రావి నారాయణ రెడ్డి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

రావి నారాయణ రెడ్డి.

రావి నారాయణరెడ్డి .
తెలంగాణ సాయుధ పోరాటయోధుడు.పార్లమెంట్ సబ్యులు,శాసనసభసభ్యులు,మానవతావాది అయినవురు నల్గొండజిల్లా బొల్లారం గ్రామంలో భూస్వామికుటుంబంలో 1908 జూన్ 4 జన్మించారు.హైదరాబాద్ నిజాం కాలేజిలో చదవారు.1927-28 మధ్యలో ఆకాలంలో ప్రజలనుండి పెత్తందార్లు చేసేబలవంతపు వసూళ్ళు వ్యతిరేకించారు.తొలిదశలో ఆంధ్రమహాసభ, ఆంధ్రజనసంఘం ఏర్పరిచిన సాంస్కృతిక చైతన్యం వల్ల ప్రభావితమైనాడు నిజాం పరిపాలనలో తెలంగాణాలో రాజకీయ చైతన్యం లేని స్థితిలోనే ఆయన పోరాటాన్ని ప్రారంభించాడు రెడ్డి హాస్టల్ విద్యార్థిగా ఉండగానే అప్పటి నిజాం కళాశాల విద్యార్థి అయిన బద్దం యెల్లారెడ్డితో కలసి 1930 సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో కాకినాడ వెళ్లి మరీ పాల్గొన్నాడు.1931లో హరిజన సేవాసంఘాన్ని నెలకొల్పి దాని ప్రధాన కార్యదర్శి హోదాలో హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారంభించాడు రెండు వసతి గృహాలను నిర్వహించాడు. 1930లో బ్రిటిష్ ప్రభుత్వం మహాత్మా గాంధీని అరెస్టు చేయగా, దానికి నిరసనగా హైదరాబాద్‌లోని హస్మద్ గంజ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించాడు. బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడాడు. హైదరాబాద్ సంస్థానంలో బ్రిటిష్ అధికారిగా వ్యవహరించే బ్రిటిష్ రెసిడెంట్, తన గూఢచారుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని, కొత్వాల్ రాజబహదూర్ వెంకట రామారెడ్డిని ఇంటికి పిలిపించి రావి నారాయణరెడ్డిని హెచ్చరించవలసిందిగా సూచించాడు. పాతికేళ్ళ ప్రాయంలోపుగానే దేశభక్తి, రాజకీయ పోరాటం పట్ల దృఢచిత్తాన్ని ఏర్పరుచుకున్నాడు. 1931లో దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్ర మహాసభలకు తన తోటి విద్యార్థులను పోగుచేసి పాదయాత్రగా ఆంధ్రోద్యమాన్ని ప్రచారం చేస్తూ హైదరాబాద్ నుంచి దేవరకొండ చేరుకున్నాడు. మహాసభల్లో చురుకైన పాత్ర వహించాడు.
నిజామాంధ్ర మహాసభలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆర్యసమాజ్, హిందూ మహాసభలతో కలిసి పనిచేసిన కమ్యూనిస్టుగా ఆయన ఆచరణ విశిష్టమైనది. ప్రజాజీవితంలో ఉన్న నాయకులు ఒక కీలకమైన చారిత్రక సన్నివేశంలో సిద్ధాంతపరంగా విభేదించే శక్తులతో ఐక్య సంఘటన ఏర్పరచి ఏకతాటిపై ఉద్యమాన్ని ఎలా నిర్మించవచ్చో తన ఆచరణ ద్వారా నిరూపించిన ప్రజాస్వామికవాది ‘రావి’. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌పై పోటీచేసి నెహ్రూకన్నా అధిక ఓట్లతో గెలిచి, పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఖ్యాతి ఆయనకే దక్కింది.ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ప్రజాపోరాటానికి చూపునిచ్చిన జననేతగా ప్రసిద్ధుడు. ఆంధ్ర మహాసభకు ఆధ్యక్షుడుగా పనిచేశాడు. తెలంగాణ విమోచన తరువాత ఆయన సిపిఐ లో చాలాకాలం పనిచేశాడు. రావి నారాయణరెడ్డి విశాలాంధ్ర కోసం ఎంతో శ్రమించాడు. నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం. 1946-48 కాలంలో హైదరాబాదు సంస్థానంలో నిజాం పోలీసుల దాష్టీకాన్ని, మతదురహంకారులైన రజాకార్ల ఆగడాలనూ అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటుచేసాడు.జాతీయోద్యమం బలంగా వేళ్లూనుకున్న ప్రాంతాల్లో మాత్రమే కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉంటుందని, అందుకు కారణం ఉద్యమంలో పాల్గొన్న అనుభవం వలన వాళ్లు కేవలం విడివిడి వృక్షాలను కాక, మొత్తం అరణ్యాన్ని చూడగలరన్నది ఆయన విశ్వాసం. ఆంధ్రమహాసభ కార్యకలాపాల్లో క్రియాశీలంగా పాలుపంచుకొన్న అనుభవంతో రాటుదేలడం వల్లే తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులు గణనీయమైన విజయాలను కైవసం చేసుకోవడం సాధ్యమైందని ఆయన తరచు అంటుండేవాడు. 1941లో నల్లగొండ జిల్లా చిలుకూరులో జరిగిన ఎనిమిదవ నిజామాంధ్ర మహాసభకు, 1944లో భువనగిరిలో జరిగిన మహాసభకు ఆయనే అధ్యక్షత వహించాడు. భువనగిరి సమావేశాల్లోనే ఆంధ్రమహాసభ అతివాద, మితవాద శిబిరాలుగా చీలిపోయింది.దేశ స్వాతంత్య్రానికి ముందు సాగిన సాయుధ పోరాటాన్ని వ్యూహాత్మకంగా సమర్థించిన రావి నారాయణరెడ్డి 1947 తరువాతి కాలంలో పోరాటాన్ని కొనసాగించాలనే ‘మెజారిటీ’ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను, సమ సమాజ ఆకాంక్షలతో కలగాపులగం చేయడం వల్లే పార్టీ, 1948 ఫిబ్రవరిలో పోరాటం కొనసాగించాలనే తప్పుడు నిర్ణయం తీసుకుందన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. చరిత్ర ఆయన మార్గమే సరైనదని తీర్పు చెప్పడం విశేషం. కాళోజీ నారాయణరావు ప్రవచించిన ‘వేరు తెలంగాణ’ను తాత్వికంగా వ్యతిరేకించడంతో ఆగక, తాను ఎన్నటికీ ‘వీరతెలంగాణ’ వాదిగానే ఉంటానని చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ రావి నారాయణరెడ్డి. తన స్వంత భూమిని 200 ఎకరాలు దానం చేశారు.'వీరతెలంగాణా నాఅనుభవాలు-జ్ఞాపకాలు'అనెపేరున 1976 ఒపుస్తకం రచించారు.ప్రజలు అందరికి ప్రజాస్వామ్య పాలన,సమన్యాయం ఉండాలని పోరాడినవురు 1991 సెప్టెంబర్ 7 న తుదిశ్వాసవిడిచారు.