నోబెల్ కవిత్వం: పుస్తక సమీక్ష - సిరాశ్రీ

nobel kavitvam book review
నోబెల్ కవిత్వం
రచన: ముకుంద రామారావు
వెల: 170/-
రచయిత దూరవాణి: 9908347273

భారతీయ చలన చిత్రం పుట్టి 100 ఏళ్లయ్యిందని ఉత్సవాలు చేసుకుంటున్నాం. మాధ్యమాలు కూడా గత శతాబ్దంగా వచ్చిన సినిమాల కార్యక్రమాలతో తమ వంతు ప్రచారం చేస్తున్నాయి. అయితే మనం గుర్తు తెచ్చుకోవాల్సిన మరో విషయం మన దేశానికి సాహిత్యంలో నోబెల్ వచ్చి కూడా ఇప్పటికి 100 ఏళ్లు అయ్యింది. అవును, రబీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి కవిత్వాన్ని నోబెల్ సాహితీ బహుమతి 1913 లో వరించింది. అదే మొదటిది, ఇప్పటి వరకు చివరిది కూడా. మధ్యలో కొందరు నోబెల్ కవులు భారత దేశంలో పుట్టినా వారి జాతీయతను అనుసరించి అవి మన దేశం ఖాతాలో పడలేదు.

ఈ వందేళ్లలో మన కవిత్వం ఏ మేరకు పురోగతి సాధించింది? అసలు 100 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న భారతదేశం నుంచి నోబెల్ బహుమతి అందుకునే స్థాయి కవి అసలు పుట్టలేదా? ఈ ప్రశ్న అడిగితే చాలా మంది "అబ్బే, నోబెల్ బహుమతి చుట్టూ రాజకీయాలేనండి. అవి మన దేశస్థులకి ఇవ్వరు. ఐరోపా ఖండాల వారికే ఇచ్చి కూర్చుంటారు" అనేస్తారు. "అందని ద్రాక్ష పులుపు..." సామెత ఊరికే రాలేదు మరి.

రాకపోతే రాకపోయింది, అసలు ఆ దిశగా ప్రయత్నాలు చేసింది ఎందరు? ఆ లక్ష్యం ఉన్నది ఎంతమందికి? ఇంతకీ నోబెల్ బహుమతి పొందిన కవితలు ఏమిటి? అవి రాసింది ఎవరు? బహుమతి ఎందుకిచ్చారు?

ఇటువంటి ఎన్నో ప్రశ్నలకి చక్కని సమాధానం ఈ పుస్తకం. అసలంటూ విషయం తెలిస్తే కవులకి ఒక కొత్త మార్గం చూపినట్టు అవుతుంది. అటువంటి మార్గాన్ని చూపే ప్రయత్నంలో ముకుంద రామారావు కృతకృత్యులైనట్టే.

1901 నుంచి నేటి వరకు నోబెల్ బహుమతి పొందిన కవులందరి జీవిత విశేషాలతో పాటు, వారి కవితలన్నీ తెలుగులోకి తర్జుమా చేసి అందించడమంటే అదేమీ అషామాషీ వ్యవహారం కాదు. అంతర్జాలంలో వెతికితే నోబెల్ కవుల వివరాలు, నాలుగు లైబ్రరీలు తిరిగితే వారి సమగ్ర రచనలు దొరికేయవచ్చు ఏమో గాని, ఆ కవిత్వాన్ని మధించి, శోధించి తెలుగు అర్ధాన్ని సాధించి పాఠకులకి అందజేయాలంటే ఒక తపస్సే చెయ్యాలి.

రామారావు గారి తపస్సు ఫలించింది. తెలుగు సాహితీ వనంలో ఒక కొత్త పరిశోధనా గ్రంథం పుష్పించింది. నా మట్టుకు నాకు అర్ధమయ్యిందేమిటంటే, భారతీయ కవులు చాలా మందికి నోబెల్ స్థాయికి మించి కవిత్వం రాయగల శక్తి ఉన్నా తమ రచనల్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించుకోవడంలో మాత్రం ఇప్పటి వరకు నిరక్షరాశ్యులుగానే ఉన్నారు. 

మరిన్ని సమీక్షలు

సున్నితం చంద్రికలు
సున్నితం చంద్రికలు
- రాము కోలా.దెందుకూరు.
మహాభావాలు కవితా సంకలనం
మహాభావాలు కవితా సంకలనం
- రాము కోలా.దెందుకూరు
పరిగె నుండి తమి  వరకు
పరిగె నుండి తమి వరకు
- బి.కృష్ణారెడ్డి
ఆలోచింపజేసేకథలు
ఆలోచింపజేసేకథలు
- అనీల్ ప్రసాద్, ఆకాశవాణి, వరంగల్
కె.ఎల్.వి.ప్రసాద్
కె.ఎల్.వి.ప్రసాద్
- శ్రీ అనీల్ ప్రసాద్ (ఆకాశవాణి, వరంగల్)