మన సినిమా - ఫస్ట్ రీల్ - v.srinivasa rao

మన సినిమా - ఫస్ట్ రీల్

సినీ చరిత్రను సరిదిద్దిన ఒక్క మనిషి భగీరథ ప్రయత్నం... ‘మన సినిమా... ఫస్ట్ రీల్-

“తమిళంలో మేము అనుకుంటున్న మా మొదటి సినిమా ఫలానా తేదీన విడుదలయ్యింది. ఇదుగో ప్రూఫ్! మరి తెలుగులో మీ మొదటి సినిమా ఎప్పుడు రిలీజైందన్న సాక్ష్యాధారాలు ఏవైనా ఉన్నాయా?” అని తనను వ్యంగ్యం గా అడిగిన తమిళ సినీ చరిత్రకారుడైన ఓ పెద్దమనిషికి సరియైన సమాధానం చెప్పాలని బయలుదేరారు రచయిత రెంటాల జయదేవ. అలా మొదలైన తపన ఆసాంతం ఓ తపస్సుగా సాగింది. దాని ఫలితమే ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ రచన. ఆ సత్యాన్వేషణలో బయల్పడిన నిజాలు ఎన్నెన్నో!

'తెలుగు వారి సినిమా చరిత్ర నిలబడాలి, ఆ గొప్పదనం అందరికీ తెలియాలి’ అని సత్యనిష్ఠతో, నిజాయతీగా చేసిన తపస్సు ఫలించింది. 'మనం ఎవరి కన్నా తక్కువ కాదు, నిజం మాట్లాడితే... ఒక మెట్టు ఎక్కువే’ అన్నది ఆ పరిశోధనా తపః ఫలితంగా రుజువైంది. మన తొలి మూకీలు, టాకీల నాళ్ళ సినీ చరిత్రలో ఆ సంగతులన్నీ సాక్ష్యాధారాలతో సహా మనముందుంచారు రెంటాల జయదేవ. ‘నిజమే వ్రాయాలి, సత్యమే చెప్పాలి, నా అంతరాత్మకు నేను జవాబుదారీ, చేసేది సరిగ్గా ఉండాలి, నిజాయితీగా నా వంతు చేసిన కృషి’ అని ఆయన నిటారుగా నిలబడి చేసిన 'మన సినిమా... ఫస్ట్ రీల్' రచన వెనుక అక్షరాలా పాతికేళ్ళ సినీ సాగర మథనం ఉంది. యువకుడిగా తన వ్యక్తిగత జీవితాన్నిపణంగా పెట్టిన త్యాగం ఉంది.

పట్టుదల, నిజాయితీ, కఠోర పరిశ్రమా, తిరిగిరాని సమయం, ఖర్చుకు వెనుకాడని తత్వం, పరిశోధన, నిజాన్నిపలుకోణాల్లో పరి పరి విధాల రాబట్టి కానీ రాజీ పడని మనస్తత్వం, సాంకేతికత అంతగా రాని - లేని రోజుల నుండి సాక్ష్యాధారాలను సేకరించి నిజాలను నిగ్గు తేల్చిన సత్యాన్వేషణా... ఈ పుస్తకం నిండా ప్రతి పేజీలో కళ్ళు చెదిరేలా చేస్తాయి. కళ్ళార్పకుండా చూస్తూ, చదివేలా చేస్తాయి.

తొలి పూర్తి నిడివి తెలుగు టాకీ అయిన 10 రీళ్ళ 'భక్త ప్రహ్లాద' రిలీజ్ తేదీ కోసం అన్వేషిస్తూ ఆ అలుపెరుగని పయనంలో పుణే, బొంబాయి, ఢిల్లీ వరకు ఆయన వెళ్ళవలసి వచ్చింది. అప్పటికి 11 రోజులు గడచి పోయాయి. మరునాడే రిటర్న్ ఫ్లయిట్. టికెట్ కూడా బుక్ అయ్యింది. కావలసిన సమాచారం లభ్యం అవ్వట్లా? ఆ సమయంలో దిక్కు తోచని పరిస్థితి. కళ్ళల్లో నీళ్ళు... మనసు నిండా వేదన. జయదేవ మాటల్లోనే చెప్పాలంటే... “భగవంతుడినీ, అమ్మానాన్నలనీ ప్రార్ధించాను. 'నీవే తప్ప ఇతరం బెరుంగ...’, ‘అన్యధా శరణం నాస్తి' అన్నట్లుగా ఉంది నా పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఆ చివరి రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో అన్నాళ్ళుగా నేను వెతుకుతున్న రిలీజ్ తేదీ సాక్ష్యం కనుల ముందు కనిపించింది. నా మొర భగవంతుడు ఆలకించినట్లు అర్థమయ్యింది.”

అప్పటివరకు అనేక దశాబ్దాలుగా 1931 సెప్టెంబర్ 15న ‘భక్త ప్రహ్లాద’ రిలీజ్ అనుకుంటున్నారు అందరూ. కానీ, చరిత్రలో ఆ తేదీ తప్పుగా నమోదైందనీ, తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ అసలు రిలీజ్ తేదీ 1932 ఫిబ్రవరి 6 అనీ ఆ ప్రకటన సాక్షిగా ప్రపంచానికి తెలియజేశారు జయదేవ. ఇది పుష్కర కాలం క్రితం 2011లోనే ఆయన పరిశోధనాత్మకంగా బహిర్గతం చేసిన సంగతి. దానికే ఆయనకు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు లభించడం విశేషం.

ఆ తరువాత కూడా ఆయన శోధన ఆగలేదు. మన సినిమా చరిత్రను సాక్ష్యాధారాలతో సహా పునర్నిర్మించే సాధన ఆపలేదు. అందరం ‘భక్త ప్రహ్లాద’ (రిలీజ్ 1932 ఫిబ్రవరి 6) మొట్టమొదటి తెలుగు టాకీ సినిమా అనుకొంటాం, కానీ అంతకు మూడు నెలల పైచిలుకు మునుపే వచ్చిన 'కాళిదాస్' (రిలీజ్ 1931, అక్టోబర్ 31) లోని డైలాగులు అచ్చంగా తెలుగు అనీ, ఆ ప్రదర్శనలోనే తెరపై తెలుగు త్యాగరాయ కీర్తనలు వినిపించారనీ, ఆ కథాచిత్రంలో హీరో పేరు వి.ఆర్. గంగాధర్ అనీ, అతను తెలుగువాడనీ, దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి ఎలాగూ తెలుగువాడనీ తాజాగా నిజ నిరూపణ చేశారు రెంటాల జయదేవ. ఇంకా లోతుల్లోకి వెళ్ళి, ఆ సినిమా పాటల పుస్తకం సాక్షిగా... అసలు ‘కాళిదాస్’ అనేది ఒకటి కాదు... 3 చిన్న లఘు చిత్రాల కదంబమనీ, అన్నీ తక్కువ తక్కువ నిడివివే కావడంతో ఒకదాని తరువాత మరొకటిగా మూడూ కలిపి ఒకే ప్రదర్శనగా సినిమా హాళ్ళలో తెరపై ప్రేక్షకులకు చూపిన “ప్రోగ్రామ్” అనీ... నిగ్గుతేల్చారు. (చూడండి... పేజీలు 205, 219).

కేవలం 4 రీళ్ళ లఘు కథా చిత్రమే అయిన ‘కాళిదాస్’ అచ్చంగా తెలుగు సినిమాగానే ఆరంభించారనీ, అలాగే తీశారనీ, అందులో పూర్తిగా తెలుగు డైలాగులే ఉన్నాయన్న విషయాన్ని ఆ చిత్ర హీరోయిన్ ఇంటర్వ్యూ, అలాగే ఆ సినిమాపై అప్పట్లోనే తమిళ ‘ఆనంద వికటన్’ పత్రికలో రచయిత కల్కి రాసిన సినిమా సమీక్ష ఆధారంగా నిర్ద్వంద్వంగా నిరూపించారు. ఇప్పటి వరకు మనకే తెలియని మన సినిమా చరిత్రలోని వాస్తవాలను బహిర్గతం చేశారు. చరిత్రలో మరుగునపడిపోయిన సత్యాన్ని మన ముందు ఉంచారు. తమిళులు తమ చరిత్రలో కలిపేసుకోగా, మనం తెలుగువాళ్ళం వదిలేసుకున్న మన టాకీగా ‘కాళిదాస్’ను ఇకనైనా మన సినిమా పరిశ్రమ పెద్దలు, ప్రభుత్వాలు, భావి చరిత్రకారులు తలకెత్తుకోవాల్సి ఉందని తేల్చి చెప్పారు. ఇది ఇన్నేళ్ళ మన సినిమా చరిత్రను మార్చేసే అనన్య సామాన్యమైన, అపూర్వ పరిశోధన.

అదే విధంగా మన ‘భక్త ప్రహ్లాద’ రిలీజైన రెండు నెలల తర్వాత వచ్చిన ‘హరిశ్చంద్ర’ (రిలీజ్ 1932 ఏప్రిల్ 9) చిత్రమే తొలి పూర్తి తమిళ టాకీ అన్న సంగతి, ఆ తరువాతే ‘గాలవ’ చిత్రం వచ్చిందనీ, ఆ ‘గాలవ’ చిత్రమే రెండో పూర్తి తమిళ టాకీ అనీ, సదరు ‘గాలవ’ అసలు రిలీజ్ తేదీ (1932 జూలై 9) సంగతి... ఇలాంటివన్నీ ఈ పుస్తకంలో రచయిత రెంటాల జయదేవ ఆధారసహితంగా నిరూపించారు (చూడండి... పేజీ 321). తమిళ సినీ చరిత్రలోని ఖాళీలను సైతం పూరించారు.

ఇక తొలి కన్నడ టాకీ ‘సతీ సులోచన’ (రిలీజ్ 1934 మార్చి 3) రూపకల్పనలో మన తెలుగు దర్శకుడు వై.వి. రావు పడిన కష్టాలు, ఆ చిత్రానికి సంగీత దర్శకత్వ వ్యవహారాలు చూసిన తెలుగు వాడు హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి జీవితాన్ని జయదేవ ఈ పుస్తకంలో వివరించారు. ఇవాళ్టికీ కన్నడ సినిమా చరిత్రలో చరిత్రకారులు తొలి కన్నడ టాకీ హీరోయిన్ త్రిపురాంబ అంటూ కె.ఎల్.వి. వసంత అనే తమిళ సినీ నటి ఫోటో వేస్తున్న సంగతిని ఆయన బహిర్గతం చేశారు. అదీ 1946 నాటి తమిళ ‘సులోచన’ సినిమాలోని ఫోటోను తొలి కన్నడ సినిమా హీరోయిన్ అంటూ ప్రచురిస్తున్న సంగతిని... ఆ ఇద్దరి ఫోటోలు, ఆ రెండు సినిమాల అప్పటి పత్రికా ప్రకటనలు పక్క పక్కనే వేసి మరీ సాక్ష్యాధారాలతో సహా జయదేవ నిరూపించారు (చూడండి... పేజీలు 438 -439). అలా ఈ ‘ఫస్ట్ రీల్’ రచన కన్నడ సినీ చరిత్రలోని తప్పులను సైతం సరిదిద్దింది.

నిజం చెప్పాలంటే... ప్రతి సినీ ప్రేమికుడూ, సినిమా చరిత్రను ఇష్టపడేవారూ చదివి ఆనందించే, ఆశ్చర్యపడే సంఘటనలు, సందర్భాలు, సత్యాలెన్నో కొల్లలుగా కనిపిస్తాయీ ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకంలో! వాటిలో నుంచి మచ్చుకు కొన్ని పేర్కొంటాను:

- నలభై రెండేళ్ళ కాలంలో ఒకే కథ మూడుసార్లు తెరకెక్కగా… ఒకే నటుడు ఆ మూడుసార్లూ అదే పాత్రను పోషించడం, అదే పాటను, మూడు సినిమాల్లోనూ పాడడం... 'ఆలమ్ ఆరా' (అంటే అర్థం ప్రపంచ కాంతి అట) లోని ఫకీర్ పాత్రధారి డబ్ల్యూ.ఎం. ఖాన్ కు సాధ్యమయ్యిందనీ , ఆయన ఫొటోతో సహా ఈ రచనలో చూస్తాం.

- అసలు దక్షిణ కలకత్తా లోని ఒక ప్రాంతం పేరు ‘టాలీ గంజ్’ అనీ, తొలి రోజుల్లో స్టూడియోలు సహా అక్కడే చిత్ర నిర్మాణం కేంద్రీకృతమవడం వల్ల బెంగాలీ చిత్ర పరిశ్రమను ‘టాలీవుడ్’ అనేవారనీ, అది తెలియక మనవాళ్ళు ‘టాలీవుడ్’ అనే పదాన్ని తెలుగు సినీపరిశ్రమకు పర్యాయపదంగా వాడేస్తున్నారనీ, ఆ పేరును అలా ఇక్కడ తప్పుగా వాడుతున్నారనీ ఈ పుస్తకం చదివితే అర్థం అవుతుంది.

- 1935 లలోనే నిజాంసాగర్ పైన ఇంగ్లీష్ కామెంటరీతో టాపికల్ తీశారనీ, తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ హీరో మాస్టర్ విఠల్ మూకీల రోజుల్లోనే 1928లలోనే ద్విపాత్రాభినయం కూడా చేశారనీ, ఆయనను వేరే సంస్థ కిడ్నాప్ చేసిందనీ, అప్పుడు కోర్టులో ఆ కేసును మహమ్మదాలీ జిన్నా వాదించడం, విఠల్ కోసం రెండు సంస్థలు కోర్టులోనే వేలం పాడాయనీ... ఇలా ఆసక్తికరమైన విషయాలెన్నో ఉన్నాయి.

 

- భారతీయ టాకీ పిత అర్దేషిర్ ఇరానీయే తొలి పర్షియన్ టాకీ రూపకల్పన ద్వారా ఇరాన్ కి కూడా తొలి టాకీ అందించిన టాకీపిత అన్న విషయమూ,

- ‘కాళిదాస్’ చిత్ర కథానాయిక టి.పి. రాజలక్ష్మి వ్యక్తిత్వమూ, జీవిత, సినీ జీవిత చరిత్ర, ధీరోదాత్తత, దేశభక్తీ అర్థమవుతాయి.

- 1931 నవంబర్ 16 నాటి ‘ఆనంద వికటన్’ తమిళ మేగజైన్ లో రచయిత ‘కల్కి’ కృష్ణమూర్తి తమిళంలో వ్రాసిన ‘కాళిదాస్’ చిత్ర ప్రదర్శన తాలూకు సుదీర్ఘ సమీక్ష పూర్తి పాఠం చాలా అరుదైనది. ఇప్పటి దాకా తెలుగులో ఎక్కడా రాని ఆ పూర్తి సమీక్షను రెంటాల జయదేవ స్వయంగా అనువదించి, మూలం తాలూకు ఫోటో సాక్ష్యంతో సహా పొందు పరచడం ఈ పుస్తకంలో మరో చెప్పుకోదగ్గ విశేషం.

- ఆ రోజుల్లో యముని పాత్రలో నటుడు వేమూరి గగ్గయ్యను చూస్తే జనం దడుచుకునేవారట. దున్నపోతుపై యమధర్మరాజు వేషంలో గగ్గయ్య దర్శనమిచ్చే అరుదైన తొలి నాళ్ళ తెలుగు టాకీ ఈస్టిండియా వారి ‘సతీ సావిత్రి’ (1933)లోని స్టిల్ ఈ పుస్తకంలో చూడగలం.

