పేరిణి నృత్యం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

పేరిణి నృత్యం.


పేరిణి నృత్యం .
శివుని శాసనమున-తండువు భరతునకు ఉధ్ధతముగా నిరూపించిననృత్యము.ఈనృత్యం'తండుని'పేరునతాండవమనబడింది.పేరణి ఈనృత్యంలో సంచలనాన్నినాలుగురీతులుగా పేర్కేన్నారు.1)మండలము:- దేహభంగిమ. 2)ఉత్ల్పవనము :-గంతు. 3) భ్రమరి :-తిరుగుట. 4) పాదాచారి:- ముందుకు-వెనుకకువెళ్ళుట.తాండవంలేదా పేరిణిశివతాండవం తెలుగు వారి ఒక ప్రాచీన నృత్యం. దీన్నే "యోధుల నృత్యం" అని కూడా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో యోధులు యుద్ధరంగానికి వెళ్ళబోయే ముందు పరమ శివుడి ముందు ఈనాట్యాన్నిఅత్యంతభక్తిశ్రద్ధలతోప్రదర్శించేవారు. ఓరుగల్లును దాదాపు రెండు శతాబ్దాల పాటు పాలించిన కాకతీయుల హయాంలో ఈ కళ బాగా పరిఢవిల్లింది. ఈ నృత్యం మనిషిని ఉత్తేజపరుస్తుందనీ శివుడికి నివేదనగానూ పరిగణిస్తారు. ఈ కళకు సంబంధించిన ఆధారాలు ఓరుగల్లుకు సమీపంలో ఉన్న రామప్ప దేవాలయంలో గల శిల్పకళలో గమనించవచ్చు. లయబద్ధంగా సాగే డప్పుల మోత దీనికి సంగీతం. ఈ కళాకారులు నాట్యం చేస్తూ ఆ పరమశివుణ్ణే తమ దేహంలోకి ఆహ్వానించి అలౌకికమైన అనుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు. కాకతీయుల శకం ముగియగానే ఈ కళ దాదాపుగా కనుమరుగైపోయింది. మళ్ళీ ఆంధ్ర నాట్య పితామహులుగా పిలవబడే ఆచార్య నటరాజ రామకృష్ణ కృషితో మళ్ళీ వెలుగులోకి వచ్చింది.పేరిణి నృత్యం చేసే ప్రతి వ్వక్తీ శివుణ్ణి తనలో ఆవహించుకుని ఆవేశంతో నృత్యం చేస్తాడు. మేళవింపు విధాన పేరణికి అతి ముఖ్యమైనది. ఓ పరమశివా? నాలో శివ శక్తిని ప్రవేశింపచేసి, నా శరీరాన్ని పవిత్ర మొనరించి, నాశరీరం ద్వారా నీ పవిత్ర నృత్యాన్ని లోకానికి ప్రసాదించు అని ప్రార్థిస్తూ, ఈ నర్తనాన్ని ప్రారంభించాలి. ఈ ప్రారంభమే నృత్యకారుల్లో ఆవేశ పరుస్తుంది. ఆ ఆవేశంతోనే నృత్యకారుడు పేరిణి నృత్యాన్ని శివ తాండన నృత్యంగా మలుచుకుంటాడు. పేరిణి తాండవం రెండు విధాలు. ఒకటి పురుషుల చేతా, రెండవది స్త్రీల చేతా చేయబడుతుంది. పురుషుని యొక్క పురుషత్వాన్ని లోకానికి తెలియచేస్తూ ప్రదర్శించే నర్తనమే పేరిణి శివ తాండవం. ఇది వీరులు చేసిన వీర నాట్యం.ఈ నృత్య భంగిమలు రామప్ప దేవాలయంలోని శిల్పంలో కనబడుతాయి. సంగీతానికి సప్తస్వరాలు ప్రాణం. అలాగే మృదంగానికీ త, ది, తో, ణం, ఆధారమైనట్లు, నృత్యం ఎన్ని విధాలుగా రూపొందినా దానికి ప్రధాన స్థానాలు ఎనిమిది మాత్రమే. ఇటివంటి మూల సూత్ర స్థానాలు రామప్ప శిల్పంలో రూపొందించ బడ్డాయి. అంతే కాదు ఆ స్థానాలను ప్రయోగించేటప్పుడు, వాయించ వలసిన తొలి మృదంగ శబ్ధాన్ని ఎంత తూకంలో ప్రయోగిస్తే ఆ విన్యాసం పూర్తిగా వికసించటానికి అవకాశముందో ఆ హస్త విన్యాస క్రమం, మొదలైన వెన్నో ఆ మృదంగ భంగిమలో రామప్పమలిచాడంటుంది ఉమావైజయంతీమాల.
