నాన్న కి ప్రేమతో... - ఉషాభగావతి పేరి

నాన్న కి ప్రేమతో...

మనం ఈ భూమి మీద జీవం పోసుకున్నామంటే దానికి సూత్రధారులు అమ్మ, నాన్నే. ఒకరు తొమ్మిది నెలలు భారం మోస్తే, మరొకరు జీవితాంతం బాధ్యత వహిస్తారు. భారం కష్టం అందరూ చెప్తారు కానీ బాధ్యత వెనక ఉన్న ఒక తండ్రి ఆవేదన కోసం చాలా తక్కువ గా చర్చిస్తారు అందరూ అమ్మ కోసమే మాట్లాడతారు అమ్మ ఎన్నో కష్టాలు పడి పెంచింది, పెద్ద చేసింది అని. వాస్తవమే తల్లి పడిన కష్టాన్ని వెల కట్టలేం, వర్ణనాతీతం అది. అలానే నాన్న పడిన కష్టం కూడా మాటల్లో చెప్పలేనిది. నాన్న కష్టం కోసం మాట్లాడేవారు, పట్టించుకునే వారు చాలా అరుదుగా కనిపిస్తారు. అమ్మ జన్మనిస్తే, ఆ జన్మకి సార్ధకత నాన్న వల్ల వస్తుంది. నిరంతరం మన వెనకాల ఉండి, మనందర్ని గెలిపించి, ఆ ఘనత కూడా తీసుకోని పెద్ద మనసు గల ఒకే ఒక వ్యక్తి నాన్న. పగలు కళ్ళు తెరిచిన దగ్గరనుండి మళ్ళీ నిద్ర పోయే వరకు ప్రతి క్షణం నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అని ఎండా వాన, పగలు రాత్రి అన్న తేడా లేకుండా కష్టపడి డబ్బులు సంపాదించేది నాన్న.  తనకంటూ ఏ స్వార్ధం లేకుండా తాను ఒక పూట పస్తు ఉండి అయినా  సమయానికి అన్ని చేకూర్చేది నాన్న మాత్రమే. వంట్లో నలత గా ఉన్నా, ఒక్క రోజు పనికి వెళ్లకపోతే నా పిల్లలు ఆడిగినవి ఇవ్వలేకపోతానేమో అన్న భయంతో, ఓపిక తెచ్చుకుని పనికి వెళ్ళిపోతాడు నాన్న. నాన్న అంటేనే పౌరుషం. అమ్మలా కొన్ని విషయాల్లో జాలిపడి పోయే రకం కాదు. ఆ కఠినత్వం, ఆ రౌద్రం తన బిడ్డ భవిష్యత్తు బాగుండాలని మాత్రమే. ఏడవడం మగవారి లక్షణం కాదని అనేస్తాం. ఏం మగవారికి మనసు లేదా? వారికి బాధ వేయదా?. ఏ బాధనైనా గుండెల్లో నింపుకుని బయట గంభీరంగా కనపడతారు నాన్న. తాను బాధపడుతున్నాడని ఎప్పుడూ పక్కనున్న భార్య కి కూడా తెలియనివ్వడు తను బాధపడుతుంది అని, అంత కోమలమైన మనస్సు ఆయనది. కూతుర్ని ప్రాణాంకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు నాన్న. తనలో అమ్మని చూసుకుంటాడు. అలా అని కొడుకు మీద ప్రేమ ఉండదని కాదు. కూతురు కొంత సమయం వరకే తండ్రి దగ్గర ఉంటుంది. మంచి వరుడ్ని చూసి ఒక అయ్య చేతిలో పెట్టి రెండు వంశాల గౌరవం కాపాడగలిగే స్తోమత నా కూతురు కి ఉందని గర్వ పడతాడు తండ్రి. వరుడ్ని వెతకదానికి తాను పడే ఆరాటం, బాధ్యత అంతా ఇంతా కాదు. నాలానే నా బంగారు తల్లికి గుండెల్లో పెట్టుకుని చూసుకునే భర్త రావాలని ఎంతో ఆచి తూచి అడుగు వేస్తాడు. తండ్రి తన ఈ ప్రయత్నం ఎక్కడ బెడిసుకొట్టినా, కూతురి కంట ఒక్క కన్నీరు చుక్క చూసినా, లోలోన కుమిలిపోతాడు. కొడుకు తండ్రి పౌరుషం అయితే, కూతురు తండ్రి నమ్మకం. నాన్న నమ్మకాన్ని కూతురు ఎప్పుడూ కాపాడుతుంది అన్న నమ్మకం తో, పుట్టిన దగ్గర నుండి చివరి వరకు గుండెల్లో దాచుకుంటాడు. కొడుకు వంశాభివృద్ధి కి కారకుడు, ఎప్పుడూ తండ్రి తోనే ఉంటాడు. కొడుకు తన కన్నా పది అడుగులు ఎత్తుకి ఎదగాలని నిరంతరం శ్రమిస్తాడు. తన కన్నా ఎత్తుగా ఎదిగిన కొడుకుని చూసి అందరికన్నా ఎక్కువ గర్వ పడేది, ఆనంద పడేది తండ్రి మాత్రమే.  ఆ రోజు కోసమే తన జీవితం ధార పోసేస్తాడు. ప్రస్తుత సమాజంలో కొడుకు తన భాద్యత మరిచిపోయనా, నా కొడుకు ఎక్కడున్నా పిల్ల పాపలతో, సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి రోజు దేవుడ్ని మనసులో కోరుకుంటూనే ఉంటాడు. ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా వున్నప్పుడు, నేనున్నాను అని వెనక నిలుచునేది నాన్న ఒక్కరే. నువ్వు గెలిచినప్పుడు పది మందికి గర్వంగా చెప్పుకుని ఆనందపడేది నాన్న ఒక్కరే. కోపంగా మాట్లాడితే నాన్నకి ప్రేమగా మాట్లాడడం రాదని అనుకున్నా, మౌనంగా మాట్లాడకుండా కూర్చుంటే , మాతో మాటలు ఆడడం ఆయనకి ఇష్టం లేదని అని అనుకున్నా, ఒక బిడ్డకి నాన్న మనసు, తను తండ్రి  అయినప్పుడే అర్ధం అవుతుంది. ఆకోపం వెనక ఉన్న నీ ప్రేమ, ఆ మౌనం వెనక ఉన్న నీ భావం, అతి చనువుగా ఉంటే మేము మీ మాట వినకుండా గారాబం ఎక్కువైపోతుందని ఆ ప్రవర్తన కి అంతరార్ధం అని , అది మేము అనుభవిస్తేగాని అర్ధం కాలేదు మాకు. తీసే ప్రతి ఊపిరి నీ భిక్షే నాన్న, ఏం చేయను నీ రుణం తీర్చుకోవడానికి . అమ్మలా మనసులో భావాలు వ్యక్తపరచలేరు, గంభీరత్వం అతని నైజం కనుక. పిల్లలుగా ఆయన్ని అర్ధం చేసుకోవడం మన ధర్మం. నాన్నకు గుప్పెడంత నమ్మకం, ఎప్పుడూ మీరు అందరికన్నా గొప్పే నాన్న అన్న భరోసా ఇస్తే చాలు, ఆయన జీవితాంతం సంతోషంగా ఉండడానికి. ఎప్పుడూ మదర్స్ డే కి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు మెల్లగా నాన్న ని కూడా అభిమానించడం  మొదలుపెట్టేరని అర్థమౌతోంది. ఈ ఒక్కరోజే కాక ప్రతి రోజు ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకోగలిగితే అదే ఆయనకి  మనం ఇచ్చే గౌరవం, మర్యాద. చిన్నప్పుడే  తల్లిని పొగుట్టుకున్న మేము, ఎన్నో కష్టాలు పడి మా అందరికీ తన సర్వస్వం ధారపోసి, ఒక మంచి జీవితం ఇచ్చిన మా నాన్న గారికి రుణం తీర్చుకోలేం అని మనసారా తెలియచెప్పే క్షణం ఇది. మేమెంత ఎత్తుకు ఎదిగిపోయినా సరే, ప్రపంచానికి ఆయన మా నాన్నగారు గా కాక మేమంతా ఆయన పిల్లలు గానే పరిచయం అది మా పూర్వజన్మ సుకృతం. ఏ లోకం లో ఉన్నా మీ చల్లని చేయి మా అందరి పై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ... "ఉషభగవతి పేరి"

మరిన్ని వ్యాసాలు

మోక్షప్రదాయని చిదంబరం.
మోక్షప్రదాయని చిదంబరం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బహుముఖ ప్రజ్ఞాశాలి తురగా జానకిరాణి.
బహుముఖ ప్రజ్ఞాశాలి తురగా జానకిరాణి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
చదువులతల్లి...
చదువులతల్లి...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
దక్షణాది నటి జయంతి.
దక్షణాది నటి జయంతి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Prakrithi-purushudu-aatma
ప్రకృతి - పురుషుడు - ఆత్మ
- కందుల నాగేశ్వరరావు