తిరుపతి వెంకట కవులు - ambadipudi syamasundar rao

తిరుపతి వెంకట కవులు
తిరుపతి వెంకట కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి జయంతి మార్చ్ 26 కావున అవకాశము ఉంటె 26 నా ఈ వ్యాసము ప్రచురించండి

దివాకర్ల తిరుపతి శాస్త్రి (1872-1919), చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (1870-1950) అనే ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిటి లోకములో ప్రసిద్ధులయ్యారు వారిలో దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి జయంతి (మార్చ్ 26)న వారిని స్మరించుకుంటూ ఈ ప్రత్యేక వ్యాసము తెలుగు సాహితి అభిమానులకు సమర్పిస్తున్నాను..వీరు రచించిన పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు "బావా ఎప్పుడు వచ్చితీవు".",చెల్లియో చెల్లకో."."జెండాపై కపిరాజు "వంటి పద్యాలు తెలుగు నాట ఊరూరా పండితుల, పామరుల నోట నేటికీ మారుమ్రోగుతున్నాయి. నాటకము వేసేటప్పుడు ఈ పద్యాలు వన్స్ మోర్ కొట్టించుకొనేవి..వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత, తెలుగు గ్రంథాలు, నాటకములు, అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి దివాకర్ల తిరుపతి శాస్త్రి ప్రజోత్పత్తి సంవత్సర ఫాల్గుణ శుద్ధ దశమి బుధవారం అనగా 1872 మార్చి 26న పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వద్ద యండగండి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి వెంకటావధాని కూడా గొప్ప వేదపండితుడు, సూర్యోపాసకుడు. తిరుపతి శాస్త్రి విద్యాభ్యాసం బూర్ల సుబ్బారాయుడు, గరిమెళ్ళ లింగయ్య, పమ్మి పేరిశాస్త్రి, చర్ల బ్రహ్మయ్య శాస్త్రిల వద్ద సాగింది. చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద చదువుకునే సమయంలో తిరుపతి శాస్త్రికి చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తోడయ్యాడు. 1898లో తిరుపతి శాస్త్రి వివాహం జరిగింది.
చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి ప్రమోదూత సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశి సోమవారం అనగా 1870 ఆగస్టు 8న తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామంలో జన్మించాడు. ఆయన ముత్తాత తమ్ముడు వేంకటేశ్వర విలాసము, యామినీ పూర్ణతిలక విలాసము అనే మహాద్గ్రంధాలను రచించిన పండితుడు. ఆయన సేకరించిన అమూల్య తాళపత్ర గ్రంథాలు వేంకట శాస్త్రికి అందుబాటులో ఉండేవి. తరువాత వారు యానాంకు మకాం మార్చారు. యానాంలో వేంకట శాస్త్రి తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషలు అధ్యయనం చేశాడు. కానుకుర్తి భుజంగరావు, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిరాజు వంటివారు వేంకటశాస్త్రి గురువులు.శ్రీవెంకటకవి చదువుకై ఎందరెందరో గురువులను ఆశ్రయించి తిరిగి తిరిగి శ్రీ చర్ల బ్రహ్మయ్యశాస్త్రిని ఆశ్రయించారు. అప్పటికే వారివద్ద కౌముది చదువుతున్న శ్రీ తిరుపతిశాస్త్రితో పరిచయమైనది. కాని కాలు నిలువని వెంకటకవి చదువుల కోసము వారణాసికి పోవలెనను ఉబలాటము కలిగి, గురువులతో మాయమాటలు చెప్పి ఒక మిత్రునితో కాశికి బయలుదేరినాడు. డబ్బులేదు. నిడమర్రు చేరి అక్కడి ఉద్యోగుల సభలో శతఘంట కవనము చేయగలనని ప్రగల్భముగా పద్యాలు చెప్పెను. అప్పటికి ఆయన వయసు 20సం. కూత ఘనముగా ఉన్నదని ఆయనతో అష్టావధానము చేయించిరి. పూర్తి చేసి, అయ్యా నేనెప్పుడు అష్టావధానము చేయలేదని ఊరక అడిగిన ధనమీయరని ప్రగల్భములు పలికితిని, లోపములున్న మన్నింపమని పలికిరి. వేంటనే సభ్యులందరు కోపమేమీ లేదని బాగుగా చేసితివి అని పలికి రూ.30 ఇచ్చి సత్కరించిరి
వెంకట కవికి అదే ఆయన మొదటి అవధానము. రెండవ అవధానము గుండుగొలనులో చేసిరి. శ్రీ శాస్త్రిగారు కాశిలో ఎక్కువకాలముండలేదు. గురువుల ఆదేశమును అనుసరించి స్వదేశము తిరిగివచ్చిరి. కాశీ సమారాధనముకు, గంగపూజకు డబ్బుకొరకు కోనసీమలో ముమ్మిడివరము, ఐనాపురము, కేసవకుర్తిలో అవధానము చేసి ధనం సంపాదించి గంగపూజ చేసారు.ఆంధ్రకవిత్వము చిన్నప్పుడే వంటపట్టెను. చిన్నప్పుడే హరికథలు వీధినాటకములు వ్రాసెను. మృదంగ వాదనము, కొంచెము ఇంగ్లీషు కొంచెము కుస్తీ కూడా అభ్యసించెను. ఈ చిల్లరవిద్యలలో తిట్ల కవిత్వం ఒకటి. కొంతకాలము చదువుకంటే చదరంగమును ఎక్కువుగా అభ్యసించెను. అన్నిటికీ తోడు ఆయన కంటి సమస్య ఒకటి. కాని వారికి విస్తారమయిన ధారణశక్తి ఉండటము వలన చదివిన చదువు గట్టిగానిలిచేది. ఆపిమ్మట శ్రీవెంకటశాస్త్రిగారు బ్రహ్మగురువులను చేరి నిలుకడగా శ్రీతిరుపతి శాస్త్రితో కలసి విద్యాభ్యాసం ఆరంభించారు . వారిద్దరికి మొదట్లో విద్యస్ఫర్ధ ఉండెడిది. ఇతరు శిష్యులలో కొందరీయనను, మరికొందరు ఆయనను బలపరిచేవారు. ఆ స్ఫర్దే వారి మైత్రికి బీజమైనది. అప్పటికి తిరుపతిశాస్త్రి సంస్కృత రచనమేకాని ఆంధ్రపద్య రచన ఎరుగరు. వెంకటశాస్త్రి పరిచయంతో ఆయన ఆంధ్ర కవిత్వములోనికి దిగెను. అప్పటినుంచే జంట కవిత్వ కృషి ఆరంభమైనది
శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారితో శ్రీ వేంకటశాస్త్రిగారికి జరిగిన తగాదా చాలా చిత్రమైనది. శ్రీపాదవారు సంస్కృతాంధ్రభాషలలో పండితులే కాక వేదము, శ్రౌతము కూడా అధ్యయనము చేసిన పుణ్యమూర్తులు. వీరు ఒక్కచేతిమీదుగా మహాభారతము, రామాయణము భాగవతము అనువదించి శతాధికగ్రంధకర్తలైన కవిసార్వభౌములు. మహామహోపాధ్యాయ బిరుదాంకితులు.వారివద్ద శ్రీ వేంకటశాస్త్రి మేఘసందేశము ఐదునెలలు శుశ్రూష చేసి కొంత చెప్పుకొనిరి. శ్రీకృష్ణ భారతముపై కొందరు ఒకమహా సభలో శ్రీవేంకటశాస్త్రిగారిని ఖండించి శ్రీపాదవారిని సమర్ధించిరి. శ్రీపాదవారికి గండపెండేరము సమర్పించు సభకువెళ్ళి శ్రీవేంకటకవి స్వయముగా గురుపాదమునకు బిరుదుటందెనలంకరించిరి. శ్రీవేంకటకవికి గండపెండేరము సమర్పించు సభలో శ్రీపాదవారుండటచే వారి అనుమతి లేనిది తానది గ్రహింపనని చెప్పగా, శ్రీపాదవారు వేంకటశాస్త్రి అందుకు తగిన వారే అను ప్రకటించిరి. వీరిరువురు మధ్య పలుసార్లు వైషమ్యములు వచ్చినను చివరకు రాజీ కుదురినట్లు 1931లో ప్రకటించారు మదరాసు ప్రభుత్వమువారు ప్రథమాంధ్రాస్థాన కవిని నియమింప నిర్ణయించినపుడు వీరిద్దరిలో ఎవరిని నియమించుటాయని మంత్రులాలోచించిరట. తుదకు ప్రభుత్వము శ్రీవేంకట శాస్త్రినే వరించి గౌరవించింది. ఆతర్వాత కొద్దినెలలకే వారు పరమపదించగా, వేంటనే రెండవ ఆస్థాన కవిగా శ్రీపాదవారిని ప్రభుత్వము వరించింది