- దక్షిణాది టాకీపులి, దర్శక - నిర్మాత హెచ్.ఎం. రెడ్డి, అలాగే తొలి కన్నడ టాకీ ‘సతీ సులోచన’ (1934)కు నిర్దేశకుడైన కన్నడ టాకీ పితామహుడైన మరో తెలుగువాడు వై.వి. రావు (ప్రసిద్ధ నటి ‘మిథునం’ చిత్ర ఫేమ్ లక్ష్మి గారి తండ్రి) వంటి మహానుభావుల ప్రస్థానాలూ, ఫొటోలతో సహా ఈ పుస్తకంలో పొందుపరచడం ఆకర్షణీయం.

అలాగే, అప్పటి వ్యక్తుల గొప్పదనం తెలిసినప్పుడు ఆ వ్యక్తులెలా ఉంటారో అన్న ఉత్సుకత కలగడం సహజం. దానికి జవాబుగా అన్నట్లుగా ఆ యా చిత్రాలు , ఆ యా పేజీలలో దర్శనమిస్తాయి. ఇంకా... అప్పట్లో పేరుగాంచిన స్టూడియోలు, వాటి అప్పటి -ఇప్పటి ఫొటోలు, వందేళ్ళ క్రితం నాటి న్యూస్ పేపర్ ప్రకటనలు, ప్రఖ్యాత చిత్రాల స్టిల్స్, మొదటి టాకీల కథలూ, ఛాయా చిత్రాలూ... ఇలా దాదాపు రెండువేల వరకు ఫొటోలతో ఒక సినిమా చరిత్ర పుస్తకం ఇంతకు మునుపెన్నడూ ఇలా రాలేదు. ఆ సంగతి ఖచ్చితంగా చెప్పవచ్చు.

 

ఏవీయం వారి మొదటి తెలుగు చిత్రం 'భూకైలాస్' (1940)లో నటించిన తెలుగు మూలాలున్న ఎం.వి. సుబ్బయ్యనాయుడు (రావణ పాత్రధారి) సినిమాల్లోకి రాక ముందు భుక్తి కోసం గొడ్లు కాసే కుర్రవాడిగా, కట్టెలు కోసే కూలీగా, కుస్తీ పట్టేవాడిగా రకరకాల పనులు నిజ జీవితంలో చేశారని తెలిసి విధి రాసిన వింత స్క్రిప్ట్ కి ఆశ్చర్యపోతాం.

 

అదే చిత్రంలో నారదుని గా నటించిన ఆర్. నాగేంద్ర రావు ఈ సుబ్బయ్య నాయుడికి తోడల్లుడనీ, వీరిద్దరూ అక్క చెల్లెళ్ళనే ప్రేమించి పెళ్ళాడారనీ, అదీ సినిమాల షూటింగ్ కోసం వెళుతున్నప్పుడనీ తెలిసి అబ్బురపడతాం. ఈ జంట కన్నడనాట మూకీల నుండీ చేసిన కృషినీ, వారికి కన్నడనాట దక్కిన, దక్కుతున్న గౌరవాన్నీ మన ముందుంచుతారు రచయిత రెంటాల జయదేవ.

అదే విధంగా... మలయాళ చిత్ర సీమకు తెలుగువారి సేవలూ ఈ రచన చదివితే అర్థమవుతాయి. తొలి మలయాళ టాకీ చిత్రం ‘బాలన్’ (1938 జనవరి 19) చిత్ర దర్శకుడు ఎస్. నోట్టానీ విమానాల పైలట్ కాబోయి సినీ దర్శకుడైన సంగతీ, అటు తర్వాత లిబర్టీ గార్మెంట్స్ అధినేతగా ఎదిగిన తీరూ ఆసక్తి కలిగిస్తుంది. తొలి మలయాళ టాకీ హీరో తర్వాత కాలంలో నిజ జీవితంలో టీ షాపులో సర్వర్ గా మారిన విషయం బాధ తెప్పిస్తుంది.