కాకతీయుల కాలంలో ఆరాధనా నృత్యాలు బహుళ ప్రచారంలో వుండేవి. ఇవన్నీ శివపరంగా, పశుపతి సంప్రదాయానికి అనువుగా వుండేవి. నాటి పశుపతులు, సంగీత నృత్యాలతో శివుని పూజించేవారు. అవి కాలానుగుణ్యంగా ఉదయమూ, మధ్యాహ్నమూ, రాత్రి సమయం లోనూ ప్రదర్శింపబడేవి. ఇవి మూల విరాట్టుకు ఎదురుగా వున్న నాట్య వేదికలలో ప్రదర్శింపబడేవి. అలాంటి నాట్య వేదికలు ఈ నాటికీ వరంగల్ కోట లోనూ, హనుమకొండ వెయ్యి స్థంభాల గుడి ముఖ మండపంలోనూ, పాలంపేట రామప్పదేవాలయంలోనూ చూడ వచ్చును.మాచర్లలో నున్న శివకేశవుల దేవాలయాల్లో, దేవతామూర్తుల ముందు పేరిణి నృత్యాన్ని భక్తి భావంతో ప్రదర్శించేవారు. అంతే కాదు శైవ క్షేత్రాలైన కోటప్ప కొండ, శ్రీశైలం మొదలైనపుణ్యక్షేత్రాలలో శివరాత్రి మహోత్సవాలలో పేరిణి నృత్యానికి సంబంధించిన కొన్ని జతులు ప్రదర్శింప బడేవి.ఈనాటికీ మాచర్ల సమీపంలో వున్న కారంపూడి గ్రామంలో పల్నాటి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరుల దినోత్సవం ప్రతి సంవత్సరమూ జనవరిలో జరుగుతుంది. అక్కడ వీరుళ్ళ దేవాలయా లున్నాయి. ఆ వుత్సవాల్లో నేను కళ్ళారా చూచిన పేరిణి నృత్యం లోని కొన్న జతులు ప్రదర్శీప బడ్డాయి. ఆ నృత్యాలు మహా ఉత్తేజంగా వుండేవి. ప్రేక్షకులను ఉద్రేక పర్చేవి. పూర్వ వీరులు ఔన్నత్యాన్ని చాటేవి. నిజానికి అవి జానపద నృత్యంగా కనిపించినా అది శాస్త్రీయ నృత్యంగానే కనిపించేది. వీరుల ప్రతిమలకు ఎదురుగా నిలబడి, సాంబ్రాణి ధూపంలో మునిగి పోయి, సన్నాయి వాయిద్యాల వీరంగంతో ఉత్తేజం పొంది చేసే ఆ పేరిణి జతుల నృత్యం ప్రేక్షకులకు కూడా వెర్రి ఎక్కించేది. వీరశైవ పేరిణి నృత్య ప్రభావం అంతటిది. అయితే అది ఆనాడు శాస్త్రీయతను కోల్పీయి, గణాచారుల నృత్యంగా మిగిలి పోయింది.
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

మరిన్ని వ్యాసాలు

Kashi Prayana Kathalu - tikkala raju
కాశీ ప్రయాణ కథలు - తిక్కలరాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Baruvu badhyatha
బరువు బాధ్యత!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - Sthithapragnudu
కాశీ ప్రయాణ కథలు - స్థితప్రజ్ఞుడు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Offer lo konna jeevitham
ఆఫర్‌లో కొన్న జీవితం !
- బొల్లిముంత వెంకట రమణారావు
Kashi Prayana Kathalu - vikatakavi telivi
కాశీ ప్రయాణ కథలు - వికటకవి తెలివి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు