Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - Sahasam

ఈ సంచికలో >> సినిమా >>

అనంత శ్రీరామ్ తో ఫటాఫట్ చిట్ చాట్

interview with lyricist anantha sreeram

చూడ్డానికి బక్క పలచగా వున్నాఅతను రాసిన పాట మాత్రం మహా బలంగా వుంటుంది. అట్టే మాటాడితే చక్కగా, చిక్కగానే కాకుండా చెక్కినట్టు కూడా వుంటుంది. అచ్చమైన స్వచ్చమైన తెలుగు తొణికిసలాడుతూ వుంటుంది. భాష, భావుకత్వం, శబ్ద సౌందర్యం ఒక దానితో మరొకటి పోటీ పడుతూ వుంటాయి. అలాగని అందనంత ఎత్తులో వుండదు సరికదా అవసరమైన చోట అన్ని రకాల పులకింతల్ని గిలిగింతల్ని అనంతంగా ఇవ్వగలదు. అందుకే ఈ వారం ఆ అనంత శ్రీరామ్ తో ఫటాఫట్ చిట్ చాట్.

"చాలా మంది కన్ ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ ఇది చెప్పండి.  మీరు అనంత్ శ్రీరామా లేక అనంత శ్రీరామా?"
"అనంత శ్రీరామే "

"అనంత్ లో మోడ్రన్ టచ్ వుంది కదా... అలా చెలామణి కావొచ్చుగా?"
"వొచ్చు ... నాకు  అనంత శ్రీరామ్ అని పేరు పెట్టిన పర్పస్ వేరు. మా నానమ్మ గారి పేరు అనంతమణి. తాతగారి పేరు రామ్ దాస్ నాయుడు. ఈ రెండు పేర్లలో ఫస్ట్ హాఫ్ లు తీసుకుని ' శ్రీ ' ని చేర్చి అనంత శ్రీరామ్ చేశారు పెద్దవాళ్ళు"

"ఇంజనీరింగ్ చదువుతూ కోపంతో ప్రతిజ్ఞ చేసి బైటకొచ్చేశారన్న స్టోరీని మళ్ళీ మరోసారి గో తెలుగు పాఠకుల  కోసం చెబుతారా?"
"కల్చరల్ యాక్టివిటీస్ బావుంటాయని బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ లో చేరాను. తీరా చేరాక తెలిసింది - అక్కడ ఎడ్యుకేషన్ అంతా స్పూన్ ఫీడింగేనని. పైగా కల్చరల్ యాక్టివిటీస్ కి మానేజ్ మెంట్ సహకారం లేదు. ఇదిలా వుండగా ఓ మాష్టారు... పేరు చెప్పొద్దనుకుంటున్నాను... దయచేసి అడక్కండి... 'పాటలు కడుపు నింపవు' అంటూ తక్కువ చేసి మాట్లాడారు. దాంతో కోపం వచ్చి 'ఎలా నింపవో నిరూపించి చూపిస్తాను' అని మూడవ సంవత్సరం మధ్యలోనే కాలేజి మానేసి  బైటికొచ్చేశాను."

"ఆ తర్వాత ఏది ముందు .. సినిమాలా లేక పార్టీ పాటలా?"
"సినిమాలే ... 'కాదంటే అవుననిలే ' ఫస్ట్ ఫిల్మ్"

"అందులో ఎన్ని పాటలు?"
"ఆరు పాటలు ... సింగిల్ కార్డ్"

"ఆ తర్వాత?"
"ఒక ఊరిలో, ఏవండోయ్ శ్రీవారు... వీటిక్కూడా సింగిల్ కార్డే"

"ఎంటరవడమే హ్యాట్రిక్ సింగిల్ కార్డ్ ... ఇది నిజంగా  రికార్డుల్లోకి ఎక్కవలసిన విషయం. అన్నట్టు 'కాదంటే అవుననిలే'  సంగీత దర్శకుడి పేరు మీద కొన్ని కన్ ఫ్యూజన్లు వున్నాయి కదా?"
"ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు విశ్వనాథ సత్యనారాయణ. న్యూమరాలజీ కోసం 'సత్యం' అని మార్చుకున్నాడు. దాంతో పాత సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారని అనుకున్నారు. ఇప్పటికీ ఆ కన్ ఫ్యూజన్ కొందరిలో వుంది"

"మరి పార్టీ పాటలు?"
"అవన్నీ 'అందరివాడు' (పడుచు బంగారమా), 'బొమ్మరిల్లు' ( అపుడో ఇపుడో ఎపుడో) తర్వాతే ...
ఇక్కడ ఇంకో రికార్డ్ కూడా వుంది. అదేటంటే- కాంగ్రెస్ మున్సిపల్ ఎలక్షన్స్ కి ప్రచార గీతాలు రాశాను. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీకి 10 పాటలు, అలాగే తెలుగుదేశం పార్టీకి ... ఇలా ఒకే టైమ్ లో 3 పార్టీలకి రాశాను. కొన్నాళ్ళ తర్వాత లోక్ సత్తాకి, ప్రస్తుతం కాంగ్రెస్ వారి పథకాలకి... ఆల్మోస్ట్ టి.ఆర్.ఎస్. కి తప్ప అన్ని ప్రధాన పార్టీలకి ప్రచార గీతాలు రాశాను."

"యమదొంగ లాంటి పెద్ద సినిమాలో 5 పాటలు పడడం ఒక ఎత్తయితే 'యంగ్ యమా' లాంటి కాయినింగ్ క్లిక్ అవడం మరొక ఎత్తు కదా?"
"యమదొంగ లో జూనియర్ ఎన్టీఆర్ చిన్న యముడు.  'ఆయనకొక  విశేషణం వుండాలి - కుర్ర యముడిలా' అని రాజమౌళి హింట్ ఇచ్చారు. ఆలోచిస్తూ వుంటే 'యంగ్ యమా' అని తట్టింది. అందరూ హ్యాపీ ... ఆ కాయినింగే ఆ సినిమాలో 5 పాటలు రాసే అవకాశాన్నిచ్చింది."

"సంగమం లాంటి సినిమాలో అద్భుతమైన పాటలు రాసినా రాని పేరు యమదొంగ పాటలకి రావడం పట్ల ఒక కవిగా ఎలా ఫీల్ అవుతున్నారు?"
"పెద్ద సంస్థకి రాస్తే ప్రమోషన్ యాక్టివిటీస్ బాగా వుంటాయి కాబట్టి పాట కొన్నాళ్ళ పాటు ప్రజల మధ్య ప్రచారంలో వుంటుంది.  సినిమా హిట్ అయితే తర్వాత కూడా నిలబడుతుంది. చిన్న సినిమాల్లో మంచి పాటలు పడ్డా వాటికా అదృష్టం లేకపోవడానికి గల కారణాల్లో ఇదొకటి."

"మీ సింగిల్ కార్డ్ సినిమాల్లో మొదటి హిట్  'ఏ మాయ చేశావే' కదా?"
"అవును. అంతే కాకుండా ఆ సినిమాలోని చాలా పాటలకి అన్నీ తెలుగు పదాలే రాసే  అవకాశం కలగడం మరో అదృష్టం"

"మీ పాటల ప్రయాణంలో దిల్ రాజు గారి సినిమాలే ఎక్కువున్నట్టున్నాయి?"
"కరక్టే... బొమ్మరిల్లు, పరుగు, కొత్త బంగారులోకం, ఆకాశమంత, మున్నా, మిస్టర్ పెర్ఫెక్ట్, రామరామ కృష్ణ కృష్ణ, బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ... "

"కొత్త  బంగారులోకం  లో 'నిజంగా నేనేనా' పాటని అప్పట్లో చాల మంది సీతారామ శాస్త్రి గారు రాసారని అనుకునేవారు .."
"అవును ... పొగుడుతూ కొన్ని ఫోన్ కాల్స్ ఆయనకే డైరెక్ట్ గా వెళ్ళాయట. అది ఆయనే చెప్పారు"

"హిట్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా మంచి భావుకత్వాన్ని, సాహిత్యాన్ని అందించిన తృప్తి ఏ సినిమా పాటల్లో లభించింది మీకు?"
"ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాలోని పాటల్లో సాహిత్య శిఖరాలకి - భావుకత్వం లోతుల్లోకి వెళ్ళే అవకాశం దొరికింది. 'అంకెలింక ఉన్నన్నాళ్ళు నీ వయసు సంఖ్యై వుంటా - సంఖ్యలన్ని బంధిస్తుంటా వంద ఏళ్ళుగా' లాంటి వాక్యం ఓ ఉదాహరణ."

"మీకు, ప్రజలకి కలిపి బాగా నచ్చిన పాట?"
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టైటిల్ సాంగ్ "

"పెళ్ళయ్యాక పాటలు తగ్గాయా పెరిగాయా?"
"పెరిగాయి "

"ఎలా?"
"అంతకు ముందు నెలకి 3 లేక 4 రాసేవాణ్ణి. పెళ్ళయ్యాక నెలకి 8 లేక 9 రాస్తున్నాను"

"ఇంటికి తొందరగా వెళ్ళాలని టైమ్ ఎక్కువ తీసుకోకుండా రాసేస్తున్నారా?"
"కాదు. థాట్  క్లారిటీ నేర్పిన అనుభవంతో ఎక్కువ వెర్షన్ లు రాయాల్సిన అవసరం పడడం లేదు. దాంతో పాటల సంఖ్య పెరిగింది"

"మీ రైటింగ్ టైమింగ్స్?"
"పగలు మేలుకున్నది మొదలు లంచ్ వరకు రాసుకుంటాను"

"ఆ తర్వాత ?"
"రాసినవి  తీసుకెళ్ళి ఒకే చేయించుకోవడం, లేదా మార్పులు చేర్పులు వుంటే వాళ్ళకు కావలసిన విధంగా చేసి 8 - 8.30 కల్లా క్లోజ్ చెయ్యడం ..."

"మధ్యలో ఆడియో ఫంక్షన్ లకి అటెండ్ అవడం, టీవీ లకి పత్రికలకి ఇంటర్ వ్యూలివ్వడం లాంటివి కూడా   వుంటాయిగా?"
"వుంటాయి. వాటికి సంబంధించి కూడా - ఒక్క సినిమా ప్రమోషన్ కి తప్ప మిగిలిన వాటిలో కొన్ని  తగ్గించుకోవాలనుకుంటున్నాను."

"ఎందుకలా?"
"పాటలు తక్కువ, ఇంటర్ వ్యూలెక్కువ అయిపోతాయి"

"మరి ఈ ఇంటర్ వ్యూకి  మాత్రం ఎందుకు  ఒప్పుకున్నారు?"
"కొన్నిటికి విలువ ఇవ్వాలిగా..."

"సరే... మీ కెరీర్ లో విపరీతమైన మార్పులకు గురి అయిన పాట?"
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లోని 'ఒహోహో అమ్మాయి' పాట. మూడు నాలుగు వెర్షన్ లు రాశాను.   రికార్డింగ్ కూడా అయిపోయింది. అయినా ఏదో వెలితి ... "

"ఎవరికి ? మీకా, ప్రొడ్యూసర్ కా, డైరెక్టర్ కా?"
"ముగ్గురికీ ... రెండు సార్లు ట్యూన్ కూడా మారింది. చివరికి 4 నెలలు పట్టింది ఫైనల్ వెర్షన్ బైటికి రావడానికి"

"అంటే 4 నెలలూ ఈ ఒక్క పాట మీదే ఉన్నారా?"
"అంటే గ్యాప్ లు తీసుకుంటూ, మళ్ళీ కలుస్తూ, డిస్కస్ చేస్తూ ఇలా అందరికీ సంతృప్తి నిచ్చిన ఫైనల్ వెర్షన్ వచ్చేసరికి 4నెలలు పట్టిందన్నమాట . నిజానికి టోటల్ వర్కింగ్ అవర్స్ తీసుకుంటే 20వర్కింగ్ డేస్ కిందే లెక్క".

"మీరు రాసిన పాటల్లో జనాలకు అందకుండా పోయిన మంచి పాటేది?"
"శుభప్రదం లో 'జైహింద్' పాట..."

"ఎంచేతంటారు?"
"అందులో సంగీతానికి సంబంధించిన పదజాలం ఉపయోగించాను. వాటిని అర్ధం చేసుకోవడానికి, ఆ శబ్దసౌందర్యం లో ఔచిత్యం వుందో లేదో తెలుసుకోవడానికి సంగీతం తో టచ్ ఉండాలి."

"మరి 'శంకరాభరణం' పాటల్ని జనం ఎంజాయ్ చేశారుగా?"
"అది ఆడినన్ని రోజులు ఇది ఆడలేదుగా ... అలా జరిగుంటే కనీసం కొంతమందైనా ఎంజాయ్ చేసుండేవారు.   అయినా ఇవి 'శంకరాభరణం' రోజులు కావులెండి"

"ఎలాగూ సంగీతం ప్రసక్తి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను ... మీకు రాగాలతో పరిచయం బాగానే   వున్నట్టుంది?"
"మరీ అంతలేదండీ"

"గతంలో మనం చాలాసార్లు రాగాల గురించి మాట్లాడుకునేవారంగా... అంత లేదంటారేంటి.. చెప్పండి... ఎన్ని రాగాలతో పరిచయం వుంది?"
"ఓ ముప్ఫై ఏసుకోండి"

"సంగీతం నేర్చుకున్నారా?"
"ఆబ్బే అంతలేదండీ ... కేవలం శ్రుతపాండిత్యమే ... పన్నెండేళ్ళఫ్ఫుడు స్టేజ్ మీద హార్మోనిస్ట్ ల దగ్గర సంపాదించిన అనుభవమే..."

"సో ... మీరు నాటకాలు కూడా వేసేవారన్నమాట .. ఏయే నాటకాలు?"
"శ్రీకృష్ణ రాయబారం, శ్రీకృష్ణ సహాయం ఇలా .. "

"ఏ పోర్షన్ వేసేవారు?"
"శ్రీకృష్ణుడే..."

"ఏంటి శ్రీకృష్ణుడా... పర్సనాలిటీ పర్మిట్ చేసిందా?"
"చిన్నప్పుడు కదా ... నడిచిపోయింది లెండి"

"మీ శ్రీమతికి పాటలంటే ఇష్టమేనా?"
"ఫిమేల్ సోలోలంటే బాగా ఇష్టం"

"ఈ రోజుల్లో ఫిమేల్ సోలోలెక్కడ వస్తున్నాయ్?"
"అప్పుడప్పుడు 'చలిచలిగా వుంటుంది' (మిస్టర్ పెర్ఫెక్ట్) లాంటివి వస్తున్నాయి గా..."

"రైటర్స్ లో ఎవరితో ఎక్కువ కలుస్తుంటారు మీరు?"
"ఎక్కువగా రామజోగయ్య శాస్త్రి గారు తారస పడుతూ వుంటారు. ఆ తర్వాత బోస్ గారు."

"ఎవరు మీతో ఎక్కువ డిస్కస్ చేస్తూ వుంటారు?"
"రామజోగయ్య గారు డిస్కస్ చెయ్యడమే కాదు మంచి సలహాలిస్తూ వుంటారు. ఆ మధ్య ఆంజనేయ స్వామి మీద రాసిన ఓ ప్రైవేట్ పాటలో 'పర్వతాల్ని దహించే విలయం' అని రాస్తే 'పర్వతాల్ని పెకలించే' అని రాస్తే బావుంటుందని దిద్దారు. ' సింగం-2' లోని 'తెలియదులే తెలియదులే' పాటలో 'ప్రేమ కన్నా హింస  వుందా' అని రాస్తే తెగ మెచ్చుకున్నారు."

"డబ్బింగ్ పాటలెన్ని సినిమాలకు రాసుంటారు?"
"ఓ ఇరవై"

"సింగం ప్రసక్తి వచ్చింది కనుక అడుగుతున్నాను. దేవిశ్రీ - మీకు, రామజోగయ్య గారికి, సాహితి గారికి పాటల్ని ఓ లెక్క ప్రకారం పంచుతాడు కదా?"
"అదేనండి ... నాకు ప్రేమ పాటలు, కొంచెం మోడ్రన్ టచ్ అయితే రామజోగయ్య గారు, ఇక మాస్ పాటలంటే సాహితి గారే .. "

"పాటల పరంగా ఈ సంవత్సరం మీకెలా వుంది?"
"ఇంతకు ముందు లేని విధంగా ఈ సంవత్సరం  సింగిల్ కార్డ్ సినిమాలు నావి బాగా వున్నాయండి. 'బంగారు కోడిపెట్ట' , 'అంతా నీ మాయలోనే', 'ఏమిటో ఈ మాయ', 'నువ్వే నా బంగారం', 'సాహసం', కర్రా కార్తిక్  దర్శకత్వం లో ఓ సినిమా, నటి శ్రీప్రియ తీస్తున్న ద్విభాషా చిత్రం, దిల్ రాజు గారి సినిమా ... ఇలా "

"సినిమాకి ఆరు వేసుకున్నా, మరో రెండు బైటివాళ్ళవి వేసుకున్నా దాదాపు యాభై పాటలు ... డిస్కషన్స్, రకరకాల వెర్షన్ లు రాయడం, ఓకే చేయించుకోవడం.. దుంప తెగిపోతుంది"
"అందుకే కదండీ కొన్ని ఇంటర్ వ్యూలు అవీ తగ్గించుకోవాలనుకుంటున్నాను ."

"సరే ... మీ పుట్టిన రోజెప్పుడో చెప్పండి. అంతవరకూ డిస్టర్బ్ చెయ్యకుండా వుండడానికి ప్రయత్నిస్తా!"
"అబ్బో అది చాలా దూరం వుంది లెండి. అయినా చెప్తా ... కాస్త తమాషాగా కూడా చెప్తా ... 8/ 4/ 84... "






రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka by Cartoonist Bannu