తిరుపతిశాస్త్రి బలశాలియైనను 49సం.లే జీవింపగా బలహీనుడైన శ్రీవేంకటశాస్త్రి 80సం.లు దాదాపు సహస్రమాసములు జీవించెను. శ్రీవేంకటకవి తనకూ, తన కుటుంబమునకు ఎన్నోమారులు జబ్బులు చేయగా, ఆరోగ్య కామేశ్వరి, ఆరోగ్య భాస్కరస్తనము, మృత్యంజయ స్తనము వంటి కావ్యములు చెప్పి వ్యాధి విముక్తులైరి. వీరు మహాశివరాత్రినాడు నిర్యాణము చెందినారు .వేంకట శాస్త్రి అధ్యాపకునిగా ఉన్నపుడు ఆయన శిష్యులుగా ఉండి, తరువాత సుప్రసిద్ధులైనవారిలో కొందరు విశ్వనాధ సత్యనారాయణ, వేటూరి సుందరరామ మూర్తి, పింగళి లక్ష్మీకాంతం మొదటినుండి తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇక వేంకట శాస్త్రి పురాణ సాహిత్యాలపై ఉపన్యాసాలివ్వడంలోనూ, మెరుపులా పద్యాలల్లడంలోనూ దిట్ట.ఒకరి ప్రతిభపై మరొకరికి ఉన్న గౌరవం వారి స్నేహాన్ని బలపరచింది. మొదటిసారిగా కాకినాడలో జంటగా శతావధానం ప్రదర్శించారు.అది వారి మొదటి శతావధానమేకాక సంపూర్ణ శతావధానమ కూడను. అప్పటికి వెంకటశాస్త్రికి 20సం. తిరుపతి శాస్త్రిగారికి 19వ ఏడు. బాలసరస్వతులవలె నున్నవారిని సభ్యులు అభిమానించుచునే అడుగడుగున గడ్డు పరీక్షలు చేసిరి ఆ తరువాత జీవితాంతం ఆ సాహితీ మూర్తులు ఒకరికొకరు తోడున్నారు. తిరుపతి శాస్త్రి సదా వేంకటశాస్త్రిని తన గురువుగా భావించాడు. తిరుపతి శాస్త్రి మరణానంతరం కూడా వేంకట శాస్త్రి తన రచనలను జంట రచనలుగానే ప్రచురించాడు.
అమ్మా! సరస్వతీ! నీ దయవలన మేము ఎన్నో సన్మానాలు అందుకొన్నాము అని చెప్పిన పద్యం:"ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము, సన్మానము లందినాము, బహుమానములన్ గ్రహియించినార, మెవ్వానిని లెక్క పెట్టక నవారణ దిగ్విజయంబొనర్చి ప్రజ్ఞా నిధులంచు బేరు గొనినాము, నీ వలనన్ సరస్వతీ!" కవులకు మీసాలెందుకని ఎవరో అధిక్షేపించినపుడు, సంస్కృతంలోనూ, తెలుగులోనూ తమను మించిన కవులు లేరని సవాలు చేస్తూ, వీరు చెప్పిన పద్యం. దమ్మున్న కవులు ఎవరైనా మమ్ములను గెలిస్తే మీసాలు తీసి మొక్కుతామని:సభలో చెప్పారు. వారిద్దరు ఓసారి ఏకాంతముగా ఒక కొబ్బరితోటలో నూరు కొబ్బరిచెట్లను పృచ్చకులుగా భావించుకొని చెట్లకు శతావాధానము చేసిరి. దానితో వారు శతావధానమేకాక వారి శక్తి సహస్రమౌనకై నను చెప్పగలము అని నిశ్చయించుకొని సంపూర్ణ శతావధానము చేసి అందులో నెగ్గిరి.ఇద్దరూ కలిసి అసంఖ్యాకంగా అవధానాలు నిర్వహించారు. సన్మానాలు అందుకొన్నారు అడయారు వెళ్ళినపుడు అనీబిసెంట్ ప్రశంసలు అందుకొన్నారు. వెంకటగిరి, గద్వాల, ఆత్మకూరు, విజయనగరం, పిఠాపురం సంస్థానాలు సందర్శించి తమ ప్రతిభను ప్రదర్శించి సత్కారాలు గ్రహించారు
పోలవరం జమీందారు వారి ప్రతిభ గురించి తెలిసికొని ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించిన లైట్ ఆఫ్ ఆసియా గ్రంథాన్ని తెలుగులోకి అనువదించమని వారిని కోరాడు. తన సంస్థానంలో కవులుగా చేరమని అర్ధించాడు. ఆ విధమైన కట్టుబాట్లకు వేంకట శాస్త్రి వెనుకాడినా తిరుపతి శాస్త్రి ఆయనను ఒప్పించాడు. ఫలితంగా వారు 1901లో కాకినాడకు నివాసం మార్చారు. 1889లో పిఠాపురం రాజు ప్రారంభించిన 'సరస్వతి' అనే సాహితీ పత్రిక నిర్వహణా బాధ్యతలు వారికి అప్పగింపబడ్డాయి. ఈ పత్రిక కోసం 'బాల రామాయణం', 'ముద్రారాక్షసం', 'మృచ్ఛఘటికం' గ్రంథాలను వీరు సంస్కృతంనుండి తెలుగులోకి అనువదించారు. 1918లో పోలవరం జమీందార్ మరణం వారిని ఇబ్బందులలో పడవేసింది. అయితే గోలంక వీరవరం జమీందార్ రావు రామాయమ్మ వీరికి భరణం ఏర్పాటు చేసింది.