సర్వసాధారణంగా మనకు వంద విషయాలు తెలిస్తే... స్థల, కాల పరిమితుల రీత్యా వ్రాతలోకి వచ్చేసరికి పది, పదిహేను శాతం మాత్రమే అనుకున్నట్లుగా వ్రాయగలం. అలాంటిది ఈ 566 పేజీల ఈ బృహత్ గ్రంథంలో వ్రాసిన అరుదైన సమాచారం కంటికి కనిపిస్తూంటే, రచయిత బుర్రలో ఇంకెన్ని నిధులున్నాయో అనిపిస్తుంది.

 

విశ్వనాథ వారి ‘రామాయణ కల్పవృక్షం’ రచనకు ఇరవైకి పైగా సంవత్సరాలు సమయం పట్టిందని విన్నాను, ఆ తరువాత అలాంటి విషయం ఈ మన సినిమా చరిత్ర పరిశోధనాత్మక రచన ద్వారా రెంటాల గారినే కంటున్నాను. ఒక్కడే భగీరథ ప్రయత్నంగా కొనసాగించి, ఆ తపస్సు ఫలితంగా... ఏ గూగుల్ తల్లీ చెప్పలేని, చూపలేని యథార్థాలను సవినయంగా మన ముందుంచారు డాక్టర్ రెంటాల జయదేవ. అందుకే, ఈ ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరూ అనేక కొత్త సినిమా విషయాలు తెలుసుకున్నామన్న ఆత్మ సంతృప్తితో, ఆనందించడం తధ్యం.

 

నిష్ఠగా, నిజాయతీగా, త్రికరణ శుద్ధితో కృషి చేస్తే... ఒక్క మనిషికి ఇది సాధ్యమంటూ చేసి చూపిన ధీరోదాత్తుడు రెంటాల జయదేవను ప్రభుత్వాలు, ప్రజలూ సముచిత రీతిన గౌరవిస్తారనీ, గౌరవించాలనీ ఆకాంక్షిస్తున్నాను. తల్లితండ్రుల పేరు నిలబెట్టేలా, తన జీవితానికొక సార్థకతగా, వృత్తీ – ప్రవృత్తీ - పుట్టి పెరిగిన వాతావరణమూ, ఇష్టమూ, వారసత్వమూ... వీటన్నిటి మేలు కలయికగా 'ఫస్ట్ రీల్' ని మన ముందుంచిన జయదేవ నిజంగా ప్రతి తెలుగువాడు, ప్రతి సినిమా ప్రేమికుడూ గర్వించదగ్గవాడు!

ఇంత చక్కని పుస్తకాన్ని అంతే అందంగా, అద్భుతమైన నాణ్యతతో ప్రచురించిన ఎమెస్కో ప్రచురణ సంస్థ వారికి తెలుగు సినీ ప్రియుల పక్షాన ధన్యవాదాలు.

వి.శ్రీనివాసరావు,ఖమ్మం

‘మన సినిమా... ఫస్ట్ రీల్’

వెల: రూ. 750 (అందించిన విషయాలు, ఫొటోలతో పోలిస్తే చాలా చౌక),

ప్రతులకు: ఎమెస్కో బుక్స్, విజయవాడ. 0866 – 2436643. ఇతర అన్ని ప్రముఖ బుక్ షాపుల్లోనూ లభ్యం.

ఆన్ లైన్ లో: అమెజాన్, లోగిలి, తెలుగు బుక్స్ వగైరాల్లో.

లోగిలిలో...

https://www.logili.com/home/first-reel/p-7488847-47010512395-cat.html#variant_id=7488847-47010512395

అమెజాన్ లో...

Mana Cinema... First Reel

https://amzn.in/d/3x5cvqp

మరిన్ని సమీక్షలు

“పోరాటపథం”
“పోరాటపథం”
- డా॥ పి.రమేష్‌నారాయణ
పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు