కరోనా@లాక్ డౌన్.360 డిగ్రీస్ - స్వప్నరాగలీనా

కరోనా@లాక్ డౌన్.360 డిగ్రీస్

కరోనా@లాక్ డౌన్.3600

నిన్న నేటికి గతం. అది గుణపాఠాలను నేర్పే తరగని గని. రెండు మూడు రోజుల క్రితం జరిగిన విషయాలైతే చాలా మందికి గుర్తుంటాయి. కొందరు కొన్ని ఏళ్లకు సంబంధించిన ఘటనలను కొంతమేరకే గుర్తుంచుకోగలుగుతారు. వందల ఏళ్ల క్రితమైనవి చరిత్రపుటల్లో నిక్షిప్తమైతే తప్ప అవి మరుగున పడిపోతాయి. మానవాళిని పట్టి పీడిస్తున్న వైరస్ల చరిత్ర కూడా సుధీర్ఘమైనవే. ప్లేగు, కలరా, స్పానిష్ ప్లూ, సార్స్, హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి వైరస్లు శతాబ్ద కాలంగా మానవజాతిని అతలాకుతలం చేసినవే. ప్రస్తుత ‘కరోనా’ వైరస్ వీటన్నింటిని మించి ప్రజా వ్యవస్థను గజగజలాడిస్తున్నది. ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజా జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తుండగా, పాలనా వ్యవస్థ గాడితప్పుతున్నది. ముందుకు నడిపించే వ్యవస్థలన్నీ ఆర్థికంగా చితికిపోతున్నాయి. తగ్గినట్లే తగ్గి మళ్ళీ పంజా విసురుతున్న కరోనా వైరస్, సగటు జీవి దైనందిన జీవితాన్ని ప్రశ్నార్ధకంగా మార్చింది.

ఆధునిక చరిత్రలో రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అత్యధికస్ధాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగిస్తూ విలయతాండవం సాగిస్తున్న ‘కరోనా వైరస్’ వల్ల కలుగుతున్న దారుణ ఫలితాలు... సామాజిక సంబంధాలు, కుటుంబ బంధాలు, వ్యక్తి ప్రవర్తన, వ్యవస్ధ తీరుతెన్నులు, వ్యాపార సంక్షోభం, ప్రభుత్వాల పనితీరు... మొత్తంగా మానవ సమాజంలో చోటు చేసుకుంటున్న అమానవీయ మార్పులను, సినిమా రీలులా మన కళ్ళ ముందు కదులుతూ, ప్రస్తుతం మనం ఎంతటి దనీయమైన సంకటసిథతిలో, అనివార్యమైన స్వార్థపూరిత బంధనాల్లో చిక్కుబడిపోయామో ఎడాది కాలంగా అనుభవిస్తూనే ఉన్నాము.

‘కోవిడ్-19’గా పిలుచుకుంటున్న కరోనా వైరస్ ప్రతిఒక్కరి బతుక్కీ ఓ మాయని మచ్చలా నిలిచిపోయింది. ఎన్నో విషాద ఘటనలు, హృదయ విదారక దృశ్యాలు వింటున్నాము, కంటున్నాము. ఈ ఘటనలను, దృశ్యాలను జర్నలిస్టు కోడం పవన్ కుమార్ తన వ్యాససంపుటిలో అక్షరబద్దం చేశాడు. ‘కరోనా@లాక్ డౌన్.3600’ పేరుతో రాసిన ఈ సంపుటిలో 59 వ్యాసాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లాక్ డౌన్ కాలంలో జరిగిన వాస్తవ సంఘటనలకు ప్రతిరూపాలు. వ్యవస్థలోని అన్ని రంగాలపై, సమస్త జీవన పార్శ్వాలపై కోవిడ్-19 ప్రభావాన్ని అనితరసాధ్యమైన లోచూపుతో, సామాజిక అధ్యయనకారుడికి ఉండే సమగ్ర దృష్టితో విశ్లేషించాడు. వర్తమానానికి, నడుస్తున్న చరిత్రకు కత్తుల వంతెన వేసిన ఈ వైరస్ ప్రభావ సమస్త పార్శ్వాలను వివరించే పుస్తకమిది. వాస్తవానికి ఈ సంపుటి ఒక సంక్షోభ కాలపు చరిత్రను రికార్డు చేసింది. సంతోషంలోనూ వేదనలోనూ మనుషులంతా, ముఖ్యంగా సృజనకారులంతా గొప్పగా స్పందిస్తారు. అదే రీతిలో ఈ కరోనా సంక్షోభ కాలాన్ని కూడా పలువురు కవులు రచయితలు తమ తమ సృజనాత్మక రంగాల్లో విరివిగా స్పందిస్తారు. కవి, జర్నలిస్టు అయిన పవన్ కుమార్ నాన్-ఫిక్షన్ ప్రక్రియను ఎంచుకుని ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలం చేస్తున్న వైరస్ తీరుతెన్నులను సమగ్రంగా విశ్లేషించాడు. కాల పరీక్షల వైరస్లు, ఆనాడు ప్లేగు-ఈనాడు కరోనా, చిన్న పరిశ్రమలు చితికిపోతున్నాయి, కరోనాకు మత్తెక్కించిన మద్యం, చిత్రసీమకు చేదుమాత్ర... శీర్షికలతో రాసిన 59 వ్యాసాల్లో భిన్న కోణాలు, భిన్న అనుభవాలు మనకు కనిపిస్తాయి. జర్నలిస్టుగా పవన్ కుమార్, ఒకరకంగా చరిత్రకారుడి పాత్రను పోషించాడనే చెప్పాలి. ఈనాడు, వార్త, మన తెలంగాణ దినపత్రికల్లో జర్నలిస్టుగా 30 ఏళ్లకుపై ఉన్న అనుభవం ఈ వ్యాస సంపుటిలో అడుగడుగునా కనిపిస్తుంటుంది.

‘‘జర్నలిస్టు కలం ఎప్పుడూ నిద్ర పోకూడదు. ఏదో ఒకటి రాస్తూనే వుండాలి’’ అన్న టంకశాల అశోక్ మాటల స్ఫూర్తితో ఈ వ్యాసాలూ ఇతర వ్యాసాలూ రాస్తున్నానని పవన్ కుమార్ చెప్పుకున్నాడు. నిరంతరం రాస్తూ వస్తున్న పవన్ హైదరాబాద్ చరిత్రపై, చేనేత స్వరూపం పై కూడా వ్యాసాలు రాస్తున్నాడు. ఆ క్రమంలో లాక్ డౌన్ ప్రభావాన్ని పూసగుచ్చినట్లుగా వివరించాడు. అనేక వివరాలతో లెక్కలతో కూడిన ఒక విశిష్టమయిన రచన ఇది. ఎంతో ఆర్ఖైవల్ ప్రాధాన్యత వున్న పుస్తకం కూడా. ఈ పుస్తకం చదువుతుంటే మనల్ని ఒకరకమైన dejavu ఆవహిస్తుంది. కోవిడ్ ప్రభావం మన మీద పలువిధాలుగా పడింది. ఈ పుస్తకంలోని వ్యాసాల సమాహారంలో ఆ ప్రభావపు అన్ని ఛాయలు, వైవిద్యం వున్నాయి. రెఫరెన్స్ పుస్తకంగా నిలిచిపోతుందనడంలో ఏలాంటి సందేహం లేదు. ఈ పుస్తకానికి ప్రముఖ రచయిత శ్రీ ఆడెపు లక్ష్మీపతి రాసిన ముందుమాట ఎంతో బలాన్నిచ్చింది. “ HUMAN HISTORY BECOMES MORE AND MORE A RACE BETWEEN EDUCTION AND CATASTROPE” అన్న H.G. WELLS మాటలతో మొదలయిన ‘చరిత్రలో ఓ కొత్త విషాద కోణం‘ శీర్షికతో రాసిన ముందుమాట మానవ జీవితమూ, ఆపత్కాలాలూ, మనుషుల మనస్తత్వాలూ, వారి జీవన సాఫల్య వైఫల్యాలూ అన్నింటినీ స్పృశిస్తూ సాగింది. చాలా మంచి ముందుమాటల్లో ఒకటిగా నిలిచింది.

 

 

మరిన్ని వ్యాసాలు

మోక్షప్రదాయని చిదంబరం.
మోక్షప్రదాయని చిదంబరం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బహుముఖ ప్రజ్ఞాశాలి తురగా జానకిరాణి.
బహుముఖ ప్రజ్ఞాశాలి తురగా జానకిరాణి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
చదువులతల్లి...
చదువులతల్లి...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
దక్షణాది నటి జయంతి.
దక్షణాది నటి జయంతి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Prakrithi-purushudu-aatma
ప్రకృతి - పురుషుడు - ఆత్మ
- కందుల నాగేశ్వరరావు