మన నృత్యకళ! - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

మన నృత్యకళ!

మన నాట్యకళా వైభవం.(అంతర్జాతీయ నృత్య దినోత్సవ సందర్బంగా)
దేశ కాల పరిస్థితులనుబట్టి కళలు ఆవిర్బవించాయి.స్ధానికి ఆచార వ్యవహారాలకు అనుకూలంగా పేర్లు ఏర్పడ్డాయి.ఉదాహరణకు నాట్యకళలను చూస్తే, నాగాలాండ్ లోని "లాయిహరేబా" తీహారులోని "హూ" ఉత్తరప్రదేశ్ లోని "దివాలి" పంజాబ్ లొని "బాంగ్రా" హిమాచల్ లోని "పంగీచంబో" రాజస్ధాన్ లోని "దాండియురాజ్ -జుమార్ " ఒరిస్సాలోని "జాదూర్ "సౌరాష్ట్రాలోని "టిప్పన్"తెలుగు నేలపైన "సిద్దిస్"-"లంబాడి" కేరళా-తమిళనాడులోని "కుమ్మి-కోలాటం"మరియు "భరత నాట్యం"-"కూచిపూడి"-"కథాళిక"-"కథక్"-"మణిపురి"-ఒబిస్సా" వంటి పలుపేర్లతో నాట్యప్రదర్శన జరుగుతుంది.

దక్షణాన తెలుగునేలపై 'కూచిపూడి' తమిళ నేలపై 'భరతనాట్యం' కన్నడ నేలపై యక్షగాన-భరత నాట్యాము.కేరళలొ 'కథాకళి'ప్రదర్శింప బడుతున్నాయి. ఈనాలుగు సాంప్రదాయ నృత్యాలకు భరతముని రాసిన 'నాట్యశాస్త్రము,కర్ణాటక సంగీతము ప్రధాన అంగాలు.భరతమునికి పూర్వమే ప్రధమంలో ఆంధ్రమహర్షి'నందికేశ్వరుడు' 'అభినయ దర్పణము'అనే గొప్ప నాట్యగ్రంధం రచించినట్లు, దాని ఆనుసరించి ధాన్యకటకము, భట్టిప్రోలు, ఘంటసాల, గోలి, జగ్గయ్యపేట, నాగార్జునకొండ మొదలగు స్ధూపశిల్పాలలో నాట్యశిల్పములు విలసిల్లినట్లు కీర్తి అడవి బాపిరాజుగారు తనపరిశోధనలో విశదపరిచారు.

నాట్యానికి సంగీతం ముఖ్యం.సంగీతానికి సాహిత్యం ముఖ్యం. ఈమూడింటికి చిత్ర శిల్ప సాహిత్య కళా జ్ఞానం ముఖ్యం.అసలు నాట్యానికి జీవం-భావం.భావ-రాగ-తాళ-భరితం కలయికే నటనా లేక నృత్యం. మన భారతీయ నృత్యకళని 'తాండవం'-'లాస్యం' అని రెండు రకాలుగా మన పూర్వికులు విభజించారు. తాండవం పురుషులు,లాస్యం స్త్రీలు ప్రదర్శిస్తారు. లాస్యానికి కర్త పార్వతి దేవి.తాండవానికి మూలపురుషుడు శివుడు.లాస్యం సుందరంగా సుకుమారంగా ఉంటుంది.మధురభావ ప్రకటనకు అనువైనది.దీనికి శృగార రసం ప్రధానమైనది.తాండవం ఉదత్తమైనది,గంభీరమైనది దీనికి వీర రసం ప్రధానమైనది.లాస్యం ఏకపాత్రకేళిక.తాండవం బహుపాత్రలతో నృత్యనాటకం.నాట్యానికి ఆధ్యుడు అయిన భరతమునికి పూర్వం శంభు, గౌరి, బ్రహ్మ, మాధవుడు, దత్తిలుడు, కోహలుడు, యాజ్ఞవత్యుడు, నారదుడు,
హనుమంతుడు, గణపతి, అర్జునుడు, రావణబ్రహ్మ, ఉషాకన్య మొదలగువారు ప్రసిధ్ధ నాట్యవేత్తలని మన పురాణాలద్వారా తెలుస్తుంది.

