొట్టమొదటి జరిగిన కార్యక్రమం పోగుచేయడం. పళ్ళు కాయలు, దుంపలు పక్షుల గుడ్లు పోగు చేసుకుని తినేవారు. ఈరోజు గురించి ఆలోచనే తప్ప రేపటి గురించి ఆలోచన ఉండేదికాదు. మొదట్లో ఇతర జంతువుల మాదిరిగా నిప్పంటే భయపడేవాడు. అది వేడిని ఇస్తుందని క్రూర మృగాలు నుండి కాపాడుతుందనే తెలుసుకున్నాడు. నాలుగు లక్షల సంవత్సరాల క్రితమే మనిషి దానిని ఉపయోగించడం నేర్చుకున్నాడు.ప్రాణం లాగే నిప్పు (అగ్ని ) కూడా పదార్థం కాదు. నిప్పు ఒక పరిణామ ప్రక్రియ. దీనివల్ల ఒక పదార్థ స్వభావం మారిపోతుంది. నిప్పుకు ఆక్సిజన్ కు సంబంధం ఉంది. రాపిడి వల్ల అడవులు మండేటివి. ఒక దివిటీ వెలిగించుకుని అవి ఆరిపోకుండా వంతులవారీ కాపలా కాసేవారు. మనిషి జీవితంలో నిప్పు చాలా ప్రధానమైంది. మనిషికి మాత్రమే పట్టుబడిన శక్తి అది. మహా భారత రచనా కాలంలో దానిని అరణి అనేవారు. నిప్పును ఉపయోగించి ఆహారం ఉడికించడం, కాల్చడం చేసేవారు . నిప్పు ఉపయోగం వలన జంతువులను లొంగదీసుకోవడం సులభమైంది. అగ్ని నాశనకారిగాకాక పదార్థాలను మార్చివేయగల ఒక మాంత్రిక శక్తి గా భావించారు. అగ్ని నాశనం చేయదు అది పునర్జన్మ నిస్తుందని భావించేవారు .రాళ్లను పగలకొట్టడానికి , వంటకూ నిప్పును వాడినారు. లోహాల శుద్దికి వాడినారు. దాంతో రాతి పనిముట్లు బదులు లోహపు పనిముట్లు కూడా వచ్చాయి. అగ్నిని దేవునిగా భావించారు. నిప్పు ద్వారానే ద్వారానే మనిషి హిమయుగంలో మనుగడ సాగించగలిగాడు. ఈ విధంగా నిప్పు మానవ నాగరికతలో ప్రధాన పాత్ర వహించింది. మనిషి దీంతో జంతు ప్రపంచం నుంచి వేరు పడ్డాడు. జంతువులను మచ్చిక చేసుకోవడం క్రమబద్ధంగా నేర్చుకున్నాడు. జంతువులను ఉపయోగించుకోవడం నేర్చుకోవడంతో అదనపు ఉత్పత్తి సాధ్యమైంది .గుర్రాలపై స్వారీ చేయడం వల్ల మనిషి ఇతర ప్రపంచం మీద పైచేయి సాధించాడు. జంతువులను తన పనులకు ఆహారాన్ని సంపాదించడంలో ఉపయోగ పెట్టడం తో కొంత అదనపు ఉత్పత్తిని మనిషి సాధించ గలిగాడు. ‌ గుహలలో చెట్టు తొర్రలలో తలదాచుకునే వారు. క్రమంగా ఎముకలతో ను చర్మాలతో ను చెట్ల ఆకులతో గుడిసెలు వేయడం నేర్చుకున్నారు. ఆడ, మగ మధ్య పని విభజన జరిగింది. మగవారు చేపలు పట్టడానికి వెళ్లేవారు. ఆహార సేకరణకు స్త్రీలు వెళ్లేవారు. పళ్ళు, కాయలు ,గింజలు సేకరించేవారు .సేకరించిన వాటిని భద్రపరిచేవారు. అందుకోసం బుట్టలు అల్లేవారు. ఇదంతా ఆనాటి సమాజ నిర్వహణలో స్త్రీల పాత్ర ఎంతో తెలియజేస్తుంది. వారికి ఆనాడు అత్యంత గౌరవం ఉండేది. క్రూర మృగాల నుండి తప్పించుకోవడానికి గుంపులు గుంపులుగా బతికేవారు గుంపులు గుంపులుగా కాకుండా పెద్ద పెద్ద జంతువులను వేటాడటం సాధ్యమయ్యేది కాదు. ఆనాటి అవసరాలు ఒకరికి ఒకరు తోడుగా ఉండే సంఘజీవనానికి దారితీసింది. ఆ దశలో గుంపు సమాజం ఏర్పడింది. జంతువులను మచ్చిక చేసుకోవడం తో అవి ఆ గుంపు సంపద గా మారిపోయింది. ఈ సంపద కోసం మరో గుంపు వారితో ఘర్షణ పడేది.నిప్పును ఆరిపోకుండా వంతుల వారీగా చూసుకునేవారు. కలిసి వేటాడేవారు గనుక ఒకరితో ఒకరు మాట్లాడొకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రకృతితో భౌతిక అవసరాల కోసం పడే సంఘర్షణలో ఆలోచనలు వికసించాయి. భావాలను ఇతరులకు తెలియజేయడం కోసం , తోటి మానవులతో సంభాషించటం కోసం మౌన సంకేతాలు ఉపయోగించేవాడు.గుహల్లో బొమ్మలు గీచేవాడు.మెల్లగా ప్రకృతి ని అనుకరిస్తూ మొదట చిన్న శబ్దాలుగా ప్రారంభించి క్రమంగా పదాలను, భాషను అభివృద్ధి చేసుకున్నాడు. గుంపులు గా ఉన్న సమాజాన్ని గణ సమాజం అన్నారు. ఈ గణ సమాజం నిరంతరం సంచరిస్తూ ఉండేది. వీరు ఇతర గణ సమూహాలపై పడి వారు సేకరించిన ఆహారాన్ని దోచుకునేవారు. ఇలా దోచుకోవడం క్రీ.పూ 10 వేల ఏళ్ళనాడే ప్రారంభమైంది .క్రీ .పూ.2000లో ఆర్యులు ఇరాన్ నుంచి వచ్చి ఇండియాలోని సింధు నాగరికతను ధ్వంసం చేసినారు. గోవులను అపహరించేవారు.