శ్రీ తిరుపతి శాస్త్రి నిర్యాణాంతరము శ్రీవెంకటశాస్త్రి చల్లపల్లి రాజాగారగు అంకినీడు ప్రసాదరాయలయు,శ్రీ శివరామ ప్రసాదప్రభువులయు పట్టాభిషేకములకు వెళ్ళి ఘనముగా సన్మానములొందెను.అట్లే బొబ్బిలి రాజాగారి పట్టాభిషేకమునకు శ్రీ వెంకటశాస్త్రి వెళ్ళి, తర్వాత పట్టాభిషేక కావ్యమును రచించెను. ఆ కావ్యమును విపించుటకు శాస్త్రిగారు శిష్యసమేతముగా బొబ్బిలి వెళ్ళెను.ప్రభువు శ్రీ శాస్త్రిని వేయినూటపదార్లు, శాలువుల జోడు, కింకణములు ఇచ్చి సన్మానించి, నూరార్లు వార్షికము ప్రకటించుటేకాక వెంటవచ్చిన శిష్యులకును నూటపదార్లు ఇచ్చి గౌరవించెను.ఆంధ్ర దేశములోని సంస్థానాధీశులు వీరిని సన్మానము చేయటానికి పోటీపడేవారు తిరుపతి వేంకట కవులు రాసిన "పాండవోద్యోగం", "పాండవవిజయం" అనే రెండు నాటకాలను కలిపి "పాండవోద్యోగవిజయాలు" లేదా "కురుక్షేత్రం" పేరుతో ప్రదర్శించేవారు.వీరి ప్రతిభ ఎంటటైడ్ అంటే వారు ఇష్టపడనివారిని తిడుతూ కూడ కవిత్వము వ్రాసేవారు ఉదారణకు వీరు ఒకసారి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆత్మకూరు సంస్థానాన్నీ దర్శించినప్పుడు అక్కడి ప్రభువును దర్శించాలనే వారి కోరికకు ఒక పండిత కవి అడ్డుతగిలాడు ఆ పండితకవి ప్రభువులకు చాడీలు చెప్పి వీరికి ప్రభువుల సత్కారాలకు దూరము చేశాడు దీనితో ఆగ్రహించిన జంటకవులు ఆ అధికారిని అధిక + అరి అని చమత్కరిస్తూ, అన్యోపదేశంగా నిందిస్తూ 27 పద్యాలతో కూడిన లఘుకృతిని రచించారు. దీనికి "శనిగ్రహం "అని పేరు పెట్టారు. అందులో మచ్చుకు ఒక పద్యం.
ధరణీ నాయకుడుత్తముండవని నిన్ ధర్మాధికారమ్మునం
దు రహిన్నిల్పుట తుచ్చ బుద్ధివయి క్రిందున్ మీదునుం గాన కె
ల్లరి కార్యమ్ములు పాడుసేయుటకె? నీ లక్ష్యమ్ము మా బోటు తెం
చరు చండాల! శనిగ్రహంబ! యిక మా సామర్థ్యం ముంజూడుమా!
తిరుపతి లేకుండా వెంకటేశ్వర్లు,లేదా వెంకటేశ్వర్లు లేకుండా తిరుపతి లేనట్లు మెలిగిన ఈ జంటకవుల తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నము చేసి తమదైన ముద్రవేసి దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు 48 సంవత్సరాలకే 1919లో నిర్యాణము చెందారు చెళ్లపిళ్ల వెంకట శాస్త్రిగారు 1950 ఫిబ్రవరి 15 న శివరాత్రి రోజున తెలుగు సాహితి జగత్తు నుంచి శివ సాన్నిధ్యము పొందారు కానీ వీరి రచనలు చిరంజీవులుగా నేటికీ దర్శనము ఇస్తున్నాయి.
అంబడిపూడి శ్యామసుందర రావు