భరతముని 'అమృతమధనం' అనే నృత్య నాటకాన్ని రూపొందించి శివుని ఎదుట ప్రదర్శించగా, శివుడు తన శిష్యుడైన 'తండని'పిలిచి భరతమునికి తాండవంలో శిక్షణ ఇవ్వమన్నాడు. అలా భరతుడు తన నాట్యశాస్త్రంలో తాండవ లక్షణం అనే అధ్యాయం చేర్చాడు. స్ధానిక చారీ రేచక కరణ అంగాహార మండల క్రమాలు ఈఅధ్యాయనంలో చోటు చేసుకున్నాయి. ఈరీతిని అనుసరించి భారత దేశం అంతటా అభివృధ్ధి పొందిన నర్తనాన్నే 'మార్గ'నర్తన రీతి అన్నారు.
ఇవికాకుండా ఆయాప్రాంతాల ప్రజల అభిరులులను అనుసరించి శాస్త్రీయంగా అభివృధ్ధి పొందిన నాట్యాన్ని 'దేశి' అన్నారు.రేచక,కరుణ విన్యాసాలతో ఏదైనా ఒక ఘట్టాన్ని ప్రదర్శించడాన్ని'నాట్యధర్మ'అంటారు. ఓకానొక భావప్రకటన చేయకుండా సహ ఓరీతిలో భావాన్ని ప్రకటించడాన్ని'లోకధర్మ'అంటారు.

తెలుగునాట రెండు నృత్య సంప్రదాయాలుఉన్నాయి.ఒకటి 'నట్టువమేళం' రెండవది 'నాట్యమేళం' పూర్వం మనకు 'దేవదాసి'వ్యవస్ధ ఉండేది. ఈదేవదాసిలు నాట్యకళా విశారదులు.సందర్బోచితంగా దేవాలయాలలోని వసంత మండపాలలో నృత్యం చేసేవారు. మత ప్రాబల్యంతో అవతరించిన శైవ-వైష్ణవ దేవాలయిలు, బౌధ్ధారామాలు, రాజ స్ధానములలో ఈ దేవదాసి వ్యవస్ధ నర్తకీమణులు విషేష ఖ్యాతి పొందారు.

బ్రిటీష్ వారి పాలనలో మనకళలకు ఆరణ బాగాతగ్గింది.1930 నాటికి దక్షణదేశమున దేవాలయాలలో దేవదాసిలను బహిష్కరిస్తూ శాసనసభలో బిల్లు తీలుకు రావడంతో నృత్యకళకు గడ్డురోజులు వచ్చాయి. వీరు చేసే ఈ నృత్యాన్ని'ఆరాధనా నృత్యం' అనేవారు. ఉత్సవ సందర్బాలలో చేసే నాట్యాన్ని'కేళికా నృత్యం' అంటారు. ఆరోజుల్లో రాజుల సభలో నృత్యం చేయడానికి రాజనర్తకీలు ఉండేవారు. కాకతీయ ప్రభువు కొలువులో 'మాచల్దేవి' అనే గొప్ప నర్తకీమణి ఉండేదని శ్రీనాధుడు తన క్రీడాభిరామంలో పేర్కోన్నాడు. కుమార గిరి రెడ్డి ఆస్ధానంలో'లకుమాదేవి' శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్ధానంలో 'రంజుకంకుప్పాయి' రఘునాధ నాయకుని ఆస్ధానంలో 'ముద్దు చెంద్రరేఖ' వంటి నర్తకీమణులు జగత్ ప్రసిధ్ధులు. అలావారు చేసేనాట్యాన్ని 'నట్టువమేళం' అంటారు. ఇది ఏకవ్యక్తపరం, ఒక్కో నర్తకి వచ్చి నృత్యం చేస్తారు. సామూహికంగా అందరు కలసి నృత్యం చేయడం ఇందులో ఉండదు.

నాట్యమేళం అనే మరో సంప్రదాయ నృత్యంలో ఆలయాలలో పండుగ-పర్వదినాలలో ప్రదర్శంచే కళారూపమైన నృత్యనాటకాలు నాట్యమేళ సాంప్రదాయానికి చెందినవి. ఇవి కేవలం పురుషులు మాత్రమే ప్రదర్శించేవారు. కాకతీయ గణపతి దేవ మహారాజు గారి బావమరిది అయిన 'జయాపసేనాని', 'నృత్యరత్నావళి' అనే లక్షణ గ్రంధాన్ని రాసాడు. దాన్ని ఆధారం చేసుకుని 'సిధ్ధేద్రుడు' అనే ప్రతిభాశాలి 1302-1390 పదమూడో శతాబ్ధంలో 'భామాకలాపం' అనే అపూర్వ నృత్యకళను సృష్టించాడు. దీన్ని ప్రదర్శించడానికి అర్హులైన వారిని వెదుకుతూ కృష్ణానది పరిశర ప్రాంతాలలోని 'కూచిపూడి' (కుచేల పురం) గ్రామం చేరి అక్కడి బ్రాహ్మణ బాలురకు నృత్యశిక్షణ ప్రారంభించాడు. అలా ఆఊరి నేలపై జన్మించిన ప్రతి బాలుడు సిద్దేంద్రుని పేరు చెప్పుకుని ముక్కు కుట్టించుకుని స్వామి సన్నిధిలో జీవితంలో ఒక్కసారైనా కాలికీ గజ్జకట్టాలి అని కట్టడి చేసారు. దానికి నాటి శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులు లభించాయి.

"కూచిపూడి" అభినయ కళా సరస్వతికి ఆంధ్రులు అర్పించిన కళలలో కూచిపూడి ఒకటి.1990 నాటికి వేదాంతం లక్ష్మి నారాయణ శాస్త్రీ గారు అప్పటి పీఠాథిపతి.తొమ్మిది రాత్రులు ఏకధాటిగా సాగే తొలి తెలుగు నృత్య ప్రదర్శనం 'భామాకలాపం' ఈప్రదర్శనకు మెచ్చిన గోల్కొండ నవాబు 1675 ప్రాంతంలో అప్పటి కూచిపూడి కళాకారులకు అగ్రాహారం దానం చేసాడు.ఆభూములను వెంపటి వారు,హరివారు, వేదాంతంవారు, బుక్కవారు, పసుమర్తివారు, జోస్యులవావు, మహంకాళివారు, భాగవతులవారు పంచుకున్నారు.

1565 లో తళ్ళికోట యుధ్ధంలో విజయనగర సామ్రాజ్యం కూలిపోయాక ఎందరో కళాకారులు దక్షణానికి తరలిపోయారు.తంజావూరు రాజధానిగా దక్షణ దేశాన్ని పాలిస్తున్న అచ్యతప్ప నాయకుడు అనే తెలుగు రాజు తరలివచ్చిన కళాకారులకు అచ్చుతాపురం అనే అగ్రాహారం దానంగా ఇచ్చాడు అదే నేటి'మేలట్టూరు'వీరి నృత్యప్రదర్శనలుచూసి మేలట్టూరు వెంకటరామ శాస్త్రులువారు పన్నెండు నృత్యరూపకాలను రూపొందించారు. వీటిని ప్రదర్శించేవారిని 'భాగవతులు అంటారు.
నాయకరాజుల అనంతరం (1798-1834 @A.D) శరభోజి ఆస్ధాన గాయక నర్తకులైన చిన్నయ్య,పొన్నయ్య, వడివేలు,శివానంద అనునలుగురు నట్టవవారు సుబ్బరాయుని పుత్రులు వీరు రూపొందించినదే నేడు మనం చూస్తున్న భరతనాట్యం.

భరతనిట్యంలోని పాటలన్ని తెలుగు భాషలోనే ఉంటాయి.త్యాగరాజు తెలుగువాడై తెలుగులో రాసిన కృతులు కర్ణాటక సంగీతానికి మూలాధారం అయ్యాయి. 17 వ శతాబ్ధంలో తంజావూరు ఏలిక అయిన విజయ రాఘవుడు కూచిపూడి కేళికలనుచూసి కొన్ని మార్పులతో మెదట 'సుగ్రీవజయం' అనే యక్షగానాన్ని రచించాడు. ఈ యక్షగాన సంప్రదాయంలో 'ఉషాపరిణయం' - 'రామనాటకం'  - 'శశిరేఖా పరిణయం' వంటి కళారూపాలు నేటికి ప్రదర్శస్తున్నారు. ఇవన్ని కర్ణాటక సంగీతంలో ఉంటాయి. భీమేశ్వర పురాణంలో యక్షగాన ప్రస్తావన ఉంది. వీటినే కొందరు 'జక్కలపాట' అంటారు. రగడలు ద్విపదలు, కీర్తనలు, రేకులు, ఏలాలు మొదలగునవి యక్షగానాలలో ప్రధాన రచనా విషేషాలు. జెంప, త్రిపుట మొదలైన తాళాలకు అనుగుణంగా వీటిలో గేయ రచన సాగుతుంది.
వీధి భాగవతాల ప్రదర్శించే వారు ఇతర కులలావారు కూడా ఉన్నారు.

కేరళలో కళామండలం సంస్ధ ద్వారా వెలుగు చూసిన గోపినాధ్ -తంగమణి దంపతులు, కర్ణాటకలో శ్రీమతి వెంకటలక్ష్మమ్మ గారు,తమిళనాట నాట్య పరిరక్షణకు శ్రీమతి రుక్మిణి అరండేల్, బేబికమల, డా.పద్మా సుబ్రహ్మణ్యం, శ్రీమతి సుధారాణి రఘుపతి, చిత్రా విశ్వేశ్వరన్ కారణీభూతురాలైతే, తెలుగునాట శ్రీ బి.వి.నరసింహరావు గారిని చెప్పుకోవాలి. నాట్యంపైన అనేక చక్కటి వ్యాసాలు రాసిన వి.ఏ.కే.రంగారువు వంటి పెద్దల సేవలు నిరుపమానమైనవి.

తెలుగు సినిమాలలో ప్రధమంగా వేదాంతం రాఘవయ్య గారిచేత, గూడవల్లిరామ బ్రహ్మంగారు తన 'రైతుబిడ్డ' చిత్రంలో దశావతారముల నృత్యం చేయించారు. అలా తెలుగు సినిమాలలో పనిచేయడినికి వెంపటి పెదసత్యం, పసుమర్తి కృష్ణమూర్తి,వేదాంతం జగన్నాధశర్మ, వెంపటి చిన సత్యం మద్రాసు చేరారు. అప్పటికే ప్రపంచ ఖ్యాతి గడించిన ఉదయ శంకర్ చిత్రం 'కల్పన' ద్వార పరచయం అయ్యారు చోప్రా. రవింద్రుని శాంతినికేతన్ నుండి విచ్చేసిన మణిపూరి నర్తకుడు కామిని కుమార్ సిన్హా, కథక్ నర్తకుడు హిరాలాల్ వంటి ప్రముఖులు చిత్రసీమలో ప్రవేసించి భారతీయ నృత్యానికి సముచితస్ధానం కలిగించారు.

అలాగే 1943 లో పుట్టిన 'ప్రజానాట్యమండలి' కళారంగానికి సేవలు అజరామరం. నటరాజు రామకృష్ణ, శ్రీమతి శోభానాయుడు, శ్రీమతి అనిల్ రత్నపాప, వంటి వేలమంది కళాకారులు నృత్యకళకు ఎనలేని సేవలు అందించారు. మన సినిమాల్లో 'క్లబ్ సాంగ్స్'- 'ఐటం సాంగ్స్' రావడంతో శాస్త్రీయ నృత్యాలు వెనుకబడ్డాయి. నృత్యం మనసుకు అహ్లాదాన్ని, ఆనందాన్ని చేకూర్చుతుంది అనుడంలో ఎటువంటి సందేహంలేదు. మన శరీరంలోని నాడులను ప్రభావితంచేసి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని పరిశోధన లోతెలిసింది. మానవాళి వినోద, విజ్ఞనం కొరకు ఏర్పడినవే కళలు. వాటిని పరిరక్షించవలసినబాధ్యత మనఅందరిపైనా ఉంది.

మరిన్ని వ్యాసాలు

కరోనాను తరిమికొడదాం...
కరోనాను తరిమికొడదాం...
- డా. చిటికెన కిరణ్ కుమార్
మిశ్రమ దంతాలు(Mixed dentition)
మిశ్రమ దంతాలు(Mixed dentition)
- డా.కె.ఎల్.వి.ప్రసాద్
కొమర్రాజు లక్ష్మణ రావు.
కొమర్రాజు లక్ష్మణ రావు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
అమృతానికి మారుపేరు అమ్మ.
అమృతానికి మారుపేరు అమ్మ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
అశ్రద్ద కు..ఆనవాళ్ళు..!!(దంతవైద్య విజ్ఞాన వ్యాసం)
అశ్రద్ద కు..ఆనవాళ్ళు..!!
- డాక్టర్. కె.ఎల్. వి.ప్రసాద్
టంగుటూరి ప్రకాశం పంతులు .
టంగుటూరి ప్రకాశం పంతులు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.